రాజనంది

రాజనంది


‘‘ఎవరి జాతకం వారు చూసుకోకూడదంటారు. ఆ వెర్రిపని నేను చేశాను. అనుభవిస్తున్నాను’’ అనుకున్నారు పూర్ణయ్య సిద్ధాంతిగారు. జాతకం ప్రకారం, ఆయన జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఒకటి జరుగుతుంది. అది కూడా పౌర్ణమి ఘడియలు పూర్తికాక ముందే జరగాలి. అమృత ఘడియల్లో జరిగే ఆ అద్భుతం ఏదో ఇంట్లో జపం చేస్తూ కూర్చుంటే కనిపించకపోవచ్చు. వీధివాకిట్లో ఎదురు చూసినా లాభం కలక్కపోవచ్చు. ఎంచేతంటే బాగా కృషి చేసిన మీద కానీ ఆ విశేషాన్ని గుర్తించే అవకాశం లేదని గ్రహాల నిర్దేశం.



ఆ రోజు ఉదయం నుంచీ హేలాపురిలోని ప్రతి వీధీ తిరుగుతూ, కనబడిన ప్రతి దృశ్యాన్నీ తరచి తరచి చూస్తున్నారు సిద్ధాంతిగారు. తన లగ్నానికి మోక్షస్థానంపై దృష్టి కేంద్రీకరించి అయిదు Ô]æుభగ్రహాలు నిలిచివున్నాయా ముహూర్తంలో. అలౌకికమైనది, అధ్యాత్మకు అనుభవం అయ్యేది, ఏ వ్యక్తికైనా చివరి ధ్యేయమూ కాగల ప్రయోజనం ఏదో ఆనాడు జరగాలి.కానీ ఆ మధుర సన్నివేశమేమిటో మాత్రం ఊహించలేకపోతున్నారు. తన లెక్క తప్పడానికి వీల్లేదు. రాజవీధిలోకి ప్రవేశించేసరికి ఆయన కళ్లు, కాళ్లు ఒకచోట నిలిచిపోయాయి. ఒక కపిల గోవు అంబారవాలు చేస్తూ తన చుట్టూ తానే తిరుగుతోంది. ప్రజలంతా ఒక్కొక్కరే గుమిగూడుతున్నారు.



ఆవు గుండ్రంగా తిరుగుతూ వెనుక కాళ్లు కిందకి వంచి నిలబడింది. పూర్ణయ్య సిద్ధాంతిగారికి బ్రహ్మానందమైంది. దూరంగా ఎత్తయిన వితర్దిక మీద నుంచుని ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తున్నారు. ఏవో శ్లోకాలు వల్లె వేస్తున్నారు. ఎక్కడెక్కడి జనం పోగుపడుతున్నారు. మరికొద్దిక్షణాల్లో ప్రసవించబోయే ఆ కపిలగోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రసవ సమయం దగ్గరపడింది. దూడ కొద్దికొద్దిగా బయటికి వస్తోంది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పూర్ణయ్య సిద్ధాంతిగారి ఏకాగ్రత బలపడుతోంది. రాను రానూ ఆయన కళ్లు విశాలం అవుతున్నాయి. దూడ నేలమీద పడినప్పుడు తన బిడ్డకు దెబ్బతగలకుండా ఉండాలని ఆ తల్లి వెనుక కాళ్లను మరింత వంచి నిలబడడానికి ప్రయత్నిస్తోంది. ఆవు యజమాని దాని వీపుపై రాస్తూ ధైర్యం చెపుతున్నాడు.



దూడ పూర్తిగా బయటకు వచ్చింది. లేగాళ్లతో లేచి నుంచోవడానికి ప్రయత్నిస్తోంది. ఆవు దూడను తమకంగా నాకేస్తోంది. దూడ గిట్టలు గిల్లడం ద్వారా దానికి లేచి నుంచుని, తల్లిపొదుగు వద్దకు వెళ్లే సామర్థ్యం కలిగేలా ప్రయత్నిస్తున్నాడు యజమాని.అక్కడికక్కడే వేణ్ణీళ్లు, మడ్డికూడు ఏర్పాటు చేశాడు. ఆవు, దూడలను వేణ్ణీళ్లతో  తోమి, స్నానం చేయిస్తున్నాడు. అప్పుడే తల్లి పొదుగును వెతుక్కుంటూ వెళ్లిపోయింది దూడ.  

