మనసు చిరునవ్వు

మనసు చిరునవ్వు


 సార్! అర్చనగారు వస్తున్నారు సార్. మా పల్స్ హార్ట్ మేనేజర్ షాజహాన్ కొంపలు మునిగినట్టు అరుస్తూ వచ్చాడు. నా గుండెల్లో మెల్లగా దడ మొదలయింది. అసలే సోమవారం. చాలామంది రోగులు, రుగ్మత లేకపొయినా తమ గుండె బాగుందని తెలుసుకొవాలనుకునేవారూ, పెద్ద పెద్ద సంచుల నిండా రిపోర్టులన్నీ పట్టుకుని ఉన్న పెద్ద వయస్కులూ, బయట వేచి ఉన్నారు. ఈ సమయంలో అర్చనగారొచ్చారంటే ఇక నా పని అయిపోయినట్లే అని నా గుండె గబగబా హెచ్చరిస్తోంది. అయినా అప్పటికే పరిస్థితి చేయి దాటింది. అర్చనగారు పట్టాలు తప్పిన రైలుబండిలా నా గదిలోకి చొచ్చుకొని వచ్చారు. అపాయింట్‌మెంట్ అనే పదం ఆవిడ నిఘంటువులో లేనేలేదు.

 

 ‘‘డాక్టర్ గారూ, డాక్టర్ గారూ! నా గుండెలో నొప్పి వస్తోంది. చాలా నొప్పిగా ఉందండీ! మీరు త్వరగా మందులు రాసివ్వండీ! అర్చనగారికి యాభై ఏళ్లు. ప్రేమించే భర్తా, ఇద్దరు బంగారాల్లాంటి పిల్లలు. ఆమెకి రెండు సంవత్సరాల కిందటే అన్ని పరీక్షలూ చేసి గుండె జబ్బు ఏ కోశానా లేదని తేల్చాశాన్నేను. ఆమె నొప్పి తగ్గించడానికి భగీరథ ప్రయత్నాలే చేశాను. భారతదేశంలో దొరికే అన్ని మందులూ, కొన్ని బయట దేశాల్లోనే దొరికే మందులు కూడా వాడి చూశాను. ఫలితం వంద శాతం. కానీ వంద నిముషాలే. మళ్లీ షరా మామూలే. నేను సరిగ్గా జబ్బు కనిపెట్టలేకపోతున్నానేమో అని ఆమెను ఫిజీషియన్, గాస్ట్రో ఎంటెరాలజిస్ట్, సైకాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఆ ఇస్ట్ ఈ ఇస్ట్...

 

 అందరి దగ్గరకూ పంపించాను. అయినా క్రిస్ గేల్ కొట్టిన బంతిలా అర్చనగారు మళ్లీ వేగంగా నా దగ్గరకే తిరిగి వస్తారు. నా అమ్ములపొదిలో ఇక చికిత్సాస్త్రాలు ఏమీ మిగలలేదు. అందుకే నా గుండెలో సన్నటి దడ, మనస్సులో నిరాశ కూడా!‘‘అర్చన గారూ! ముందొక ఈసీజీ చేయించండమ్మా!’’ నా పరిధిలో మొదటి ప్రయత్నం చేశాను. అర్చనగారు ఇంద్రజాలికుడు తన టోపీలోంచి కుందేలుని తీసినట్టు తన హేండ్‌బ్యాగ్ నుండి ఈసీజీ బయటకు తీశారు. ‘‘ఇప్పుడే చేయించుకుని వస్తున్నా డాక్టర్ గారూ’’! నిరాసక్తతతో ఆ ఈసీజీని నిశితంగా పరిశీలించాను నేను.

 

  రెండేళ్లలో తీసిన రెండు వందల ఈసీజీల్లానే శుభ్రంగా, కడిగిన ముత్యంలా, మనది కాని కోహినూర్ వజ్రంలా ఉందా ఈసీజీ. ‘మరి ఏక్స్....’ నేను పూర్తి చేసే లోపలే అర్చనగారు తన టోపీ, క్షమించాలి, బ్యాగ్ లో చెయి పెట్టారు. ఎక్స్ రే బయటకు వచ్చింది. అదీ నార్మలే.  ‘‘రెండూ బాగానే ఉన్నాయమ్మా! మందులు రాసిస్తాను వాడండి’’ పెద్దనవ్వుతో చెప్పాన్నేను. నవ్వు సరిగా అతకలేదు. అర్చనగారి గుండెజబ్బు పట్ల అనుమానానికి అంతే లేదు.

 

 ‘‘డాక్టర్! నా గుండె బాగుందా?’’

 ‘‘బాగు....’’

 ‘‘మరెందుకు నొప్పి వస్తుంది? అదెందుకు తగ్గట్లేదు?’’

