బలి మేక

బలి మేక


ఎంతో ప్రమాదకరమైన ఎన్‌కౌంటర్‌. అయినా తప్పంతా తనదే. ఆ గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోకుండా సరిౖయెన వ్యూహం లేకుండా తను వ్యవహరించాడు. అదృష్టం తనవైపు ఉంది కాబట్టే తాను తప్పించుకొని ఫైరింగ్‌ చెయ్యడం వల్ల గ్యాంగ్‌స్టర్‌ త్రిలోచన్‌ సింగ్‌ చనిపోయాడు. లేకపోతే తమ బృందం అంతా వాడి బుల్లెట్లకు బలైపోయేవాళ్లమే!



అర్ధరాత్రి! సమయం పన్నెండు కావస్తోంది. ఆ నిశీధిని చీల్చుకుంటూ ఘాట్‌ రోడ్‌లో జీపు చాలా స్పీడుగా పోతోంది. హెయిర్‌ పిన్‌ బెండ్స్‌... ఒకదాని తరువాత ఇంకొకటి... నాకు నిద్ర ముంచుకు వస్తున్నా రోడ్డు వంపుల వద్ద బ్రేకులు వెయ్యడం వల్ల జీపు చేస్తున్న శబ్దానికి నిద్ర పట్టడం లేదు.నిజంగా ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. మరణం అంచుదాకా వెళ్లి మళ్లీ తిరిగొచ్చిన రోజు... ఆ ఆలోచన వస్తేనే ముఖం నిండా చెమటలు పడుతున్నాయి. త్రుటిలో తప్పిపోయింది ఆ బులెట్‌.



లేకపోతే నా తలలోంచి దూసుకుపోయేదే. ఎంతో ప్రమాదకరమైన ఎన్‌కౌంటర్‌. అయినా తప్పంతా తనదే. ఆ గ్యాంగ్‌లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోకుండా సరిౖయెన వ్యూహం లేకుండా తను వ్యవహరించాడు. అదృష్టం తనవైపు ఉంది కాబట్టే తాను తప్పించుకొని ఫైరింగ్‌ చెయ్యడం వల్ల గ్యాంగ్‌స్టర్‌ త్రిలోచన్‌ సింగ్‌ చనిపోయాడు. లేకపోతే తమ బృందం అంతా వాడి బుల్లెట్లకు బలైపోయేవాళ్లమే!



ఇంతలో జీపు శబ్దం చేస్తూ ఆగడంతో కళ్లు తెరిచాను. డ్రైవర్‌ ‘‘సార్‌. గెస్ట్‌ హౌస్‌ వచ్చింది’’ అని చెప్పడంతో తలుపు తెరిచి దిగాను. మా జీపు వెనుకే మా కానిస్టేబుల్స్‌ వస్తున్న వ్యాన్‌ కూడా రావడం కనిపించింది. ఆ నిశీధిలో ఎత్తుగా ఉన్న ఘాట్‌ రోడ్డు మీద నుంచి దాని లైటింగ్‌ వంపులో రిఫ్లెక్ట్‌ మా మీద పడుతుండటంతో ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుంటూ ‘‘ఏం... ఇప్పుడు విశాఖపట్నం వెళ్లలేమంటావా?’’ అని అడిగాను.



‘‘వద్దు సార్‌. ఆ ముఠా నాయకుడు త్రిలోచన్‌ సింగ్‌ చనిపోయినా వాడి అనుచరుడు తప్పించుకున్నాడు. వాడు చాలా కిరాతకుడు. అందుకని ఈ సమయంలో ఈ అడవిలో ప్రయాణం ప్రమాదం. ఈ రాత్రికి ఈ గెస్ట్‌ హౌస్‌లో ఉండిపోయి రేపు ఉదయాన్నే వెళదాం’’ అన్నాడు. అతని మాటలు ఆ నిశీధి నీరవంలో నామీద బాగా ప్రభావం చూపించాయి. అయినా నేను కూడా ఉదయం నుంచి ఈ ఆపరేషన్‌లో అలసిపోయాను. అందుకని ఇంకేం మాట్లాడకుండా జీపు దిగి గెస్ట్‌ హౌస్‌లోకి నడిచాను.



