మనసు మనసులో ఉండేదెలా?!

మనసు మనసులో ఉండేదెలా?!


జీవన గమనం

నేను దైవ సంబంధిత ఆచారాల వ్యతిరేకిని. మనిషి సంతోషంగా బతకాలంటే ఆత్మ విశ్వాసం, తార్కిక జ్ఞానం ముఖ్యమని నమ్ముతాను. గుళ్లూ గోపురాలకు వెళ్లను. ప్రస్తుతం ఓ అకాడెమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఓ ప్రొఫెషనల్ కోర్సుకి ప్రిపేర్ అవుతున్నాను. మంచి స్థాయికి వెళ్తాననే నమ్మకం ఉంది. కానీ నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. పూజలు చేసి పుణ్యం సంపాదించకపోవడం వల్ల నాకు మంచి జరగట్లేదు, సరైన ఉద్యోగం దొరకట్లేదంటూ ఉపయోగం లేని మాటలు చెప్తున్నారు. అలాంటప్పుడు నా ఆత్మవిశ్వాసం దెబ్బ తింటోంది. ఈ మధ్య తెలిసిన వ్యక్తి ఒకరు నా జాతకంలో దోషముందని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కోవడం ఎలా?

 - వెంకట్, శ్రీకాకుళం


 

దైవం, ఆచారం, గుళ్లూ గోపురాలూ, విగ్రహారాధన... వీటిపట్ల బలమైన అభి ప్రాయాలు ఉన్నవారు మరొక అలవాటు కూడా చేసుకోవాలి. తమ అభిప్రాయాలకి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నవారితో చర్చించడం, వాదించడం తగ్గించాలి. భిన్న ధృవాలు ఎప్పుడూ ఒకటి కావు. మీ అభిప్రాయాల పట్ల మీకు బలమైన నమ్మకం ఉన్నప్పుడు మీ బంధువులు, స్నేహితులు వాటిని అర్థం చేసుకోకపోతే మీకొచ్చే నష్టమేంటి? అసలీ చర్చలన్నీ ఎందుకు? ఎప్పుడైతే మీ జాతకం మరొకరికి చూపించారో... వారు దానిపట్ల తమ అభిప్రాయాలు చెప్తూనే ఉంటారు.



వాటిని నమ్మనప్పుడు చర్చ ఎందుకు? మీరు నమ్మిన సిద్ధాంతాలను బలపర్చేవారి గ్రూప్స్ ఫేస్‌బుక్‌లో కొన్ని ఉంటాయి. వాళ్లతో చేరితే మీ అభిప్రాయాల పట్ల మీకు నమ్మకం ఇంకా బలంగా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, అవతలివారి అభిప్రాయం కూడా విని నిర్ణయం తీసుకోండి. తన నమ్మకాలు తప్పని తెలిసినప్పుడు వాటిని మార్చుకోనివాడు మూర్ఖుడు. మార్చుకునేవాడు జ్ఞాని. ‘అందరూ నిన్ను ప్రభావితం చేయడానికి  ప్రయత్నిస్తారు, నాతో సహా. నేను చెప్పినా, మతగ్రంథాల్లో రాసినా అది నీ తర్కానికి, ఇంగిత జ్ఞానానికి, హేతువుకి సరిపోతేనే దాన్ని నమ్మి ఆచరించు’ అన్నాడు బుద్ధుడు. కాబట్టి అనవసరమైన చర్చల ద్వారా సమయం వృథా చేసుకోకుండా, ప్రొఫెషనల్ కోర్సుకి బాగా ప్రిపేరవ్వండి.

 

నా వయసు 18. నా మనసు అధీనంలో ఉంచుకోవడం నాకు చేతకావడం లేదు. ముఖ్యంగా శృంగారపరమైన ఆలోచనలు నన్ను కుదురుండనివ్వడం లేదు. దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ఇలా అయితే ఫెయిలైపోతానేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి?

