పిచ్చి గంగి


‘టప్, టప్’ మంటూ, కారు మెల్లిమెల్లిగా నడుస్తూ దానంతటదే ఆగిపోయింది. మామయ్య కోపంగా ఎగిరి పడ్డారు - కారులోంచి కూడా.‘‘సరిపోయిందిలే. మధ్య దారిలోనే నిల్చిపోయిందే బండి. వెళ్లేది శుభకార్యం, శకునం బాగా లేదే!’’ అంది అత్తయ్య. ‘‘అదేమిటమ్మా... నాకు వళ్లు మండి పోతుంది, శకునాలేమిటి! నీ మూఢ నమ్మకాలు మార్చుకోవడం మంచిది ఇహనైనా, ఇది ఆధునిక యుగం’’ అంది విసుగ్గా శాంతి, కాలేజీ సెలవులకి ఇంటికి వచ్చిన అత్తయ్య కూతురు.

 

 ‘‘అసలు నువ్వు బండిలో పెట్రోలు ఉన్నదీ లేనిదీ చూసుకుని మరీ బయలు దేరవద్దా? నేను ఆఫీసు నించీ వచ్చేటప్ప టికి అన్నీ రెడీగా ఉంటాయనుకున్నాను. ఏమిటా నిర్లక్ష్యం?’’ కసిరారు, కారు డ్రైవరు రాజుని మామయ్య.‘‘ఏం చెయ్యమంటారు సార్. అమ్మాయిగారు తొందరపెట్టేసారు, వెంటనే బయలుదేరి పెళ్లికి అందుకోవాలి అంటా. ఆ గాభరాలో నేనూ బండి తీసేసాను’’ అన్నాడు రాజు దిగులుగా, తనూ బండి దిగుతూ. ‘‘అసలు అందుకనే ఈ అడ్డ తోవని పట్టిచ్చానండి కారు’’ అన్నాడు మళ్లీ.

 

 ‘‘అసలు పెట్రోలు ఉందో లేదో రాజు చూసుకోవద్దా ఏమిటి? అది అతని డ్యూటీ’’ అంది శాంతి గడసరితనంగా.

 ‘‘అదేమిటి, తెల్లవారు జాము ముహూర్తానికి ఇప్పుడే తొందరేమిటి అమ్మాయ్ నీకు?’’ అడిగింది అత్తయ్య.

 ‘‘పెళ్లి అంటే కాస్త తొందరగా వెళ్ల వద్దా మరి’’ అంది శాంతి.కానీ నాకు తెలుసు - ఆ పెళ్లికి వచ్చే బంధుమిత్ర బృందంలో, శాంతికి కావల సిన రమేశ్ వచ్చి ఉంటాడని. చేసేదేమీ లేక అందరమూ కారు దిగాం. ఎండ తీక్షణంగా ఉంది. మా నీడలు పొడుగ్గా మా ముందర పడు తున్నాయి. మా చుట్టూ భూదేవి కూడా వేడి ఆవిర్లు చిమ్ముతోంది. ఎక్కడో దూరాన ఎండి పోయిన పొలాల్లో, నలుగురు మనుష్యులు బెడ్డ తిరగ వేస్తున్నారు. ఇహ మరి మనిషి సంచారం లేదు ఎక్కడా. ఆ రోడ్డు పెద్ద రహదారి కూడా కానట్టుంది. రోడ్డుకి ఇంకో పక్క కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక మనిషి కూచుని ఉన్నాడు. ఆ చుట్టూ మాత్రం, కాస్త మేర పచ్చిక పచ్చగా ఉంది. అందరమూ చెట్టుకేసి నడిచాం.

 

 మమ్మల్ని చూసి ఆ వయో వృద్ధుడు లేచి నించుని, గడ్డం క్రింద చేతి కర్రని ఆనించుకొని, మాకేసి చూస్తున్నాడు.

