నహుషుడి మిడిసిపాటు!

నహుషుడి మిడిసిపాటు!


నహుషుడు చంద్రవంశానికి చెందిన రాజు. పరాక్రమవంతుడిగా, ధర్మనిరతి కలిగిన చక్రవర్తిగా పేరు గడించిన వాడు. ఇలా ఉండగా, ఇంద్రుడు కొంత పాపం చేసినందువల్ల దాని పరిహారం కోసం మానస సరోవరంలో ఒక తామర తూడులో ఉండి తపస్సులో మునిగిపోయాడు. దాంతో ఇంద్రపదవికి ఖాళీ ఏర్పడింది. ఆయన తిరిగి వచ్చేవరకు ఆ స్థానాన్ని పూరించగల సమర్థుడైన వ్యక్తి కోసం దేవతలందరూ అన్వేషించసాగారు. చివరికి వారందరూ కూడా నహుషుడయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికొచ్చారు. నారద మహర్షిని నహుషుని వద్దకు పంపించి, ఇంద్రపదవిని స్వీకరించవలసిందిగా ఆహ్వానం పంపారు. నహుషుడు అందుకు ఆనందంగా అంగీకరించాడు. తాత్కాలిక సురపతిగా పదవిని స్వీకరించాడు. ధర్మబద్ధంగా పరిపాలన అందించసాగాడు. కాలంతోబాటే మనుషుల ప్రవర్తన ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! క్రమేణా నహుషుడికి అధికార మదం తలకెక్కింది.



అహంకారం అతని  విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది. ఇంతలో ఓ రోజున దేవేంద్రుడు భార్య శచీదేవి ఉద్యానవనంలో విహరిస్తూ అతని కంటపడింది. ఆమె అందచందాలకు ముగ్ధుడయ్యాడు. ఆమెను అనుభవించాలన్న లాలస కలిగిందతనిలో. ఇంద్రపదవిని చేపట్టిన తనకు ఇంద్రుని భార్య శచీదేవి పట్టపురాణిగా విచ్చేసి, తనను సుఖపెట్టవలసిందేనంటూ శాసనం చేశాడు. నహుషుని అధర్మవర్తనకు దేవతలందరూ కోపించారు. కానీ, ఏం చేయగలరు... తామే తీసుకొచ్చి రాజుగా మహేంద్రపదవిని కట్టబెట్టాము కాబట్టి, కాదని ఖండించడానికి వీలు లేదు మరి. ఏం చేయాలో తోచక కలవరపడ్డారు. మహాపతివ్రత అయిన శచీదేవి ఇది తెలుసుకుంది.



దేవతల గురువైన బృహస్పతిని కలుసుకుని, ఈ ముప్పు తప్పించమని మొరపెట్టుకుంది. ఆయన ఓ ఉపాయం చెప్పాడు. అదేమంటే, నహుషుడిని ఎదిరించగల పరాక్రమవంతుడు ఎవరూ దేవతలలో లేరు కాబట్టి, అతన్ని ఎలాగైనా సరే, మునుల శాపానికి గురయేలా చేయాలి అన్నాడు బృహస్పతి. ఆయన మాటలకు ధైర్యం తెచ్చుకుంది శచీదేవి. ఓ ఉపాయం ఆలోచించింది. అదేమంటే, తాను ఇంద్రాణి కాబట్టి, తన భర్త సామాన్యుడిలా తన వద్దకు రాకూడదని, సప్తర్షులు మోసే పల్లకిలో తన మందిరానికి రావలసిందని కబురంపింది నహుషుడికి.



కామంతో, అధికార మదంతో ఉన్న నహుషుడు ఉచితానుచితాలు ఆలోచించలేదు. ‘‘ఓస్‌! అదెంత పని’’ అంటూ, సప్తర్షులకు వర్తమానం పంపాడు తన పల్లకిని మోసేందుకు రావలసిందంటూ... నహుషుడి వర్తమానం విని సప్తర్షులు కోపోద్రిక్తులయ్యారు. అయినా, తమాయించుకున్నారు. నహుషుడు పల్లకిలో ఆసీనుడు కాగా, సప్తర్షులు ఆ పల్లకిని మోయసాగారు. వారిలో అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, బలహీనుడు కావడంతో పల్లకిని మోయడం అతని తలకు మించిన పనైంది. మిగిలిన వారితో సమానంగా అడుగులు వేయలేకపోయాడు. ఫలితంగా కుదుపులు రావడంతోపాటు, పల్లకి వేగం కూడా మందగించింది. కారణం తెలుసుకున్న నహుషుడు అగస్త్యుడిని కొరడాతో అదిలిస్తూ, ‘సర్ప సర్ప’ అన్నాడు. సర్ప అంటే త్వరగా నడవడమని అర్థం.



కోపించిన అగస్త్యుడు ‘‘అధికార మదంతో ఉచితానుచితాలు, ధర్మాధర్మాలు మరచిపోయిన నీవు వెంటనే సర్పంగా మారి, భూలోకంలో పడి ఉండు’’ అని శపించాడు. నహుషుడికి తన తప్పు తెలిసి వచ్చింది. కనులకు కమ్మిన పొరలు కరిగిపోయాయి. వెంటనే అగస్త్యుడి కాళ్లమీద పడి, తనను క్షమించి, శాపాంతాన్ని చెప్పవలసిందంటూ ప్రార్థించాడు. అప్పుడు అగస్త్యుడు ‘‘రాజా! నీవు ఒక కొలను ఒడ్డున గల బిలంలో ఉంటూ, నీళ్లు తాగడానికొచ్చిన వారిని నిర్బంధిస్తూ, వారిని కొన్ని ప్రశ్నలు అడుగు. వారిలో ఎవరైతే నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెబుతారో, అప్పుడే నీకు శాపవిమోచనం కలుగుతుంది’’ అంటూ శాపాంతం చెప్పాడు.



తక్షణం నహుషుడు మహాసర్పమై, భూలోకంలోని ఒక కొలను వద్ద పడి ఉన్నాడు. కొన్ని వేల ఏళ్ల తర్వాత ఆ కొలను వద్దకు వచ్చిన భీముడిని తన భారీ శరీరంతో చుట్టి వేసి, ఎటూ కదలకుండా బంధించి వేస్తాడు. అతన్ని వెదుక్కుంటూ వచ్చిన ధర్మరాజు, నహుషుడు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడంతో శాపవిముక్తి కలుగుతుంది. పూర్వపుణ్యం వల్లనో, ఈ జన్మలో చేసిన గొప్ప పనుల వల్లనో పదవులు వరించవచ్చు. దానిని తమ గొప్పతనంగా భావించి, అహకరించినవారికి పతనం తప్పదని పై ఉదంతం చెబుతుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top