 నా వాక్యం సగంలోనే తర్వాతి రెండు ప్రశ్నలూ దూసుకు వస్తారుు. ఆ విషయం నాకు తెలుసు. అరుునా యథాశక్తి సమాధానం ముగించడానికి ప్రయత్నం చేస్తాను.

 ‘‘కొంచెం గ్యాస్....’’

 ‘‘మీరు గ్యాస్ బిళ్లలు ఇచ్చారుగా! ఒక్కో బిళ్లా పన్నెండు రూపాయలు.’’

 ‘‘ఇచ్చాను....’’

 ‘‘మరి నొప్పెందుకు వస్తుంది? రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా?’

 ‘‘ప్రయత్నం.....’’

 ‘‘మొన్న కుడి పక్కన వచ్చిందిగా, ఇప్పుడు ఎడమ పక్కన వస్తుందెందుకు? ఇది వేరే నొప్పా?’’

 ‘‘మనమన్ని పరీక్షలూ చే.......’’

 ‘‘ఇంకేమైనా చెయ్యలా? ఆయుర్వేదం ఏమైనా ప్రయత్నించనా?’’

 ‘‘తప్పేం...’’

 ‘అరుునా మీ కన్నా మంచి డాక్టర్ ఎవరు? మీవల్ల తగ్గనిది ఎవరివల్లైనా తగ్గుతుందా? రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా?’

 ‘‘ప్రయత్నం చే... ’’

 ‘‘మరెందుకు తగ్గట్లేదు డాక్టర్?’’

 

 ఆమె నొప్పెందుకు తగ్గడం లేదో నాకప్పుడు అర్థం కాలేదు. కానీ ఆ క్షణంలో, నా జుట్టెందుకు ఊడుతుందో నాకర్థమైంది. రామారావుగారి మీద క్షిపణి దాడి చేద్దామనిపించింది. రామారావుగారు మా నాన్నగారికి సన్నిహితులు. ఆయనే అర్చనగారనే పులిని నేననే జింక మీదకు నిర్దాక్షిణ్యంగా వదిలారు. ‘ఆత్మీయతతో గుండె వైద్యం’ అన్నందుకు మరి ఇవి తప్పవేమో! అప్పుడే ఆపద్బాంధవుడిలా అర్చనగారి భర్త లోపలికి వచ్చారు. అయన్ని చూడగానే నా మనసులో కొంత ప్రశాంతత. ఆయన కష్టం తలచుకుంటే నా పది నిముషాల కష్టం చాలా చిన్నదనిపించింది. అయితే ఆయన రాగానే, అప్పటిదాకా నన్నేడిపిస్తున్న అర్చనగారి మొహంలో దాగున్న ఒక చిలిపి నవ్వు మాయమైంది.

 

 కొంచెం కోపంగా, కొంచెం గంభీరంగా, మరికొంచెం నిర్ణయాత్మకతను జోడించి గట్టిగా చెప్పాను నేను. ‘‘చూడండి లక్ష్మణ్‌గారూ! అర్చనగారికి ఏ జబ్బూ లేదు. అన్ని పరీక్షలూ నార్మల్‌గా ఉన్నారుు. ఇలా మాటిమాటికీ నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. మందులు రాశాను. వాడుకోండి. ఆమెకు విశ్రాంతి కూడా అవసరం లేదు. శుభ్రంగా అన్ని పనులూ చేసుకోవచ్చు’’ నా గొంతులో కాఠిన్యం కొత్తగా అనిపించింది. ‘‘తగ్గిపోతుందిలే అర్చనా! నా మాట విను’’ దగ్గరుండి భుజం మీద చెయి వేసి బయటకు తీసుకెళ్లారు లక్ష్మణ్‌గారు. ఊపిరి పీల్చుకున్నాను నేను. నావైపు బాధగా చూస్తూ వెళ్లిపోయారు అర్చనగారు.

   

 అది ఆదివారం. ఆ రోజు నాకు విశ్రాంతి అనివార్యం. ఇంట్లోనే ఉన్నాను. పిల్లలతో కాస్త సమయం గడిపేందుకు నాకు అద్భుతమైన అవకాశం. ఆదివారాలు కూడా పిల్లలకు కనపడకపోతే నన్ను పూర్తిగా మర్చిపోతారేమోనని ఒక భయం. అందుకే ఆదివారాలను భక్తితో, భయంతో ఇంటికే సమర్పిస్తాను. అయితే ఆ ఆదివారం మా రామారావంకుల్ పొద్దున్నే ఇంటికి వచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉండే రామారావుగారు ఒకప్పుడు మా నాన్నగారికి రూమ్ మేట్. నన్ను ఏ విషయంలోనైనా నిలదీసి అడిగే చనువుంది.