 ‘‘నీ పేరేమిటయ్యా?’’ అడిగారు మామయ్య.‘‘మాదయ్యండి. మా మనుమడు వచ్చే దాగా ఈ గొడ్లని శూత్తా ఉండమన్నా డండి నన్ను’’అన్నాడు ఆ వృద్ధుడు.అంతలోనే మా కారు ప్రక్కనించీ మోటారు బైక్ మీద శరవేగంతో ఒక యువకుడు వెళ్లాడు.‘‘ఆ బండి ఏ ఊరు వెడుతోందో నీకు తెలుసా?’’ అడిగారు మామయ్య.‘‘మా లింగాలేనండి. పెద కామందులు శంకరం గారి బాబండి ఆయన’’ అన్నాడు అతను.‘‘మా కారులో పెట్రోలు అయిపో యింది. ఇది బొత్తిగా మారుమూల దారి. ఆయన్ని అడిగి ఎంతైనా ఇచ్చి కాస్త పెట్రోలు తెచ్చుకుందామా’’ అన్నారు చిన్న స్వరంతో మామయ్య.

 

 ‘‘మారాజులాగా ఎల్లండి బాబయ్యా. ఇట్టాంటి ఇక్కట్టు టయానికి సహాయం చేత్తారండి ఆరు’’ అంటూ, ఆ మోటారు బైక్ వెళ్లిన దారికేసి, చేత్తో చూపిస్తూ, ‘‘అదిగదిగో ఆపైన ఎగుర్తా ఆ కొంగలు కనిపిత్త ఉండాయే. అదేనండి మా లింగాల గ్రామం చెరువు. ఒక రొండడుగులు ఏత్తే గంగమ్మ గుడి. అది దాటంగానే చెరువు కెదూరుంగా మండువా ఇల్లండి ఆరిది. నాలుగడుగులండి ఇక్కడికి’’ అన్నాడు మాదయ్య, చేతిలో కర్రతో మేము వెళ్లబోయే దిక్కు చూపిస్తూ. మాకందరికీ ప్రాణాలు లేచి వచ్చినట్టయినాయి.

 ‘‘రాజూ, కారులో ఉన్న క్యాన్ తీసు కుని, ఈ తాత చెప్పిన దారినే వెళ్లి, ఎంత డబ్బు అయినా ఇచ్చి ఒక లీటరు పెట్రోలు తీసుకురా’’ అంది అత్తయ్య, తన పర్సు లోనించి డబ్బు తీసి ఇస్తూ. అందరమూ ఆ పెద్ద నేరేడు చెట్టు నీడని కూలబడ్డాం. కాస్త దూరంలో ఒక బావి కనిపించింది. అక్కడక్కడా, చింతలూ తుమ్మలూ మామిడి చెట్లూ ఉన్నాయి.మాదయ్య కూర్చున్న పక్కన రెండు పాత సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల మీద తామరాకులో రకరకాల పువ్వులు పెట్టి ఉన్నాయి, వాడిపోతూ - ఎవరో పూజ చేసినట్టూ. ‘‘అయ్యయ్యో! సమాధుల ప్రక్కనా కూచున్నాం!’’ అంది శాంతి కాస్త చీదరించుకుంటూ. తన చేతి రుమాలు గడ్డిమీద పరిచి ముళ్ల మీద కూచున్నట్టు కూచుంది.‘‘ఏం బయ్యం లేదండి అమ్మాయి గారూ, ఆ తల్లి పిచ్చి గంగి. మీయసు వంటి కన్నె పాపల్ని మా ఇదిగా కాపాడుద్దండి’’ అన్నాడు మాదయ్య.

 

 ‘‘ఎవరైనా పూజ చేస్తారా ఇక్కడ?’’ అడిగింది అత్తయ్య.

