ధీర... ధీర... ధీర... మనసాగ లేదురా!

ధీర... ధీర... ధీర... మనసాగ లేదురా!


శివాజీ, తానాజీ అడవి దారిలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా వాళ్ళపై మొఘలాయి సైన్యం దాడి చేసింది. కొంచెం దగ్గర్లోనే సింహ్‌గఢ్ కోట. అక్కడకు వెళ్లగలిగితే ఫిరంగులతో సైన్యాన్ని పేల్చిపారేయొచ్చు. అందుకే తానాజీ ఒంటరిగా సైన్యాన్ని ఎదుర్కొంటూ, శివాజీని కోటలోకి పంపించాడు. ఇక్కడ తానాజీ ‘ఒకటీ... రెండూ... మూడు’ అని లెక్కపెడుతూ, శత్రువుల్ని వరుసపెట్టి నరికేసి, తానూ చనిపోయాడు. అప్పుడు శివాజీ వచ్చి, ‘గఢ్ మిల్‌గయా, మగర్ సింహ్ చలాగయా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఇదో మరాఠీ సినిమా. చూసి థ్రిల్లయిపోయాడు విజయేంద్రప్రసాద్. తానాజీ పాత్ర ఆయనను చాలాకాలం వెంటాడుతూనే ఉంది. తానాజీ లాంటి వీరుడు మళ్లీ పుడితే?

 

విజయేంద్ర ప్రసాద్ మైండ్‌లో కథ పురుడు పోసుకుంటోంది. సూపర్‌స్టార్ కృష్ణ హీరోగా సాగర్ దర్శకత్వంలో ‘జగదేకవీరుడు’ సినిమా. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ ఇవ్వాలి. కొడుకు రాజమౌళి స్టోరీ అసిస్టెంట్. ఈ కథ చేస్తుంటే అనుక్షణం తానాజీ గుర్తొస్తున్నాడు. ఓ రాజమాత. ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఓ బాడీగార్డ్. రాజమాతపై ఓ వందమంది యోధులు ఎటాక్ చేస్తే, ఎదురొడ్డి పోరాడి, అసువులు బాశాడు బాడీగార్డ్. మళ్లీ 400 ఏళ్ల తర్వాత పుట్టాడు. రాజమాత కూడా మళ్లీ పుట్టింది. మేధా పాట్కర్ లాంటి సోషల్ వర్కర్‌లా ఎదిగిన ఆమె ముఖ్యమంత్రి కావడం కోసం బాడీగార్డ్ ఎంతో పోరాడి, ఆమె లక్ష్యాన్ని నెరవేరుస్తాడు.క్లుప్తంగా ఇదీ కథ. దర్శక నిర్మాతలకు నచ్చలేదు. దాంతో ఇంకో రైటర్ ఎంటర య్యాడు. ఇక్కడ రాజమౌళిని మాత్రం ఈ కథ హాంట్ చేస్తూనే ఉంది.

    

చిరంజీవి ఇల్లు - అక్కడ్నుంచీ చూస్తే హైదరాబాద్ మొత్తం కనిపిస్తోంది. చిరంజీవి, అల్లు అరవింద్, రామ్‌చరణ్, రాజమౌళి... నలుగురే కూర్చుని ఉన్నారు. ‘‘సారీ సర్! చరణ్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేయలేను. మీ అబ్బాయి ఫస్ట్ సినిమా అంటే ఎక్స్‌పెక్టేషన్స్ హై లెవెల్‌లో ఉంటాయి. నేను ఎంతవరకు నెరవేర్చ గలనో చెప్పలేను. సెకండ్ సినిమా అయితే ఓకే’’ అని చెప్పేశాడు రాజమౌళి. కట్ చేస్తే - రామ్ చరణ్ ఫస్ట్ సినిమా ‘చిరుత’ పూరి జగన్నాథ్ డెరైక్షన్‌లో తయారైంది. హండ్రడ్ డేస్ ఫిల్మ్. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఇప్పుడు చరణ్ సెకండ్ ఫిల్మ్ రాజమౌళి చేతిలో ఉంది.