దూరంగా ఘాట్‌ రోడ్డుమీద అప్పుడప్పుడు వస్తున్న వాహనాల శబ్దాలు... మధ్యమధ్యలో కీచురాళ్ల అరుపులు తప్ప ఆ సమయంలో ఆ అడవిలో నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది.

రూమ్‌లోకి వెళ్లి వేడినీళ్లతో స్నానం చెయ్యగానే శరీరం, మస్తిష్కం రెండూ చల్లబడ్డాయి. హాల్లోకి వచ్చి టీవీ ఆన్‌ చేశాను. ఏవో పిచ్చి ప్రోగ్రామ్‌లు... ఉదయం ఇచ్చినవే మళ్లీ రిపీట్‌ చేస్తున్నారు. ఛానల్స్‌ సర్ఫింగ్‌ చేస్తున్నాను. డిస్కవరీలో ఏదో సైన్స్‌ ప్రోగ్రామ్‌. ఆ తరువాత ఏనిమల్‌ ప్లానెట్‌ ఛానల్‌లో... ఒక పులి కోతిని వేటాడుతోంది.



 అంతే. నా చెయ్యి ఒక్కసారిగా ఆగిపోయింది. రిమోట్‌ని టేబుల్‌ మీద పెట్టేసి తీక్షణంగా ఆ కార్యక్రమాన్ని చూడసాగేను. రాను రాను నాలో ఉత్కంఠ. ఏం జరగబోతుందన్న మీమాంస. ఆ కార్యక్రమం పూర్తయింది. కానీ నన్ను వెంటాడ సాగింది.లైటార్పి పడుకున్నానే గానీ ఆ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌ నన్ను వెంటాడ సాగింది. మళ్లీ మస్తిష్కం వేడెక్కసాగింది. ఆర్నెల్ల క్రితం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి మీద ఈ మన్య ప్రాంతానికి వచ్చాను. సుమారు పది సంవత్సరాలు పట్టణ ప్రాంతాల్లో ఎస్‌.ఐ.గా పనిచేసిన నాకు ఇక్కడి పోస్టింగ్‌ కొద్దిగా రిలీఫ్‌నిచ్చింది.



ఇదివరకైతే ఇళ్లల్లో దొంగతనాలు, అమ్మాయిల్ని వేధించే ఆకతాయిలు, రాజకీయ నాయకుల దౌర్జన్యాలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల భూ దందాల గొడవలతో ఉక్కిరి బిక్కిరి అయిన నాకు ఇది మన్య ప్రాంతం కావడంతో అటువంటి కేసులు పెద్దగా లేకపోవడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకోసాగాను.ఈ మన్య ప్రాంతం అంతా తూర్పు కనుమల్లో విస్తరించి ఉంది. ఏభై కిలోమీటర్ల తరువాత ఒరిస్సా బోర్డర్‌ కోరాపుట్‌ వచ్చేస్తుంది. ఇక్కడ మద్యానికి బానిసలైన గిరిజనుల్ని మోసం చేసే దళారులు ఎక్కువగా కనిపిస్తారు.



దూరంగా కొండల్లో అక్కడక్కడ విసిరేసినట్లుండే తండాలు, వాటిని కలుపుకుంటూ ఒరిస్సా వెళ్లే జాతీయ రహదారి... ఎక్కువగా వారపు సంతల రోజున గిరిజనులకు, దళారులకు ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. వాటిని అదుపు చెయ్యడానికి ఆ రోజుల్లో సంతలకి కానిస్టేబుల్స్‌ వెళ్తుంటారు.ఇలా సాఫీగా జీవితం గడిచిపోతున్న సమయంలో ఒకరోజు నేను స్టేషన్లో ఉండగా నన్ను కలవడానికి ఫారెస్ట్‌ రేంజర్‌ సన్యాసి రాజు వచ్చాడు. అతణ్ని ఆహ్వానించి కాఫీలు ముగిసిన తరువాత వచ్చిన విషయం గురించి అడిగాను. అతడు కొద్దిసేపు మౌనం వహించి తరువాత చెప్పడం మొదలుపెట్టాడు.



