ఆరోజు...

ఆరోజు...


సుగుణాకర్‌ పేరుకు తగ్గ వ్యక్తి. మంచి గుణాలను రాశి పోసినట్లుగా ఉంటుంది అతని ప్రవర్తన.ఇలాంటి అజాతశత్రువు ఒకరోజు హత్యకు గురయ్యాడు. పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు సుగుణాకర్‌. కుటుంబసభ్యులందరూ పెళ్లికి వెళ్లారు. ఎవరూ లేని సమయాన్ని ఎంచుకొని మరీ సుగుణాకర్‌ను చంపారు.



‘‘మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా?’’ అని పోలీసులు అడిగిన ప్రశ్నకు కుటుంబసభ్యుల నుంచి మౌనమే సమాధానమైంది.‘‘జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌.పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టారు.‘సుగుణాకర్‌ ఏంచేసేవాడు?’‘చాలా సంవత్సరాల పాటు వ్యాపారం చేశాడు. రెండు సంవత్సరాల నుంచి విశ్రాంత జీవితం గడుపుతున్నాడు’



‘వ్యాపారంలో ఆయనకు శత్రువులెవరైనా ఉన్నారా?’‘అజాతశత్రువడీ.  ఆయనకు శత్రువులెవరు ఉంటారు?’‘ఇది నిజం కాదు. వ్యాపారమన్నాక కచ్చితంగా ఎవరో ఒకరు శత్రువు ఉండే ఉంటాడు’ అనుకోని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాడు ఇన్‌స్పెక్టర్‌ నరసింహ. వ్యాపారంలో సుగుణాకర్‌ చురుగ్గా ఉన్నప్పుడు నలుగురితో గొడవ పడ్డాడు. ఈ నలుగురిలో ఒకరు విదేశాల్లో ఉంటున్నాడు.



1. సురేష్‌ 2. రవి 3. శ్రీను అనే ముగ్గురు మాత్రం సుగుణాకర్‌ ఉంటున్న ఊళ్లోనే ఉంటున్నారు. వీరిలో... సమయం దొరికితే చాలు సురేష్‌ నిద్రపోతుంటాడు. రవికి కాలు ఒక్క చోట నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక ఊరు తిరుగుతూనే ఉంటాడు. ఇక శ్రీను విషయానికి వస్తే... అతనికి మతిమరుపు.ఈ ముగ్గురిని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు ఇన్‌స్పెక్టర్‌.



‘‘గొడవ పడిన మాట వాస్తవమేగానీ రెండో రోజు నుంచే చక్కగా కలిసి పోయాం. ఆరోజు నుంచి ఈరోజు వరకు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. ఆరోజు ఒంట్లో నలతగా ఉండి పదింటికే పడుకున్నాను’’ అన్నాడు సురేష్‌.‘‘సుగుణాకర్‌ చాలామంచి వ్యక్తి. ఎవరో చెప్పిన మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నాడు. త్వరలోనే నిజం తెలుసుకున్నాడు. ఆరోజూ నేను ఊళ్లో లేను. పొరుగూరుకు వెళ్లాను’’ అన్నాడు రవి.



‘‘ఏదో చిన్న గొడవ. అంతకు మించి ఏమీ లేదు. ఆరోజు నాకు నిద్ర రాకపోవడంతో రాత్రి రెండు గంటల వరకు టీవీ చూస్తూ కూర్చున్నాను’’ అన్నాడు శ్రీను. ముగ్గురిలో శ్రీనే హంతకుడు అనే విషయాన్ని కనిపెట్టాడు ఇన్‌స్పెక్టర్‌. దేని ఆధారంగా అతడు హంతకుడని ఇన్‌స్పెక్టర్‌ కనిపెట్టాడు?

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top