 ‘‘మరేనండమ్మా, రొండో కంటికి తెలువకుండా, కన్నె పడుసులు ఈ సుట్టు పట్లు గ్రామాల్నించి తెల్లారగట్ట, పొద్దు పొడవక ముందరే పువ్వులు పెట్టి ఏడు కుంటారండి. ఆళ్లందరికీ మనసుల్లో ఎవ్వుళ్లని కోరుకున్నారో ఆళ్లతో పెళ్లి అవుద్దండి. ఆయమ్మ నమ్మిన వాళ్లని ఇడవదు’’ అన్నాడు మాదయ్య.

 ‘‘ఎవరయ్యా ఆ పిచ్చి గంగి?’’ అడిగాడు మామయ్య.

 ‘‘అది ఒక పెద్ద కతలెండి బాబయ్య. నా శిన్నతనాల్లో జరిగిందండి.’’

 ‘‘అంటే, ఈ మధ్యనే జరిగిందన్న మాట.’’

 ‘‘రాజు వచ్చే వరకూ కాస్త ఊసు పోతుంది. ఆ కథ ఏదో కాస్త చెప్ప వయ్యా’’ అడిగింది శాంతి.

 

 ‘‘ఆ మాటకొత్తే ఈ సుట్లు పట్లు గ్రామాల్లో ఆయమ్మంటే తెలవనోళ్లే లేరండి. గురి పెట్టి రాయి ఇసిరిందంటే ఎక్కడ అనుకుంటే అక్కడ తగుల్తాది. బయపడి పోయేవాళ్లండి ఊరంతా. ఆ తల్లి ఈ ఊళ్లోనే పుట్టి పెరిగిందండి. బంగా రమ్మ తమ్ముడి కూతురండి. పురిట్లోనే సంది ఒచ్చి తల్లి పోయిందండి. ఆ తమ్ముడు కొన్నాళ్లయ్యాక, ఏరే కోస్తాకి పోయేశి రొండో ఇవాహం చేసేసుకున్నాడండి. ‘‘తల్లి పోయినప్పుటేల నించీ ఆ పాపని కన్నురెప్పలాగా కాపా డతా ఒచ్చిందండి బంగారమ్మ. ఇరుగు పొరుగు అమ్మలక్కల్ని బతిమాలి పాలి ప్పిచ్చి, పెంచి అమ్మోరి పేరే గంగమ్మ అని పెట్టిందండి. బంగారమ్మకి ఒక్కడే ఒక్క కొడుకు సంగ మయ్య. ఐదెకరాల పల్లం ఉండాదండి. కూలోళ్లతో పాటు ఆయమ్మ కూడా పని చేస్తా పొలం పండిచ్చుకుంటూ, కొడుకునీ గంగమ్మనీ పెంచుకుంటూ కాలం గడుపుతా ఒచ్చిందండి, బంగారమ్మ.’’

 

 ‘‘ఇంక సూత్తే గంగమ్మ శెక్కిన బొమ్మెల్లే తయారయ్యిందండి. ఆ పాప ఒంటి సాయ సూస్తే, ఆ ఇళ్లల్లోనే ఎవ్వుళ్లకీ లేదండి అసువంటి రంగు. మేలిమి బంగారు రంగండి. అప్పుడు నేను శిన్నోణ్ణండి. గోశీలు పెట్టుకుని బర్రెల్ని మేపుతా ఉండేవాణ్ణి. నేను బర్రెల్ని కడు గుతా వుంటే, గంగమ్మ గుడ్డలు గుంజే దానికి చెరువు కాడికి ఒచ్చేది. ఆయమ్మ నీడ బర్రెల మీద దీపం శూపినట్టనిపిచ్చేది. కుచ్చ జడలతో, జడని పువ్వులతో, చేతి నిండా గాజులతో, కాటిక బొట్టు, పసుపు వుంటే, తిరిగి సూడనోళ్లు లేరండి. ఆడోళ్లయినా సరే మొగాళ్లయినా సరే.’’

 

 ‘‘బంగారమ్మకేమో, గంగమ్మని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసుకుని ఇంట్లోనే పెట్టు కుందామని, ఏనాడో తీర్మానంగా అను క్కున్న మాటేనండి. ఆ మాట ఈ ఊళ్లల్లో అందరికీ తెలుసండి. అందుకని గంగమ్మకి ఎక్కణ్ణించీ కూడా మనువులు రాలేదండి.’’

