ఆ నవ్వు వెనుక...

ఆ నవ్వు వెనుక...


అది అయోధ్యానగరం. మరికాసేపట్లో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. సకల సన్నాహాలూ జరుగుతున్నాయి. ఇనకుల తిలకుడు, దశరథ తనయుడు రామచంద్రమూర్తికి అయోధ్యానగర చక్రవర్తిగా పట్టం కట్టే ఆ మహోత్సవాన్ని కన్నులారా చూడాలని నగర ప్రజలతో పాటు దూరదేశాల నుంచి ఎందరెందరో పెద్దలు, ప్రముఖులు, మహర్షులు, వస్తూ వస్తూ వెంటబెట్టుకు వచ్చిన వానరులతో సహా ఎందరో మహానుభావు లున్నారక్కడ. ఇసుకవేస్తే రాలనంత జనం ఉన్నప్పటికీ అంతా నిశ్శబ్దం... ఇంతలో ఎక్కడినుంచో నవ్వు, ఆ వెంటనే చిటికలు వేస్తున్న శబ్దమూ వినిపించాయి. అన్ని తలకాయలూ ఆ నవ్వు వినవచ్చిన దిశగా తిరిగాయి.



నవ్వుతున్నదెవరో చూసి, నివ్వెరపాటుకు గురయ్యాయి. ఆ నవ్విన వారు లక్ష్మణుడు. ఇంతకూ లక్ష్మణుడు ఎందుకు నవ్వినట్లు, తమను చూసేనేమో అని అనుకోసాగారు. ‘ఎట్టకేలకు నా కడుపున  పుట్టిన రాముడికే పట్టాభిషేకం జరుగుతున్నందుకు నేను సంతోషపడుతున్నానని కాబోలు’ అని ముందుగా కౌసల్య అనుకుంది. ‘భరతుడి రాజ్యం ఇంతటితో చెల్లిపోయింది, కైక తిక్క కుదిరిందని కాబోలు’ అని కైకేయి, ‘తనకూ, తన సోదరుడు శత్రుఘ్నుడికీ,  ఎల్లప్పుడూ సేవకులుగా ఉండక తప్పడం లేదని విరక్తిగా నవ్వుకున్నాడేమో నా బిడ్డ’ అని సుమిత్ర అనుకున్నారు. తన అన్నను చంపి, తనను రాజుగా చేసినందుకే రామపట్టాభిషేకానికి విచ్చేశామనే లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని సుగ్రీవుడు, విభీషణుడూ అనుకున్నారు. చూసి రమ్మంటే.



 కాల్చి వచ్చిన తన తొందరపాటును, తెలివి తక్కువతనాన్ని చూసే లక్ష్మణుడు నవ్వుతున్నాడేమో అని హనుమంతుడు, ముసలివాడినై పోయి, కళ్లు సరిగా కనపడక, చెవులు స్పష్టంగా వినపడక, ఒకరి సాయం ఉంటే తప్ప నడవలేని స్థితిలో ఉండి కూడా రామపట్టాభిషేకానికి వచ్చిన తనని చూసే నవ్వాడేమో అని జాంబవంతుడు, రావణుడి చెరలో అంతకాలమూ పవిత్రంగా ఉండి కూడా, చివరకు తనను అగ్నిపరీక్ష చేయించి కానీ, తనను ఏలుకోవడానికి తన నాథుడు  సిద్ధపడలేదని తనను చూసే లక్ష్మణుడు నవ్వి ఉండవచ్చునని సీతాదేవి .



 హనుమంతుడు కనిపెట్టేదాకా సీతజాడ కనిపెట్టలేకపోవడం, వానరుల సాయం ఉంటే తప్ప, రావణుడిని వధించలేకపోయిన తనను చూసే తమ్ముడు నవ్వి ఉంటాడని రాముడూ... ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అనుకున్నారట లక్ష్మణుడి నవ్వు చూసి. నిజానికి లక్ష్మణుడు నవ్వింది పై కారణాలలో ఏ ఒక్కదాని వల్లా కాదు, ఏ ఒక్కరినీ చూసి నవ్వుకోలేదు. తన దుస్థితికి తన మీద తనకే జాలి వేసి, నవ్వుకున్నాడట. అదేమిటంటే, వనవాసానికి వెళుతున్న రాముడి వెంట లక్ష్మణుడు బయలు దేరాడు.



ఆ తర్వాత సీతామాత కూడా వనవాసానికి బయలుదేరింది. ఎంతగా బతిమాలినా, ఇంకెంతగా నచ్చజెప్పినా, అనునయించినా, చివరకు భయపెట్టినా కూడా సీతాదేవి వినకుండా రాముడి వెంట వనవాసానికి బయల్దేరింది. సరిగ్గా అప్పుడే లక్ష్మణుడి పత్ని ఊర్మిళ కూడా లక్ష్మణుడి వంక దీనంగా చూసిందట, తాను కూడా లక్ష్మణుడి వెంట వనవాసానికి వస్తానన్నట్టుగా... అయితే లక్ష్మణుడు వద్దన్నట్టుగా కన్నులతోనే సైగ చేసి చెప్పాడట. అయితే తాను లేక తన పత్ని వియోగ బాధను అనుభవిస్తుందేమోననే ఉద్దేశంతో, తాను వనవాసంలో ఉన్నంత కాలమూ తన నిద్రను కూడా తన పత్నికే ఇవ్వమని నిద్రాదేవతను కోరాడట.



అంతేకాదు, అన్నావదినలకు కాపలా కాయాలి కాబట్టి, దయచేసి తనజోలికి రాకుండా ఉండమని నిద్రాదేవతను పరిపరివిధాలా ప్రార్థించాడట! అందుకు అంగీకరించిన నిద్రాదేవి, పద్నాలుగేళ్లపాటు ఓపిక పట్టి, తీరా తాను ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రామపట్టాభిషేక మహోత్సవ సమయంలో ఎంత చెప్పినా, తనమాట వినకుండా తనను ఆవహించేందుకు వస్తోందని నవ్వు వచ్చిందట. అంతమంది సభాసదుల మధ్యలో తన అన్నగారైన రామçచంద్రమూర్తికి పట్టాభిషేకమహోత్సవం జరిగేటప్పుడు నిద్రపోయి తన పరువు తీయకుండా కనీసం మరికొద్ది సమయమైన గడువు ఇవ్వమని బతిమాలుకున్నాడట లక్ష్మణుడు.



ఈ కథ పుక్కిటి పురాణమే కావచ్చు, ఏ కవో, పండితుడో సరదాకోసం అసలు విషయానికి మరికొంత ముందు వెనుకలు జోడించి ఉండవచ్చు, దీనిపై లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర అనే ఉపాఖ్యానాలే వెలువడి ఉండవచ్చు కానీ, నిద్ర అనేది మనిషికి ఎంత అవసరమో, సమయానికి నిద్రపోకపోతే ఎంత అనర్థమో, అసÆ దర్భంగా నిద్రపోవడం ఎంత హాస్యాస్పదమో వివరిస్తుంది.     

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top