బలేటోళ్లు

బలేటోళ్లు


ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ

ఒళ్లంతా చెమట. వెంకటేశ్, భాస్కర్ టీషర్ట్‌లు తడిచిపోయాయి. ఇద్దరూ శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల ప్రధాన భవనం చుట్టూ ఉండే తారు రోడ్డుపైన మార్నింగ్ వాక్ చేస్తున్నారు. వయసు యాభైకి దగ్గర. వేళకు మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండడం, ఆర్థిక ఇబ్బందులు లేకపోవడంతో వారి వయసు కంటే ఐదారేళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. ‘‘మీకేం సార్.. ఇద్దరూ కొడుకులు.. ఖర్చు తక్కువ’’ అన్నాడు వెంకటేశ్ అంతకు ముందు మాటలకు కొనసాగింపుగా. ‘‘మీకు ఒకమ్మాయే కదా సార్. మాకంటే మీకే ఖర్చు తక్కువ. మాకిద్దరు పిల్లలు. వాళ్లకు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం.



అన్నీ డబుల్ డబులే కదా’’ బదులిచ్చాడు భాస్కర్.

 ‘‘మీరెంత పెట్టినా చదువుకే. పెండ్లికేమీ ఖర్చుండదు. మాకట్ల కాదే. పేరుకే ఫిఫ్టీ టూ సేలరీ. అందులో కటింగ్స్, సేవింగ్స్, ఇంటి లోనిన్‌స్టాల్‌మెంట్ పోను చేతికొచ్చేది ట్వంటీ కూడా ఉండదు. దాంట్లో మళ్లా నెలనెలా గోల్డ్ కోసం షాపులో ఫైవ్ థౌజండ్ కడతాండాం. బయట ఫైవ్ లేక్స్ చీటీ వేసిండాం. మీరూ వేసినారు కదా. ఇంకేంది సార్ మిగిలేది. ఎవ్రీ మంత్ మంతెండింగ్ వచ్చిందంటే బండ్లోకి పెట్రోలుక్కూడా డబ్బుండడం లేదు.’’

 

నిజమే అన్నట్టు తలూపి, ‘‘మీకూ మాకూ పెద్ద తేడా ఏం లేదుసార్. మీరు మీ అమ్మాయి పెండ్లి చేసేదానికి ఇప్పటి నుంచీ సేవింగ్స్ చేస్తాండారు. మేము మా కొడుకులకు ఉద్యోగాల కోసం సేవింగ్స్ చేస్తాండాం. నాకు మీ కన్నా టూ తౌజండ్స్ ఎక్కువంతే కదా జీతం. అయినా మంతెండింగ్‌కు చేతిలో సింగిల్ రూపీ ఉండదు.’’ ‘‘లాస్ట్ మంత్ మా అమ్మాయి బర్త్‌డేకు ఫోర్ గోల్డ్ బ్యాంగిల్స్ కొన్నాం. ఇప్పుడొద్దంటే మా మిసెస్ వినలా. తర్వాతైనా కొనాల్సిందే కదా అంది. ఫోర్ బ్యాంగిల్స్ కలిపి ఎయిటీ గ్రామ్స్‌పైన్నే ఉన్నేయి. దగ్గర దగ్గర టూ అండాఫ్ లేక్ అయింది. మా బామ్మర్ది దగ్గర ఫిఫ్టీ చేబదులు తీసుకున్నే. వాడికి చీటీ పాడినప్పుడు ఇస్తానన్నే.’’

 

‘‘మీరన్నా మేలుసార్. మాకు టొంటీ లేక్స్ అయిందే. ఉండే ఇల్లు ఒగనికి సరిపోతుంది. ఇంకోడికి..? నగలు బ్యాంకులో పెట్టి, ఇంగో లోను పెట్టి, అప్పులు చేసి టొంటీ లేక్స్‌తో స్థలం కొన్నేం. మీక్కూడా తెలుసు కదా. మనకు జీతాలు సరిపోవడం లేదు సార్.’’

 ఇద్దరూ తమ ఇంట్లోని ఆర్థిక ఇబ్బందులను, ఒంట్లోంచి చెమటను వెళ్లగక్కుతూ నడుస్తున్నారు.

 సమయం ఆరున్నర.  ఆరుగంటలకే ఉదయించిన సూర్యుడు అప్పుడే తన ప్రతాపం చూపుతున్నాడు. ‘‘గుడ్ మానింగ్ సార్’’ అంటూ వచ్చాడు చంద్ర. ‘‘అప్పుడే మీ నడక ఐపోయినట్టుంది?’’ అడిగాడు భారంగా అడుగులేస్తూ చంద్ర.

 

చంద్రకు కూడా యాభై ఏళ్లకు అటూ ఇటుగా ఉంటుంది. ఆరడుగుల పొడవున్నాడు. పెద్ద బొజ్జ. నడక కూడా కష్టంగానే ఉంది. ఆరోగ్య సమస్యలు తలెత్తి డాక్టర్ వార్నింగ్ ఇవ్వడంతో నెల నుంచీ క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తున్నాడు.

