శ్రీమన్మథ నామ సంవత్సర ఫలితాలు

శ్రీమన్మథ నామ సంవత్సర ఫలితాలు


ఈ సంవత్సరం రాజు శని, మంత్రి, సైన్యాధిపతి కుజుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. నవనాయకుల్లో ఐదుగురు శుభులు, మిగతా నలుగురు పాపులు. అలాగే 21 మంది ఉపనాయకుల్లో 12 మంది శుభులు, 9 మంది పాపులు. రాజు శని కాగా, మంత్రి, సైన్యాధిపతి కుజుడు కావడం వల్ల రాజకీయంగా కొంత గడ్డుస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి. పాలనాపరంగా కొన్ని ప్రతిబంధకాలు పాలకులకు తలనొప్పిగా మారే సూచనలు.  



అలాగే, ఇరుగుపొరుగు దేశాలతో ఉద్రిక్తతలు ఏర్పడవచ్చు. ప్రజల మధ్య అకారణంగా  వివాదాలు నెలకొనే సూచనలు. కొన్ని ప్రాంతాలలో పంటలు విశేషంగానూ, మరికొన్ని ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని రకాల ధాన్యాలు, పప్పుధాన్యాల ధరలు పెరుగుతాయి. శాస్త్రసాంకేతిక, పరిశోధనా రంగాలు మరింత పుంజుకుంటాయి. సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల తెలుపు, ఆకుపచ్చని ధాన్యాల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.



మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల తూర్పు, ఆగ్నేయ ప్రాంతాల్లో అధికంగానూ, మిగతా ప్రాంతాలలో మధ్యస్థంగానూ వర్షాలు పడతాయి. రాజు శని కావడం వల్ల ఒక కుంచం వర్షం పడుతుంది. ఇందులో 10 భాగాలు సముద్రంలోనూ, 7 భాగాలు పర్వతాలపైన, ఒక భాగం భూమిపైన కురుస్తుంది. ఈ ఏడాది వర్షలగ్నం సింహం అయినది. లగ్నాధిపతి రవి మీనరాశిలో వ్యయాధిపతి అయిన చంద్రునితోనూ, చతుర్ధ, భాగ్యాధిపతి అయిన కుజ, కేతువులతో కలయిక, ధన స్థానంలో రాహువు, ధనాధిపతి, లాభాధిపతి అయిన బుధునికి సప్తమస్థితి, తృతీయ, రాజ్యాధిపతి శుక్రునికి భాగ్యస్థితి, పంచమ, అష్టమాధిపతి అయిన గురునికి వ్యయస్థితిలో ఉచ్ఛస్థితి  కలిగింది.

 

ఇక జగల్ల్లగ్నం పరిశీలించగా లగ్నం సింహమే అయినది. ద్వితీయంలో రాహువు, ద్వితీయ, లాభాధిపతి అయిన బుధుడు కేతువుతో కలిసి నీచస్థితి అయిన అష్టమస్థితి, తృతీయ , రాజ్యాధిపతి  అయిన శుక్రునికి స్వక్షేత్రమైన దశమ స్థితి, లగ్నాధిపతి రవి ఉచ్ఛపొంది చతుర్ధ, భాగ్యాధిపతి కుజునితో కలిసి భాగ్యస్థితి, పంచమ, అష్టమాధిపతి గురునికి వ్యయస్థితి. వ్యయాధిపతి అయిన చంద్రునికి  సప్తమస్థితి, షష్ఠమ, సప్తమాధిపతి శనికి అర్థాష్టమస్థితి కలిగింది. జగల్ల్లగ్నంలో లగ్నాధిపతి రవికి  ఉచ్ఛస్థితి కలిగి మేషరాశిలో భాగ్యాధిపతి కుజునితో చేరిక విశేష యోగప్రదం.  

 

మొత్తం మీద కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే  అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు, పాలకుల మధ్య వైషమ్యాలు తప్పకపోవచ్చు.  ఆర్థిక పరిపుష్టి కలగడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. కొన్ని విషయాలలో మనదేశానిదే కీలకపాత్రగా మారవచ్చు. కొన్ని ప్రాంతాలలో మతకలహాలు వ్యాపించినా పాలకుల చర్యల వల్ల అదుపులోకి వస్తాయి. మధ్యప్రాంతం, ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆస్తి, జననష్టాలు సంభవించే సూచనలు.



