హనీమూన్ హత్య

హనీమూన్ హత్య


అందమైన, అమాయకమైన ఆడపిల్ల...

కోరుకున్నవాడితో తాళి కట్టించుకుంది...

ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది...

భవిష్యత్తు గురించి ఆశలగూళ్లు అల్లుకుంది...

అంతలోనే ఘోరం జరిగిపోయింది...

అనుకోని పరిస్థితుల్లో ఆమె హత్యకు గురయ్యింది...

అసలేం జరిగింది?

కాళ్ల పారాణి ఆరకముందే ఆమె ఎందుకు కన్నుమూసింది?


 

నవంబర్ 13, 2010... స్వీడన్...
  ‘‘ఎంతసేపు మురిసిపోతారు ఆ ఫొటోల్ని చూసి... ఇక పడుకోండి’’... గదిలోకి వచ్చిన నీలమ్, భర్తని కోప్పడింది.  ‘‘ఎంతసేపు చూసినా తనివి తీరడం లేదు నీలమ్. చూడు నా చిట్టితల్లి పెళ్లి బట్టల్లో ఎంత బాగుందో. ఎక్కడలేని కళా వచ్చేసింది తనకి’’... ఇంకా మురిసిపోసాగాడు వినోద్. ‘‘అబ్బా... ఇక చాల్లే ఇటివ్వండి’’ అంటూ ఆల్బమ్ తీసుకెళ్లి అల్మారాలో పెట్టేసింది నీలమ్. భార్య చేసిన పనికి నవ్వేసి, మంచమ్మీద వాలాడు వినోద్. చిన్న కూతురు ఆనీ అంటే ప్రాణం వినోద్‌కి. అందుకే పదిహేను రోజులు కావస్తున్నా కూతురి పెళ్లి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు. కొద్ది నిమిషాల్లోనే నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి దాటాక సెల్ రింగవడంతో లేచాడు వినోద్.

 

 ఈ సమయంలో ఎవరు చేశారబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. స్క్రీన్ మీద కనిపించిన అల్లుడి పేరు చూసి ఉలిక్కిపడ్డాడు. వెంటనే ఆన్ చేసి... ‘‘హలో ష్రీన్... ఏం జరిగింది? ఈ టైమ్‌లో ఫోన్ చేశావేంటి’’ అన్నాడు కంగారుగా. ‘‘ఆనీని ఎవరో ఎత్తుకుపోయారు మావయ్యా? ఎవరో ఇద్దరు నన్ను కార్లోంచి తోసేసి తనని తీసుకెళ్లిపోయారు.’’ అల్లుడు చెబుతోన్న ఒక్కో మాటా గుండెల్లోకి గునపంలా దూసుకెళ్తోంది. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియక బొమ్మలా ఉండిపోయాడు వినోద్. ‘‘ఏమైందండీ...  ఆనీకి ఏమయ్యింది?’’ ఆత్రుతగా అడిగింది నీలమ్. నుదుటికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు వినోద్. ‘‘నేను వెంటనే కేప్‌టౌన్ వెళ్లాలి నీలమ్’’ అంటూ ఒక్క ఉదుటున మంచం దిగాడు. క్షణాల్లో తయారై బయలుదేరాడు.

   

 కేప్‌టౌన్... దక్షిణాఫ్రికా...

 ట్యాక్సీ వచ్చి హాస్పిటల్ ముందు ఆగింది. కంగారుగా దిగి లోనికి పరుగెత్తాడు వినోద్. ఎమర్జెన్సీ యూనిట్ దగ్గరకు వెళ్లబోతుండగా పోలీసులు ఎదురు వచ్చారు. వాళ్లతో పాటు వినోద్ అల్లుడు ష్రీన్ దివానీ కూడా ఉన్నాడు. మామగారిని చూస్తూనే వచ్చి వాటేసుకుని బోరుమన్నాడు. ‘‘ఏమైంది ష్రీన్... ఆనీ ఎక్కడుంది? ఎలా ఉంది?’’