 ‘‘ఎలా ఉంది సార్ బిజినెస్’’ అడిగాడు భాస్కర్.

 ‘‘ఇప్పటికైతే పర్లేదు సార్. ఈసారి వానలు బాగా పన్నేయి. జిల్లాలో రైతులంతా వరి సాగు చేశారు. బియ్యం రేటు పడిపోతుందేమో’’ అన్నాడు చంద్ర. అతని వద్ద ఎప్పుడూ రెండు వందల టన్నులకు తగ్గకుండా బియ్యం ఉంటాయి. చంద్ర బియ్యం వ్యాపారం చేసే వ్యక్తిలా లేడు. రైతులు పండించిన ధాన్యం మొత్తం ఒక్కడే తినేసినవాడిలా ఉన్నాడు.

 

‘‘అనంతపురం, కడప, నెల్లూరు, మన జిల్లాలో మాత్రమే వానలు. ఇంక రాష్ర్టంలో ఎక్కడా వానల్లేవు.’’

 ‘‘మీకేం భయం లేదు లేండీ. మన ముఖ్యమంత్రి పుణ్యమా అని ఈసారి సుమారు అరవై వేల ఎకరాల్లో కోస్తాలో వరి పండదులే.’’

 ‘‘అదేంటండీ.. ముప్ఫై వేల ఎకరాలే కదా... గవర్నమెంట్ తీసుకుంది.’’

 ‘‘గవర్నమెంట్ తీసుకుంది ముప్ఫై వేల ఎకరాలే. రియలెస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసింది... ముప్ఫై కంటే ఎక్కువే ఉంటుంది. ఒక్కసారిగా అరవై వేల ఎకరాల్లో వరి పండకపోతే.. అమ్మో... తలచుకుంటేనే భయమేస్తా ఉంది.’’

 

ముగ్గురూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు.

 పెద్ద కానగచెట్టు కిందున్న సిమెంట్ అరుగు మార్నింగ్ వాక్‌కు వచ్చినవారితో కిటకిటలాడుతోంది. రోజూ అక్కడికి తెలుగు దినపత్రిక ఒకటి, ఆంగ్ల దినపత్రిక ఒకటి వస్తాయి. వాటిలో తలా ఒక పేపర్ చేతిలోకి తీసుకుని కొందరు సీరియస్‌గా ఆ రోజు ఏదో ఎగ్జామ్ ఉందన్నట్టుగా చదువుతున్నారు. కొంతమంది మార్నింగ్ టాక్ కోసమే వచ్చినట్టుగా ఉంటారు. వారక్కడికి వచ్చినప్పటి నుంచి మాట్లాడ్డమే పనిగా పెట్టుకోనుంటారు. వాళ్లు ఏ విషయంపైనైనా సరే మాట్లాడతారు. ఆ రోజు కూరగాయలపైన చర్చ వాడి వేడిగా సాగుతా ఉంది. అక్కడున్న వాళ్లలో రైతులెవరూ లేరు. అయితే వారిలో చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినవారే.

 వాళ్లకు కాస్త దూరంలో ఉండే బెంచీపైన విశ్రాంతిగా కూర్చున్నారు వెంకటేశ్, భాస్కర్.

 

‘‘కందిపప్పు టూ హండ్రెడ్ దాటిపాయ. ఆనియన్ సెవంటీ. తెల్లగడ్డలు టూ హండ్రెడ్. టమోటాలు ఫిఫ్టీ. కాకర, బీన్స్, క్యారెట్, చిక్కుడు ఆరవైకి తక్కువలే. వంకాయ, ముల్లంగి, బంగాళదుంప, పచ్చిమిరప ఫార్టీ పైన్నే.. ముందు ముందు మనట్లాటోళ్లకు ఇంకా కష్టమైపోతాదేమో సార్’’ అన్నాడు వెంకటేశ్

 ‘‘నిజమే సార్.. రైతుల పనే మేలుగా ఉండాది. మా ఊర్లో ఒగాయన రెండెకరాల్లో టమేటాలు ఏసినాడంట. ఇప్పుడు కిలో ఫిఫ్టీ పైన్నే ఉంది. ఇప్పటికే టూ లేక్స్ వచ్చేసిందంట. ఇంగా టూ లేక్స్ వస్తాదంటా ఉండారు.’’ చెప్పాడు భాస్కర్.

 ఇంతలో చంద్ర గసపోస్తా వచ్చి వాళ్ల పక్కనుండే బెంచీపైన కూర్చున్నాడు.

 

‘‘కుచ్చొనేస్తిరే. నడక ఐపోయినట్టుంది’’ మాటల్లో వ్యంగ్యం ధ్వనించకుండా వ్యంగ్యంగా అడిగాడు వెంకటేశ్. ‘‘ఔను సార్. మీ మాదిరిగా ఉంటే ఎన్ని రౌండ్లయినా వేయచ్చు. నాకు కష్టం’’ నవ్వుతూ చెప్పాడు చంద్ర.

