స్నాక్ సెంటర్

స్నాక్ సెంటర్ - Sakshi


వెజ్ పనీర్ రోల్స్

కావలసినవి: క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు, తరిగిన టొమాటోలు - అరకప్పు, పసుపు - 1 టీ స్పూన్, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ - 1 టేబుల్ స్పూన్ (కావాలనుకుంటేనే), పనీర్ ముక్కలు - 1 కప్పు, ఉప్పు - సరిపడా, కారం పొడి - 1 టీ స్పూన్, మసాలా పొడి - 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర - అరకప్పు, పెరుగు - పావుకప్పు, నూనె - 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు, చపాతీలు - 4

 

తయారీ: స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు వేసి వేయించాలి. తర్వాత అందులో అల్లం-వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, పనీర్ ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, మసాలా వేసి బాగా కలపాలి. అందులో టొమాటో సాస్ వేసి రెండు నిమిషాలు స్టౌను పెద్ద మంటపై ఉంచి, తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీలను తీసుకొని.. వాటికి పెరుగు రాసి పైన తయారు చేసుకున్న మిశ్రమాన్ని అందులో పెట్టి, కొత్తిమీరను చల్లాలి. తర్వాత వాటిని రోల్ చేయాలి. అలాగైనా లేదా ఆ రోల్‌ను ముక్కలుగా చేసైనా పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు. వీటిని కొత్తిమీర చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో కలిపి తింటే టేస్ట్ అదుర్స్.

 

చపాతీ నూడుల్స్

కావలసినవి: చపాతీలు - 4, సన్నగా, పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు - పావుకప్పు, పొడుగ్గా తరిగిన టొమాటోలు - పావుకప్పు, సన్నగా తరిగిన క్యారెట్ - పావుకప్పు, తరిగిన పచ్చిమిర్చి - 2 టీ స్పూన్లు, సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర - పావుకప్పు, కారం పొడి - 1 టీ స్పూన్, పసుపు - 1 టీ స్పూన్, గరం మసాలా - 1 టీ స్పూన్ (కావాలనుకుంటేనే), ఉప్పు - సరిపడా, నూనె - 1 టేబుల్ స్పూన్

 

తయారీ: ముందుగా చపాతీలను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌపై ప్యాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. మూడు నిమిషాల తర్వాత క్యారెట్ ముక్కలు వేసి కొద్దిసేపు ఉంచాలి. ఇప్పుడు అందులో టొమాటో ముక్కలు వేసి, మగ్గాక పసుపు, ఉప్పు, కారం, మసాలా, సోయా సాస్ వేసి బాగా కలపాలి. తర్వాత చపాతీ ముక్కలను వేసి కలపాలి. అయిదు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. ఈ చపాతీ నూడుల్స్‌ను పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు.

 

బనానా డాగ్ బైట్స్


కావలసినవి: అరటిపండు - 2, పీనట్ బటర్ - పావుకప్పు, చపాతీలు - 2, తేనె - 1 టీ స్పూన్

తయారీ: ముందుగా అరటిపండ్ల తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చపాతీలకు ముందుగా తేనెను సమానంగా రాయాలి. ఆపైన పీనట్ బటర్‌ను అప్లై చేయాలి. ఇప్పుడు ఒక్కో చపాతీలో ఒక్కో అరటిపండును పెట్టి రోల్ చేయాలి. తర్వాత ఒకటిన్నర ఇంచు చొప్పున రోల్‌ను కట్ చేసుకోవాలి.



ఈ బైట్స్‌తో ఆరోగ్యం, ఆనందం మీ సొంతం. (కావాలంటే చపాతీలకు బదులు టార్టిల్లాలను వాడొచ్చు. ఇవి షాపుల్లో దొరుకుతాయి. అలాగే పీనట్ బటర్‌ను కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే.. ముందుగా పల్లీలను వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలి. ఆపైన అందులో చిటికెడు ఉప్పు, తేనె, కొద్దిగా పల్లి నూనె వేసి మరోసారి క్రీమ్‌లా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top