శ్రీ మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు - 2015

శ్రీ మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు - 2015


మేషం (ఆదాయం -14, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-6)

వీరికి గురుడు జూలై 14 నుంచి మరింత  యోగకారకుడు. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురుబలం వల్ల నెట్టుకొస్తారు. చేపట్టిన కార్యాలు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆదాయం ఆశించినంతగా లేక కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. బంధువర్గంతో తరచూ వివాదాలు నెలకొంటాయి. వ్యవహారాలలో అంచనాలు తప్పే అవకాశం. ఆరోగ్యపరంగా చికాకులు తద్వారా ఔషధసేవనం. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు జూలై 14 తరువాత అనుకూలిస్తాయి. జనవరి 29 నుంచి రాహుకేతువుల సంచారం మరింత అనుకూలం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేయాల్సివస్తుంది.



వ్యాపారాలు కొంత మందగించినా ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు పనిభారంతో కొంత సతమతమవుతారు. అయితే కోరుకున్న బదిలీలు, పదోన్నతులు పొందుతారు. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగాలి. తరచూ విదేశీ పర్యటనలు సాగిస్తారు. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో పదవీయోగాలు క లిగే సూచనలు. కళాకారులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితం దక్కించుకుంటారు. న్యాయవాదులు, వైద్యులు, పరిశోధకులకు ఈ ఏడాది కలసివచ్చే కాలం. జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-9.

పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, శివునికి అభిషేకాలు చేయించుకోవాలి. అలాగే, సుందరకాండ పారాయణ మంచిది. శనివార నియమం పాటించడం ఉత్తమం.

 

వృషభం (ఆదాయం-8, వ్యయం-8, రాజపూజ్యం-6, అవమానం-6)

వీరికి జూలై వరకు గురుబలం అంతగాలేదు. తదుపరి కొంత మెరుగుపడుతుంది. అలాగే, శని సప్తమస్థితి అనుకూలం కాదు. ఇక జనవరి 28 వరకు రాహు, కేతువుల స్థితి అనుకూలం. తదుపరి సంవత్సరాంతం వరకు అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బందికరమే. రుణదాతల నుంచి ఒత్తిడులు తప్పకపోవచ్చు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు చర్యలు వద్దు. జీవిత భాగస్వామి, బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. మీ విధానాలను, ప్రతిపాదనలను కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం ద్వారా చిక్కుల్లో పడే అవకాశం ఉంది.



జూలై నుంచి గురుబలం కారణంగా కొంత ఆశాజనకంగా ఉంటుంది. రాబడి స్వల్పంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వాహన, గృహయోగాలు కలిగే అవకాశం. వ్యాపారులు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధి నిర్వహణలో జాగరూకతతో మెలగాలి. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక, వైద్యరంగాల వారికి క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. కళాకారులు ద్వితీయార్థంలో విజయాల బాటలో సాగి అభివృద్ధి చెందుతారు. నిరుద్యోగులకు కొంత నిరాశ ఎదురైనా ప్రభుత్వ నిర్ణయాలతో ఊరట చెందుతారు. విద్యార్థులు శ్రమానంతరం మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట లాభిస్తుంది. జనవరి 29 నుంచి అర్ధాష్టమ రాహువు కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైశాఖం, ఆషాఢం,  శ్రావణం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6.

పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, దుర్గామాతకు కుంకుమార్చనలు మంచిది.

 

మిథునం (ఆదాయం -11, వ్యయం-5, రాజపూజ్యం- 2, అవమానం-2)

వీరికి అర్థాష్టమ రాహువు ప్రభావం ఉన్నా గురు, శని అనుకూల సంచారంకలసివస్తుంది. జూలై నుంచి గురుడు తృతీయరాశి సంచారమైనా మూర్తిమంతం చేత శుభుడు కావడం వల్ల అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. తరచూ శుభకార్యాల రీత్యా ఖర్చులు ఎదురవుతాయి. దూరమైన వారు తిరిగి దగ్గరవుతారు. మీపట్ల ద్వేషభావం చూపిన వారే ప్రేమానురాగాలు కురిపిస్తారు. ఆస్తివ్యవహారాలలో కొత్తగా ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఒక ఆప్తుని ద్వారా లబ్ధి పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.



అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, వైద్య, సాంకేతికరంగాల వారు మంచి గుర్తింపు పొందుతారు. పరిశోధకులకు ఈ సంవత్సరం శుభదాయకమైన కాలం. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవార్డులు కూడా దక్కవచ్చు. వ్యవసాయదారులకు రెండుపంటలూ అనుకూలిస్తాయి. రాజకీయవర్గాల వారికి మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థుల కృషి ఫలించి మంచి ర్యాంకులు సాధిస్తారు. జనవరి వరకు అర్థాష్టమ రాహువు వల్ల ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ముఖ్యంగా చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. చైత్రం, వైశాఖం, నిజ ఆషాఢం, ఆశ్వయుజం, పుష్యమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-5.

పరిహారాలు: వీరు హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం పఠించడం, దుర్గామాతకు కుంకుమార్చనలు చేయడం మంచిది.

 

కర్కాటకం (ఆదాయం -5, వ్యయం-5, రాజపూజ్యం- 5, అవమానం-2)


వీరికి ఈ సంవత్సరమంతా గ్రహసంచారం అనుకూలమనే చెప్పాలి. జూలై నుంచి గురుడు మరింత విశేషయోగకారకుడు. రాహువు, శని అనుకూల సంచారం కలిసివస్తుంది. మొత్తం మీద వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ఏ  కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. తరచూ తీర్థయాత్రలు సాగిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఊహించని విధంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. గతం కంటే రాబడి మరింతగా పెరుగుతుంది. సంఘంలో విశేష గౌరవప్రతిష్ఠలు పొందుతారు. మీ నిర్ణయాలకు తిరుగుండదు. జూలై నుంచి స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు, శుభకార్యాల నిర్వహణ రీత్యా ఖర్చులు ఉంటాయి.



కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారస్తులు పెట్టుబడులు రెట్టింపు చేస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలు, పరిశోధకులు, న్యాయ, సాంకేతికరంగాల వారికి విశేష కాలమనే చెప్పాలి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీయోగాలు. కళాకారులకు అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి. రివార్డులు, అవార్డులు పొందుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట మరింత లాభిస్తుంది. జనవరి నుంచి రాహుసంచారం వల్ల ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించండి. వీరికి జ్యేష్ఠం, నిజ ఆషాఢం, ఆశ్వయుజం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-2.

పరిహారాలు: సుందరకాండ పారాయణం, శివాలయంలో అభిషేకాలు మంచిది.

 

సింహం (ఆదాయం -8, వ్యయం-14, రాజపూజ్యం- 1, అవమానం-5)

వీరికి జూలై నుంచి గురు సంచారం అనుకూలమైనందున అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా ఏదోవిధంగా నెట్టుకొస్తారు. రాహు, కేతువుల సంచారం కూడా అనుకూలం కాదు. మొత్తం మీద  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  ఆర్థికంగా ఫర్వాలేదనిపించినా కొత్త రుణాల కోసం యత్నించాల్సి వస్తుంది. కుటుంబసభ్యులతో తరచూ వివాదాలు. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగానే సాగుతాయి. మీ నిర్ణయాల పట్ల వ్యతిరేకత ఎదురవుతుంది. తరచూ ప్రయాణాలు సాగించే వారు విలువైన సామగ్రిని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ఇతరుల చేత మాటపడాల్సిన సమయం. ప్రతి విషయంలోనూ సొంత ఆలోచనలతో ముందుకు సాగడం శ్రేయస్కరం. వ్యాపారులు పెట్టుబడులతో తొందరపడకపోవడమే మంచిది.



ఉద్యోగులు అదనపు పనిభారంతో సతమతమవుతారు, పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక , వైద్య, సాంకేతిక, పరిశోధనారంగాల వారికి అంచనాలు తప్పుతాయి. రాజకీయవర్గాల వారికి పదవులు ఊరిస్తాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు సైతం జారవిడుచుకుని నిరాశ చెందుతారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్పదు. విద్యార్థులు మరింతగా కృషి చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. అధిక ఆషాఢం, శ్రావణం, ఆశ్వయుజం, కార్తీకం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-1.

పరిహారాలు: శనికి తైలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు మంచిది.

 

కన్య (ఆదాయం -11, వ్యయం-5, రాజపూజ్యం- 4, అవమానం-5)

వీరికి జూలై వరకు గురుడు విశేష యోగప్రదుడు, తదుపరి సామాన్యం. అలాగే, శని యోగదాయకుడు. రాహు, కేతువులు దోషప్రదులు. మొత్తం మీద వీరికి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. స్థిరాస్తి వృద్ధి. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఓర్పు, నేర్పుతో అనుకున్న కార్యాలలో విజయం సాధిస్తారు.  వాక్చాతుర్యంతో అందర్నీ ఆక ట్టుకుంటారు. పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో కదలికలు.