 ‘‘ఈలోగా ఏవయిందంటేనండీ, గంగమ్మ గుడి ఎనకాల పాపాయమ్మ, ఆయమ్మ కొడుకు రూపులయ్య ఉండా రండి. ఆళ్లకి నాలుగు ఎకరాల మాగాణి, దిబ్బ గట్రా ఉండాదండి. ఆ అర ఎకరం దిబ్బ మీద కాయ కూరలు పండిచ్చోరండి, గడ్డి వాము అక్కడే ఉండేదండి. పువ్వులు గట్రా కూడా పెంచేవారు అమ్మోరి గుడికి. పాపాయమ్మ గారికి కళ్లు చెడ్డ మసక. ఇంట్లోనే నడవడానికి కాళ్లు తడబడేయి. రూపులియ్య మామంచోడండి. తల్లిని కనిపెట్టుకుని పొలం సూసుకుంటా కుటుంబం నడిపిస్తా ఉండాడండి. బయట పనులన్నీ శెయ్యటం, ఇంట్లోకి మంచినీళ్లు తేటం అంతా రూపులియ్యే చేసేవాడు. బియ్యం పొంగిచ్చి కొడుక్కి అన్నం పెట్ట టంతో, పాపాయమ్మగారి పని సరి. తల్లి అంటే రూపులియ్యకి పాణంతో సమానం.’’

 

 ‘‘రూపులియ్యగారి దిబ్బమీదికి ఆవు గడ్డి కోసం గంగమ్మ ఎల్తా ఉండేది. రూపులియ్య కూడా దిబ్బ మీద పండే కాయ కూర కోసి ఇచ్చేవోడు. మోపు బరువుగా ఉంటే పిలవకుండానే, గంగమ్మ తలమీద ఎత్తిపేట్టేవోడు. అట్లా గంగమ్మకీ రూపులియ్యకీ స్నేహితం ఏర్పడ్డదండి. కాని ఒకళ్లతో ఒకళ్లు మాట్లాడుకోరు. కాని ఎట్టాగో ఊళ్లో ఓళ్లకందరికీ రూపులియ్యకి, గంగమ్మ మనసు ఇచ్చింది అన్న మాట తెలిసిపోయిందండి. ఊరంతా ఉడికి పోయింది. బంగారమ్మకీ, కొడుక్కీ మట్టుకు ఈ సంగతి తెలువదు. గంగమ్మకంటారా అసువుంటి కొంటె పనులు తెలవ్వు. మొగోళ్లు నిల్చేశోట నిలవదు, అయితే ఎవ్వుళ్లకన్నా ఏదన్నా పని కావాలంటే శటుక్కున శేశిపెడద్ది. మా ఉపకార బుద్ధండి మొదట్నించీ.’’

 

 ‘‘పొద్దు పొడిశేతలికి నీళ్లోసుకుని గంగమ్మ తల్లి గుడిసుట్టూ తిరిగి ఒక దణ్ణం పెట్టుకుని, ఆ పూజారమ్మ కనకమ్మ గారిచ్చిన కుంకుం కళ్లకి అద్దుకుని నొసట్లో పెట్టుకుని మరీ పనుల్లో జొరబడేదండి. గంగమ్మ గుళ్లో మంచికీ శెబ్బరికీ గంగమ్మ ముందుండేదండి. గుళ్లో నుంచీ కొబ్బిరి ముక్కలూ ప్రసాదాలు అంతా మా పిల్లలందరికీ ఆయమ్మే ఇచ్చేదండి. ఈ పనులు కాక రూపులియ్యగారి బియ్యం బాగుశెయ్యటం, కాయలు తరగటం శేశి పెట్టేది. గుడ్డలు గుంజుకోటానికి ఎల్తే, పాపాయమ్మగారి కోకలు కూడా జాడిచ్చి తెచ్చేది. పూజ సామాన్లు తోమి పెట్టేది. ఇంకా రూపులియ్య గంటే నుండి, గుడి సంబరాలకి గుంజలు పాతటం, పందిళ్లెయ్యటం, తోరణాలు కట్టటం గట్రా అన్ని పన్లూ ఆయన లేకుంటే నడవవండి. అయితే ఒక సంగతండి. రూపులియ్యనీ గంగమ్మనీ గుళ్లోగాని గుడి ముందరగాని, ఒకే పాలి శూశినోళ్లు లేరండి. రూపులియ్య మూగోడిలాగానే ఉండేవోడండి.’’