‘‘మళ్లీ కోడె దూడేనా? ఈసారైనా పెయ్యనిస్తావని ఎన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా!’’ అంటూ ఆవు, దూడలను నిమురుతూ పరామర్శిస్తున్నాడు యజమాని. దూడతో పాటు యజమాని చేతిని కూడా నాకుతోంది గోవు. జనమంతా ఒక్కరొక్కరుగా అక్కడి నుంచి దూరంగా వెళుతున్నారు.



 అంతసేపూ దూరంగా ఉన్న పూర్ణయ్య సిద్ధాంతిగారు మాత్రం ఆవు దగ్గరకి వెళ్లారు. గోసేవలో తలమునకలుగా ఉన్న యజమాని వద్దకు వెళ్లి, అతని వీపుపై చరిచి, కళ్లలోకి ఆనందంగా చూస్తూ, ‘‘నీ దూడ గురించి ఓ విషయం చెప్పాలయ్యా!’’ అన్నారు పూర్ణయ్యగారు.సిద్ధాంతిగారి వాలకం చూసి, రెండు చేతులూ జోడించాడు యజమాని. ‘‘రేపు ఉదయాన్నే తమ దర్శనం చేసుకుంటానండీ. ఇంటికి తీసికెళ్లడానికి కూడా లేకుండా నడివీధిలో ఆవు ఈనింది కదా! ఇప్పుడు వీటిని ఇంటికి చేర్చాలి’’ అంటూ తన పనిలో పడ్డాడు.  ‘చూడూ! నీ పేరేమిటన్నావ్‌?’’ అడిగారు పూర్ణయ్యగారు వెళ్లబోతూ.



‘‘చలమయ్య అంటారండి’’ చెప్పాడతను.

చీకటిపొద్దు తిరిగింది. అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్లాలనిపించలేదు పూర్ణయ్యగారికి. జరాపహరేశ్వరుని ఆలయానికి చేరుకున్నారు. ఆ శివునితో తన సొదంతా చెప్పుకున్నారు. ఆ పరమేశ్వరుడు తథాస్తు! అని దీవించి, హేలగా నవ్వినట్లు పూర్ణయ్యగారి కళ్లకు గోచరించింది. ఒకప్పుడు జరాసంధుని భక్తికిమెచ్చి వరమిస్తూ పరమేశ్వరుడు హేలగా నవ్విన కారణంగా హేలాపురి నగరం ఏర్పడిందని చెబుతారు. కాలాల తరువాత 9వ శతాబ్దిలో చాళుక్యార్జునునిగా పేరుపొందిన విజయాదిత్యుడు పన్నెండేళ్లపాటు నూట ఎనిమిది యుద్ధాలు జరిపి శత్రు సంహారం చేశాడు.



నిరంతర యుద్ధాలతో ఆ సమయంలో వేంగి మండలం వేడిమంగలంగా ఉండేది. ఎటు చూసినా పీనుగ దిబ్బలు. వాటి నుంచి వ్యాపించే దుర్గంధం వల్ల రోగాల పాలబడిన ప్రజలకు మళ్లీ ఆ స్వామే దిక్కయినాడు. చాళుక్యార్జునుని మనసు మార్చాడు. జరిగిన జనహింసకు ప్రాయశ్చిత్తంగా రాజు నూట ఎనిమిది శివాలయాలు ప్రతిష్ఠించాడు. చాళుక్యార్జునునిలో పరివర్తనకు కారణమైన స్వామి జరాపహరేశ్వరుడు (జర+అపహర+ఈశ్వర స్వామి) అంటే వ్యాధుల నుంచి రక్షించే స్వామిగా కీర్తి గడించాడు. మనోవాక్కాయాలతో చేసే అపరాధాలను మన్నించి సాయుజ్యమిచ్చే జరాపహరేశ్వర స్వామిలో చిరుహాసాన్ని గుర్తించి పూర్ణయ్యగారు ఇంటి ముఖం పట్టారు. మనసులో వృషభేశ్వరుని మనోహర రూపం కదలాడుతుండగా ఆ రాత్రి నిదురన్నమాట మరిచేపోయారు.  మర్నాడు సిద్ధాంతిగారి వద్దకు వస్తానని మాటిచ్చిన చలమయ్య రానేలేదు. మూడోరోజునా రాలేదు. నాలుగోరోజు ఉదయాన్నే సిద్ధాంతిగారు బయలుదేరారు... చలమయ్య ఇల్లు వెదుక్కుంటూ.గుమ్మంలో ప్రత్యక్ష మాహేశ్వరుని చూసి, చలమయ్య ఆదుర్దా పడ్డాడు. వెంటనే తేరుకుని, సభక్తికంగా ఆహ్వానించాడు.