 ష్రీన్ మాట్లాడలేకపోయాడు. వెక్కి వెక్కి ఏడవసాగాడు. ‘‘సారీ మిస్టర్ వినోద్ హిండోచా... ఆనీ చనిపోయింది.’’

 ఇన్‌స్పెక్టర్ మాటతో అదిరిపడ్డాడు వినోద్. ‘‘ఆనీ చనిపోయిందా? ఏంటిది ష్రీన్? రాత్రి ఫోన్ చేసి ఎవరో ఎత్తుకుపోయారన్నావ్. పొద్దున్న ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఫోన్ చేస్తే హాస్పిటల్ దగ్గరకు రమ్మన్నావ్. అసలేం జరిగింది?’’

 ‘‘రాత్రి ఆనీని ఎవరో ఎత్తుకుపోయారని మీ అల్లుడు మాకు ఫోన్ చేశాడు. వెంటనే హెలికాప్టర్‌లో వేట మొదలెట్టాం. ఉదయం ఏడున్నరప్పుడు ఆనీని కిడ్నాప్ చేయడానికి ఉపయోగించిన ట్యాక్సీ కనిపించింది. కానీ అప్పటికే ఆమె..’’

 ఇన్‌స్పెక్టర్ మాట పూర్తి కాకముందే కుప్పకూలిపోయాడు వినోద్. హనీమూన్‌కని వెళ్లిన కూతురు శవంగా మారుతుందని ఊహించని ఆ తండ్రి మనసు వాస్తవాన్ని జీర్ణించుకోలేక విలవిల్లాడుతోంది. జరిగింది, తాను విన్నది నిజం కాదేమో ఇంకా చిన్న ఆశతో రెపరెపలాడుతోంది. కానీ అది అర్థం లేని ఆశ అని అర్థం చేసుకోవడానికి కొన్ని గంటలు పట్టింది.

   

 డిసెంబర్ 8, 2010...

 ‘‘ఏం మాట్లాడుతున్నారు సర్... తను నా భార్య సర్. నా ప్రాణం. ప్రేమించి పెళ్లాడిన తనను చంపాల్సిన అవసరం నాకేముంటుంది సర్?’’ ‘‘అనవసరంగా అరవొద్దు మిస్టర్ ష్రీన్ దివానీ. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఇక మీరు తప్పించుకోలేరు’’ అంటూ ఆ సాక్ష్యాలను ష్రీన్ ముందు పెట్టాడు ఇన్‌స్పెక్టర్. వాటిని చూడగానే ష్రీన్ ముఖం పాలిపోయింది. కాసేపు నీళ్లు నమిలాడు. కాసేపు ఏదో చెప్పబోయి తత్తరపడ్డాడు. తర్వాత మౌనంగా ఉండిపోయాడు. దాంతో అతడే నేరస్తుడన్న నమ్మకం బలపడింది పోలీసులకు. ష్రీన్‌ని కోర్టు ముందు హాజరు పర్చేందుకు రంగం సిద్ధం చేశారు. అసలింతకీ ఏరికోరి మనువాడిన ప్రేయసిని ష్రీన్ ఎందుకు చంపాడు? దేని కోసం చంపాడు?

   

భారతీయ హిందూ సంతతికి చెందిన వినోద్ హిండోచా కుటుంబం చాలా యేళ్ల క్రితమే స్వీడన్‌లో స్థిరపడింది. వినోద్ ముగ్గురు పిల్లల్లో చిన్నది ఆనీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ఉద్యోగం చేస్తోంది. 2009లో ఓరోజు స్నేహితురాలిని కలవడానికి లండన్ వెళ్లింది. అక్కడే తొలిసారి ష్రీన్‌ని కలిసింది. చార్టెడ్ అకౌంటెన్సీ చదివి, తన సొంత కంపెనీ వ్యవహారాలు చూస్తోన్న ష్రీన్ ఆమెకు నచ్చాడు. అతడూ ఆనీ మీద మనసు పడ్డాడు. స్నేహం కుదిరింది. ప్రేమ పెరిగింది. లండన్‌కీ స్టాక్‌హోమ్‌కీ మధ్య రాకపోకలు జరిగాయి. పెద్దల అనుమతులు లభించాయి. 2010, అక్టోబర్ 29న... ముంబైలోని ఓ రిసార్ట్‌లో, హిందూ మతాచారం ప్రకారం వారి వివాహం జరిగింది. తర్వాత హనీమూన్‌కి దక్షిణాఫ్రికా వెళ్లిపోయారు.