 ‘‘మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినోళ్లం కదా. చిన్నప్పుడంతా బాగా కష్టపడినాం. అందుకే ఇప్పుడింత స్ట్రాంగ్‌గా ఉన్నాం’’ చెప్పాడు భాస్కర్.

 ‘‘నేను చిన్నప్పటినుంచీ కష్టమంటే ఏందో తెలీకుండా పెరిగినా సార్.  ఇప్పుడిట్ల ఒళ్లు చేసి నడవాల్సి వస్తాండాది. ఇప్పుటికీ మీకు ఊర్లో సేద్యం ఉందా సార్’’ అడిగాడు ఆసక్తిగా చంద్ర.

 

‘‘ఇంకా ఎక్కడ సేద్యం. ఆడ నీళ్లా పంటలా పాడా. ఎప్పుడో అమ్మేసి ఈడ ప్లాట్ తీసుకున్నేం. దాంట్లోనే ఇల్లు కట్టుకోనుండాం.’’

 ‘‘సేద్యం చేస్తా ఉంటే ఎన్నేండ్లున్నే మా బతుకులూ ఆడికాడికే ఉండేటియి. ఏదో మా పెద్దోల్లు తినీ తినక చదివించడంతో ఇప్పుడీ స్థాయికొచ్చినాం.’’

 ‘‘నిజమే సార్. ఉద్యోగస్తుల పనే మేలు. యాపారంలో పోటీ పెరిగిపోయిండాది. మా నాయన సంపాదించిందాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలు. దానికే చానా కష్టంగా ఉండాది.’’

 ‘‘ఉద్యోగుల పని ఏం మేలోలే. పోదామా సార్’’ లేస్తూ అన్నాడు భాస్కర్.

 

ఒళ్లంతా చెమట. రామచంద్ర వేసుకున్న కాటన్ షర్టు, భరత్ టీషర్టూ తడిసిపోయాయి. రామచంద్రకు నలభై ఏళ్లు. వేళకు సరైన తిండి, తగినంత నిద్ర లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మరో ఐదారేళ్లు పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అతని కొడుకు భరత్‌కు పద్నాలుగేళ్లు. తొమ్మిదో తరగతి చదవుతున్నాడు. మనిషి పీలగా, పొట్టిగా పదేళ్ల పిల్లాడిలా ఉన్నాడు. రామచంద్ర నెత్తిన వంకాయల గంప ఉంది. గంపకు చుట్టూ మూరడెత్తు ఒక గుడ్డ కట్టారు. పాతిక కిలోల కాయలుంటాయి. దానికి తోడు చేతిలో మరో సంచీ ఉంది. దాంట్లో బెండకాయలు, తక్కెడ, తూకం రాళ్లు ఉన్నాయి.



తిరుపతికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే గొల్లపల్లె వాళ్లది. వాళ్లు తిరుపతికి రావాలంటే మూడు కిలోమీటర్లు నడిచి తన పల్లెకు రావాల. అక్కడి నుంచి బస్సో, ఆటోనో ఉంటుంది. అందులో కూడా మనిషికి పది రూపాయలు. గంప ఉంటే మరో పది రూపాయలు. గొల్లపల్లె నుంచి తిరుపతికి ఇద్దరు మనుషులు ఒక గంపను తీసుకుని ఆటోలో రావాలంటే వంద ఇవ్వాల్సిందే. వంద రూపాయలుంటే ఏదైనా అవసరం తీరుతుందని తిరుపతికి నడక మొదలుపెట్టాడు రామచంద్ర. అతడి పక్కనే వస్తున్నాడు భరత్.

 

తండ్రీకొడుక్కు ఎదురుగా వచ్చి ఆపి స్కూటరాపి ‘‘ఏం రామచంద్రా! పిల్లోన్నిగూడా నడిపిస్తాండావే’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి.

 ‘‘ఏం చేద్దాంనా. మా రాతలట్లుండాయి. దించుకోన్నా’’ అన్నాడు రామచంద్ర.

 అప్పటికే అతను స్కూటర్ సైడ్ స్టాండ్ వేశాడు. రామచంద్ర తల పైనుండే గంపను కిందకు దింపుతా ‘‘ఇంత బరువుందేందిప్పా’’ అన్నాడు. ‘‘వంకాయల్నా’’ అన్నాడు తలపైన చుట్టను విప్పదీసి టవల్‌తో ముఖం తడుచుకుంటా రామచంద్ర.

 ‘‘ఈ మధ్య కనపన్నే లేదు. నీళ్లు తాగతావా’’ అని సమాధానం కోసం చూడకుండా స్కూటర్ సైడ్ బ్యాగులోంచి ఓ బాటిల్ తీసి ఇచ్చాడు.

 

సగం బాటిల్ నీళ్ల్లు గటగటా తాగేసి కొడుక్కు ఇచ్చాడు. వాడు దానిని చేతిలోకి తీసుకుని తాగుదామా వద్దా అన్నట్టుగా రాజారెడ్డి ముఖంలోకి చూశాడు. ‘‘పర్వాలేదులే తాగు. నేను తణపల్లెలో పట్టుకుంటాలే’’ అన్నాడతను.

