శల్యుడు


ఐదోవేదం: మహాభారత పాత్రలు - 24

శల్యుడు, పాండురాజు రెండో భార్య మాద్రికి అన్నగారు; నకుల సహదేవులకు స్వయానా మేనమామ; ధర్మరాజుకు సవతి తల్లి ద్వారా చుట్టం. ఈ శల్యుడు తన గొప్ప సేనలతో కౌరవులతో యుద్ధం చేయడానికి బయలుదేరాడు గానీ, మధ్యే మార్గంలో దుర్యోధనుడు ఇతన్ని పరోక్ష మైన తన సేవలతోనూ ఉపచారాలతోనూ మభ్యపెట్టి, తల తిరిగిపోయేలాగ చేశాడు. ‘ఎవడబ్బా? ధర్మరాజేనా ఇంత సేవ చేస్తు న్నాడు?’ అని విస్తుపోతూన్న శల్యుడికి ఎదురుగా దుర్యోధనుడు వచ్చి నమస్క రించాడు. ‘నా సేవలు మీకు నచ్చాయా?



ఇంకా ఏమన్నా లోటులున్నాయా?’ అని అడగడంతో ‘నీకు ఏం కావాలి?’ అన్నాడు శల్యుడు. ఆలోచనకు వ్యవధినీయకుండా ‘మీరు మావైపు సేనను నడిపించాలి’ అని అడిగాడు దుర్యోధనుడు. ‘తథాస్తు’ అనే శాడు శల్యుడు. ఇలాగ ఒకటి చేద్దామను కొని బయలుదేరి, దానికి పూర్తి విరుద్ధంగా చేయడానికి సంసిద్ధమైపోవడం అహం కారంతో కూడిన మదానికే తగును. మదమంటే కన్నూ మిన్నూ కానని గర్వమూ మత్తూ పిచ్చీను. తానన్న మాటకు తిరుగుండదని మద మత్తుడి పిచ్చి.



శల్య మంటే ముల్లూ దోషమూ అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇతను శత్రువుల పాలిటి కంటకమే కానీ వివేచనను భ్రష్టు పట్టించే దోషమున్న మదం, ఇతని చూపును మందగింపజేస్తూనే ఉంటుంది. పరస్పరమూ పొసగుబాటు లేకుండానూ పొందిక లేకుండానూ ప్రవర్తించడం మదానికి పెద్ద గుర్తు. ‘నన్ను మించిన యోద్ధ లేడు’ అనే ఈ మదం పొగడ్తకీ కైవారానికీ లొంగి, తన ఉద్దేశానికి పూర్తిగా విరుద్ధమైనదానికైనా ఒప్పుకొనేలాగ ఇతని తలను తప్పుదిక్కుగా తిప్పుతుంది.



దుర్యోధనుడికి వరమిచ్చి ‘నేను యుధిష్ఠిరుణ్ని పలకరించి వెంటనే వచ్చే స్తాను’ అని పాండవుల శిబిరానికి వెళ్లాడు శల్యుడు. ‘నాక్కూడా ఒక ఉపకారం చేయాలి. కృష్ణుడితో సమానమైన సారథి అని దుర్యోధనుడు నిన్ను కర్ణుడికి సారథిగా ఉండమని అడుగుతాడు. అప్పుడు కర్ణుడి మనస్సు విరగ్గొట్టి, అర్జునుడి పని సులువు చెయ్యాలి నువ్వు’ అని యుధిష్ఠిరుడంటే, దానికీ ‘తథాస్తు’ అన్నాడు. కౌరవులవైపు యుద్ధం చేస్తానన డమెంత అర్థ రహితమో అర్జునుడి గెలుపు కోసం కర్ణుడి మనస్సు విరగ్గొడతానన డమూ అంత అర్థ రహితం. మదగర్వ మున్నవాడు ఇలాగే తలా తోకా లేని విధంగా మాట్లాడుతూ చివరికి ధర్మం చేతిలో చచ్చిపోతాడు.