కొత్త వ్యక్తుల పరిచయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు తొలిగే అవకాశం. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారికి మిశ్రమంగా ఉంటుంది. కళాకారులు జారవిడుచుకున్న అవకాశాలను దక్కించుంటారు. కొందరికి సన్మాన, సత్కారాలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. రాజకీయ నాయకుల పదవీయత్నాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది. జూలై నుంచి గురు సంచారం అనుకూలం కానందున ఆరోగ్యపరంగా చికాకులు. ముఖ్యంగా నడుము, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వృథా ఖర్చులు తప్పవు. ఇతరుల చేత మాటపడతారు. చైత్రం, అధిక ఆషాఢం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం,పుష్య మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-5.

పరిహారాలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు, గురునికి పరిహారాలు మంచిది.

 

తుల (ఆదాయం -8, వ్యయం-8, రాజపూజ్యం- 7, అవమానం-1)

వీరికి జూలై నుంచి గురుడు విశేషయోగదాయకుడై శుభాలనిస్తాడు. ఏల్నాటి శని ప్రభావం, జనవరి వరకూ రాహు సంచారం అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి శుభాశుభమిళితమై ఉంటుంది. జూలై వరకూ కొన్ని ఈతిబాధలు, కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. విలువైన వస్తువులు జారవిడుచుకుంటారు. మిత్రులు, బంధువర్గంతో విభేదాలు. జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆకస్మిక ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. వ్యాపారులకు మొదట్లో కొంత మందగించినా క్రమేపీ లాభాల దిశగాసాగుతారు.



ఉద్యోగులకు పనిభారం ఉన్నా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక, వైద్య, పరిశోధనారంగాల వారు గతం కంటే కొంత మెరుగైన ఫలితాలు పొందుతారు. కళాకారుల కృషి ఫలిస్తుంది. రాజకీయవర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యవసాయదారులకు రెండవపంట లాభిస్తుంది. నిరుద్యోగుల కల ఫలించే సమయం. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా ముఖ్యంగా చర్మ, ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. చైత్రం, అధిక ఆషాఢం, కార్తీకం, మాఘమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-6.

పరిహారాలు: శ నికి తైలాభిషేకాలు, దుర్గామాతకు కుంకుమార్చనలు, హనుమాన్ చాలీసా పఠనం మంచిది.

 

వృశ్చికం (ఆదాయం -14, వ్యయం-14, రాజపూజ్యం- 3, అవమానం-1)

వీరికి శని ప్రభావం ఉన్నా జూలై వరకు గురుడు, రాహుకేతువుల అనుకూల సంచారం కలిసివస్తుంది. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభంలో ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. అయితే ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. బంధువులతో వివాదాలు నెలకొన్నా చాకచక్యంగా సర్దుబాటు చేసుకుంటారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. జూలై నుంచి వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది.



నిర్ణయాలలో ఆచితూచి అడుగువేయాలి. కళాకారులకు కొంతమేరకు కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మంద కొడిగా సాగినా విజయం సాధిస్తారు. వ్యవసాయదారులకు మొదటి పంట సానుకూలం. రాజకీయవర్గాలకు పదవులలో ఒడిదుడుకులు తప్పవు. శని ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా చికాకులు, ఔషధసేవనం, ఆప్తుల చేత మాట పడాల్సివస్తుంది. చోరభయం. చైత్రం, నిజ ఆషాఢం, శ్రావణం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య-9.

పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, సుబ్రహ్మణ్యాష్టకం పఠనం మంచిది.

 

ధనుస్సు (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం- 6, అవమానం-1)

వీరికి ఏల్నాటిశని ప్రభావం, జూలై వరకు అష్టమ గురుని ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. కార్యక్రమాలలో అవరోధాలు, బంధువిరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. జూలై 14 నుంచి గురుని భాగ్యస్థితి కారణంగా డబ్బుకు లోటు ఉండదు. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీ సత్తా చాటుకుని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక పెండింగ్ కేసు నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.



పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు సవాలుగా మారినా సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులకు నిరుత్సాహం తప్పదు. కళాకారులకు అవకాశాలపై అసంతృప్తి. విద్యార్థులు మరింత శ్రమపడాల్సిన సమయం. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది.  ఏల్నాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. ముఖ్యంగా నరాలు, చర్మ, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. వైశాఖం, అధిక ఆషాఢం, శ్రావణం,ఆశ్వయుజం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 3.

పరిహారాలు: శనికి తైలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, సుందరకాండ పారాయణ మంచిది.

 

మకరం (ఆదాయం -5, వ్యయం-2, రాజపూజ్యం- 2, అవమానం-4)

వీరికి ఈ సంవత్సరమంతా గ్రహాల అనుకూల సంచారం కలిసివస్తుంది. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఇష్టకార్యసిద్ధి. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇతరుల మెప్పు పొందుతారు. ఒక వ్యక్తి ద్వారా సహాయసహకారాలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రథమార్థంలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల వారికి చెప్పుకోతగ్గ అభివృద్ధి ఉంటుంది.



కళాకారులకు అవకాశాలు మరింతగా పెరగడంతో పాటు సన్మానాలు అందుకుంటారు. రాజకీయవర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రజాదరణ పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండుపంటలూ లాభిస్తాయి. జూలై 14 నుంచి గురుని అష్టమస్థితి కారణంగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా నడుము, నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. మంచికి వెళ్లినా చెడుగా మారే అవకాశం. కొంత అప్రమత్తత అవసరం. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 8.

పరిహారాలు: గురునికి జపాదులు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మంచిది.

 

కుంభం (ఆదాయం -5, వ్యయం-2, రాజపూజ్యం 5, అవమానం-4)

వీరికి జూలై 14వరకు గురుడు ఓ మోస్తరుగానూ, తదుపరి విశేషయోగదాయకుడై ఉంటాడు. జనవరి 29 వరకు అష్టమ రాహువు, ద్వితీయంలో కేతువు, శని సంచారం అనుకూలం కాదు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థిక ఇక్కట్లు. రుణయత్నాలు. మానసిక అశాంతి. శత్రుభయం. కొన్ని కార్యక్రమాలు మందగించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు కాస్త చికాకు పరుస్తాయి. సోదరులు, సోదరీలతో అకారణంగా వైరం. వాహనాలు, ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం తగదు. ఒక కోర్టు వ్యవహారం ప్రతిబంధకంగా మారవచ్చు.



వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగ వర్గాలకు ఊహించని మార్పులు, కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, శాస్త్రసాంకేతిక రంగాల వారికి నిరుత్సాహం. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కృషి చేయాలి. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు ద్వితీయార్థంలో పదవీయోగం. అయితే జూలై నుంచి గురుని అనుకూల సంచారం కాస్త ఊరటనిస్తుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలలో అనుకూలత. వైశాఖం, భాద్రపదం, మార్గశిరం, ఫాల్గుణమాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య- 8.

పరిహారాలు: శని, రాహుకేతువులకు పరిహారాలు. దుర్గామాతకు కుంకుమార్చనలు, ఆదిత్య హృదయం పఠనం మంచిది.

 

మీనం (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం- 1, అవమానం-7)


వీరికి జూలై14 వరకు గురుడు విశేష యోగకారుడు. కార్యజయం. ధనలాభం. బంధువులతో సంతోషంగా గడుపుతారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. మీ నిర్ణయాలకు కుటుంబసభ్యులు ఆమోద ముద్ర వేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. జూలై 14 నుంచి గురునికి షష్ఠమ స్థితి, శని, రాహుకేతువుల సంచారం అంత అనుకూలం కాదు. ఈ రీత్యా చూస్తే లేనిపోని సమస్యలు. మానసిక అశాంతి. కుటుంబ సభ్యులతో తగాదాలు. ఉదర, నేత్ర, నరాల సంబంధిత రుగ్మతలు, త ద్వారా ఖర్చులు.



వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు అనుకోని బదిలీలు, ఒత్తిడులు. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక వర్గాలకు కొంత అనుకూలత ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగం. కళాకారులకు అవకాశాలు కొంత అసంతృప్తి కలిగిస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు ప్రథమార్థంలో అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, అధిక ఆషాఢం, భాద్రపదం, పుష్య, మాఘ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. అదృష్టసంఖ్య- 3.

పరిహారాలు: కుజ, గురు, రాహుకేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పఠనం చేయాలి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top