    

చిరంజీవి ఇల్లు... సేమ్ ఫోర్ మెంబర్స్. రాజమౌళి కాన్సెప్ట్ చెబుతున్నాడు. వందమంది యోధుల్ని ఓ మగధీరుడు ఎంత వీరోచితంగా తెగ నరుకుతున్నాడో కళ్లకు కట్టినట్టుగా చెబుతున్నాడు. చిరంజీవి అదిరిపోయాడు. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన రాజమౌళితో ఒకటే చెప్పారు. ‘‘చిరంజీవి నాకెన్నో హిట్స్ ఇచ్చారు. ఆయనకో అద్భుతమైన కానుక ఇవ్వాలి. అలాగే నా మేనల్లుడు... హిస్టరీలో నిలిచిపోవాలి. ఎంత ఖర్చయినా ఫర్లేదు. నీ ఇష్టం’’

 

రాజమౌళికి ఫుల్ ఫ్రీడమ్ గ్రాంటెడ్.

రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చున్నారు. ‘‘పదిహేనేళ్ల క్రితం కథ అది. నీకింకా గుర్తుందా?’’ ఆసక్తిగా అడిగారు విజయేంద్ర ప్రసాద్.

 

‘‘అవును నాన్నా! ఎప్పటికైనా ఆ బాడీగార్డ్ కథతో సినిమా చేద్దామని కాచుకుని కూర్చున్నా. ఇప్పుడు టైమ్ కుదిరింది. చరణ్ హార్స్ రైడింగ్ స్పెషలిస్టు. తనకు ఇలాంటి కథే కరెక్టు’’ చెప్పాడు రాజమౌళి.‘‘చిరంజీవిగారి ‘ఘరానా మొగుడు’లోని ‘బంగారు కోడిపెట్ట’ సాంగ్‌ని ఇందులో రీమిక్స్ చేద్దాం’’ కీరవాణిగారి భార్య శ్రీవల్లి ఐడియా ఇది. ఆ ఫ్యామిలీస్‌లో వల్లి మాటే వేదం.  వదినగారి ఐడియాకు రాజమౌళి గ్రీన్ సిగ్నల్. కథ రెడీ అవుతోంది. కొంత జానపదం. కొంత సాంఘికం. పునర్జన్మల నేపథ్యం. రాజమాత కాస్తా రాజకుమారి అయిపోయింది. చరణ్ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా కథలో మలుపులు. ఓపెనింగ్ సీన్ నుంచే అటెన్షన్ డ్రా అవ్వాలి. రాజమౌళి తన రైటర్స్ టీమ్‌తో కూర్చుని వర్క్ చేస్తూనే ఉన్నాడు.

 

ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తీసిన టీవీ సీరియల్స్ అన్నీ వాచ్ చేస్తున్నాడు రాజమౌళి. హిచ్‌కాక్ టేకింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్. కాన్సెప్ట్ ఏంటో ఫస్ట్ సీన్‌లోనే చెప్పేస్తాడు. ఆ తర్వాత ఆసక్తికరంగా చిక్కుముళ్లు వేస్తూ, విప్పుతూ ఉంటాడు. ఈ నేరేటివ్ స్టయిల్ రాజమౌళికి విపరీతంగా నచ్చేసింది. అదే ఫాలో అయితే..? అంతే... ఓపెనింగ్ సీన్ విషయంలో క్లారిటీ వచ్చేసింది. హీరో హీరోయిన్లు ఫస్ట్ సీన్‌లోనే పర్వతాలపై నుంచి పడి చనిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ‘మగధీర’ స్టోరీ రెడీ.