కర్ణుడు సేనాపతి అయిన మొదటి రోజున అర్జునుడితో యుద్ధం చేయడమే కుదరలేదు అతనికి. ఆ రాత్రి శిబిరంలో దుర్యోధనుడితో ‘రేపు అర్జునుణ్ని వధిస్తాను’ అంటూ కర్ణుడు బీరాలు పలకడం మొదలుపెట్టాడు. ‘ఇంద్రుడిచ్చిన శక్తి అనే అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించవలసి రావడంతో అర్జునుడు రేపు నామీద విజృంభించడానికి ప్రయత్ని స్తాడు. అతని విల్లు గాండీవ మైతే నా విల్లు విజయం. ఇది నాకు పరశు రాముడిచ్చాడు. ఆయన దీనితోనే ఇరవై ఒక్కసార్లు క్షత్రియుల్ని నాశనం చేశాడు. అందుకనే నా ధనుస్సు అర్జునుడి గాండీవం కన్నా గొప్పది. కానీ ఒక లోటు ఉంది. అర్జునుడికి గోవిందుడు సారథి. అటువంటి సారథి నాకు లేడు. అర్జునుడి రథాన్ని అతను రక్షిస్తూ ఉంటాడు. శల్యుడు కృష్ణుడితో సమానమైన నేర్పు ఉన్న సారథి. అతనే కనక సారథ్యం వహిస్తే, నా విజయ ధనుస్సుతో నీకు విజయాన్ని రేపే ఇస్తాను’ అంటూ సాక్షాత్తూ కర్ణుడే శల్యసారథ్యాన్ని కోరుకున్నాడు.



మిత్రుడి కోరికనూ వెలితినీ తీర్చడానికి శల్యుణ్ని దుర్యో ధనుడు అడిగాడు. ఇలాగ దుర్యో ధనుడు అడగబోతాడని ఆగమశక్తిపరుడైన యుధిష్ఠిరుడు ముందే చెప్పాడు. అయితే, దుర్యోధనుడు తనంతటివాణ్ని సూత పుత్రుడైన కర్ణుడికి సూతుడిగా ఉండ మంటాడా అని, ‘నేను ఈ అవమానం పొందడం కన్నా ఇంటికి పోతాను’ అని ధ్వజమెత్తాడు. శల్యుడి మదానికి ఇదీ ఒక మచ్చుతునకే.

 దుర్యోధనుడు పాండవుల వైపు వెళ్తూన్న శల్యుణ్ని తనవైపు తిప్పుకున్నాడు. అతన్ని సారథ్యానికి ఒప్పించడానికి ‘కర్ణుడు రథికుల్లోకల్లా శ్రేష్ఠుడైనట్టే, నువ్వు సారథుల్లో శ్రేష్ఠుడివి, అర్జునుడి కన్నా కర్ణుడు గుణంలో మెరుగైనట్టే, నువ్వు కృష్ణుడి కన్నా కూడా గొప్ప సారథివి, అస్త్ర జ్ఞానంలో అర్జునుడి కన్నా కర్ణుడు అధికు డైనట్టే అశ్వజ్ఞానం లోనూ బలంలోనూ కూడా నువ్వే కృష్ణుడి కన్నా అధికుడివి. రథికుడి కన్నా అధికుడైన వాడే సారథిగా ఉండాలి.



నువ్వు కర్ణుడి కన్నా అధికుడివి. అదీగాక కర్ణుణ్ని చూస్తూ ఉంటే అతను సూతపుత్రుడని ఎప్పుడూ అనిపించడు. అతను అంగరాష్ట్రానికి రాజు’ అంటూ ఉబ్బేసేసరికి ‘నన్ను కృష్ణుడి కన్నా విశిష్టుడి వన్నావు గనక నాకు నువ్వంటే ప్రీతి. నీమాట నిజం చేస్తాను’ అంటూ శల్యుడు సారథ్యం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక షరతు పెట్టాడు: ‘నేను కర్ణుడి ఎదుట నాకేది అనిపిస్తే అది అంటాను. అతని హితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియం గానీ అప్రియం గానీ అంటూ ఉంటాను.