 

 నవంబర్ 7న కేప్‌టౌన్‌లో దిగిన తర్వాత క్రూగర్ జాతీయ పార్కుకి వెళ్లిపోయారు ఆనీ, ష్రీన్‌లు. అక్కడ అయిదు రోజులు (12 వరకు) బస చేసి కేప్‌టౌన్‌కు తిరిగొచ్చి, ఓ స్టార్ హోటల్లో దిగారు. 13 సాయంత్రం... ఆఫ్రికన్ సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపించే గుగులేథు టౌన్‌షిప్‌ని చూడ్డానికి బయలుదేరారు. దారిలో ఓ ఇద్దరు వ్యక్తులు కారుకు అడ్డుపడ్డారు. బలవంతంగా ఆపి కారెక్కారు. ష్రీన్ తలకి తుపాకీ గురిపెట్టి, తాము చెప్పిన దారిలో పోనివ్వమని డ్రైవర్ జోలా టాంగోని బెదిరించారు. ఇరవై నిమిషాల తర్వాత ష్రీన్‌ని కారులోంచి బయటకు నెట్టేసి, ఆనీని తీసుకుని వెళ్లిపోయారు. వెంటనే పోలీసులకు, ఆనీ తండ్రికి, తన కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి విషయం చెప్పాడు ష్రీన్. పోలీసులు హెలికాప్టర్ సాయంతో ట్యాక్సీని ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు. ఉదయం ఏడున్నర కావస్తుండగా ఓ నిర్మానుష్య ప్రాంతంలో ట్యాక్సీ కనిపించింది. అందులో ఆనీ నిర్జీవంగా పడివుంది. మెడమీద తుపాకీతో కాల్చిన గుర్తు ఉంది. ఆమె ఒంటిమీది ఆభరణాలు, పర్స్, ఖరీదైన ఐఫోన్ కన్పించలేదు. ఆమె ఒంటి నిండా, ముఖ్యంగా తొడల మీద గాయాలు ఉన్నాయి. నడుం వరకూ దుస్తులు తొలగించి ఉండటంతో ఆత్యాచారం కూడా జరిగివుండొచ్చని పోలీసులు అనుమానించారు. కానీ అలాంటిదేమీ లేదని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. అత్యాచారం చేయబోగా ఎదురు తిరగడంతో చంపేశారని నిర్ధారణ అయ్యింది.

 

 ఆనీ మరణంతో ష్రీన్ కుంగిపోయాడు. మానసిక ఒత్తిడికి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో అతడి మీద ఎవరికీ అంతగా అనుమానం రాలేదు. అయితే పోలీసులు ట్యాక్సీ డ్రైవర్ టాంగోని అరెస్ట్ చేయడంతో కథ కొత్త మలుపు తిరిగింది. ష్రీన్ దివానీయే తన భార్య హత్యకి కుట్ర పన్నాడనీ, అంతా అతడి ప్లానేననీ టాంగో చెప్పాడు. కిడ్నాప్‌నకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల వివరాలు కూడా ఇచ్చాడు. దాంతో పోలీసులు వాళ్లతో పాటు ష్రీన్‌ని కూడా అరెస్ట్ చేశారు. కోర్టు టాంగోకి 18 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.

 

 కానీ ష్రీన్ నేరం ఎంతకీ నిరూపణ కాలేదు. ఆనీ అక్క అమీ ... తన చెల్లెల్ని చంపింది ఆమె భర్తేనంటూ వాదించింది. హనీమూన్‌లో ఉండగా ఆనీ తనకి ఫోన్ చేసిందనీ, ఆమె తనకు చెప్పినదాని ప్రకారం ష్రీన్ ‘గే’ అనీ, ఆ విషయం తెలిసిపోయి నందుకే ఆనీని చంపేసివుంటాడనీ అమీ అంది. అయితే తగిన సాక్ష్యాలను సేకరించలేకపోయింది. దాంతో న్యాయస్థానం ఈ నెల 8న  ష్రీన్‌ని నిర్దోషి అంటూ విడుదల చేసింది.

