స్నాక్ సెంటర్

స్నాక్ సెంటర్ - Sakshi


వెజ్ మోమోస్

కావలసినవి: మైదా పిండి - 1 కప్పు, తరిగిన కూరగాయలు - 2 కప్పులు (అర కప్పు క్యాబేజీ, అర కప్పు బీన్స్, అర కప్పు క్యారెట్, అర కప్పు క్యాప్సికమ్), తరిగిన ఉల్లిపాయలు - 1 టేబుల్ స్పూన్, అల్లం- వెలుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్, సోయా సాస్ - సరిపడా, ఉప్పు - తగినంత, నూనె - కావలసినంత

 

తయారీ: ముందుగా మైదా పిండిలో చిటికెడు ఉప్పు, టీ స్పూన్ నూనె, నీళ్లు పోసి బాగా కలపాలి. అది చపాతీ పిండిలా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై ప్యాన్ పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలను వేయించాలి. ఆపైన మిగిలిన కూరగాయల ముక్కలను వేయాలి. అవి వేగుతున్నప్పుడే... ఉప్పు, సోయా సాస్ వేయాలి. మిశ్రమం దగ్గరికయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకొని, చిన్న సైజు చపాతీల్లా చేసుకోవాలి. వాటి మధ్యలో కూరగాయల మిశ్రమాన్ని పెట్టి, ఫొటోల్లో కనిపిస్తున్న ఆకారం వచ్చేలా ఆ చపాతీ చివర్లను మడచాలి. వీటిని ఇడ్లీల్లాగే ఆవిరి మీద ఉడికించాలి. ఈ మోమోస్‌ను ఏదైనా సాస్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.

 

మావా మాల్‌పువా

కావలసినవి: పాలు - 1 లీటర్, కోవా - అర కప్పు, మైదా పిండి - అర కప్పు, పంచదార - 2 కప్పులు, కుంకుమ పువ్వు - చిటికెడు, ఫుడ్ కలర్ (కావాలనుకుంటేనే) - చిటికెడు, నెయ్యి - సరిపడా, యాలకుల పొడి - అర టీ స్పూన్, తరిగిన పిస్తా ముక్కలు - 2 టీ స్పూన్లు

 

తయారీ: ముందుగా పాలను బాగా మరిగించాలి. ఆ పైన అందులో కోవాను వేసి ఉండలు లేకుండా కలపాలి. మిశ్రమం పూర్తిగా చల్లారాక, దాంట్లో మైదా పిండిని కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి (మిశ్రమం లూజ్‌గానే ఉంటుంది). మరోవైపు ఓ గిన్నెలో రెండు కప్పుల పంచదార, రెండు కప్పుల నీళ్లు పోసి స్టౌ పై పెట్టాలి. పాకం కాస్త ముదిరాక, అందులో యాలకుల సొడి, కుంకుమ పువ్వు వేసి దింపేయాలి.



ఇప్పుడు మరో గిన్నెను స్టౌపై పెట్టి, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. అది వేడెక్కాక కోవా మిశ్రమాన్ని ఆ నూనెలో వేయాలి. అప్పుడు అవి ఫొటోలో కనిపిస్తున్న ఆకారాల్లోకి వస్తాయి. డీప్ ఫ్రై తర్వాత, వాటిని పంచదార పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి పిస్తా, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రాజస్థానీ మావా మాల్‌పువా రెడీ.

 

మసాలా మఠ్రీ

కావలసినవి: మైదా పిండి - 2 కప్పులు, గోధుమ పిండి - అర కప్పు, శనగ పిండి - అర కప్పు, జీలకర్ర - అర టీ స్పూన్, కారం - 1 టీ స్పూన్, మిరియాల పొడి - అర టీ స్పూన్, ఉప్మా రవ్వ - పావు కప్పు, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా, మసాలా - అర టీ స్పూన్, ఉప్పు - తగినంత

 

తయారీ: ముందుగా ఓ పెద్ద బౌల్‌లో మైదా, గోధుమ పిండి, శనగ పిండి వేసి కలపాలి. అందులో ఉప్మా రవ్వ, జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, మసాలా, ఇంగువ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా చేసి, కాసేపు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని మీకు నచ్చిన షేపులో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టౌ పై ప్యాన్ పెట్టి, నూనె పోయాలి. అది వేడెక్కాక మఠ్రీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని చాయ్ లాంటి పానీయాల్లోకి సర్వ్ చేసుకోవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top