షేక్‌స్పియరూ... నువ్వు కాస్త తప్పేమో గురూ!!


కామెడీ

 షేక్‌స్పియర్ అనే మహా రచయిత ‘పేరులో ఏమున్నది!’ అన్నాట్ట. సరే... అంతటి  పెద్దమనిషి, ఆయన చెప్పాక అదే నమ్మడం మనకూ కరెక్ట్ అనుకున్నా. కానీ ఎందుకో మా బుజ్జిగాడి మాటల్తో అటు షేక్‌స్పియర్ చెప్పింది నిజమా లేక మా బుజ్జిగాడి మాటలే వాస్తవమా అని తేల్చుకోలేని అయోమయంలో పడ్డా. అసలు విషయం ఏమిటంటే...

   

 ఒకరోజు వాడు టెన్నిస్‌బాల్‌తోనే క్రికెట్ ఆడుతుంటే కంటి దగ్గర కాస్త గాయమైంది. దాంతో బెంబేలెత్తిపోయి నేను హడావుడిగా వాణ్ణి కంటివైద్య నిపుణుడి దగ్గరకు తీసుకెళ్లా. ఆయన చూసి ‘కంటికేమీ పర్లేదు’ అని భరోసా ఇచ్చేదాక నా మనసు మనసులో లేదు. కానీ బయటకు వచ్చాక నా బుర్ర బుర్రలో లేదు. కారణం...  మా బుజ్జిగాడు నన్నో ప్రశ్న వేశాడు.

 ‘‘నాన్నా... కంటి డాక్టర్‌ను ఇంగ్లిష్‌లో ఏమంటారు?’’ అని.

 

 ‘‘ఆఫ్తాల్మాలజిస్ట్ అంటార్రా’’ అన్నాన్నేను.

 ‘‘బాగాలేదు’’ అన్నాడు.

 ‘‘ఏంట్రా బాగాలేనిది?’’

 ‘‘నువ్వు చెప్పిన మాట నోరు తిరగడం లేదు. సింపుల్‌గా విజనిస్ట్ అనొచ్చు కదా’’ అన్నాడు వాడు. ఇంకా వాడిచ్చిన షాక్‌లో ఉండగానే మరో దెబ్బ కొట్టాడు వాడు. అదెలా జరిగిందంటే...

   

 ఆరోజు మావాడికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే పిల్లల డాక్టర్‌గారి దగ్గరికి తీసుకెళ్లాన్నేను. వాడింకేదైనా ప్రశ్న వేస్తాడేమోనని అప్పటికీ కాస్త భయంభయంగానే ఉన్నాను. చివరికి నా భయమే నిజమైంది.

 

 ‘‘నాన్నా... పిల్లల డాక్టర్‌ను ఇంగ్లిష్‌లో ఏమంటారు?’’ అడిగాడు మా వాడు.

 ‘‘పీడియాట్రీషియన్ లేదా పీడియాట్రిస్ట్ అంటార్రా’’ అన్నాన్నేను.

 ‘‘బాగాలేదు’’

 ‘‘ఏంటీ బాగా లేనిదీ?’’  

 ‘‘పీడియాట్రీషియన్, పీడియాట్రిస్ట్ అనే మాటలు... ఆయనేదో పిల్లల్ని పీడించుకు తినేవాడు అనేలా ఉన్నాయి.  పిల్లల్ని చూసే డాక్టర్లు చాలా దయగల వారుగా ఉంటారు. పైగా డాక్టరుగారు నాకు చాక్లెట్ కూడా ఇచ్చారు. వాళ్లను  పీడియాట్రిస్టూ,

 

 పీడియాట్రీషియన్ అనడం బాగాలేదు’’

 ‘‘అందుకే ఈమధ్య వాళ్లను చిల్డ్రెన్స్ స్పెషలిస్ట్ అని కూడా అంటున్నార్లేరా’’ అంటూ సముదాయించబోయా. ‘‘అదీ బాలేదు. చిల్డ్రెన్ అన్న స్పెల్లింగు చిల్డ్రెన్‌కు అంత తేలిగ్గా రాదు. కాబట్టి కిడ్స్ స్పెషలిస్ట్ అంటే తేలిగ్గానూ, అందంగానూ ఉంటుంది. అదే బాగుంటుంది’’ అన్నాడు వాడు.

   

 ఇక వాణ్ణి ఆటలాడకుండా చూడటమో లేకుంటే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లకుండా చూడటమో... ఈ రెండింట్లో ఏదో ఒకటే  జరగాలని బలంగా నిర్ణయించుకున్నా. కానీ విధి రాత వేరేలా ఉంది. వాడు ఆటలూ మానలేదు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకా తప్పలేదు. క్రికెట్ ఆడుతూ మళ్లీ కింద పడ్డాడు. మోకాలి దగ్గర కాస్త పెద్దగానే చీరుకుపోయింది. అప్పటికి కుట్లు వేశారు. నిక్కర్లేసుకునే కుర్రాడు కదా... మచ్చ కనిపించకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి తీసుకెళ్దామని వాణ్ణి రమ్మన్నా. వాడు రానంటే రానని ఒక్కటే గొడవ. బలవంతంగానైనా తీసుకెళ్దామంటే ససేమిరా అన్నాడు. ఇక గొడవ భరించలేక

 ‘‘ఎందుకు రానంటున్నావురా?’’ అని అడిగా.

 

 ‘‘నీకు తెలియదా? ప్లాస్టిక్ చాలా డేంజరస్. దానివల్లే భూమిలోని రిసోర్సెస్ అన్నీ దెబ్బతింటున్నాయట. నేను ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి రాను. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోను. కావాలంటే ఎకోఫ్రెండ్లీ సర్జరీ ఏదైనా ఉంటే ఓకే. ‘గన్నీబ్యాగ్ సర్జరీనో లేదా  ‘జూట్ సర్జరీనో’ కాదంటే ‘ఫైబర్ సర్జరీనో’ చేయించు. అంతేగానీ ప్లాస్టిక్ సర్జరీకి అస్సలు ఒప్పుకోను’’ అంటూ కరాఖండీగా చెప్పేశాడు.

 

 ఇంతకీ వీడి మెదడు మామూలుగానే ఉందా లేక వీడిలో అబ్‌నార్మాలిటీ ఏదైనా ఉందా అని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దామనుకున్నాను గానీ... సైకియాట్రిస్ట్ స్పెల్లింగ్‌కు ముందు ‘పి’ ఎందుకుంటుందని అడుగుతాడేమోనని భయపడి, ఎందుకైనా మంచిదని  ముందుచూపుతో వెనక్కుతగ్గా. ఇదే మాట మా బ్రహ్మంగాడితో చెబితే... ‘‘వాడి ఆలోచన బాగానే ఉందిరా. కానీ వాణ్ణి సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలన్న ఆలోచన వచ్చినందుకు అసలు నిన్ను తీసుకెళ్లాల్రా అక్కడికీ’’ అంటూ కాస్త కేకలేశాకగానీ నా మనసు శాంతించలేదు.

 - యాసీన్



 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top