 

 ఆ ఆదివారం రామారావుగారు కొంత ముభావంగా ఉన్నారు. ఒక అరగంట యోగక్షేమాలు మాట్లాడాక విషయానికొచ్చారు. ‘‘ఏరా! అర్చనగారని నీకు పేషంట్ని పంపించాను. మళ్లీ రావద్దన్నావంట?’నాకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఆమెను భరించడం నావల్ల కావడం లేదు అంకుల్. ఆమెకు ఎటువంటి గుండె జబ్బూ లేదు. ఊరికే నా దగ్గరకు వచ్చి సమయమంతా వృథా చేస్తుంది. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగి నా సహనాన్ని థర్మామీటర్‌తో పరిశీలిస్తుంది. నిజంగా చెప్తున్నాను. ఆమె వస్తుందంటేనే నాకు భయమేస్తుంది. ఆమె నుండి నాకు విముక్తి ఎప్పుడు లభిస్తుందా అని చూస్తున్నాను.

 

 రామారావుగారు బాధగా మొహం పెట్టారు. ‘‘నీ నుండి ఇలాంటి ప్రవర్తనను నేనెప్పుడూ ఆశించలేదురా. ఆత్మీయతతో పేషంట్లను చూస్తావనుకున్నాను గానీ, ఆశతో వచ్చినవారిని నిరాశ పరచి పంపిస్తున్నావనుకొలేదు. అసలు అర్చనగారి సమస్య నీకు అర్థం కాలేదు. అర్థం చేసుకునేందుకు నీవు ప్రయత్నించలేదు. పైగా నీ చేతగానితనానికి ఆమెను కారణంగా చూపెడుతున్నావా?

 

 నా కోపం కట్టలు తెంచుకుంది. ఏదో అనబోయాను. రామారావుగారు ఒక చెయ్యెత్తి నన్నాపారు. ‘‘నన్ను చెప్పనీ అసలు సమస్య. ఎప్పుడూ కోపంగా కనిపించే ఆమెకు మరొక వైపుంది. శ్రీరామచంద్రుడిలా కనపడే వాళ్లాయన అంత మంచివాడేం కాదు. ఇంట్లోనే స్నేహితులందరికీ రోజూ విందులూ వినోదాలు. తాగి చిందులెయ్యడం. ఆ స్నేహితులందరికీ అర్చనగారు వండి వార్చటం. ఇద్దరు పిల్లలు. అమ్మారుు పెద్దది. బాబు చిన్నవాడు. వాడికి మస్కులార్ డిస్ట్రొఫీ అనే జబ్బు ఉంది. ఆ జబ్బుకి మందులు లేవట. మంచంలోనే ఉంటాడు.

 

 ఎప్పటి వరకు బతుకుతాడో తెలియదన్నారు డాక్టర్లు. తనెంతగానో ప్రేమించే బాబు తన కన్నా ముందే చనిపోతాడన్న బాధ, ఏ మాత్రమూ పట్టించుకోని భర్త, ఈ రెంటి మధ్యలో సతమతమై నలిగి పోయేదామె. మొదటిసారి జీవితంలో ఒక వ్యక్తి తన బాధను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని నీ దగ్గరకి వచ్చిన తరువాతే చెప్పింది. నీ క్లినిక్‌లో గడిపిన ఆ కొన్ని నిముషాల కోసం నెలంతా ఎదురు చూసేది. నిన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టినా మరొక నెలవరకూ తన నరకాన్ని భరించే శక్తిని నీ దగ్గర నుండి మూట కట్టుకునేది. ఆమెకు గుండె జబ్బు లేదని ఆమెకూ తెలుసు. అయితే తెలిసో తెలియకో నీ దగ్గరే కొంత స్వాంతన ఆమెకు లభించేది.

 

  నువ్వు రెండు రోజులు రెస్ట్ తీసుకోమంటే ఆవిడకు అది అద్భుతమైన అవకాశం. ఆ మాట కోసమే అన్ని ప్రశ్నలు. నీ నుంచి సానుభూతి ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. కేవలం మాట సాయం మాత్రమే కావాలనుకుంది. నువ్వేమో....’ వాక్యాన్ని మధ్యలోనే ఆపేశారు రామారావుగారు. నా కాళ్ల కింద భూమి గిర్రున తిరిగినట్లరుుంది నాకు. ఎప్పుడూ చలాకీగా, ఇతరులని ఏడిపించేటట్లు కనపడే అర్చనగారి వెనుక ఇంత కథ ఉందా! ఎన్ని కష్టాలని ఎంత బాగా దాయగలిగింది? అయినా నాకామె కోపం ఎందుకో అప్పుడే అర్థం అయింది. ఆమెకి ఛాతీ నొప్పి తగ్గించలేకపోయానన్న చిరాకు వల్ల ఆమెపై వ్యతిరేకత పెంచుకుంటూ పోయానే తప్ప నా దగ్గరకు రావడమే ఆవిడ చికిత్స అని గమనించలేకపోయాను.

