గజాసురుని సత్యసంధత

గజాసురుని సత్యసంధత


పూర్వం గజాసురుడనే రాక్షసుడుండేవాడు. అతను మహా శివభక్తుడు. శివుని గురించి తపస్సు చేసి, ప్రసన్నం చేసుకున్నాడు. తన ఉదరంలోనే నివసించేలా వరం కోరుకున్నాడు. సరేనంటూ వెంటనే ఆ అసురుడి ఉదరంలోకి ప్రవేశించి అక్కడే ఉండిపోయాడు ఉబ్బుశంకరుడు. తన స్వామిలాగే ఈ అసురుడికి కూడా ఒక బలహీనత ఉంది. అదేమంటే గంగిరెద్దుల ఆట. తన వద్దకు గంగిరెద్దులు ఆడేవారెవరైనా వస్తే చాలు, వారి ఆట చూసి, నచ్చితే, గొప్ప బహుమతులిచ్చి పంపుతుండేవాడు. అదే బలహీనత విష్ణువుకు ఆయుధంగా మారింది.



తన భర్త ఎక్కడున్నాడో తెలియక తల్లడిల్లుతున్న పార్వతిని ఊరడించి, ఎక్కడున్నా సరే, తీసుకువస్తానని చెప్పిన విష్ణుమూర్తి, శివుడు గజాసురుడనే రాక్షసుడి ఉదరంలో ఉన్నట్లు తెలుసుకున్నాడు. నందిని గంగిరెద్దుగా మార్చి, బ్రహ్మదేవుడూ తానూ నాదస్వర విద్వాంసులుగా, ఇంద్రాది దేవతలు తలో వాద్యం వాయిస్తూ వెళ్లి గజాసురుని ఇంటి ముంగిట అత్యద్భుతంగా గంగిరెద్దుని ఆడించాడు. సాక్షాత్తూ నందీశ్వరుడే ఆడిన ఆ ఆటను చూసి ఆనందించిన గజాసురుడు ‘‘నీకు ఏం వరం కావాలో కోరుకో, ఇస్తా’’ అన్నాడు పరవశంలో. ‘‘నీ ఉదరంలోని శివుడు కావాలి’’ అన్నాడు విష్ణువు.



 తన బలహీనతే తన మృత్యువును తెచ్చి ఎదుట నిలిపిందని అర్థమైంది గజాసురుడికి. అయినా సరే, తపస్సు వల్ల వచ్చిన సత్యసంధత, సంస్కారం, సాక్షాత్తూ పరమేశ్వరుడినే ఉదరంలో నిలుపుకోగలిగిన శారీరక పుణ్యం ఆ మరణాన్ని ధీరోదాత్తంగా ఆహ్వానించేలా చేశాయి. ‘‘ఈశ్వరా! నేను చచ్చినా, నా శిరస్సు త్రిలోకాలకూ పూజనీయం కావాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి’’ అని చివరి కోరిక కోరి, నంది తన వాడిౖయెన కొమ్ములతో తన ఉదరాన్ని చీల్చడానికి అనుమతించాడు.



ఆ భక్తుని కోరికను మన్నించిన బోళాశంకరుడు ఆ గజచర్మాన్ని తన శరీరానికి ఆచ్ఛాదనగా చుట్టుకుని, గజాసురుని శిరస్సును తీసుకుని వెళ్లి, తాను స్వయంగా శిరస్సు ఖండించిన వినాయకుడి మొండేనికి శిరస్సుగా అమర్చి, త్రిలోకాలలోనూ పూజింపజేశాడు. తన కుమారుడి వికార రూపానికి విచార పడలేదు సరికదా, మరణించిన తన భక్తుడి శిరస్సును చూస్తూ, అతని భక్తిని తలచుకుంటూ ఉండిపోయాడు పరమశివుడు. రాక్షసులు అనగానే వాళ్లు చెడ్డవాళ్లనే భావనే అందరికీ ఉంటుంది. అయితే, వారు కూడా మహాబలవంతులే.



అసహాయ శూరులే. మహాభక్తులే. సత్యసంధతను వీడని వారే, బలిచక్రవర్తి శ్రీహరి పాదాన్ని తన శిరస్సు మీద ధరించి, పాతాళానికి వెళ్లిపోతే, గయాసురుడు తన శరీరాన్నే యజ్ఞపీఠంగా చేసుకునేందుకు దేవతలకు అనుమతి ఇచ్చి, తాను మరణించిన చోటును పితృదేవతలకు పిండప్రదానం చేసే పరమ పవిత్రమైన స్థలంగా మార్చుకున్నాడు. ఇక్కడ చెప్పవచ్చిందేమంటే, రూపాన్ని బట్టి, జాతిని బట్టి వారు చెడ్డవారని అనుకోవడానికి వీలు లేదు. ఒకవేళ చెడ్డవారయినా కూడా, వారు చివరి వరకూ కట్టుబడిన ఒక్క మంచి లక్షణం వల్ల లోకంలో శాశ్వతమైన కీర్తిని సంపాదించుకోగలిగారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top