 - వికాస్, మెయిల్


 

పద్దెనిమిదేళ్ల వయసులో శృంగార పరమైన ఆలోచనలు రాకపోతే తప్పు కానీ వస్తే తప్పులేదు. అయితే చదువు మీద శ్రద్ధ, శృంగారపరమైన ఆలోచనలు... రెండూ భిన్నమైనవి. ఒకదాన్ని ఒకటి డామినేట్ చేయకూడదు. చానలైజ్ చేయాలి. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకచోట... ‘ఇలాంటి ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి చిత్రకారుడై, తన కోరికలకి ఒక చానెల్ చూపించి గొప్ప విజయాన్ని సాధించాడు’ అని రాశాడు. కాబట్టి మీరు ఏదైనా ఒక హాబీని అలవర్చుకోండి.



సాధారణంగా ఇలాంటి ఆలోచనలు తెల్లవారుజామున లేదా రాత్రిళ్లు వస్తాయి. కాబట్టి మెలకువ రాగానే పక్కమీద నుంచి లేచిపోవడం, సాయంత్రం గేమ్స్‌తో బాగా అలసిపోయి, నిద్ర ముంచుకువచ్చే వరకూ పక్క మీదికి చేరకపోవడం వంటి అలవాట్లు చేసుకోండి. కీప్ యువర్‌సెల్ఫ్ ఆల్వేజ్ బిజీ. అదొకటే మంత్రం దీన్నుంచి బయట పడటానికి. చదువుకునే వాతావరణాన్ని తగిన విధంగా సృష్టించుకోవడం, పొద్దున్న లేవగానే కాసేపు ప్రార్థన, ఆపై మరికాసేపు యోగా మొదలైన ప్రక్రియల ద్వారా మనసును కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.



గమ్యంవైపు దృష్టిపెట్టి భవిష్యత్తులో నేనెలాగూ దాన్ని అనుభవించబోతున్నాను కదా అనే ఆశతో చదువు మీద శ్రద్ధ నిలపండి. సినిమాలు తగ్గించండి. ఇంటర్నెట్‌లో ఇటువంటి సైట్ల జోలికి అస్సలు వెళ్లకండి. తరచూ సెక్స్ గురించి మాట్లాడే ఫ్రెండ్స్‌ని దూరం పెట్టండి. అప్పటికీ మార్పు రాకపోతే మంచి సైకాలజిస్టును సంప్రదించండి.

 

నేను ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. బాగా చదువుతాను. కానీ హాస్టల్లో నా రూమ్మేట్ పద్ధతి బాలేదు. ఎప్పుడూ ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడుతుంది. ల్యాప్ టాప్‌లో సినిమాలు చూస్తుంది. ప్రశాంతంగా చదువుకోవడానికి, నిద్రపోవడానికి ఉండట్లేదు. భరించి భరించి పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా అని వార్డెన్‌కి చెప్పాను. ఆవిడ మందలించడంతో తను మరీ రెచ్చిపోతోంది. ఇంతకుముందు కంటే ఎక్కువ గొడవ చేస్తోంది. ఆ అమ్మాయిది పెద్ద బ్యాగ్రౌండ్ కావడంతో వార్డెన్ రూమ్ మార్చడం లేదు. నా సమస్య ఎలా తీరుతుంది?

 - మంజరి, హైదరాబాద్


 

హాస్టల్లో ఉండే చాలామంది విద్యార్థులకు (ముఖ్యంగా విద్యార్థినులకు) ఇది పెద్ద సమస్య. బాగా చదువుకునే విద్యార్థినులకు ఒక గదిలోను, అల్లరి చిల్లరిగా ఉండేవారిని మరొక గదిలోనూ వేయాలనే స్పృహ వార్డెన్లకు ఉండదు. అయితే వారి సమస్యలు, కారణాలు వారికుంటాయి. మీరింకా మొదటి సంవత్సరమే కాబట్టి నాలుగేళ్ల పాటు ఈ డిస్టర్బెన్స్‌ని భరించడం కష్టం. అందుకే మీ తల్లిదండ్రులని వెళ్లి అధికారులతో కానీ ప్రిన్సిపల్‌తో కానీ మాట్లాడమని చెప్పండి. సమస్య పరిష్కారమవుతుంది. లేదంటే నేరుగా కాలేజీ కరెస్పాండెంట్‌తోనే మీ పేరెంట్స్‌ని మాట్లాడమని చెప్పండి. అదొక్కదే దీనికి పరిష్కారం.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top