బలరామకృష్ణులు

బలరామకృష్ణులు


అవంతీతీరంలో గల సాందీపుడనే గురువు వద్ద విద్యాభ్యాసం కోసం చేరారు కృష్ణబలరాములు. భుజబలం, బుద్ధిబలం, ధనబలం అన్నీ ఉన్నా కానీ వారు గురువాజ్ఞను శిరసావహించి గురుపత్ని చెప్పిన పనులను అందరితో సమానంగా చేస్తూ శ్రద్ధాసక్తులతో గురువు వద్ద విద్యను అభ్యసించసాగారు. సాందీపుడు అమిత ప్రేమతో తన శిష్యులకు తర్క, వ్యాకరణ, ధర్మ, అర్థశాస్త్రాలను బోధించసాగాడు. ఏకసంథాగ్రాహులైన బలరామకృష్ణులు గురువు చెప్పిన విద్యలన్నీ అవలీలగా అతి కొద్దికాలంలోనే నేర్చుకున్నారు. ఎప్పుడూ చిరిగిపోయిన వస్త్రాలను ధరించడం వల్ల కుచేలుడనే పేరు పొందిన సుదాముడు వారి సహాధ్యాయే.



సాందీపునికి ఒక కుమారుడున్నాడు. ఒకనాడు సాగర సంగమమైన ప్రభాస తీర్థంలో స్నానం చేస్తూ నీటిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయాడా కుర్రవాడు. తమ ఏకైక కుమారుడు కాస్తా సముద్రంలో కొట్టుకుపోవడంతో దుఃఖసాగరంలో మునిగిపోయారు సాందీపని దంపతులు. అయితే సాందీపనికి తన శిష్యుల శక్తిసామర్థ్యాలపైన అపారమైన నమ్మకం. దాంతో బలరామకృష్ణులను సమీపించి, ‘‘నాయనలారా! అన్నీ తెలిసిన మీకు నేను ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. నాకున్న ఒక్కగానొక్క కుమారుడు కాస్తా సాగర గర్భంలో మునిగిపోయాడు.



మీరు వాడిని తిరిగి తెచ్చివ్వగలరా?’’అని దీనంగా అడిగాడు. గురువు మాటలకు హృదయం ద్రవించి పోయింది బలరామకృష్ణులకు. ‘‘మీరేమీ దిగులు చెందకండి గురువర్యా! మీ కుమారుడు ఎక్కడ ఉన్నా మేమతన్ని తీసుకొచ్చి అప్పగిస్తాం. ఇదే మీకు చెల్లించే గురుదక్షిణ’’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. గురువుకిచ్చిన మాట మేరకు వారు సముద్రంలో ప్రవేశించి గురుపుత్రుని కోసం అన్వేషించసాగారు. వారి వెదకులాటను గమనించిన సముద్రుడు ‘‘కృష్ణా! పొరపాటున కాలుజారి నాలో పడిపోయిన మీ గురుపుత్రుని పంచజనుడనే రాక్షసుడు మింగేశాడు. మీరు అతన్ని అడగండి’’ అని సలహా ఇచ్చాడు.



పంచజనుడుని పట్టుకుని వాతో పోరాడి, వాడిని సంహరించి, వాడి పొట్టలోకి ప్రవేశించి చూడగా ఒక శంఖం మాత్రం కనిపించింది. ఆ శంఖాన్ని తీసుకుని దిక్కులు పిక్కటిల్లేలా పూరిస్తూ యముని వద్దకెళ్లాడు కృష్ణుడు. అదే అనంతర కాలంలో పాంచజన్యమైంది. యముడు తన వద్ద భద్రంగా దాచి ఉంచిన సాందీపని కుమారుణ్ణి కృష్ణుడికి ఇచ్చాడు. బలరామకృష్ణులా పిల్లవాడిని తీసుకొని వెళ్లి గురుదంపతులకు అప్పగించి, తమ ప్రతిజ్ఞ, గురుదక్షిణా చెల్లించుకున్నారు. ఈ కథలో మనం గమనించవలసిందేమిటంటే, ఎంత గొప్పవాడైనా గురువు వద్ద వినయంగా ఉండాల్సిందే, ఎంత క్లిష్టమైనాగురువు కోరిక నెరవేర్చవలసిందే.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top