 

 ‘‘ఆ యేడు కొడుక్కీ మేనకోడలికీ పెళ్లి శెయ్యాలని కంకణం కట్టుకుంది బంగా రమ్మ. ఒకనాడు ఏమయిందంటే... అది పొద్దుటేల. శద్దణ్ణం అయ్యాక గంగమ్మ కొడవలి సేత పట్టుకుని, ఆవుకి సందిడు గడ్డి తెద్దావని రూపులియ్యగారి దిబ్బ మీదకి ఎల్లిందండి. నడుం ఎత్తున పెరిగిన పచ్చిగడ్డిలో కింద పడుకుని ఉన్న తాసు పాముని గంగమ్మ సూడలేకపోయింది. పాము తలమీద కాలు ఏసింది. ఆ పాము శటుక్కున ఆయమ్మ కాలు సుట్టేసుకుంది. బయ్యంతో గంగమ్మ గట్టిగా ఒక్క కేక అరిసేసింది. గడ్డి వాము పక్కన వరి గడ్డి పీకుతూన్న రూపులియ్య ఒక్క అంగలో ఒచ్చాడు. శటుక్కున గంగమ్మ శేతిలో కొడవలి లాక్కొని, ‘‘నువ్వు కాలు గట్టిగా తొక్కి అట్టాగే ఉంచు, కదిల్తే కాటేత్తాది’’ అంటూనే ఆ పాముని మెడ దగ్గిరిగా నరికి పారేసాడు.

 

  ఎంటనే ఆమె పాదం కిందగా కొడవలి జరుపుతా ‘‘ఒక్క అంగలో దూరంగా దూకు’’ అన్నాడు. గంగమ్మ శటుక్కున దూకింది. రూపులియ్య అనుకున్నట్టుగా ఆ కొడవలి పాము తలలోకి ఎల్లలేదండి. గడ్డిలోకే ఎల్లింది. పాము తల అట్టాగే ఉండాది. ఆ తల ఎగిరి రూపులియ్య కాలు కాటేసి పడి పోయింది. ఇక బతకను అని రూపు లియ్యకి తెలిసిపోయింది. ‘‘నువ్వు వెంటనే పారిపో, ఇక్కడ ఉండొద్దు. మాయమ్మని ఎవ్వురు శూత్తారో దేవుడా!’’ అంటా పడిపోయాడు. ఇదంతా, పల్లంల గొడ్లని కాస్తాన్న నేను సూస్తానే ఉండానా, అట్టాగే కొయ్యబారిపోయానండి. ఎట్టాగో తెప్పరిల్లి, ఒక చణంలో కర్ర కింద పారేసి ఊళ్లోకి లగెత్తుకొచ్చానండి.’’