 ‘‘ఎకరా నేలలో వంకాయలు ఏసినాంనా. ఇంగో ఎకరాలో టమేటా ఏసినాం. వానలు పడేలకు ఎండిపోయిన బోర్లో నీల్లొచ్చినాయి. రెండెకరాల్లో వరేసినాం. క్షణం తీరికలేదునా.’’

 ‘‘అయితే ఇంగేమప్పా. నువ్వే షావుకారివి’’ సిగరెట్ తీసి వెలిగించి, ఒక సిగరెట్ రామచంద్రకు ఇస్తా అన్నాడు రాజారెడ్డి.

 

రామచంద్ర సిగరెట్‌ను చేతిలోకి తీసుకుంటా కొడుకు వైపు చూశాడు.

 ‘‘ఏంరా. నీగ్గూడా కావాల్నా సిగరెట్టు’’ నవ్వుతూ అడిగాడు రాజారెడ్డి. ‘‘అమ్మకు చెప్పేస్తా’’ అన్నాడు వాడు నీళ్లు తాగేసి బాటిల్‌కు మూత వేస్తా. ‘‘ఇది సిగరెట్టురా. బీడీ కాదులే’’ నంగి నంగిగా కొడుకుతో అని వెలిగించాడు రామచంద్ర. ఏమయింది అన్నట్టుగా కండ్లెగరేసినాడు రాజారెడ్డి.

 ‘‘ఆరోగ్యం బాగలేదన్నా. కరెంటు రేత్తిరిపూట ఇస్తారు. నీళ్లు కట్టాలంటే మేలుకోవాల. మేలుకునేదానికి బీడీలు తాగి తాగి దగ్గొచ్చింది. డాక్టర్ కాడికి పోతే బీడీలు మానెయ్యమని చెప్పినాడు. నెలయిందినా మానేసి’’ చెప్పాడు రామచంద్ర. ‘‘పగలు పూట తొమ్మిది గంటలు కరెంటిస్తామంటా ఉండారు.’’

 ‘‘అయ్యన్నీ అయినప్పటికిలేన్నా. రాజకీయ నాయకుల మాటలు భూమిలో నాయట్లావోడు ఏసిన ఇత్తనాల్లాంటియి.’’

 

‘‘ఇత్తనం వేసినాక మొలస్తాది. పంట చేతికొస్తాది..’’ అది మంచిదే కదా అన్నట్టుగా మాట్లాడాడు రాజారెడ్డి.

 ‘‘అదే నిజమయితే మా బతుకులు ఇట్లెందుకుంటాయినా. ఇత్తనాలు మంచియి కాకుంటే, ఇత్తనం ఏసినాక నీళ్లు లేకపోతే.. మొల్చినాంక వానలు పడకపోతే.. కాయలు కాసే ఏళకు ఏదైనా రోగమొస్తే.. కోతకొచ్చినప్పుడు వడగండ్ల వానొస్తే.. తీరా పంట పండినాంక రేటు లేకుంటే..’’

 ‘‘అయితే రాజకీయ నాయకులు చెప్పినోటియి నెరవేరవా’’ నవ్వుతూ అడిగాడు రాజారెడ్డి.

 

‘‘ఎందుకు నెరవేరవు. కీనీరు బాయి ఉండి, ఇత్తనం గింజలు మనమే ఎత్తిపెట్టుకోనుండి, పంట సాగుచేస్తే, రోగాలు రాకుండా మందులు కొట్టి, పంట కోసి, ఇంట్లో పెట్టుకుని, రేటొచ్చినప్పుడు అమ్ముకుంటే బాగనే ఉంటాది. ఇట్లా ఎంతమందికయితాది. ఇరవై ముప్ఫై ఎకరాల సేద్యం, రెండు మూడు మిద్దెలు, ఒకటి రెండు ట్రాక్టర్లు ఉండే వాళ్లకయితే సరి. ఏ పంటేసినా బాగొస్తాది. ఆ మాదిరిగా రాజకీయ నాయకులు కూడా అన్నీ ముందే చూసుకోని ఏది చెయ్యగలం ఏది చెయ్యలేం అనేది ఆలోచించి మాటిస్తే నెరవేరతాది. లేదంటే... ఇదో మేం సేద్దిం చేసినట్లే ఉంటాది.’’

 

‘‘నాలుగెకరాలు సాగు చేసినానంటివి. ఈసారితో నీ బాధలన్నీ పోతాయిలే.’’

 ‘‘ఏం లాబంలేనా. ఎకరా టమేటా పనికి రాకుండా పోయింది. ఇత్తనాలు మంచియి కాదు. చెట్లు పెరిగినాయే కానీ పూతే లేదు. వంకాయలు గూడా బాగేం కాయలా. వాటికేందో రోగమొచ్చిండాది. చెట్టుకు ఆరేడుండాయంతే. ఇదే తొలి కోత. ఎకరా అంతా తిరిగి కోస్తే ఈ కాయలయినాయి. వరి కత చూడాల’’ అన్నాడు రామచంద్ర.