‘‘నీ దూడని గురించి ఒక విషయం చెప్పాలయ్యా!’’ అన్నారు పూర్ణయ్యగారు ముక్కాలిపీటమీద కూర్చుంటూ.‘‘చిత్తం. తమరు ఏదో సెలవిస్తానన్నారు. నన్ను కనబడమనీ ఆదేశించారు. కానీ అదే రాత్రికి మా ఆడదానికి పురిటినొప్పులు మొదలయ్యాయండీ. తెల్లవారుజామున మగబిడ్డను కంది. పంతులుగారూ! పదకొండోరోజు దాకా మీలాంటి పెద్దల్ని చూసేదెలాగా? ఈ సంగతి మీకు కబురైనా పంపించలేకపోయాను. మన్నించండి’’ అన్నాడు చలమయ్య బేలగా.‘‘బిడ్డొచ్చిన వేళా, గొడ్డొచ్చిన వేళా అన్నారు. సాక్షాత్తూ ఆ నందీశ్వరుడు నీ ఇంట్లో వెలిశాడయ్యా! ఇంక నీకు లోటేమిటయ్యా చలమయ్యా!’’ అన్నారు పూర్ణయ్యగారు ఆనందంగా.‘‘పంతులుగారూ! కొంచెం పాలు పుచ్చుకుంటారా?’’ వేడికోలుగా అడిగాడు చలమయ్య.‘‘పాలు కాదు చలమయ్యా! నేను చెప్పేది శ్రద్ధగా విను. నీ ఇంట పుట్టిన నందీశ్వరుడు ఈ సీమను బంగారం చేస్తాడయ్యా! కోరిన వరాలు తీర్చే కామేశ్వరుడవుతాడు. భక్తిగలిగి పూజించే వారికి కొంగు బంగారమవుతాడు.



యోగుల తపస్సు పండించే సిద్ధేశ్వరుడవుతాడు’’ ఆర్తితో చెప్పుకుపోతున్నాడు పూర్ణయ్యగారు. చలమయ్యకు ఆయన ధోరణి గందరగోళంగా ఉంది. ‘‘మా కర్రావు ఇప్పటి వరకూ నాలుగు ఈతలు ఈనిందండీ. అందులో మూడు కోడె దూడలే. అన్నీ సామాన్యమైన ఎడ్లే అయినాయండీ’’ అన్నాడు చేతులు నలుపుకుంటూ చలమయ్య.పూర్ణయ్య సిద్ధాంతిగారి చూపులో క్షణకాలం తీక్షణత తొంగి చూసింది. ‘‘బసవేశ్వరుని ఆవిర్భావం నేను జన్మ చరితార్థం అయ్యేలా చూశానయ్యా! గ్రహగణితం చూశాను. నా లెక్క తప్పదు. దక్షిణాపథాన ద్వాదశాదిత్యుల వలె సుప్రసిద్ధులయ్యే పన్నెండు మంది బసవన్నలలో ఈ నందీశ్వరుడు ఒకడవుతాడు. చరిత్ర గతిలో చిరస్థాయిగా నిలిచిపోయే అవతార పురుషుడాయన. మహోదాత్త లగ్నంలో పుట్టాడు’’ చెప్పారాయన.



‘‘చిత్తం... కానీ’’ అన్నాడు చలమయ్య.

‘‘తెలుసు. సమయం వచ్చేంత వరకూ ఆగాలి. ఆ సమయం వచ్చిననాడు మళ్లీ వస్తాను. అప్పటి వరకూ నా మాట మరిచిపోకు. అలాగని నాకు వాగ్దానం చేయ్‌’’ అన్నాడు పూర్ణయ్యగారు.

