ముందుచూపుంటే మేలు!

ముందుచూపుంటే మేలు!


ఆత్మబంధువు

మిత్ర, మైత్రి ఆనంద్‌తో కలిసి టీవీ చూస్తున్నారు. ‘‘మీ నాన్నకు మీరు తోడు చేరారా?  వెళ్లి చదువుకోండి’’ అని అరిచింది రేఖ.‘‘పర్లేదులేవోయ్, కాసేపు చూడనియ్’’ అన్నాడు ఆనంద్.‘‘మీకంటే పనీపాటా లేదు. వాళ్లను కూడా చెడకొడతారెందుకు?’’ అంది చిరుకోపంగా.‘‘ఔనోయ్, నాకేం పనీపాటా లేదు. నా పిల్లలకు ఇప్పుడేం పరీక్షలు లేవు. అందుకే చూస్తున్నాం. తప్పేంటి?’’ ‘‘కదా నాన్నా’’ అంటూ పిల్లలిద్దరూ వంత పాడారు. ‘‘కావాలంటే మీరు చూడండి. వాళ్లను చెడగొట్టమాకండి’’ అని గద్దించింది రేఖ. ‘‘ప్లీజ్ మమ్మీ... కార్టూన్ చానలేగా. పైగా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా లేవు’’ అంటూ బతిమలాడారు పిల్లలు.



‘‘టీవీలో ఏ రోజు ఎపిసోడ్ ఆ రోజు చూసినట్లే, క్లాసులో చెప్పిన పాఠాలు ఏ రోజువి ఆ రోజే చదువుకుంటే బావుం టుంది.. లేవండి’’ అంటూ ఇద్దరినీ టీవీ ముందు నుంచి లేపేసింది. వాళ్లతో కాసేపు మాట్లాడి చక్కగా చదువుకునేలా చేసింది.ఊర్నుంచి రేఖ అమ్మానాన్న వచ్చారు. వాళ్లని అల్లుకుపోయారు మిత్ర, మైత్రి. ‘‘ఎలా ఉన్నార్రా?’’ అంటూ ముద్దు చేశారిద్దరూ. ఇంతలో ఆనంద్ వచ్చాడు. అత్తా మామల యోగక్షేమాలు కనుక్కున్నాడు.  ‘‘రాక రాక వచ్చారు. నాల్రోజులుండి సిటీ అంతా చూసి వెళ్లండి’’ అని చెప్పాడు. ‘‘హాయ్ హాయ్.. అయితే అమ్మమ్మా, తాతయ్యలతో మేమూ వెళ్తాం. దగ్గరుండి అన్నీ చూపిస్తాం’’ అన్నారు పిల్లలిద్దరూ.



‘‘మరి మీ స్కూల్?’’ అడిగాడు ఆనంద్. ‘పర్లేదులే బాబూ.. రెండ్రోజులేగా. వాళ్లూ సంతోషిస్తారు’’ అన్నాడు రేఖ తండ్రి ఈశ్వర్. తర్వాత రెండు మూడు రోజులూ పిల్లలు అమ్మమ్మ, తాతయ్యలతో హైదరాబాద్ సిటీ అంతా తిరిగారు. ఆ తర్వాత మరో రెండ్రోజులు బంధువుల ఇళ్లకు. వారం రోజులు మనుమడూ, మనమరాలితో సరదాగా గడిపాక ఆనందంగా ఊరెళ్లారు. ‘‘రేఖా.. రేఖా...’’ బాధగా పిలిచింది రత్నమాంబ. ఆవిడ గొంతులో తేడాను గమనించి పరుగున వచ్చింది రేఖ. రత్నమాంబ గుండె పట్టుకుని పడిపోయింది. రేఖ గాభరా పడి పోయింది. ఆంబులెన్స్‌కు, ఆనంద్‌కు ఫోన్‌చేసింది. 108 వచ్చి రత్నమాంబను ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆనంద్ కూడా వచ్చేశాడు. రత్నమాంబకు గుండెపోటు వచ్చింది, ఆపరేషన్ చేశారు. రేఖ, ఆనంద్‌లకు హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరి పోయింది. పిల్లల గురించి పట్టించు కోవడం సాధ్యం కాలేదు.



 రోజూ ఉదయం వాళ్లకు ఏదో క్యారేజీ పెట్టి పంపించామా, రాత్రి వండి పెట్టామా అన్నట్లుగా తయా రైంది వాతావరణం. నాన్నమ్మ అనా రోగ్యం, అమ్మానాన్నల ఆందోళన పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నెల రోజులకు రత్నమాంబ ఆరోగ్యం కుదుటపడింది. ఇంటికి తీసు కొచ్చారు. అయినా ఆమెను శ్రద్ధగా చూసుకోవాలి. మరో నెలరోజులు అలా గడిచిపోయాయి. ఇంతలో పిల్లలకు పరీక్షలు వచ్చేశాయి. అయినా వాళ్ల దగ్గర కూర్చుని చదివించేంత తీరిక లేకపోయింది రేఖకు. వాళ్లే చదువుకుని పరీక్షలు రాసి వచ్చారు. వారం రోజులకు రిజల్ట్స్ వచ్చాయి. ఆశ్చర్యం... ఇద్దరూ క్లాస్ ఫస్ట్ వచ్చారు. అదెలా సాధ్యమైందో అర్థం కాలేదు ఆనంద్‌కు.



‘‘రేఖా.. నువ్వు చదివించకపోయినా నా పిల్లలు ఫస్ట్ వచ్చారు చూశావా?’’ అన్నాడు. ‘నేను చదివించకుండానే వచ్చారు మరి’’ అంది రేఖ.‘నువ్వెప్పుడు చదివించావోయ్?’’‘‘వాళ్లనే అడగండి.’’పిల్లల్ని అడిగాడు ఆనంద్. ‘‘అమ్మమ్మ తాతయ్య రాకముందే అన్నీ చదిశాం నాన్నా. ఇప్పుడు జస్ట్ రివైజ్ చేసుకున్నా మంతే’’ అని చెప్పారు మిత్ర, మైత్రి.‘‘నీకు చాలా ముందు చూపుం దోయ్!’’ అంటూ రేఖను ప్రశంసించాడు.‘‘ముందు చూపని కాదు సార్. ఏ రోజెలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి. తప్పకుండా చేయాల్సిన పనులు కాస్తంత ముందుగా చేసుకుంటే ఆ తర్వాత కుదరకపోయినా ప్రాబ్లమ్ ఉండదనీ.’’‘‘నేను చెప్పేదీ అదేనోయ్!’’ అన్నాడు ఆనంద్ నవ్వుతూ.

- డా విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top