 ‘‘నీళ్లుంటే వరికేంలే. బాగనే పండతాది’’ చెప్పాడు రాజారెడ్డి. ‘‘నాయనా.. నాకు సైకిల్ తీసివ్వాల’’ అప్పటివరకూ వాళ్ల మాటలు వింటా నిలబడుకోనుండే భరత్ ఒక్కసారిగా గట్టిగా అన్నాడు. ‘‘సైకిలెందుకురా నీకు’’ అడిగాడు రాజారెడ్డి. ‘‘బడికి పొయ్యేదానికి.’’

 ‘‘బస్సులో పోవచ్చు కదా.’’

 ‘‘మా వూరికి బస్సు రాదు’’ చకచకా సమాధానాలు చెప్పాడు భరత్.

 

‘‘నీకూ తెలుసు కదాన్నా. మా ఊరికి బస్సు రాదు. రెండు మైళ్లు నడుచుకోని తణపల్లెకొచ్చి ఆట్నించి బస్సుకు తిరపతికి పోవాల. ఈ రూట్‌లో బస్సులు తక్కువ. ఆటోలకు చార్జీలెక్కువు. రోజూ పుస్తకాల బ్యాగెత్తుకోని నడవాలంటే కష్టంగా ఉండాది. సైకిల్ కావాలని రెండేండ్లగా అడగతాండాడు’’ చెప్పాడు రామచంద్ర.

 

‘‘ఒగడే కదా కొడుకు. సైకిల్ తీసీలేవా.’’

 ‘‘కూతురుండ్లేదానా. ఇప్పుడంటే వానలు పన్నేయి. పదేండ్లగా మనకు వానలేడ? నీళ్లులే. పంటల్లే. కూలిపన్లకు పోతాంటిమి. నీ దెగ్గిరిక్కూడా వచ్చినాం కదాన్నా పనికి. పేరుకు నాలుగెకరాల సేద్యగాన్ని. నాలుగు లక్షల దాంకా అప్పులుండాయి. మొండోన్ని కాబట్టి బండిలాక్కస్తాండా.’’

 ఔనన్నట్టు తలూపి ‘‘మొండోళ్లు కాకపోతే ఇట్లా ఊర్లల్లో సేద్యం చేసి బతకలేరు. ఎన్నో క్లాసురా’’ అడిగాడు భరత్‌ను.

 ‘‘నైన్త్.’’

 

‘‘ఓ.. ఇంక టెన్త్ క్లాసా. బాగా చదువుకో. మీ నాయన్ను చూస్తాండావు కదా. సేద్యంతో ఎంత కష్టపడతాండాడో. బాగా చదివి ఉద్యోగం తెచ్చుకోని మీ నాయన్ను కుచ్చోబెట్టి సాకాల’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి.

 ‘‘నేను కలెక్టరైతా’’ అన్నాడు వాడు. కలెక్టరయితే నాయనను కుచ్చోబెట్టి సాకచ్చు అని వాడి మాటల్లో ధ్వనించింది.

 ‘‘మా ఊరికి తాగే నీళ్లు లేకుండా ఉంటే, నాలుగు నెలల ముందు అందరం చిత్తూరుకు పోయి కలెక్టర్‌కు అర్జీ ఇచ్చినాంనా. ఆయనకు అర్జీ ఇచ్చినా మరసటిరోజు నించి ట్యాంకర్లతో నీళ్లు తోలినారు. అప్పట్నింటీ ఈడు కలెక్టరైతా కలెక్టరైతా అంటాండాడు’’ నవ్వుతూ చెప్పి చేతిలోని టవల్‌ను చుట్టగా చుట్టాడు రామచంద్ర.

 ‘‘కష్టపడి చదివితే కలెక్టర్ ఎందుక్కాకూడదు. అయితాడులే’’ అని గంపనెత్తి రామచంద్ర నెత్తిన పెట్టాడు. జేబులోంచి రెండు పది రూపాయల నోట్లు తీసి భరత్ వైపు చేయి చాపాడు రాజారారెడ్డి.



వాడు వద్దన్నాడు.

 ‘‘కొందురు దుడ్డో, తినేదో ఇచ్చి కీతాగా చూస్తాంటారునా. అందుకని తిరిపానికి ఎవురేమిచ్చినా తీసుకోవద్దని చెప్పినాం వాడికి. ఎప్పటికీ కష్టపడుకోని సంపాదించుకోవాల. ఖర్చు పెట్టుకోవాల. తీసుకోరా. మనోడేలే అన్న’’ అన్నాడు రామచంద్ర. ‘‘తీసుకోరా. నేనూ మీ మాదిరిగా కష్టపడి సంపాదించిందేలే’’ అన్నాడు నవ్వుతూ రాజారెడ్డి. నాన్నవైపు ఒకసారి చూసి ఇరవై రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు భరత్. ‘‘దుర్గసముద్రం కాడికి పోతాండా. పనికి మనుషులు రాక కష్టమైపోతాండాది. ఆట్నించి ఇద్దురొస్తాన్నేరు. నాలుగు రోజులుగా రావడం లేదు’’ అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజారెడ్డి.