చలమయ్య గాభరా పడిపోయాడు. ‘‘ఎంతమాట! మీరన్నట్లే జరగాలి పంతులుగారూ! మీలాంటివారికి ఇవ్వడం కంటే అదృష్టం ఇంకేముంది? మేతకు పడనివ్వండి. ఇరగ మేపేస్తాను. ఎలా తయారు చేస్తానో మీరే చూస్తారుగా’’ అన్నాడు భక్తితో.కాలం గడుస్తోంది.కోడెదూడను యవ్వనం ఆవరించింది. నిలువెల్లా కోడెతనం తాండవిస్తోంది.  చారెడేసి కళ్లచుట్టూ కాటుక దిద్దినట్టు నల్లటిరేఖ కోడెదూడ ముఖానికి పెళ్లికొడుకు ఠీవిని తెచ్చిపెడుతోంది. ఉన్నతమైన మూపురంతో పాటు ఎడమ వైపున అచ్చు గుద్దినట్టు శంఖసుడి అల్లంత దూరానికే కనిపిస్తుంది. పృష్టభాగంలో మహాభోగాలు కట్టబెట్టే పద్మాకార సుడి ఉంది. దాని గిట్టలకు సహజమైన మెరుపు ఉంది.



పుట్టింది మొదలు ఆ కోడె ముకుతాళ్లు ఎరగదు. గద్దింపులు తెలియదు. హద్దు ఆపులెరుగని జాతకం. అది నిజంగానే దళం వేసుకు పుట్టింది. ఆనాటి చిన్నిదూడ ఈనాటికి ఉత్తమ లక్షణాలతో ఎనిమిది అడుగుల ఎల్తైన రాజఠీవి గల వృషభేశ్వరునిగా సంతరించుకుంది.జీవితకాలపు సంపాదనంతా ఈ రోజుకోసమే పోగుచేశారు సిద్ధాంతిగారు. మహోత్సవం జరిపించారు. సర్వ లక్షణాలు కలిగిన గోమాతను భూమాతగా అర్చించి, పెళ్లికూతురిగా అలంకరించారు. చలమయ్య పెంచుకున్న రాజనందిని పరిపోషకుడైన నారాయణునిగా అర్చించి, పెళ్లికొడుకుగా అలంకరించారు.



వైదిక క్రతువులన్నింటిలో మహోత్కృష్టమైనదిగా పేరుపొందిన ‘వృషోత్సర్జన’ అంగరంగ వైభవంగా జరిపించారు. విచ్చేసిన భూసురులందరికీ భూరి సంభావనలు, భారీ సంతర్పణ జరుగుతుందని ముందే ఊరూ నాడూ మారుమోగింది. హేలాపురి నగరం జనసంద్రమైపోయింది. లాంఛనప్రాయమైన వివాహ తంతు ముగిసింది. సంతత స్వర్గలోక నివాస ప్రాప్తికి కలిగించే వృషోత్సర్జన క్రతువు సామాన్య పరిభాషలో ఆంబోతుకు అచ్చుపోయడమంటారు. ఉత్సవం జరిపిన తరువాత ముగింపుగా రాజనందికి విష్ణ్వంశను ఆపాదిస్తూ అచ్చులు పోయించారు. వీధి గుమ్మానికి ముందు రెండు యాగ స్తంభాల మధ్య రాజనందిని నిలబెట్టి వుంచారు. పృష్ట భాగంలో తోకకు రెండువైపులా శంఖు, చక్ర ముద్రలు వేశారు.



అచ్చుముద్రలు ఒంటిపై పడగానే ముల్లోకాలూ దద్దరిల్లేలా రంకె వేస్తూ రాజనంది వీధిలోకి పరుగెత్తింది. వెనుక నుంచి వేదమంత్రాల ఘోష చెవులబడుతుండగా తన జన్మ ధన్యమైందన్నట్లుగా కన్నులు మూసుకుని  చేతులు జోడించారు పూర్ణయ్యగారు.