అతను ఓర్పుతో సహించాలి’ అని. కర్ణ దుర్యోధనులిద్దరూ ఆ షరతుకి ఒప్పుకున్నారు. ‘ఈరోజు చూడు నేను అర్జునుణ్ని ఒక ఆట పట్టిస్తాను. పాండవులనందర్నీ వినాశనం చేసి, దుర్యోధనుడికి జయాన్ని సంపాయిస్తాను’ అని కర్ణుడు గొప్పలు చెబుతూ ఉంటే శల్యుడు... ‘అర్జునుడనే నరవరుడెక్కడ? నరాధముడివైన నువ్వెక్కడ?’ అంటూ అతని తేజస్సును ఘటాయించడానికి శ్రీకారం చుట్టాడు. ఈ విధంగా మనస్సు విరగ్గొట్టడాన్ని ‘తేజోవధ’ అంటారు. తేజోవధకు మారు పేరే శల్యసారథ్యం. కండలు తిరిగిన ఒక వస్తాదున్నాడు. అతనంటే, ఆ ఊరివాళ్లం దరికీ హడలు. ఎక్కడ కొట్టి చంపుతాడో నని ఒకటే భయం.



ఈ భయం నుంచి ఎలాగ తప్పించుకోవాలని ఊళ్లోవాళ్లం దరూ ఆ వస్తాదుకు తెలియకుండా ఒక సభ చేశారు. దాంట్లో తేజోవధ రహ స్యాన్ని ఎరిగిన ఒక శల్యుడి లాంటివాడు, ఆ వస్తాదు పీచమణచడానికి ప్రణాళికను చెప్పాడు. అతన్ని చూసిన ప్రతివాడూ వంగి దండం పెడుతూ ‘అయ్యా! ప్రాణం బాగుందా? మీరెందుకో వడిలినట్టు న్నారు’; ‘అయ్యా! మీ ముఖం కొంచెం వాడినట్టుంది’; ‘జ్వరంగా ఉందా? నీరసంగా ఉన్నట్టున్నారు’ వగైరా వగైరా విధంగా పలకరించడం మొదలుపెట్టారు. అంతే, కొన్ని రోజుల్లో ఆ కండలు తిరిగిన వస్తాదు పీనుగులాగ నీరసపడిపోయాడు. మనస్సు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.



 శల్యుడు కర్ణుడికి కాకీ హంసా కథనొక దాన్ని చెప్పాడు. ఒక వైశ్య శ్రేష్ఠి కొడుకులు కాకినొకదాన్ని తమ అన్నంలో మిగిలినది పెడుతూ గారం చేస్తూ ఉండేవాళ్లు. ఏది మిగిలితే అది దానికే చేరేది. అది ఉన్న పళాన లావెక్కింది. తోటి పక్షుల్ని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది. ఓసారి, ఒక హంసల బారును చూసి, ‘నాకెన్నెన్నో రకాల ఎగరడాలు వచ్చును. నాతో మీరెవరైనా పందెం వేయగలరా?’ అంది. ఒక హంస, ‘నాకు ఒకే రకమైన ఎగరడం తెలుసు. అయినా నీతో స్పర్ధ పెట్టుకో డానికి సిద్ధమే’ అని నడుం కట్టింది.

 

కాకి అటు ఎగిరి, ఇటు ఎగిరి, పైకి ఎగిరి, కిందకి దూసుకొని, ఆ చెట్టుమీద వాలీ ఈ చెట్టుమీద వాలీ, ముందుకు వెళ్లి వెనక్కు వస్తూ రకరకాల వేషాలు వేసింది. హంస మాత్రం ఒకే విధంగా ఎగురుతూ నెమ్మదిగా సముద్రం మీదుగా ఎగరడం ప్రారంభించింది. అక్కడ ఆకాశంలో ఏ చెట్టూ లేకపోయేసరికి కాకికి ఆయాసం పెరిగింది. కిందికి రాలిపోవడం మొదలు పెట్టింది.



నీళ్లల్లో పడిపోతుందా అన్నం తగా నీళ్ల దగ్గరికి పోవడం చూసి హంస, ‘ఇది ఏ రకమైన ఎగరడం?’ అని ఎక సక్కెం చేసింది. కాకి దీనంగా ‘నన్ను నువ్వు లేవనెత్తకపోతే చచ్చిపోతా. నన్ను కాపాడు’ అంటూ నెత్తీనోరూ మొత్తుకుంది. హంస దాన్ని కాళ్లతో పట్టుకొని, వీపుమీద ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకొని వచ్చింది.

