పాము మాంసం తినే దేశాలు!

పాము మాంసం తినే దేశాలు! - Sakshi


వింతైన వంటకంబు

‘చైనాలో సమస్తం తింటారు’ అని మా బీజింగ్ గైడ్ హేరిస్ చెప్పాడు. పాములని కూడా తింటారని చెప్పాడు. రెస్టారెంట్లలో జీవించి ఉన్న పాములని ప్రదర్శనలో ఉంచుతారు. వాటిలో తాచుపాములు అధికంగా ఉంటాయి. ఇలాంటి స్నేక్ రెస్టారెంట్స్‌కి విదేశస్థులు అధికంగా వెళ్తుంటారు. పాడవకుండా కొన్ని సర్పాలని ధాన్యంతో చేసిన లిక్కర్‌లోనూ, కొన్ని రకాలని  సారాసీసాల్లోనూ భద్రపరుస్తారు.

 

సాధారణంగా బార్బెక్యూ (నిప్పులమీద కాల్చడం) చేసి వడ్డిస్తారు. తీగలతో చేసిన పంజరాల్లో ఉంచిన పాముని అతిథి ముందుగా ఎంపిక చేసుకోవాలి. ‘‘పొడవైన పాముని కాక, తెలివైన వాళ్ళు పొట్టిదైనా చుట్టుకొలత ఎక్కువున్న పాముని ఎన్నుకుంటారు. దానికి మాంసం ఎక్కువ ఉంటుంది’’ అని హేరిస్ చెప్పాడు. పాము మాంసం రుచి చికెన్‌కి దగ్గరగా ఉంటుందన్నాడు.

 ఆ పాముని నేల మీద పడేసి అతిథి ముందే పొడిచి చంపుతారు. తలని వేరు చేసి విషాన్ని ఓ గ్లాస్ లోకి వంపుతారు. తర్వాత దాని రక్తాన్ని గ్లాసులో నింపుతారు. విషం రక్తంలోకి ఎక్కితేనే ప్రమాదం. కడుపులోకి వెళ్తే ఏమీ కాదు. కాబట్టి దాన్ని అతిథులకు తాగడానికి ఇస్తారు.

 

ఇంకా కొట్టుకునే పాము గుండెని ఓ ప్లేట్‌లో ఉంచి, ప్రధాన గౌరవ అతిథికి దాన్ని తినడానికి ఇస్తారు. పాము మాంసంతో నాలుగైదు రకాల పదార్థాలని తయారు చేస్తారు. సూప్, స్ప్రింగ్ రోల్స్, బార్బెక్యూ, మొదలైనవి. వీటితో పాటు బియ్యంతో చేసిన అరసీసా సారాయి ఇస్తారు. తేళ్ళు, బల్లులు, పాములు నానబెట్టిన ఆ సారాయి వల్ల పుంసత్వం, బలం లభిస్తాయని వారి నమ్మకం.



పాము మాంసం తినడం వల్ల అనేక జబ్బులు రావని కూడా వాళ్లు విశ్వసిస్తారు. ఒక్క చైనాలోనే కాక పాము మాంసాన్ని జపాన్, కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్ మొదలైన దేశాల్లోనూ తింటారు.నేను అమెరికా వెళ్ళినపుడు టెక్సాస్‌లోని స్వీట్ వాటర్ అనే చోట జరిగే రేటిల్ స్నేక్ ఫెస్టివల్‌కి వెళ్ళాను. ఆ రోజు అంతా పోటీ పడి రేటిల్ స్నేక్స్‌ని వేటాడి పట్టుకొస్తారు.



ఇందుకు గైడ్లు సహకరిస్తారు. పట్టుకున్న పాముల బరువుని బట్టి విజేతని నిర్ణయిస్తారు. ఆ రోజు అక్కడి రెస్టారెంట్స్‌లో రేటిల్ స్నేక్స్‌తో చేసిన ఆహార పదార్థాలు విరివిగా లభిస్తాయి. ఆరిజోనా రాష్ట్రంలో కూడా దీన్ని జరుపుతారని విన్నాను.వియత్నాంలోని హనోయీలో ఓ వీధినిండా పాము మాంసం అమ్మే రెస్టారెంట్స్ ఉన్నాయని చెప్పాడు హేరిస్. తమిళనాడులోని కొన్ని అటవీ ప్రాంతాల్లోని ఆటవికులు పాము మాంసాన్ని తింటారని చదివాను.అమెరికన్ కుకరీ హీరో గార్డన్ రామ్సే వియత్నాం సందర్శించినప్పుడు తాచుపాము కొట్టుకునే గుండెని తిన్నాడు. ‘గార్డన్ రామ్సే ఈట్స్ ఏ బీటింగ్ స్నేక్ హార్ట్ ఇన్ వియత్నాం’ అని సెర్చ్ చేస్తే ‘యూట్యూబ్’లో దీన్ని చూడొచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top