 అతనటు, అబ్బాకొడుకు ఇటు బయలుదేరారు.

   

‘‘ఎంతయ్యా.. వంకాయలు..?’’

గంపను కింద పెట్టి, అక్కడే ఉన్న కానగచెట్టులో ఆకులున్న రెండు చిన్న కొమ్మలు విరిచి కిందేసి వాటిపైన టవల్ పరుస్తున్న రామచంద్ర తల పెకైత్తి చూసి ‘‘కాల్ కేజీ పదైదు సార్’’ అన్నాడు.

 పొద్దున్నే ఏడు కిలోమీటర్లు నడవడంతో పట్టిన చెమట... అక్కడకు స్కూటర్‌లో రావడంతో వీచిన చల్లగాలికి ఇంకిపోవడంతో.. భాస్కర్, వెంకటేశ్ శరీరాలకు, మనసుకు చాలా హాయిగా ఉంది.

 ఏడు కిలోమీటర్లు నెత్తిన బరువు మోసుకుని వచ్చి అక్కడ దించి కూర్చున్నా... అవి సరిగా అమ్ముడుపోతాయో పోవో అని అబ్బాకొడుక్కు దిగులుగా ఉంది.

 ‘‘పదైదు రూపాయలా..? కేజీ ముప్ఫైకి ఇస్తాండారే’’ భాస్కర్.

 ‘‘లేదు సార్. అర్దకేజీ ఇరవై ఐదుకిస్తా. ఇప్పుడే తోటలోనించి కోసుకోనొస్తాండాం సార్. చాలా బాగుండాయి చూడండి. ఒక్క పుచ్చు కూడా లేదు’’ వివరించాడు రామచంద్ర.

 

‘‘ఎన్నియా ఇయ్యి. యాభై కేజీలుంటాయా..?’’ అడిగాడు వెంకటేశ్.

 ‘‘లేదు సార్.. ఇరవై ఐదు కేజీలుంటాయి.’’

 ‘‘ఇరవై ఐదా. ఇన్నుండాయే. ముఫ్ఫై అనుకో. ముప్ఫై ఇంటూ యాభై. అంటే రోజుకు నీ ఆదాయం పదైదు నూర్లు. నెలకు నలభై ఐదు వేలు. పక్కన మునక్కాయలు, బెండకాయలుండాయే. అయ్యి ఎట్ల లేదన్నా ఐదు నూర్లు. నెలకు పదైదు వేలు. అంటే నెలకు మీ ఆదాయం అరవై వేలు. చూస్తిరా సార్. వీళ్లకు మన జీతం కన్నా ఎక్కువ ఆదాయం’’ అన్నాడు వెంకటేశ్.

 

‘‘రోజూ వంకాయలు, మునక్కాయలు, బెండకాయలు ఉండవు కదా సార్’’ నవ్వుతూ అన్నాడు రామచంద్ర.

 ‘‘మేమూ రైతుబిడ్డలమే. మాకు తెలీదా సేద్యం గురించి. రోజూ లేకపోయినా రోజు మార్చి రోజే అనుకో. అట్లెత్తుకున్నా నెలకు మీకు ముప్ఫై వేలొస్తాది. మాకు చదువులకెంతయింది? రోజూ మేము పొద్దున్నే పోతే సాయంత్రానికొస్తాం. రోజుకు పదిగంటలకు పైగా కష్టపడతాండాం. మీరూ..’’ భాస్కర్ అన్నాడు. ‘‘మేము కుచ్చోనుంటే పంట చేతికొచ్చేస్తాదా సార్’’ కోపాన్ని నిగ్రహించుకుంటూ అడిగాడు రామచంద్ర.

 

‘‘కుచ్చోనుంటే ఏదీ రాదులే. మా మాదిరిగా రోజుకు పది పన్నెండు గంటలు పనిచేసే అవసరం లేదు కదా. వరి అయితే నాట్లేసినాంక, కలుపు తీస్తారు. మళ్ల కోతలు కోసి కుప్ప కొడతారు. మధ్యలో రోజు మార్చి రోజు గంటసేపు నీళ్లు కడతారంతే. వంకాయలు, టమేటాలు ఏస్తే మధ్యలో ఒకసారి తవ్వతారు. వారానికి ఒకసారి రెండు మూడు గంటలు నీళ్లు కడతారు. అంతే. ఇంగ రోజు మార్చి రోజు ఇట్లా కోసుకోనొచ్చి అమ్ముకుంటారు. కష్టం తక్కువ. ఫలితం ఎక్కువ’’ చెప్పాడు వెంకటేశ్.