 ‘కాకి ఆ వైశ్యుడి కొడుకుల ఎంగిలికూడు తిని బలిసినట్టే నువ్వూ ధార్తరాష్ట్రుల ఎంగిలికూడుతో పెరిగి గొప్పవాళ్లందర్నీ అవమానపరిచేలాగ మాట్లాడుతున్నావు.



ఉత్తర గోగ్రహణమప్పుడు ద్రోణుడూ అశ్వత్థామా కృపాచార్యుడూ భీష్ముడూ ఇలాగ చాలామందే నీకు రక్షక కవచంలాగ ఉన్నప్పుడు అర్జునుణ్ని ఎందుకు చంపలేక పోయావు? ఇప్పుడు ఒంటిగా ఉండి కూడా అర్జునుణ్ని ఇలా పట్టి అలాగ చంపేస్తానని అంటున్నావు. అప్పుడు అర్జునుడు మీ అందర్నీ సింహం నక్కల్ని తరిమినట్టు తరిమిగొట్టాడు. ద్వైతవనంలో ఘోషయాత్రా సమయంలో గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు నువ్వు ముందుగా పారిపోయావు.



ఆ తరువాత చిత్రసేనుడూ మొదలైన గంధర్వులు స్త్రీలతో సహా దుర్యోధనుణ్ని పట్టుకొని తీసుకొనిపోతూ ఉంటే, ఈ అర్జునుడే వాళ్లను ఆ గంధర్వుల నుంచి కాపాడి ప్రాణభిక్ష పెట్టాడు. నువ్వు మాత్రం పలాయనం చిత్తగించావు. ఇప్పుడు మాత్రం గండర గండడి మాదిరి ప్రగల్భాలు వల్లిస్తున్నావు’ ఇలాగ కర్ణుడి తేజస్సును వధిస్తూ శల్యుడు అతని చావుకు, అతనికున్న శాపాలతో సహా పెద్ద కారణమయ్యాడు.

 

జయద్రధుణ్ని, అంటే, సైంధవుణ్ని రక్షించడానికి శల్యుడూ కృపుడూ అశ్వత్థామా దుర్యోధనుడూ కర్ణుడూ కలిసి ఎంత ప్రయత్నించినా అర్జునుణ్ని అతన్ని చంపకుండా ఆపలేకపోయారు. కర్ణుణ్ని అర్జునుడు తన బాణజాలంతో మోహితుణ్ని చేశాడు; అశ్వాల్నీ సారథినీ చంపి ముప్పుతిప్పలు పెట్టాడు. ఇలాగ కర్ణుడు ప్రగల్భాలు పలికాడే తప్ప ఎప్పుడూ అర్జునుడి చేతిలో భంగ పడుతూనే వచ్చాడు. శల్యసారథ్యంతోనే కర్ణుడికి చెడు జరిగిందనడానికి పూర్తి ఆస్కారం లేదు.

 

కర్ణుడి తరవాత శల్యుడే కౌరవులకు సేనాపతి అయ్యాడు. శల్యుడు ఋతాయనుడి కొడుకు. చాలా పెద్ద యోద్ధ. భీష్ముడూ ద్రోణుడూ కర్ణుడూ ఎంతటివాళ్లో అంతటివాడూ ఈ శల్యుడు. కృష్ణుడు ‘అతన్ని నువ్వే చంపాలి పెద్దబావా!’ అంటూ ధర్మరాజును ఉత్సాహపరిచాడు. ‘మేనమామ గదా అని ఏమాత్రం జాలి చూపించకుండా క్షాత్ర ధర్మాన్ని చూపిస్తూ అతన్ని చంప’మంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజును పదే పదే ప్రోత్సహించాడు. యుధిష్ఠిరుడు మండుతూన్న శక్తిని విసిరి, ఆ మంటకు శల్యుణ్ని ఆహుతి చేశాడు. ధర్మప్రవర్తనే మదాన్ని దహించగలదని ధర్మజుడు శల్యవధతో నిరూపించాడు.

  - డా॥ముంజులూరి నరసింహారావు

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top