‘‘సుమారు రెండు సంవత్సరాల నుంచి ఈ అడవిలో టేకు చెట్ల స్మగ్లింగ్‌ జరుగుతున్నాది. ఈ అక్రమ రవాణా అన్నది ఎప్పట్నుంచో ఉన్నా సంవత్సరం నుంచి బాగా పెరిగింది. దీనికి కారణం ఇక్కడి మాజీ శాసన సభ్యుడు. అతను చాలా రోజుల నుంచీ మా కాంట్రాక్టర్‌. మేము వేలం వేసిన టేకు, దేవదారు చెట్లను ఆక్షన్‌లో పాడి, వాటిని తన టింబర్‌ డిపోలకి తరలిస్తుంటాడు.అతను తన పలుకుబడితో ఇంకెవరూ ఆక్షన్‌లో పాల్గొనకుండా మేనేజ్‌ చేస్తుంటాడు. అవసరం అయితే బెదిరిస్తాడు. వినకపోతే హత్యలు చేయిస్తాడు.



అంతవరకు బాగానే ఉన్నా ఈ మధ్య అతను బీహార్‌ నుంచి ఒక గేంగ్‌ని తెచ్చి, వాళ్ల చేత రాత్రిపూట టేకు చెట్లను కొట్టించి, మా అటవీ సిబ్బంది, మీ పోలీసుల కళ్లు కప్పి విలువైన అటవీ సంపదను తరలించుకుపోతున్నాడు. ఆ బీహార్‌ గేంగ్‌కి నాయకుడు త్రిలోచన్‌ సింగ్‌. కరడు కట్టిన క్రిమినల్‌. అతని మీద బీహార్, ఒరిస్సాలో ఎన్నో క్రిమినల్‌ కేసులున్నాయి. అతనికడ్డు వచ్చిన అధికారుల్ని, సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఒకవిధంగా అతను ఈ అడవికి వీరప్పన్‌ లాంటివాడు అనుకోండి’’ అతను చెబుతూ మధ్యలో ఆగాడు.



‘‘మరి మీరు ఆ మాజీ ఎమ్మెల్యేపై కేసు పెట్టలేకపోయారా?’’ మంచినీళ్లు అందిస్తూ అడిగాను.‘‘అది అంత సులభం కాదు ప్రభాకర్‌గారూ. అతని చీకటి సామ్రాజ్యం ఈ అడవి అంతా చాప కింద నీరులా వ్యాపించి ఉంది. ఇక్కడి గిరిజన తండాల్లో అతని అనుచరులు చాలామంది ఉన్నారు. వాళ్ల ద్వారా అతనికన్ని విషయాలూ తెలిసిపోతుంటాయ్‌. ఆర్నెల్ల క్రితం ఆ గేంగ్‌ని పట్టుకోవడానికి వెళ్లిన మా ఫారెస్ట్‌ గార్డ్‌లిద్దర్నీ కిరాతకంగా చంపేసింది ఆ ముఠా.



అప్పట్నుంచీ మా సిబ్బంది భయపడి ఎవరూ వాళ్లకి అడ్డు చెప్పడం లేదు. ఇప్పటికి కొన్ని వేల చెట్లు ఈ అడవి దాటి పోయాయి. ఈ విషయం మా చీఫ్‌ కన్సర్వేటర్‌ దృష్టికి రావడంతో క్రితం నెల అతనిక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించి మీ ఎస్పీగారితోను, కలెక్టర్‌గారితోను మాట్లాడి మన రెండు శాఖల సమన్వయంతో వాళ్లని పట్టుకోమని ఆదేశాలిచ్చారు. ఆ విషయం మీతో మాట్లాడదామనే ఇప్పుడు వచ్చాను’’ అన్నాడు కుర్చీలో రిలాక్స్‌గా కూర్చుంటూ.



ఇప్పుడు పరిస్థితి నాకు అర్థం అయింది. ‘‘మిస్టర్‌ రాజూ... మీరు ఓ పని చెయ్యండి. ఈ విషయాలన్నీ పూర్తిగా వివరిస్తూ అనుమానితుల పేర్లతో సహా ఒక కంప్లయింట్‌ ఇవ్వండి. ఎఫ్‌.ఐ.ఆర్‌. లాడ్జ్‌ చేసి వాళ్లని ఎలా పట్టుకోవాలో ఆలోచిద్దాం. ఈ విషయంలో మీరు అధైర్యపడొద్దు. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని మా ట్రైనింగ్‌లో చెబుతారు’’ అన్నాను నవ్వుతూ.