 

 ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాను. నేను నోరు తెరిచి ఏదో మాట్లాడబోయాను. గొంతు పెగల్లేదు. రామారావుగారు నావైపు జాలిగా చూశారు. ‘‘ఈ విషయం నీకు చెబుదామనుకోలేదు. అయితే చెప్పక తప్పని పరిస్థితి. మొన్న నీ దగ్గర నుండి వెళ్లిన రాత్రే అర్చనగారు విషం తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. అది తప్పే. కానీ ఆమె ఇప్పుడు చావు బతుకులలో ఉంది. ఎవరినైనా బతికిస్తామని చెప్పే అతిపెద్ద ఆస్పత్రిలోనే ఆమె బతకటం కష్టమని చెప్తున్నారు. మంచి మనిషిరా ఆమె. కనపడేదంతా నిజం కాదురా!’’ గద్గగ స్వరంతో అన్నారు రామారావుగారు.

 ఒక్కసారిగా నా ఊపిరితిత్తుల నుండి ప్రాణవాయువు మాయమైనట్లనిపించింది. గుండెల్లో భరించరాని బాధ. ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి నేను పూర్తి కారణం కాకపొవచ్చు. కానీ.. నేను కూడా ఒక కారణమే. తట్టుకోలేకపోయాను. నోట్లోంచి మాట రాలేదు.

 

 వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరాను. దారంతా ఒకటే ఆలోచనలు. ఆవిడ బతికి బయటపడితే బాగుండునని పదే పదే అనుకున్నాను. ఒక రోగి పూర్తి వివరాలు తెలుసుకోలేనంత బిజీగా ఉండడం వ్యర్థం అనిపించింది. ఆమె నా నుండి ఏమీ ఆశించలేదు. నెలకు ఒక్క ఐదు నిముషాలు ప్రశాంతంగా ఆత్మీయతతో గడపాలని కోరుకుందంతే. ఎప్పుడూ రోగులతో నవ్వుతూ ఉండే నేను... ఆమె ప్రవర్తన వెనకున్న బాధను గమనించలేకపోయాను. ఆమె వ్యాధి నిర్ధారణలో నిజంగానే పూర్తిగా ఓడిపోయాను నేను.      

 

 ఆసుపత్రి చేరుకోగానే పరిగెత్తుకుంటూ ఐసీయూకి చేరుకున్నాను. నాలుగవ నంబర్ బెడ్‌లో అచేతనంగా ఉన్నారు అర్చనగారు. నెమ్మదిగా దగ్గరకు వెళ్లాను. మానిటర్‌లో ఉన్న సంఖ్యలన్నిటినీ పరీక్షగా చూశాను. అర్చనగారి ఆరోగ్యం మెరుగ్గానే ఉందనిపించింది. ‘‘అర్చనగారూ!’’ చిన్నగా పిలిచాను. కళ్లు తెరిచారావిడ. నన్ను చూడగానే ముఖంలో ఒక ఆనందం. ఆమె చేతిని పట్టుకున్నాను. నా కళ్లలో మెదులుతున్న చిన్న చెమ్మను యధాలాపంగానే గమనించిందావిడ. ‘‘నన్ను క్షమించాలి డాక్టర్ గారు!’’ అంది. కంట్లో లేని నలకని తుడుచుకోలేక తప్పలేదు నాకు. ‘రామారావుగారు నాకంతా చెప్పారు.

 

  క్షమించాల్సింది నేను కాదు మీరు’’ గొంతు ఎలాగో పనిచేసింది. ‘‘మీరేం అనుకోకపోతే నేనిక మీ దగ్గరకు రాలేను’’ అర్చనగారు మెల్లగా అన్నారు. నా సానుభూతి తనకు అఖ్ఖర్లేకపోవటమే కాదు. తను భరించలేదన్నమాట. అర్థమైనట్లు తలూపాను నేను. ఇక ఎక్కువ సేపు అక్కడ ఉండలేకపోయాను. వెనక్కు తిరిగి బయలుదేరాను. అప్పుడే అక్కడకు ఆమె ఫిజిషియన్ వచ్చారు. అర్చనగారు అడుగుతున్నారు. నాకు లీలగా వినిపిస్తోంది. ‘‘డాక్టర్! నాకేమైంది?’’ ఫిజిషియన్ ఏమన్నారో నాకు వినబడలేదు. అర్చనగారి బాణాల్లాంటి ప్రశ్నలు వినబడుతూనే  ఉన్నారుు. నా మనసులో ఒక చిరునవ్వు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top