 

‘‘మీరు చెప్పినంత సులభంగా పంటలు పండేటిగా ఉంటే మీరెందుకు సార్ సేద్ది మొదిలేసి ఉద్యోగం చేస్తాండారు’’ ప్రశ్నించాడు రామచంద్ర. వాళ్లకు తగలాల్సిన చోటే తగిలింది. ‘‘మేము చెప్పింది ఇప్పుడు సేద్యం, ఇప్పుడు రేట్ల సంగతి. మా చిన్నప్పుడు వంకాయలు కేజీ అర్ధ రూపాయి. టమేటాలు పావలా. ఎర్రగడ్డలు రూపాయి. మిరపకాయలు రూపాయి. కందిపప్పు పది రూపాయలు. ఇప్పుడు మాదిర్తో అప్పుడు రేట్లున్నింటే సేద్యమే చేసుకోనుందుము. ఏం సార్’’ అన్నాడు వెంకటేశ్ వైపు చూసి భాస్కర్.

 

బాగా చెప్పావన్నట్టు తలూపాడతను.

 ‘ఇప్పుడు మీ జీతమెంత. ముప్ఫై ఐదేండ్లకు ముందు ఈ ఉద్యోగం చేసినోళ్లకు ఇచ్చిన జీతమెంత?’ అని అడగాలనుకున్నాడు. పేదవాడి కోపం పెదవికి చేటనే విషయం తెలిసినవాడు కావడంతో మౌనంగా ఉండిపోయాడు రామచంద్ర.

 ‘‘కేజీ ముప్ఫై ఐదు చేసుకో. ఒక కేజీ కొంటాం’’ అన్నాడు భాస్కర్. ‘‘కేజీ యాభైకి తక్కువ లేదు సార్’’ అన్నాడు రామచంద్ర.

 ‘‘మునక్కాయలెంత?’’

 ‘‘పదికి మూడు.’’

 ‘‘పదికి ఐదిస్తాండారే.’’

 

‘‘అయ్యన్నీ చిన్నయి సార్. ఇయ్యి ఒగోటి రెండు మూరలుండాయి.’’

 ఏవీ కొనకుండానే అక్కడి నుంచీ భాస్కర్, వెంకటేశ్ ముందుకు పోయారు.

 ఆ ఇద్దరూ తిరుపతిలోని ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటారు. ఇద్దరివీ పక్క పక్క ఇళ్లు. ఒకే చోట ఉద్యోగం. ఇద్దరూ ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రోజూ ఆఫీసుకు ఒకరి బైక్‌లో పోతారు. మరొకరి బైక్‌లో వాకింగ్‌కు పోతారు. ఆ రకంగా పెట్రోలు ఆదా చేస్తుంటారు. మార్కెట్‌కు వచ్చినా కూరగాయలు బేరమాడి ఆడి, రేటు తగ్గించే కొంటారు.

 

అది తిరుపతిలోని పళని థియేటర్ రోడ్డు. పక్కనే రైతు బజార్ ఉంది. రైతు బజార్ వెలుపల రోడ్డుపైన పండ్లు, పూలు పెట్టుకుని అమ్ముతున్నారు. రామచంద్ర లాంటివాళ్లు కూడా నలుగురైదుగురు కూరగాయలు పెట్టుకోని అమ్ముతున్నారు.

 భరత్‌కు ఇది వింతగా ఉంది. వాడికి ఊహ వచ్చాక ఈ మాత్రం పొలం సాగు చేయడం ఇదే మొదటిసారి. తిరుపతికి కూరగాయలు తీసుకొచ్చి అమ్మడం కూడా ఇదే మొదటిసారి. తోటలో వంకాయలు అయిపోయేలోపు తనకు సైకిల్ తీసిస్తానని నాన్న చెప్పాడు. తమ ఊర్లో సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి వేయి రూపాయల్లో ఉంది.



దాన్ని ఆ రోజు సాయంకాలమే కొనుక్కోవాలనుకుని మనసులో అనుకుని నాన్నతో పాటు తిరుపతికొచ్చాడు వాడు. ఇలా అయితే సైకిల్ కొనుక్కోవడం కష్టమని భరత్‌కు అక్కడికొచ్చిన కాసేపట్లోనే అర్థమైపోయింది.

 పది నిముషాలయింది. కిలో వంకాయలు అమ్ముడుపోయాయి. భాస్కర్, వెంకటేశ్ తిరిగి వచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ రిలయన్స్ మార్ట్ కవర్లున్నాయి. వాటిలో ఏవో కూరగాయలున్నాయి.

 ‘‘చెప్పయ్యా.. ఎంతకిస్తావు.. వంకాయలు’’ అడిగాడు భాస్కర్.

 ‘‘చెప్పినా కదా సార్.. అర కేజీ ఇరవై ఐదు.’’

 ‘‘అవునూ... నువ్వు బయటెందుకు అమ్మతాండావు. రైతు బజార్ లోపల కదా అమ్ముకోవాల’’ అన్నాడు వెంకటేశ్.