‘‘ఆ కంప్లయింట్‌ను తెచ్చాను చదవండి’’ అంటూ ఒక ఫైల్‌ని నాకిచ్చాడు. దాన్ని చదివిన తరువాత మా రైటర్‌కిచ్చి ఎఫ్‌.ఐ.ఆర్‌.ని తయారుచెయ్యమని చెప్పాను.lఆ సాయంత్రం ఆ కేసు ఫైలు తెప్పించి చదివాను. ఆరునెలల క్రితం డ్యూటీలో ఉన్న గార్డ్‌ రవి దారుణంగా చంపబడటంతో ఎఫ్‌.ఐ.ఆర్‌. రిజిస్టర్‌ చేశారు. మా కానిస్టేబుల్‌ అప్పారావుని ఆ కేసు గురించి అడిగితే అతను కాసేపు తటపటాయించి అప్పుడు చెప్పాడు.



‘‘సార్‌... మన మాజీ ఎమ్మెల్యే రత్తయ్య గురించి మీరు వినే ఉంటారు. ఈ అడవిలో అతన్ని ఎదిరించిన వారెవ్వరూ బతికి బట్టకట్టరు. టేకు చెట్ల అక్రమ రవాణా దగ్గర్నించి పులుల్ని చంపడం దాకా అన్నింటిలో వాడి హస్తం ఉంది. వాడిని ఎదిరిస్తే మనం ఇక్కడ ఉద్యోగం చెయ్యలేం. దయచేసి ఈ విషయాల్లో మీరు తలదూర్చకండి. ఆ ఫారెస్ట్‌ వాళ్లకేం పోయింది చెప్పండి... వాళ్లేమీ చెయ్యకుండా మనమీద తోసేస్తుంటారు’’ అని చెప్పాడు అప్పారావు భయంగా.



‘‘అప్పారావ్‌... ఈ రత్తయ్య ఇక్కడికొస్తుంటాడా? వాడే ఈ పనులు చేయిస్తున్నాడనడానికి ఏవైనా ఆధారాలున్నాయా?’’‘‘వాడెప్పుడూ ఇక్కడికి రాడు సార్‌. అంతా వాడి అనుచరులే చేస్తుంటారు. ముఖ్యంగా పకీరు అని వాడికి ఓ అనుచరుడున్నాడని, వాడే అన్నీ చేయిస్తుంటాడని విన్నాను.’’ఆ సాయంత్రం నేను మా ఎస్పీగారితో ఈ విషయం గురించి ఫోన్‌లో మాట్లాడాను.



అతను నే చెప్పినదంతా విని, ‘‘ప్రభాకర్‌...  ముఖ్యమంత్రిగారు మొన్న మా ఎస్పీల మీటింగులో అటవీ సంపదని దోచుకుంటున్న క్రిమినల్స్‌ మీద కఠిన చర్యలు తీసుకొమ్మని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర బోర్డర్‌లోని మన్యంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను అణచి వేయమని హెచ్చరించింది. మొన్ననే అటవీ శాఖతో మీటింగ్‌ పెట్టాను. వాళ్లు కూడా  ఈవిషయంలో సీరియస్‌గా ఉన్నారు. కాబట్టి నువ్వేమీ భయపడొద్దు. గో ఎ హెడ్‌’’ అని భరోసా ఇవ్వడంతో వాళ్లని ఎలా పట్టుకోవాలోనని ఆలోచనల్లో పడ్డాను.



ఆ మర్నాడు నేను స్టేషన్లో ఉన్నప్పుడు ఫారెస్ట్‌ రేంజర్‌ సన్యాసిరాజు వచ్చి, ‘‘ప్రభాకర్‌గారూ... ఈ రాత్రి పది లారీల టేకు చెట్లు ఈ అడవి దాటి పోతున్నట్లు మావాళ్లు సమాచారం ఇచ్చారు. రత్తయ్య కూడా నిన్ననే ఇక్కడికి వచ్చి ఏదో తండాలో తలదాచుకున్నాడట. నిన్నట్నుంచీ అడవిలో కదలికలు పెరిగినట్లు మా గార్డులు చెబుతున్నారు. నేను మా డీయఫ్‌ జోగారితో చెప్పి మరికొంతమంది సిబ్బందిని రప్పిస్తున్నాను. ఈ రాత్రి వాళ్లని ఎలాగైనా ఎటాక్‌ చేద్దాం. మీరు ఆ ప్రయత్నంలో ఉండండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు.



