మర్యాద ఓ మద్యపు కిక్కు!... గౌరవం ఓ అడిక్టెడు డ్రగ్గు!!

మర్యాద ఓ మద్యపు కిక్కు!... గౌరవం ఓ అడిక్టెడు డ్రగ్గు!!


‘‘మర్యాద పొందడం అన్నది మద్యం కంటే హానికరం. గౌరవం ఆశించడం అనే దాంట్లో లిక్కర్‌కు మించి కిక్కు పొందాలనే ఆశ ఉంటుంది. అందుకే గౌరవ మర్యాదల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటరు’’ అన్నాడు మా రాంబాబు గాడు. సంగతేమిటంటే... వాడెవడో తలకు మాసినవాడు వీడికి కాస్త వినయంగా నమస్కారం పెట్టాడు. అంతే... వీడు హై స్పీడ్‌తో, పై స్పీచ్‌తో వాడికి ఒక మినీ క్లాస్‌ తీసుకున్నాడు. ‘‘ఒరేయ్‌ ప్రతినమస్కారం పెట్టి ఊరుకుంటే పోయేదానికి ఎందుకురా ఈ పనికిమాలిన కబుర్లూ, క్లాసులు’’ అన్నా. అంతే వాడి దృష్టి నా మీదికి మళ్లింది.



‘‘నేను చెప్పింది నిజంరా బాబూ. మర్యాదను పొందడం తనకు అవసరమనుకునే వాడూ, అది తన హక్కుగా భావించేవాడూ, ఏదైనా పరిస్థితుల్లో దాన్ని దొరకకపోతే మాత్రం.. డ్రగ్సుకు అలవాటు పడ్డవాడు సమయానికి అది దొరకకపోతే అల్లాడిపోయినట్టు అల్లాడుతాడురా. అందుకే... ఈ గౌరవం పొందడమనే డ్రగ్గుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దొరికినప్పుడు ఆనందపడకూడదూ... దొరకనప్పుడు వెంపర్లాడకూడదు.



 ఒకవేళ వెంపర్లాడాడా అంటే మనశ్శాంతి దొరకదు’’ అంటూ కాస్త విపులీకరించాడు రాంబాబు గాడు. ‘‘మరీ చాన్స్‌ దొరికింది కదాని ఓవర్‌గా మాట్లాడుతున్నావ్‌ నువ్వు’’ అన్నా.‘‘నేను కనీసం ఓవర్‌గా మాట్లాడుతున్నానేమోగానీ... ప్రజలు గ్రహించడం లేదు గానీ... ఇదే సత్యాన్ని ఆర్టీసీ వాడు గోడల మీద రాసి మరీ ప్రచారం చేస్తున్నాడు’’ చెప్పాడు రాంబాబు.‘‘నీ అతిశయోక్తి కాకపోతే... ఏమిట్రా వాళ్లు చేస్తున్నదీ? మర్యాద పొందడం, గౌరవం చూపడం అన్నవి మద్యంతో సమానమని ఆర్టీసీ వాళ్లు ప్రచారం చేస్తున్నారా?’’ అడిగా.‘‘అవునురా... కాకపోతే ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో ఏం రాసి పెడుతుంటారో ఎప్పుడైనా చూశావా? ‘మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకునే ఆభరణం...  మనం పరస్పరం మర్యాదగా మసలుకుందాం’ అని రాస్తారు వాళ్లు.



అంటే... ఆర్టీసీ వాడు మర్యాదను ఏ ఏడు వారాల నగగానో,  మాంచి మందపాటి నెక్లెస్‌గానో పరిగణించిన మాట నిజం. సపోజ్‌... ఎదుటివాడు నీ మెళ్లో 5 తులాల మర్యాద బంగారం పెట్టాడనుకో. మళ్లీ నువ్వు కూడా వాడికి తూచినట్టుగా సరిగ్గా 5 తులాలే పెట్టాలి. ఏమైనా తేడా వచ్చిందనుకో. మళ్లీ ఆ పరస్పర గౌరవాలు ఇచ్చిపుచ్చుకున్నోళ్ల మధ్య తేడాలొచ్చేస్తాయి. నేనింత గౌరవాన్ని ఎదుటాడికి సమర్పిస్తే... వాడు మాత్రం పోన్లే అని ఇంతే నా ముఖాన కొట్టాడు... అంటూ దెబ్బలాడుకునే ప్రమాదమూ ఉంది.  ఇక మర్యాద అనేది ఆభరణం అన్న మంట ఎంత కరక్టో ఇంకా చెబుతా విను’’ అంటూ చెప్పబోతూ ఉండగా...