 

‘‘వారానికి ఒకటి రెండుసార్లు వచ్చేటోళ్లం. లోపల అమ్మాలంటే ఎట్లయితాది సార్. వాళ్లకు గేటు కట్టద్దా.’’

 ‘‘లోపల అమ్మేటోళ్లంతా రైతులు కాదా?’’ అడిగాడు భాస్కర్. నువ్వు నేరం చేస్తున్నావు అన్నట్టున్నాయి ఆ మాటలు.

 ‘‘మీరు సేద్యం చేసినామంటిరి. రోజూ కూరగాయలు కాస్తాయా సార్. లోపల చానామంది మా యట్లా రైతుల దగ్గర కొనుక్కోని మారుబేరానికి అమ్ముకుంటారు.’’

 ‘‘అంటే నువ్వు... లోపల రైతు బజారోళ్లకు గేటు డబ్బు కట్టకుండా, బయట పెట్టుకోని ఎక్కువ రేటుకు అమ్మతాండావా. ఏం తెలివి. బలేటోళ్లుయా మీ రైతులు. ఎంతకిస్తావో చెప్పు’’ అని గీరి గీరి బేరం చేసి కిలో నలభై ఐదు లెక్కన రెండు అర కిలోలు తీసుకున్నారు.



పదికి నాలుగు మునక్కాయల వంతున ఇరవై రూపాయలకు తీసుకుని భాస్కర్, వెంకటేశ్ వెళ్లిపోయారు.

 మనుషూలు వస్తున్నారు. పోతున్నారు. బేరం చేస్తున్నారు. కొంటున్నారు. గొణుగుతున్నారు. మధ్యలో పోలీసోళ్లొచ్చారు. మున్సిపాలిటీ వాళ్లొచ్చారు. రైతు బజార్ మేనేజర్ వచ్చి తిట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. రోజూ అక్కడ చెట్టుకింద పండ్లమ్ముకునే తోపుడు బండ్లవాళ్లూ కేకలు వేశారు, తమ వ్యాపారానికి అడ్డమని. రెండు గంటల సేపున్నా ఐదు కిలోలకు మించి అమ్మలేకపోయారు. కొడుకును అక్కడే పెట్టి రైతు బజారు లోపలకు పోయి చూసొచ్చాడు రామచంద్ర. అక్కడ పుచ్చులున్న వంకాయలు నలభై ఐదుకు అమ్ముతున్నారు. రోడ్డుపైన తమను అమ్ముకోనివ్వడం లేదు. రైతు బజార్‌లో ఒక వ్యాపారికి చెప్పాడు తన దగ్గర వంకాయలున్నాయని. అతను గంప దగ్గరకొచ్చి చూశాడు.

 

‘‘కిలోకు ఇరవై ఇస్తా’’ అన్నాడు.

 రామచంద్ర బిత్తరపోయాడు. ‘‘లోపల నలభై ఐదుకు అమ్మతాండారే’’ అన్నాడు.

 అతను నవ్వి ‘‘బలేటోడివే. నువ్వు పొద్దుట్నించీ కుచ్చొన్నే ఐదు కేజీలే అమ్మినావు. పది గంటలవతాంది. ఎండెక్కతాంది. ఇంగ కొనేదానికి ఎవురూ రారు. ఈపొద్దు ఆదివారం. సాయంత్రం వస్తే వస్తారు. లేదంటే లేదు. ఈ వంకాయలన్నీ అమ్మాలంటే రెండు మూడు రోజులు పడతాది. రేపొగేళ వంకాయలు ఎక్కువొచ్చినాయంటే కేజీ పదికి కూడా అమ్మలేం. వీటికి ఇరవై రూపాయలు కూడా ఎక్కువే. ఆలోచించుకో’’ అన్నాడతను నవ్వుతూ.

 రామచంద్ర ఇంకేమీ ఆలోచించలేకపోయాడు.



అతనికి ఇచ్చేశాడు. తెచ్చింది ఇరవై ఐదు కిలోలు. అమ్మింది ఐదు కిలోలు. ఉండాల్సింది ఇరవై కిలోలు. కానీ అక్కడ తూకం మాత్రం పద్దెనిమిది కిలోలే ఉండాయి. మునక్కాయలు, బెండకాయలు కూడా వ్యాపారి చెప్పిన ధరకే ఇచ్చేసి, తండ్రీ కొడుకు రోడ్డుపైకి వచ్చారు. వంకాయ తోటకు పట్టిన రోగాన్ని వదిలించేందుకు పురుగుల మందు కొనుక్కోవడానికి ఎరువుల దుకాణం వైపు నడక మొదలుపెట్టారు.

 రైతులు పండించినోటియి తప్ప వేరే వేటితోనూ బతకలేమని తెలిసినా, కంటికి వారి పేదరికం స్పష్టంగా కనిపిస్తున్నా, వారు పండించే వాటిని అతి తక్కువకు కొనాలని చూసే మనుషుల జబ్బును నయం చేసే మందులు ఎప్పటికైనా తయారవుతాయా?

- సుంకోజి దేవేంద్రాచారి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top