అతను వెళ్లిపోయిన తరువాత నేను మావాళ్లని పిలిచి ఏం చెయ్యాలో చెప్పాను. ఎస్పీగారితో చెబితే, ‘‘ప్రభాకర్‌... ఇప్పుడే ఓ పాతిక మంది గ్రే హౌండ్స్‌ బెటాలియన్ని పంపిస్తున్నాను. వాళ్ల దగ్గర అత్యంత అధునాతనమైన ఆయుధాలున్నాయి. ఇటువంటి వాళ్లని మట్టుబెట్టడంలో వాళ్లు సిద్ధహస్తులు. నువ్వు ఫారెస్ట్‌ వాళ్లతో కో–ఆర్డినేట్‌ చేసి ఈ రాత్రి వాళ్లమీద ఎటాక్‌ చెయ్యండి. అవసరమైతే షూట్‌ ఎట్‌ సైట్‌ చెయ్యండి. ఓకే’’ అని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది. అనుకున్నట్లుగానే ఆ రాత్రి వాళ్లమీద మాగ్రే హౌండ్స్‌ దళం, ఫారెస్ట్‌ గార్డ్స్‌ మొత్తం అంతా కలిసి దాడి చేశాము.



 ఇంతమంది పోలీసులు ఒకేసారి ఎటాక్‌ చెయ్యడంతో త్రిలోచన్‌ సింగ్‌ గేంగ్‌ అడ్డంగా దొరికిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ పదకొండున్నర దాకా సాగింది. ఆ ఎన్‌కౌంటర్లో త్రిలోచన్‌ సింగ్‌తో సహా ఎనిమిది మంది గేంగ్‌ చనిపోయారు. ఒక్కడు మాత్రం తప్పించుకున్నాడు. పాపం, వాళ్లతోపాటు లారీలో ఉన్న రత్తయ్య ముఖ్య అనుచరుడు పకీరు కూడా మా తుపాకీ గుళ్లకి బలైపోయాడు.

ఆ తరువాత మేము బయలుదేరి మా గెస్ట్‌ హౌస్‌కి వచ్చేశాము.



అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు కానీ ఏడవుతుండగా మా కానిస్టేబుల్‌ అప్పారావ్‌ వచ్చి లేపే దాకా తెలివి రాలేదు. వాడు వస్తూనే, ‘‘సార్‌! ఆ రత్తయ్యగాడిని కూడా మన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వాడు ఈ పక్కనే ఉన్న కిల్లిగూడలో దొరికాడట. ఇంకో ముఖ్య విషయం... నేను తెల్లవారిజామున జీపులో వస్తుంటే చింతవంపు దగ్గర రత్తయ్య కారు లోయలో కనిపించింది. బహుశా వాడి అనుచరులెవరో పారిపోతూ దీన్ని వదిలేశారేమో. దాన్ని మనవాళ్లెవరూ గమనించలేదు. చూస్తే ఆ కారుకి లాక్‌ కూడా చెయ్యలేదు. ఆశ్చర్యంగా అందులో ఈ బ్రీఫ్‌ కేస్‌ దొరికింది’’ అంటూ తలుపులు వేసి దాన్ని తెరిచాడు. ఆశ్చర్యం... దాన్నిండా ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు. ఓ పది లక్షల పైనే ఉన్నాయి. ఆ డబ్బుని చూడగానే నా కళ్లు బైర్లు కమ్మాయి.



‘‘తరువాత ఏం జరిగింది ప్రభాకర్‌. టెన్షన్‌ పెట్టకుండా చెప్పు’’ అంటూ రాజు తొందర పెట్టసాగాడు. వాడు కూడా మా బేచ్‌ వాడే. పక్క స్టేషన్‌లో పనిచేస్తుంటాడు. వాడికి, నాకు ఒకేసారి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లుగా ప్రమోషన్స్‌ వచ్చాయి. ఆ తెల్లవారి ఎన్‌కౌంటర్‌లో రత్తయ్య, గేంగ్‌ని తుద ముట్టించి ప్రాణాలతో బయటపడి నన్ను పరామర్శించడానికి మా ఇంటికి వచ్చాడు.