‘‘చాల్లేరా’’ అంటూ వాడి ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశా. ఊహూ... వాడేమాత్రమూ వినలేదు. ‘‘నువ్వు వేళ్లకు ఎలాంటి ఉంగరాలూ, మెళ్లో గొలుసులూ, మణికట్టుకు చైన్లూ లేకుండా ఉన్నావనుకో. ఏ బెంగా లేకుండా హాయిగా ఉంటావు. అదేగానీ ఈ ఆభరణాలతో బస్సెక్కావనుకో. ఇంకంతే. నీ మనశ్శాంతి మసి. ఎంతసేపూ ఆ ఆభరణాలు పదిలంగా ఉన్నాయో లేదో చూసుకోవడమే సరిపోతుంది. అన్నట్టు నువ్వో విషయం చెప్పు....’’ అన్నాడు వాడు. ‘‘అన్నీ నువ్వే చెప్పేస్తూ... మళ్లీ నేను నీకు చెప్పగలిగేదేముందిలే’’ అంటూ తప్పించుకోజూశాను. అయినా వదల్లేదు వాడు.



‘‘ఇలా ఇచ్చి పుచ్చుకునే ఆభరణాల విషయాన్ని కాస్త జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఆలోచించు. మన మధ్యతరగతి మెంటాలిటీతో ఆలోచించు. మనకు ఏదైనా ఒక గిఫ్ట్‌ వచ్చిందనుకో. మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి... దాని విలువెంతో అంచనా వేసి... మొక్కు తీర్చుకున్నట్లుగా అంతే విలువైన గిఫ్టు బదులుగా ఇస్తాం. సదరు ఆభరణమైన మర్యాద విషయంలోనూ అంతే. పైగా గౌరవం అన్ని వేళలా అందరికీ ఆనందాన్ని ఇవ్వదు’’



‘‘గౌరవం వల్ల ఆనందం దక్కకపోవడం ఏమిట్రా. ఐస్‌ వల్ల చలి పెట్టదు అన్నట్లుంది నీ వాదన’’ ‘‘నేను చెప్పేది నిజం రా బాబూ. ఐస్‌ చల్లగా ఉన్నా ఏదో వేడిది పట్టుకున్నట్టుగా చెయ్యి కొరికేస్తుంది. గౌరవం కూడా అంతే. దొరికినప్పుడు దాన్ని హ్యాండిల్‌ చేయడం కష్టం రా బాబూ’’ ‘‘అదెలా?’’ ‘‘గౌరవం అన్ని వేళలా అంతే ఆనందం కలిగించదు. గౌరవం ఎప్పుడూ సంతోషదాయకం కాదు. గౌరవంతో కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఎదుటివాడు అందించే గౌరవాన్ని మనం సరిగ్గా అందుకోకపోతే వాడెంత బాధపడతాడేమో అని మనం బాధపడుతుంటాం. మనం ఇచ్చే గౌరవాన్ని వాడికి సరిగా చేరవేశామో లేదో అని మనమూ సతమతమవుతుంటాం.



అందుకే బాగా పరిచయం ఉన్నవాళ్లు గౌరవం ఇవ్వరు’’ ‘‘ఏమిటీ గౌరవాలు ఇవ్వరా? ఇలా ఇవ్వకపోవడమే మంచిదా?’’ అడిగా ఆశ్చర్యంగా. ‘‘మరి అంతేరా... నిన్ను నేను ఒరే అంటున్నాను. నువ్వు నన్ను ఏరా అంటావు. కాబట్టి ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటాం. అదే ఏవండీ... మంచిదండీ అనుకుంటుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించు. ఇంత ఆలోచించేరా... పరిచయం పెరుగుతున్న కొద్దీ... ఆప్యాయత ఎక్కువవుతున్న కొద్దీ గౌరవాలు తగ్గించుకొని జాగ్రత్త పడతారు మనలా స్నేహమూ... ఆపేక్షా పుష్కలంగా ఉన్నవాళ్లు’’ అంటూ తన సై్టల్లో వివరణ ఇచ్చాడు మా రాంబాబు గాడు.

– యాసీన్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top