 

 ‘‘గంగమ్మ ఒక్క పరుగులో ఒచ్చి గంగమ్మ తల్లి గుళ్లో అమ్మోరి కాళ్ల ముందర పడిపోయిందండి. అంతేనండి... ఆనాడు పోయిన మతి గంగమ్మకి. మళ్లీ తిరిగి మడుసుల్లోకి రాలేదండి. అమ్మోరి గుళ్లోనే పడి ఉండేది. జుట్టు ముడి కూడా ఏసుకు నేది కాదు. ఎంటికలన్నీ ఇరబోసుకునే ఉండేది. చెరువుల్లో నీల్లోసుకుని అమ్మోరికి సేవ చేసుకుంటా, పొలాలెంట ఒంటరిగా తిరుగుతూండేదండి. కొంతమంది రాలుగాయి పిల్లకుంకలు మాత్రం ఆయమ్మ ఆపడగానే పిచ్చి గంగి పిచ్చి గంగి అంటానే ఉండోళ్లండి. ఆయమ్మ పట్టిచ్చుకునేది కాదు. అసలేమీ అనేదే కాదు. ఆ తల్లికి అదే పేరైపోయిందండి.‘‘పాపాయమ్మగారి ఒక్క కొడుకూ పోనే పోయాడుగిందా. ఇంక ఈ బతుకు ఎందుకులే అనుకుంది. దూరపుకోస్తా నించీ, చెడి బతకటానికి ఈ ఊరొచ్చి బాగుపడ్డ కుటుంబం అది. అందుకని ఈ ఊళ్లల్లో ఎక్కడా బందుగులు లేకపో యారు. ఉండా ఆస్తిపాస్తులన్నీ గంగమ్మ తల్లి గుడికి రాసిచ్చేసి ఇంట్లోనే పడి ఉండే దండి. అంత పిచ్చిలో కూడా గంగమ్మ... పాపాయమ్మగారి ఇల్లూ వాకిళ్లూ తుడవటాలూ, గుడ్డలు గుంజటాలూ, జత పడుకోటాలూ చేత్తానే ఉండేది.

 

 ‘‘ఈ లోగా ఇంకొక సంగతి కూడా జరిగింది. ఒకనాడు రాత్రి శిద్దయ్య కూతురు చంద్రమ్మని, ఆయన రొండో భార్య - అదొక గయ్యాళిలెండి - ఆయమ్మ తమ్ముణ్ణి పెళ్లాడనందని ఆ పిల్లని పట్టి కొట్టి, వాతలేస్తానందంట. శిద్దయ్య ఇల్లూ వాకిలీ, కొండ్రా గట్రా అంతా ఆమె తమ్ముడికే దక్కాలని కంకనం కట్టుకుండాది. శిద్దయ్యకి ఏరే పిల్లలూ లేరు. బార్య మాటకి ఎదురు శెప్పనూ లేడండి. చంద్రమ్మ శేతులు రొండూ కట్టేసి, ఆ సవితి తల్లి పొయ్యి అద్దకి ఎల్లిందంట, అట్ల ముల్లు తేటానికి, వాతలేశాదానికి. అంతే, శిటుకలో చంద్రమ్మ బయటికి ఉరికి, ఆ చీకట్లో పరుగెడతా వుండాదంట పొలాల కడ్డంగా. చెరువు గట్టుమీద మర్రి చెట్టు కింద చెట్టు నీడన చీకట్లో కూశున్న పిచ్చి గంగి, ఒక్క అంగలో లేశి చంద్రమ్మ దారికడ్డంగా నిల్చిందంట, చేతిలో రాయి పట్టుకుని కొట్టేదానికి.

 

 చంద్రమ్మ గాభరాగా ‘అక్కా, నన్ను కాపాడమ్మా’ అని పెద్ద కేక పెట్టేసిందంట. గంగమ్మ శటుక్కున దగ్గిరికి ఒచ్చి, ‘యాంమయిం దమ్మా నీకు’ అని అడిగిందట. చంద్రమ్మ జరిగిందంతా శెప్పి, పక్క కాట్లపూడి గ్రామంలో తన మేనత్త ఉండాదని, ఆయమ్మ కొడుకునే పెళ్లాడాలని ఉండా దని, అక్కడికి పోతే సాలనీ శెప్పిందంట. అంతలోకే కర్ర చేతపట్టుకుని శిద్దయ్య బావమరిది చింతాలు వస్తా వుండాడంట. గంగమ్మ ఎంటనే గట్టు కింద చంద్రమ్మని కూసోబెట్టి, దారికి అడ్డం ఒచ్చి ‘ఎవడ్రా నువ్వు’ అని రాయి చేత్తో పట్టుకుందంట. ఇకంతే, చింతాలు ఎనక్కి తిరిగి పారి పోయాడంట. కాట్లపూడి దాకా చంద్రమ్మకి గంగమ్మ తోడుగా ఎల్లిందంట. ఆ నోటా ఈ నోటా, చంద్రమ్మ పెళ్లి మాట పొక్కింది. అప్పుటేలనించీ, పొద్దుటేల గుడికి వచ్చే ఆడపిల్లలు, గుడి ముందర కూసున్న గంగమ్మకి కూడా మొక్కి ఎల్లే ఓళ్లంట.’’