    

రాజకుమారి మిత్రవింద. అదిరిపోయే అందం. అలాంటి హీరోయినే కావాలి. రాజమౌళి కళ్లు వెతుకుతున్నాయి. తమన్నా... ఇలా చాలామంది. ఎవ్వరూ కనెక్ట్ కావడం లేదు. ఆయన వ్యూ ఫైండర్‌లో కాజల్ అగర్వాల్ కనబడింది. ‘యమదొంగ’లో ఫస్ట్ కాజల్‌నే అడిగారు. డేట్లు కుదర్లేదు. ఇప్పుడామె రెడీ.షేర్‌ఖాన్ పాత్రకు స్క్రిప్టు దశలోనే శ్రీహరి పేరు లాక్ చేసేశాడు రాజమౌళి. విలన్ పాత్రకు మాత్రం కొత్తవారినే వెతుకుతున్నాడు. దేవ్‌గిల్. ‘కృష్ణార్జున’ సినిమాలో యాక్ట్ చేశాడు. పెద్ద పేరు లేదు. ఈ క్యారెక్టర్‌కి బానే ఉంటాడు కానీ, హార్స్ రైడింగ్ అంటే దడ, వణుకు. ఇది తనకు గోల్డెన్ చాన్స్ అని దేవ్‌గిల్‌కు తెలుసు. అందుకే వదులుకోకూడదు. రాత్రింబవళ్లు హార్స్ రైడింగ్ ప్రాక్టీస్ చేశాడు.

 

రాజమౌళి ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. ఇదొక ఎత్తు. అన్‌కాంప్రమైజింగ్ టీమ్ కావాలి. గ్రాఫిక్స్ అదిరిపోవాలంటే వీఎఫ్‌ఎక్స్ టీమ్ బ్రహ్మాండంగా కుదరాలి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా! రాజమౌళి తలుచుకుంటే టీమ్‌కు కొరతా! కెమెరామ్యాన్ సెంథిల్, ఆర్ట్ డెరైక్టర్ రవీందర్‌రెడ్డి, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్, వీఎఫ్‌ఎక్స్ హెడ్ కమల్ కణ్ణన్, స్టయిలింగ్ రమా రాజమౌళి. వీళ్లందరికీ పెద్ద దిక్కు మ్యూజిక్ డెరైక్టర్ కీరవాణి. వర్క్ స్టార్ట్!

 

షూటింగ్‌లో చాలాభాగం ఆర్‌ఎఫ్‌సీలోనే. కొన్ని రియల్ లొకేషన్స్, కొంత గ్రాఫిక్స్. ఉదయ్‌గఢ్ కోట కట్టాలి. ఇరాన్ నుంచి ఓ ఎక్స్‌పర్ట్ వచ్చాడు. గద్ద షేప్‌లో డిజైన్ ఇచ్చాడు. కొద్దిభాగం సెట్ వేయడానికే త్రీ మంత్స్ పట్టింది. మొత్తం కోట సెట్ వేయాలంటే ఆరు నెలల పైనే అవుతుంది.

 

అంత టైమ్ వేస్టు. గ్రాఫిక్స్ వాళ్లకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు.

పీటర్ హెయిన్ ఫుల్ డేట్స్ తీసేసుకున్నాడు రాజమౌళి. ఫైట్లు అలా ఇలా ఉండకూడదు. కళ్లు చెదిరిపోవాలి. ముఖ్యంగా వందమంది యోధులతో ఫైటింగ్ సీక్వెన్స్. దీనికైతే షూటింగ్‌కి ముందే బోలెడంత గ్రౌండ్ వర్క్. ప్రాక్టీస్ సెషన్స్.

 

ఈ సినిమాలో బోలెడన్ని రిస్కీ షాట్స్. పీటర్ హెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. బైక్‌ను గాల్లోకి లేపే సీన్ తీస్తున్నారు. చరణ్‌కు చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. ఫస్ట్ టేక్ ఓకే. కానీ చిన్న చేంజ్. సెకండ్ టేక్ చేసి చూపిస్తున్నాడు పీటర్ హెయిన్. బైక్‌తో గాల్లోకి లేచాడు. 80-90 అడుగుల ఎత్తు. ఎక్కడో చిన్న మిస్టేక్. స్ల్పిట్ సెకండ్. అంత పైనుంచి ఫోర్స్‌గా ఢామ్మని కిందపడ్డాడు. ఎన్ని ఎముకలు విరిగిపోయాయో... అసలు బతికే చాన్సుందా..? ‘కిమ్స్’లో చేర్చారు. ప్రాణభయం లేదు. కానీ ఫోర్ మంత్స్ బెడ్ మీద నుంచి కాలు దించితే కష్టమన్నారు డాక్టర్లు. పీటర్ హెయిన్ మొండోడు. నెలకే తిరిగొచ్చాడు. అదే బైక్ షాట్ మళ్లీ తీశాడు.