నాటి నుంచి రాజనంది అసలు కథ ప్రారంభమైంది. నగరంలో దానికి ఎదురులేదు. ఏవేళప్పుడు వీధిలో అడుగు పెట్టినా, వీధిలోని వారంతా భక్తితో ఏదో ఒకటి తెచ్చిపెట్టేవారు. నగరానికి చుట్టుపక్కల పొలాలన్నీ దానివే. ఎక్కడ ఏ చేలో పడి మేసినా, ఎవ్వరూ కొట్టడానికి లేదు. తిట్టడానికి లేదు. సికుమారు లేదా ముకుతాడు వేసి బంధించడానికి అసలే వీల్లేదు.

ఊళ్లో ఆవులన్నీ దాని చుట్టూ తిరిగేవి. ఆలమందలన్నింటిలోనూ రాజనంది ఇచ్ఛావిహారం చేసేది. మిగిలిన ఆంబోతులన్నీ అది వస్తోందంటే హడలి చచ్చేవి. రాజనంది మూత్రం వాసన చూస్తే గొడ్డుటావు కూడా చూడి కట్టేది. రోజుకో మందలో తిరుగుతూ రాజనంది గోకులాన్ని మోహపెట్టేది.



రాజనందికి శనగలు పెడితే పిల్లలు పుడతారని ప్రచారం జరిగింది. బియ్యం పెడితే, కందులు, ఇతర అపరాలు పెడితే, తోటకూర వగైరాలు పెడితే ఒక్కొక్క పెట్టుపోతకు ఒక్కో రకం కోరిక తీరుతుందనే విశ్వాసం ప్రజల్లో ప్రబలింది. ఆనాటికి వీర ‡శైవ, వీర వైష్ణవ మతాల ఉధృతి తగ్గింది. కన్నడనాట బసవ మతం స్థిరపడింది. వేంగినాట వైదిక మతం ప్రవర్తిల్లుతోంది. కాకపోయినా భారతీయ సమాజానికి వృషభ జాతిపై గౌరవానికి చారిత్రకమైన లెక్కలు తీయడం కష్టసాధ్యం.రాజనంది ఎక్కడ వున్నా వెతుక్కుంటూ వచ్చి మరీ దానికి తినబెట్టేవారు ప్రజలు. కోరికలు తీర్చమంటూ మొక్కేవారు. ఇష్టమైతే వాళ్లు తెచ్చిన పదార్థాలు తినేది. లేదంటే చేటలు తొక్కేసి వెళ్లేపోయేది. ఊరి నిండా రాజనంది సంతానమే. సిరలు నాలుగూ సమాంతరంగా ఉండి, ముందరి పొదుగుతో, పాల సముద్రం ఇంట నిలిపే గోమాత చాలామటుకు రాజనంది ప్రసాదమే. పౌరుషానికి ప్రతీకలైన కోడెలెన్నో ఆయన వల్లనే జనించాయి.



ఆ వృషభేశ్వరుని మహత్యం, శక్తి హేలాపురి చుట్టుపట్ల మారుమోగిపోతోంది. రైతులు తమ పÔ]æువులు ఎద కొచ్చాయని తెలియగానే, ఎన్ని మైళ్ల దూరమైనా శ్రమకోర్చి వాటిని హేలాపురి తీసుకొచ్చేవారు. వచ్చిన పని పూర్తికాగానే రాజనందిని వివిధ అలంకారాలతో అర్చించి, దానికి సుష్టుగా తినబెట్టి ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యేవారు. నాణ్యమైన పÔ]æుసంపద వృద్ధి చేయడంలో రాజనంది తన యవ్వన కాలమంతా ధారపోసింది.క్రమంగా దాని వయస్సు పెరుగుతోంది. వయసు ముదిరిన కొద్దీ రాజనందిలో ఎందుకో ఆవేశం పెరుగుతోంది. అల్లంత దూరాన యేటి డొక్కలో ఆలమందలు మేస్తుంటే... ఇవతల రాజనంది ఎవరిపై పరితాపమో పరవళ్లు తొక్కేది.



