స్నాక్ సెంటర్

స్నాక్ సెంటర్ - Sakshi


చిల్లీ చీజ్ బజ్జీ

కావలసినవి: బజ్జీ మిర్చీలు - 6, తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, తరిగిన చీజ్ - 1 కప్పు, శనగ పిండి - 1 కప్పు, బియ్యం పిండి - పావు కప్పు, కారం - 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా - పావు టీ స్పూన్, ఇంగువ - పావు టీ స్పూన్, చాట్ మసాలా - అర టీ స్పూన్ (కావాలనుకుంటేనే), కొత్తిమీర తురుము - 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా

 

తయారీ: ముందుగా ఓ బౌల్‌లో ఉల్లిపాయలు, చీజ్, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిర్చీలను ఓ వైపు మధ్యగా కట్ చేసి, అందులో పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూర్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్‌లో శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ఇంగువ, బేకింగ్ సోడా వేసి కలపాలి. ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి (బజ్జీల పిండి కాస్తంత లూజ్‌గానే ఉంటుంది). ఆపైన స్టౌ పై ప్యాన్ పెట్టి నూనెను వేడి చేసుకోవాలి. తర్వాత మిశ్రమం కూర్చిన మిర్చీలను పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. చివరగా వాటిపై చాట్ మసాలా చల్లుకోవాలి. వీటిని వర్షం పడుతున్నప్పుడు తింటే... ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

 

రాజ్మా గలౌటీ కబాబ్స్

కావలసినవి: రాజ్మా - అర కప్పు, ఉడికించిన బంగాళదుంప (చిదుముకోవాలి) - ముప్పావు కప్పు, పనీర్ తురుము - పావు కప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, పచ్చి మిర్చి - 2, మసాలా - అర టీ స్పూన్, శనగ పిండి - 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు - 1 కప్పు, ఉప్పు- తగినంత, నూనె - సరిపడా

 

తయారీ: ముందుగా రాజ్మాలను 8 గంటల పాటు నానబెట్టాలి. తర్వాత వాటిని కాస్తంత ఉప్పు వేసి, మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు రాజ్మాలలో పచ్చి మిర్చి వేసి, మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమంలో శనగపిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలా, ఉప్పు, చిదిమిన బంగాళదుంప, పనీర్ తురుము, ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని ఫొటోలో కనిపిస్తున్న ఆకారంలో ఒత్తుకోవాలి. ఆపైన వాటిని ప్యాన్‌పై నూనె వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి. వీటిని ఏదైనా సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.

 

చికెన్ బ్రెడ్ రోల్స్

కావలసినవి: కావలసినవి: చికెన్ ముక్కలు - పావు కిలో, పసుపు - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత, తరిగిన ఉల్లిపాయలు - 2 కప్పులు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ - 1 టీ స్పూన్, కారం - 1 టీ స్పూన్, కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ ముక్కలు - 10, కరివేపాకు రెబ్బలు -2, గుడ్డు సొన - అర కప్పు, పాలు - 1 కప్పు, బ్రెడ్ పొడి - 1 కప్పు, నూనె - సరిపడా

 

తయారీ: ముందుగా చికెన్ ముక్కలను పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి నూనెను వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం పొడి, చికెన్ ముక్కలు వేయాలి. 5- 10 నిమిషాల తర్వాత దాంట్లో కొత్తిమీర తురుమును వేసి, స్టౌ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కల చివర్లను తొలగించి, వాటిని పాలలో కాసేపు నానబెట్టాలి. ఆ బ్రెడ్ ముక్కల మధ్యలో చికెన్ స్టఫ్ పెట్టి రోల్ చేయాలి. ఆపైన వాటిని గుడ్డు సొనలో ముంచాలి. తర్వాత బ్రెడ్ పొడిలో దొర్లించాక ఫ్రిజ్‌లో పెట్టాలి. అరగంట ఆగాక బయటికి తీసి, నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top