 

 కోర్టు తీర్పు ష్రీన్ దివానీ కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తిందేమో కానీ... సర్వత్రా నిరసనలు వెల్లువెత్తేలా చేసింది. ఎందుకంటే... ష్రీన్‌ని నేరస్తుడనడానికి చాలా సాక్ష్యాలున్నాయి. ఆనీ చనిపోయినరోజు ఉదయం, ముందురోజు రాత్రి కూడా డ్రైవర్ టాంగోని ష్రీన్ ట్యాక్సీ స్టాండులో కలిశాడు. అందుకు సాక్ష్యంగా సీసీ టీవీ ఫుటేజులు ఉన్నాయి. పైగా ఉదంతం గురించి అతడు చెప్పిన విషయాలు ఒక్కోసారీ ఒక్కోలా ఉన్నాయి. దుండగులు ట్యాక్సీలోకి ఎక్కాక ఇరవై నిమిషాల తర్వాత తనని తోసేశారని ఓసారి అన్నాడు. నలభై నిమిషాల తర్వాత అని ఇంకోసారి అన్నాడు. నీతో పని లేనప్పుడు అంతసేపు ఎందుకు కారులో ఉంచుకుని తిప్పారు అంటే సమాధానం లేదు. దోచుకునే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేసివుంటే నీ ఫోన్, పర్స్ కూడా లాక్కోవాలి కదా అంటే మాట్లాడలేదు. అంత స్పీడుగా వెళ్తోన్న కారులోంచి తోసేస్తే నీకు దెబ్బలెందుకు తగల్లేదు అంటే కిక్కురుమనలేదు.     

 

 వీటన్నిటినీ న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఆనీకి అన్యాయం జరిగిందని ప్రపంచమంతా ఘోషిస్తోంది. ఆమెకు న్యాయం చేసేవరకూ పోరాడతామని ఆనీ కుటుంబం శపథం చేస్తోంది. తను ఎలాగూ తిరిగిరాదు, కనీసం తన పట్ల ఏం జరిగిందో తెలుసుకోండి చాలు అంటూ పోలీసులను, న్యాయస్థానాన్నీ వేడుకుంటోంది. వారి ఆవేదనను ఎవరు అర్థం చేసుకుంటారు? ఆనీకి ఎవరు న్యాయం చేస్తారు?!

 

 ఆనీ మరణించిన తర్వాత ష్రీన్ మానసిక ఒత్తిడికి గురయ్యాడని అతడి ఇంట్లోవాళ్లు చెబుతున్నా, తన ప్రవర్తన అలా అనిపించలేదంటారు చాలామంది. చివరికి అంత్యక్రియల సమయంలో కూడా అతడి కళ్ల నుంచి నీళ్లు రాలేదనీ, పైగా చలాకీగా తిరిగేవాడనీ, అందరితో నవ్వుతూ మాట్లాడేవాడనీ కొందరు చెప్పారు. మరోపక్క ష్రీన్ ‘గే’ అన్న విషయం ఆనీ సోదరి అమీ చెప్పగానే... పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఆ క్రమంలో వారికి అమీ చెప్పిన విషయం నిజమేనని తేలింది. ష్రీన్‌కి చాలామంది పురుషులతో సంబంధాలు ఉన్నాయనీ, అతడు మేల్ ప్రాస్టిట్యూట్స్‌తో కూడా కలిసి తిరిగేవాడనీ నిరూపణ అయ్యింది. అయితే ఆ నిజం ఆనీకి తెలియడం వల్లే ఆమెను చంపాడు అనడానికి మాత్రం సాక్ష్యాలు లభించలేదు. దాంతో కేసు నుంచి బయటపడ్డాడు.

 - సమీర నేలపూడి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top