సంతృప్తికరమైన వర్షాలు కురుస్తాయి. సస్య, జలసమృద్ధి. వ్యవసాయరంగం పుంజుకుంటుంది. కొన్నిరకాల ఆహార ఉత్పత్తులు పెరుగుతాయి. ముఖ్యంగా మిర్చి, గోధుమలు, ధాన్యం, అపరాల దిగుబడులు పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. శాస్త్రసాంకేతిక రంగాలకు నూతన జవసత్వాలు చేకూరతాయి. మన మేధోసంపత్తికి అంతర్జాతీయంగా తగిన గుర్తింపు రాగ లదు.  బంగారం, ఇతర లోహాల ధరలు విశేషంగా పెరుగుతాయి.కళలు, క్రీడారంగాలకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కళాకారులకు గతం కంటే మెరుగైన కాలమనే చెప్పాలి.



రక్షణరంగం ప్రాధాన్యత పెరుగుతుంది. జ్యేష్ఠ మాసం ప్రారంభంలో తొలకరి జల్లులు పడవచ్చు.  ప్రజల్లో ధార్మిక చింతన పెరుగుతుంది. వైశాఖమాసంలో అకాల వర్షాలు, గాలిదుమారాలు, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిర మాసాల్లో కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు, తుపాన్లు, ప్రజాందోళనలు, విస్ఫోటనలు సంభవించే అవకాశం. ప్రముఖులకు గడ్డుస్థితి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉద్యమాలు, కొత్త నాయకులు పుట్టుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలనలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు.22.06.2015వ తేదీ అధిక ఆషాఢ శు.షష్ఠి తత్కాల సప్తమి సోమవారం రాత్రి 12.29 గంటలకు పుబ్బ నక్షత్రం, సిద్ధియోగం, గరజి కరణం, మీనలగ్నమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే సర్వత్రా శుభదాయకమే.



ఆశాజనకమైన వర్షాలు పడతాయి.ఈ ఏడాది పశుపాలకుడు బలరాముడు,  గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త శ్రీకృష్ణుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. పాల ఉత్పత్తులు విశేషంగా పెరుగుతాయి. వీటిపై ఆధారపడే వారికి మంచిరోజులే. ఉగాది నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అఢకం(కుంచం) గోపబాలుని చేతిలోనూ, తదుపరి  సంవత్సరాంతం వరకూ యవ్వన గోపబాలకుని చేతిలోనూ ఉండడం వల్ల సస్యానుకూలత, సుభిక్షంగా ఉంటుంది.

 

నవనాయకుల ఫలాలు



⇒ రాజు శని కావడం వల్ల పాలకుల మధ్య వివాదాలు, కలహాలు. చోరభయాలు, ధరలు ఆకాశాన్నంటుతాయి. పంటలు మధ్యస్థంగా ఉంటాయి. నీతి నిజాయితీలు లోపిస్తాయి.

⇒మంత్రి కుజుడు కావడం వల్ల వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అధికంగానూ, కొన్ని ప్రాంతాల్లో తక్కువగానూ పడతాయి. ప్రజల్లో మానసిక ఆందోళన, పాలకుల మధ్య అపార్థ్ధాలు. యుద్ధభయాలు నెలకొంటాయి. ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి.

⇒సేనాధిపతి కుజుడు కావడం వల్ల విచిత్రమైన వ్యాధులు, ప్రజల మధ్య పరస్పర వైరాలు, పాలకుల మధ్య సఖ్యత లోపించడం, ఇరుగుపొరుగు దేశాల మధ్య వివాదాలు నెలకొంటాయి.

⇒సస్యాధిపతి శుక్రుడు కావడం వల్ల మెట్ట, మాగాణి భూములు సమృద్ధిగా పండుతాయి. పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. పట్టు, ఉన్ని, సుగంధ ద్రవ్యాల ధరలలో తగ్గుదల కనిపిస్తుంది.

⇒ధాన్యాధిపతి బుధుడు కావడం వల్ల సామాన్య వర్షాలు, ప్రజల్లో భయాందోళనలు, ఆకుపచ్చని పంటలు పండి గిరాకీ పెరుగుతుంది.

⇒ఆర్ఘాధిపతి చంద్రుడు కావడం వల్ల అన్ని రకాల పంటల ఉత్పత్తులు ఆశాజనకంగా ఉంటాయి. ధరలు పెరుగుతాయి. ప్రజలు, పాలకుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటుంది.

⇒మేఘాధిపతి చంద్రుడు కావడం వల్ల మంచి వర్షాలు, పాలదిగుబడులు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో విశేష వర్షాలు.

⇒రసాధిపతి రవి కావడం వల్ల నువ్వులు, పండ్లు, నూనెలు, బెల్లం వంటి వాటి ధరలు కొంత తగ్గుతాయి. వేరుశనగ, నెయ్యి ధరలు పెరుగుతాయి. అధికారులకు శ్రమ మరింతగా పెరుగుతుంది.

⇒నీరసాధిపతి శుక్రుడు కావడం వల్ల బంగారం, వజ్రాలు,  మంచిగంధం, ముత్యాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి ధరలు పెరుగుతాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top