‘‘ఆ డబ్బుని చూడగానే నాకు నిజంగా మతిపోయింది. దీన్ని ఎస్పీగారికి అప్పజెప్పాలని గెస్ట్‌ హౌస్‌ నుంచి బయలుదేరుతుండగా టీవీలోని ఏనిమల్‌ ప్లానెట్‌ ఛానల్లో వచ్చిన ఓ ప్రోగ్రామ్‌ నన్ను ఆకర్షించింది. అందులో ఓ పులి ఓ కోతిని వెంటాడి మరీ చంపుతుంది. దాన్ని చెట్టు కింద కూర్చొని తినబోతుండగా పక్కనే అప్పుడే పుట్టిన దాని పిల్లకోతి కనిపిస్తుంది. ఆ తరువాత ఆ పులి ఆ కోతిని తినడం ఆపి, దాని పక్కనే ఈ కోతి మాంసం గురించి ఎదురుచూస్తున్న సివంగి బారి నుంచి, చెట్టుమీద పొంచి ఉన్న ఎలుగుబంటి నుంచి ఆ పిల్లకోతిని రక్షించి దూరంగా ఉన్న తన గుహలోకి తీసుకెళ్లడంతో ఆ ప్రోగ్రామ్‌ ముగుస్తుంది.



దాన్ని చూసిన తరువాత నాకు తెలియకుండానే నా కళ్లు చెమ్మగిల్లడం నేను గమనించాను. ఆ సమయంలో మా ఎన్‌కౌంటర్లో బుల్లెట్లకు బలైపోయిన పకీర్‌ నాకు గుర్తుకు వచ్చాడు. పాపం... వాడు ఏమీ తెలియని ఓ అమాయకుడైన గిరిజనుడు. అనవసరంగా రత్తయ్య దుర్మార్గాలకు బలైపోయాడు. వాడు గుర్తుకు రాగానే నాకెందుకో పులి చేతిలో బలవంతంగా ప్రాణాలు కోల్పోయిన కోతి గుర్తుకు వచ్చింది. ఆ తరువాత ఆ పులి పశ్చాత్తాప పడి దాని పిల్లని కాపాడిన పులి మంచితనం నా మనసుని కదిలించింది’’ చెబుతూ మధ్యలో ఆగాను.



‘‘తరువాత’’ రాజు కళ్లల్లో ఉత్కంఠత.

‘‘వెంటనే నేను, మా అప్పారావ్‌ కలిసి పకీర్‌ శవాన్ని అప్పజెప్పడానికి వాడి తండాకి వెళ్లాము. వాడిది చాలా పేద కుటుంబం. వీడి సంపాదన మీదే వాళ్లు ఆధారపడి బతుకుతున్నారని, వాడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారని, అక్కడ వాళ్లకి ఇల్లు తప్ప మరేమీ లేదని ఊరివాళ్ల ద్వారా తెలుసుకున్నాము. పకీర్‌ అనవసరంగా మా చేతిలో చనిపోయాడు. వాడు చేసింది చట్ట ప్రకారం తప్పే కావచ్చు కానీ వాడు రత్తయ్యలాంటి క్రిమినల్‌ చేతిలో బలిమేక.



 నాకెందుకో ఆ సమయంలో పకీర్‌ కుటుంబాన్ని రక్షించాలనిపించింది. నేను చేస్తున్నది తప్పో ఒప్పో తెలియదు. ఆ తెల్లవారు జామున అప్పారావుకి రత్తయ్య కార్లో దొరికిన పది లక్షల రూపాయల్ని పకీర్‌ భార్యకు ఇచ్చేసి వచ్చేశాను.’’ఈ విషయం పూర్తిగా చెప్పేసిన తరువాత మళ్లీ నా కళ్లు చెమర్చడాన్ని గమనించాను.అప్పటికే రాజు నా దగ్గరకు వచ్చి కావలించుకొని, ‘‘వృత్తి పరంగానే మనం పోలీసులం. కానీ అందరిలాగే మనం కూడా మనుషులమేనని నిరూపించావ్‌’’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ...

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top