యేటిగట్లు తెగిపడేలాగా కొమ్ములతో, గిట్టలతో కుసాళించి పారేసేది. ఏరులన్నీ దిశ మార్చుకుని ఒకప్పుడు నగర వీధుల్లోకి ప్రవహించేవి. మరొకప్పుడు నీటి వసతి అందని దెసకు పంటపొలాలకు అందుకునేవి. ఒకప్పుడు రాజనంది చేసిన పని ప్రజలకు ఎంతో లాభించేది. మరొకప్పుడు ఇళ్లూ, వాకిళ్లూ ముంచెత్తి నష్టపరిచేది. హలాయుధంతో యమునా నది గతిని మార్చిన బలరాముని అంశ రాజనందిలో ప్రవేశించినట్లుంది. ఆ ప్రాంతాలలో ఎక్కడా లేని నీటివసతి హేలాపురికి రాజనంది దయవల్ల కలిగింది. మాగాణి పంటలు పెరిగాయి. వేంగినాటికి మహదైశ్వర్యం పట్టింది.  హేలాపురి నగరం చుట్టూ, లోపల కూడా ఏరులతో నిండిపోయిన హేలాపురిని ఏరులూరు అని ప్రజలు పిలవసాగారు. (అదే తరువాత ఏలూరు అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం) హేలాపురి పచ్చదనంతో శోభిస్తోంది. తమ నగరానికి ఇంతటి శోభ తెచ్చిన రాజనంది పట్ల ప్రజల గౌరవాభిమానాలు రెట్టింపు అయ్యాయి.



వందలాది శ్రామికులు రోజులకొద్దీ కష్టపడ్డా చెయ్యలేని పని... యేటి పాయల్ని సరిచేయడం అనేది... కేవలం తన కాలిగిట్టల రాపిడితో, కొమ్ముల కుసాళింపుతో సాధించిన రాజనంది పట్ల ప్రజల్లో ఆరాధనాభావం పెరిగింది.అప్పటిదాకా రాజనంది విశేషాలు వింటూ వచ్చిన పూర్ణయ్యగారు, వయస్సు పండిన ముసలితనంలో కర్రసాయంతో రాజనందిని వెతుక్కుంటూ వచ్చారు. కొంగున కట్టి తెచ్చిన పత్తి విత్తులు, బెల్లం, బియ్యం తినబెట్టి, గంగడోలు దువ్వుతూ, ‘‘బసవేశ్వరా! త్వరలో నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటా అని తరచూ చెపుతున్నాడయ్యా శివయ్య. ఏదో ఒకనాడు ఇద్దరం అక్కడే... కైలాసంలో  కలుసుకుందాం’’ అన్నారు తడి నిండిన కళ్లతో. ఆ రాత్రికే ఆయన శివసాయుజ్యం పొందారు.   



అది క్రీస్తు శకం 1305వ సంవత్సరం. దక్షిణాదిన మాలిక్‌ కాఫర్‌ దండయాత్ర సాగిస్తున్నాడు. అతనితోపాటు యుద్ధ వీరులు, మత గురువులు కూడా వచ్చారు. అలాంటి గురువుల్లో హజరత్‌ పాషా హేలాపురిలో నిలిచిపోయారు.ఎటు చూసినా ఏరులు, ఏ వీధిలో చూసినా స్వేచ్ఛగా తిరిగే ఆవులతో నిండిన ఏలూరు నగర సౌందర్యం పాషా మహాత్ముని మనసు దోచుకుంది. ఇతరులతో ప్రమేయం పెట్టుకోకుండా సకల లోక పాలకుడైన అల్లాహ్‌ స్మరణలో కాలం వెళ్లబుచ్చాలనే నిర్ణయంతో ఉన్నారు అప్పటికే మహాత్ములు.



దొరికిన పళ్లు మాత్రమే తింటూ ధ్యానం సాగించారు. ఆయన తపశ్చర్య నగరంలోని ఒకానొక భార్యాభర్తలకు అద్భుతంగా అనిపించింది. ఆయనకు సేవలు చేయడం ఆరంభించారు. పూర్తి శాకాహారుడయిన హజరత్‌ పాషా మహాత్ములకు బియ్యపు రొట్టె, తోటకూరలతో భోజనం పెట్టేవారు. వారిద్దరికీ తొలిసారి మహమ్మదీయ మతదీక్షను ఇచ్చారు మహాత్ములు.   

క్రమంగా మహాత్ముల గురించి చుట్టు పట్ల తెలియవచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ కోర్కెలతో వచ్చేవారు. నిజానికి అంతమంది ప్రజలను రోజూ కలవడం ఆయన తపస్సుకు భంగంగా తోచేది. అయినా తప్పడం లేదు.