 

 ‘‘అట్టా అట్టా, యాడాది తిరగేతలికి పాపాయమ్మగారు మంచం ఎక్కారండి. అంతే, ఆయమ్మ కళ్లు మూసేదాకా పిచ్చి గంగి పాపమ్మ పక్క ఒదల లేదు. నిద్రా లేదు వణ్ణమూ లేదు, నీల్లూ లేవు. పాపాయమ్మకి అన్ని సేవలూ శేశింది.‘‘ఇక అంతేనండి. గంగమ్మ అలిసి పోయి గుడి ముందరకొచ్చి పడిపోయిం దండి. మేనత్త వణ్ణం తెస్తే తినలే. కనకమ్మ గారు పళ్లూ గట్రా ఇస్తే తినలే. నీల్లిస్తే తాగలే. అట్టాగే పడి ఉండేది. గాలి పట్టిందన్నారు. వారం దాటింది. మేనత్త వణ్ణం తినమని బతిమాలితే, గంగమ్మ కళ్లల్లో నీళ్లు నిండినయి. కనకమ్మ భర్త గారు, వైద్యుణ్ణి తెస్తా, కొంచం మందు తినమన్నారండి. గంగమ్మ కళ్లల్లో నించి నీళ్లు ధారగా జారి పడ్డాయండి. పిచ్చి గంగి అప్పుడు మూసిన కళ్లే. ప్రాణం పోయేదాకా తిరిగి తెరవనే లేదండి. తెల్లారక ముందరే జీవుడు ఒదిలేసింది.

 ‘‘కనకమ్మగారు.. రూపులియ్య పక్కనే ఈయమ్మకి కూడా సమాధి కట్టించ్చిం దండి. అయ్యేనండి ఈ సమాధులు.’’

 మాదయ్య ఒళ్లోనించీ పుగాకు తీస్తూ కాస్త ఆగి ‘‘కనకమ్మగారు శచ్చిపోయే టప్పుడు పెద్దల్ని పిల్చి, దణ్ణం పెట్టి శెప్పిందండి, అన్నేళ్లూ ఆయమ్మ కడుపులో పెట్టుకున్న ఆ రహస్యం.’’

 

 అప్పటికి కాస్త తెప్పిరిల్లి, ‘‘ఏమిటా రహస్యం?’’ అడిగింది, అత్తయ్య.

 ‘‘అసలు, ఏనాడూ పిచ్చి గంగికి పిచ్చేలేదంటండి!’’ అన్నాడు మాదయ్య, పుగాకు చేత్తో ఊత ఇస్తూ.

 దూరాన్నించీ, వస్తున్న చెప్పుల శబ్దం తప్ప, అంతా నిశ్శబ్దం, పెట్రోలు బరువుతో రాజు వస్తున్నాడు. ఏ లోకం లోనించో భూలోకానికి వచ్చి పడ్డాం అందరమూ.

 అందరికంటే ముందర శాంతి లేచింది. ఎప్పుడూ కనిపించని గాంభీర్యం ఏదో కనిపించింది, శాంతి ముఖంలో. రెండడుగులు వేసి వంగి నమస్క రించింది... ఆ సమాధులకి.                    

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top