పచ్చని చిలకలు తోడుంటే!

పచ్చని చిలకలు తోడుంటే!


పచ్చని చిలకలు, పాడే కోయిలలు, నృత్యాల పిచ్చుకలు... హర్‌సుఖ్‌భాయ్‌ దొబరియ ఇల్లు, ఇల్లుగా కనిపించదు... ఆనందాల హరివిల్లులా కనిపిస్తుంది! గుజరాత్‌లోని జూనగఢ్‌ జిల్లా కేంద్రానికి చెందిన హర్‌సుఖ్‌భాయ్‌ మొదటి నుంచి పక్షి ప్రేమికుడేమీ కాదు... అయితే ఒకానొక రోజు ఆయన జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చింది. సుమారు పదిహేడు సంవత్సరాల క్రితం హర్‌సుఖ్‌భాయ్‌కి చిన్న యాక్సిడెంటై కాలికి గాయమైంది. ఆ సమయంలో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒకరోజు కాస్త దూరంగా ఉన్న ఒక చిలకను చూసి, వరండాలో సజ్జగింజలు చల్లాడు. ఆ చిలక పరుగెత్తుకు వచ్చింది.



అలా మొదలైంది ఆ ఇంటికి చిలకల రాక!  రోజు రోజుకూ... హర్‌సుఖ్‌భాయ్‌ ఇంటికి వచ్చే చిలకల సంఖ్య పెరుగుతూ పోయింది. అలా ఒకటి కాదు... రెండు కాదు... ఆయన ఇంటికి 250 నుంచి 300 వరకు చిలకలు వచ్చేవి. అయితే ఈ పక్షులకు స్థలం సమస్యగా మారింది. దీంతో పాతపైపులను ఏర్పాటు చేసి, వాటికి రంధ్రాలు చేసి సజ్జకంకులు పెట్టడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడి నుంచో గుంపులుగా వచ్చే చిలకలను చూస్తుంటే చూడముచ్చటగా ఉండేది. ఈ చిలకలు అంటే హర్‌సుఖ్‌భాయ్‌కి మాత్రమే కాదు... ఆయన కుటుంబసభ్యులకు కూడా ఎంతో ఇష్టం.



‘‘చిలకల వల్ల ఇల్లంతా మురికి పేరుకుపోతుంది కదా... మీకేమీ ఇబ్బందిగా అనిపించదా?’’ అని అడిగితే హర్‌సుఖ్‌ మనవడు కృపాల్‌ ఇలా అంటాడు...‘‘చిలకలకు తిండిగింజలు పెట్టడం అనేది మా అందరికీ ఇష్టమైన విషయం. మనం బ్రాండెడ్‌ దుస్తులను ఇష్టపడతాం. అవి మురికైనప్పుడు ఉతికి శుభ్రం చేసుకొని తిరిగి ధరిస్తాం తప్ప... వాటిని వదులుకోలేం కదా! చిలకలు కూడా అంతే. అవంటే మాకు ఎంతో ఇష్టం. అవి మురికి చేస్తాయని వాటికి దూరంగా జరగలేం కదా’’ఇల్లు ఇరుకు అవుతుందని హర్‌సుఖ్‌ తన మకాంను నగర శివార్లలోకి మార్చాడు. ఇప్పుడైతే పక్షులకు ఆ ఇల్లు స్వర్గధామంగా మారింది.



చిలకల ఆహార ఏర్పాట్లకు హర్‌సుఖ్‌కు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. కొందరు అనవసర ఖర్చు అంటారు. కొందరు అనవసర శ్రమ అంటారు. హర్‌సుఖ్‌భాయ్‌కు మాత్రం ఇది అవసరమైన ప్రేమ. అవసరమైన ఖర్చు. అందుకే ఆయన ఇలా అంటారు... ‘‘పక్షుల వల్ల నా జీవితంలో ఎంతో మంచి జరిగింది. ఈ సంగతి ఎలా ఉన్నా... పక్షులు, జంతువుల సంరక్షణకు మనవంతుగా పాటుపడాలి’’

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top