పులిమీద పుట్రలాగా అప్పుడే మరో అసందర్భం వచ్చిపడింది. ప్రతిరోజూ ధ్యానంలో ఉండగా ఆయన ఏకాగ్రతను చెడగొట్టడానికే అన్నట్లుగా రాజనంది మహోగ్రమైన రంకెలు వేసేది. మళ్లీ మళ్లీ రంకెలతో మహాత్ములవారి ధ్యాన ప్రాంతమంతా దద్దరిల్లి పోయేది. ఇలాంటి రంకె వేయడం రాజనందికి నిత్యకృత్యమైనా హజరత్‌ పాషావారికి ఇది తలనొప్పిగా మారింది. ఓ రోజున ఆయన ఓపిక నశించింది. మాయగోవుపై కర్ర విసిరిన గౌతమ మహర్షి పరిస్థితి ఏర్పడింది ఆయనకు. ఏనాడూ దెబ్బపడి ఎరుగని రాజనంది రోషంతో ముందుకు దూకింది. కొమ్ములతో పొడవబోయింది. లాఘవంగా ఆ వేటును తప్పించుకుని పక్కకు ఉరికారు మహాత్ములు. ఓ చేత్తో తోక పట్టుకుని, మరోచేత్తో కొమ్ములను ఒడిసిపట్టి దానిని నిలువరించాలని ప్రయత్నించారు. అది ఆగలేదు.



దూరంగా కత్తి వుంది. అందుకోగలిగితే... ఒక్కసారిగా దాని ఆగడం కట్టిపోయేదే. కానీ హేలాపురిలో అడుగుపెట్టినది మొదలు హజరత్‌ పాషా పూర్తి శాకాహారిగా మారిపోయారు. అటువంటి ఆయన జంతు హింస ఇష్టం లేకపోయింది. ఆ రోజుకి అక్కడి నుంచి తప్పుకుని వెళ్లిపోయారు. పక్షం రోజులు గడిచాయి.ఆ పౌర్ణమి నాటి మధ్యాహ్నం నందీశ్వరుని వీరంగం శృతి మించింది. మహోగ్రంగా చిందులు తొక్కుతున్నాడు. చెలరేగిపోతున్నాడు. అగ్రహారానికి అటు చివరి నుంచి ప్రతాపవిశ్వేశ్వర స్వామి సన్నిధి వరకూ పారుతున్న ఏటిపాయకు గండి కొట్టడం ప్రారంభించాడు. కొమ్ములతో గట్టును కుమ్ముతున్నాడు. గిట్టలతో మట్టిపెళ్లలు ఎగరేస్తున్నాడు. ఆ పాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండాలన్నీ దద్దరిల్లేలా రంకెలు వేస్తున్నాడు.



ఎవ్వరికీ ఆ ప్రళయ నందీశ్వరుని దగ్గరకు వెళ్లడానికి ధైర్యం చాలడం లేదు. కానీ ఆ గట్టు తెగితే అగ్రహారం మొత్తం మునిగిపోవడం ఖాయం. కొంతమంది నందీశ్వరుని శాంతించమంటూ హారతులు పడుతున్నారు. మరికొందరు మూటాముల్లె సర్దుకుని ప్రయాణమైపోవడానికి సిద్ధపడుతున్నారు. పౌరుల ఆక్రందనలు, నందీశ్వరుని రంకెలతో ఎటు చూసినా కల్లోలంగా ఉంది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో చేతిలో పెద్ద తాడుతో కాలపాశంతో నిలిచిన యమునిలా హజరత్‌ పాషా మహాత్ములు రాజనంది ఎదురుగా నిలబడ్డాడు. నంది మెడలో బిగించడానికి వీలుగా తాడును ఓ చివర గుండ్రంగా కట్టి పట్టుకుని గిరగిర తిప్పుతున్నాడు. కొన్ని ప్రయత్నాల తర్వాత మెడకు బంధం పడింది.