 

    

‘కాలభైరవ’ పాత్ర కోసం చరణ్ ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉన్నాడు. బాడీ పెంచాడు. లుక్‌లో రాజసం తీసుకొచ్చాడు. నిజంగా యోధానుయోధుడిలాగానే తయార య్యాడు. రాజమౌళి చెప్పింది తు.చ. తప్పకుండా చేస్తున్నాడు. ‘మగధీర’ను అతను ఫుల్‌గా ఓన్ చేసేసుకున్నాడు. రాజస్థాన్ ఎడారిలోని లొకేషన్స్ కోసం వెళ్లినప్పుడు తగిలింది బాదల్. సింహం లాంటి గుర్రం. కన్నుమూసి తెరిచేలోపు ఆమడ దూరం పరిగెడుతుంది. కానీ జగమొండి. అస్సలు మాట వినదు. చరణ్ ఆ గుర్రానికి ఫ్యాన్ అయి పోయాడు. ‘‘ఈ గుర్రం నాక్కావాలి’’ అన్నాడు. దాంతోనే షూటింగ్. వాటర్ ఫాల్స్ నుంచి జంప్ చేసే షాట్‌లో కొంచెం వైల్డ్‌గా రియాక్టయ్యింది. చరణ్ లిగ్మెంట్‌కు గాయమైంది. రెండు నెలలు బెడ్ రెస్ట్.

    

రాజమౌళి ఓ తపస్సులా షూటింగ్ చేస్తున్నాడు. సినిమా బిగినింగ్‌లో హీరో హీరోయిన్లు పర్వతాల నుంచి పడిపోయే సీన్ కోసమైతే చాలా వర్క్ చేశాడు. షాట్ బై షాట్ రాసుకుని... రీ-రికార్డింగ్‌తో సహా స్టోరీ బోర్డ్ చేసి, గ్రాఫిక్స్ వాళ్లకు ఇచ్చాడు.

 

షూటింగే ఓ యజ్ఞం అనుకుంటే, పోస్ట్ ప్రొడక్షన్ అంతకు మించిపోయింది. వీఎఫ్‌ఎక్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి బోలెడంతమంది ఫ్రీ లాన్సర్స్ పనిచేస్తున్నారు. అందరికీ పీస్ వర్క్‌లు. మళ్లీ వాళ్లందర్నీ కో-ఆర్డినేట్ చేయడం. వర్క్ అంతా ఒకే చోట జరిగితే ఓకే కానీ, రకరకాల ప్లేసుల్లో... రకరకాల మనుషులతో చేయించుకోవడమంటే నిజంగా నరకం. కానీ రాజమౌళి భరిస్తున్నాడు. చివరిక్షణం వరకూ మంచి ఫలితం కోసం పోరాడుతూనే ఉన్నాడు. రిలీజ్‌కు రెండ్రోజుల ముందు కూడా కొన్ని షాట్స్ నచ్చక బెటర్ చేయించుకున్నాడు. రిలీజ్ ముందురోజు రాత్రే హైదరాబాద్ బంజారాహిల్స్ సినీమ్యాక్స్ లో ప్రివ్యూ వేశారు. పిన్‌డ్రాప్ సెలైన్స్. తుపాను ముందర ప్రశాంతత అంటే ఇదేనేమో! ఆ తర్వాత తుపాను ఆగలేదు. పాత రికార్డులన్నీ చెల్లాచెదురు. వంద రోజుల వరకూ హౌస్‌ఫుల్సే. 223 థియేటర్లలో హండ్రడ్ డేస్. కోట్లకు కోట్ల వసూల్. అమ్మో... అమ్మో... అమ్మో! తెలుగు సినిమాకు ఇంత డబ్బా!?

నిజమే! అద్భుతాలు కొన్నిసార్లే జరుగుతాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top