ప్రజలంతా ‘హరహర మహాదేవ! బసవేశ్వర పాహి పాహి’ అంటూ బిగ్గరగా అరిచారు. రాజనందితో మహాత్ముని పోరాటం మొదలైంది. ఈసారి వీధుల వెంట పరుగెత్తడం మొదలుపెట్టింది రాజనంది. తాడుతో సహా మహాత్ముల వారిని ఈడ్చుకుపోతోందది. ఒకచోట నిలువదొక్కుకున్న మహాత్ముడు రాజనందిపైకి కుప్పించి ఎగిరాడు. అదను తప్పడంతో మూపురం ఫెళ్లున తగిలి వెల్లకిలా పడ్డాడు. నందీశ్వరుడు పరుగు ఆపలేదు. నందితో సమానంగా తానూ పరుగెడుతూ, ముందరి కాళ్లకు బంధం వేయడానికి ప్రయత్నించాడు. కొద్దిసేపటికి రాజనంది వేగం తగ్గింది. అయినా నడక ఆపలేదు.



చివరకు జరాపహరేశ్వరుని ఆలయం ముందుకు వచ్చేసరికి రాజనంది నడక మందగించింది. స్వామి కళ్లబడగానే అరమోడ్పు కన్నులతో నిశ్చలంగా నిలబడిపోయిందది. ఒకనాడు వేంగి ప్రజలను రోగాల నుంచి రక్షించి జరాపహరేశ్వరునిగా పేరుపొందిన స్వామి ఆయన. అయిదు వందల ఏళ్ల తరువాత రాజనంది వల్ల ఏర్పడబోయిన జలప్రళయాన్ని అడ్డుకుని జలాపహరేశ్వరస్వామి కాబోయే అద్భుత సన్నివేశం అప్పుడు ఆవిష్కృతమైంది.  

అకస్మాత్తుగా రాజనంది నిశ్చలంగా నిలబడిపోవడం సహజం అని మహాత్ముడు సరిపెట్టుకున్నాడు. బంధనాలను మరింత దృఢంగా బిగించాడు. ఏ మాతం ప్రతిఘటించకుండానే రాజనంది శివునిపై దృష్టి నిలిపి కూర్చుంది.



 ఎడమ కాలిని నిలబెట్టి వుంచి, మిగిలిన కాళ్లన్నీ మడిచి కళ్లతో శివునికి వినమ్ర నమస్కారం చేస్తోంది. మహాత్ముడు తాను బిగించిన తాళ్లన్నింటినీ రాజనంది వీపుపై ముడివేశాడు. అంగీలో దాచిపెట్టిన పంచలోహ కడియాన్ని బయటికి తీశాడు. రాజనంది ఎడమకాలిని జాగ్రత్తగా పైకెత్తి పట్టుకున్నాడు. ఆ కాలికి మహిమాన్వితమైన కడియాన్ని తొడిగాడు. దూరంగా కూర్చుని ధ్యానంలో మునిగిపోయాడు. అప్పటివరకూ అస్థిమాంసాలతో నేలపై నడయాడిన రాజనంది పÔ]æుజన్మ నుంచి విముక్తమైంది. శివ సాయుజ్య పదవితో జన్మ సార్ధకం చేసుకుంది. చరిత్రలో చిరంజీవిగా మిగిలిపోయింది. కడియం తొడిగిన క్షణంలోనే అది జీవ లక్షణాన్ని కోల్పోయింది. అచ్చంగా శిలగా మారిపోయింది... సర్వాలంకారాలతో, కట్టుతాళ్లతో సహా!



పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలోని జరాపహరేశ్వరస్వామి ఆలయంలో రాజనందిని దర్శించవచ్చు. నంది కాలి కడియాన్ని చేతితో పట్టుకుని తిప్పవచ్చు. ఆలయానికి పక్కనే హజరత్‌ పాషా షహీద్‌ మహాత్ముల దర్గాను అసఫ్‌జాహీలు నిర్మించారు. దర్గాలో ఉరుసు ఉత్సవాలు జరిగేటప్పుడు మహమ్మదీయ సోదరులు రాజనందిని సందర్శిస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన రాజనంది కాలి కడియం 28/07/2012న అపహరణకు గురైంది. రాజనంది కాలిని కోసి కడియాన్ని దొంగిలించగా ఆ కాలి నుంచి రక్తం స్రవించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విరిగిన కాలికి అతుకుపెట్టారు. మరో కడియాన్ని అమర్చారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top