అనుభూతి కలగదెందుకు?!

అనుభూతి కలగదెందుకు?! - Sakshi


సందేహం



నాకు పెళ్లై మూడు నెలలు అయ్యింది. మేము ఓ సంవత్సరం దాకా పిల్లలు వద్దనుకుంటున్నాం. అందుకే మావారు కండోమ్స్ వాడుతున్నారు. వాటిని ఎక్కువ కాలం వాడటం వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా?

 - అపర్ణ, కాకినాడ

 

కండోమ్స్ వాడటం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ రావు. పైగా వీటిని వాడటం వల్ల మీ ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది రెండోవారికి సోకకుండా కూడా ఉంటుంది. అయితే కండోమ్స్ తయారీలో వాడే లెటెక్స్, రబ్బరు వంటివి కొంతమందికి పడవు. దాంతో అవి వాడినప్పుడు అలర్జీ వస్తుంది. తద్వారా దురద, మంట వంటివి కలగవచ్చు. అలాగే సరిగ్గా వాడకపోవడం వల్ల, కలయిక మధ్యలో కండోమ్ జారిపోవడం, చినిగి పోవడం, పగిలిపోవడం వంటివి జరగడం వల్ల కొన్నిసార్లు వీర్యం యోనిలోకి లీక్ అయ్యి, గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. పది నుంచి ఇరవై శాతం మందిలో ఇలా కండోమ్స్ ఫెయిల్ అయ్యి, గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

 

నా వయసు 20. మా అత్త కొడుకుతో నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ మధ్య ఏకాంతంగా ఉన్నప్పుడు అతడు నన్ను దగ్గరకు తీసుకుని ఫోర్‌ప్లే చేశాడు. కానీ ఎందుకో నాకు ఎంతకీ మూడ్ రాలేదు. ఎటువంటి అనుభూతీ కలగలేదు. నాలో ఏదైనా సమస్య ఉందా? పైగా గత మూడు నెలలుగా నాకు వైట్ డిశ్చార్జి బాగా అవుతోంది. తీగలు తీగలుగా, జిగురుగా ఉంటోంది. దుర్వాసన కూడా వస్తోంది. ఈ రెండు సమస్యలకీ సంబంధం ఉందా?

 - సుధ, తిరుపతి

 

ఫోర్‌ప్లేలో అనుభూతి కలగక పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మీకు ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి ఎవరైనా చూస్తారేమోనన్న భయం ఓపక్క, తప్పు చేస్తున్నామన్న అభద్రతాభావం మరోపక్క ఉండొచ్చు. దానివల్ల అనుభూతి కలిగి ఉండకపోవచ్చు. కొంతమందికైతే ఆ వ్యక్తిపైన ఇష్టం లేకున్నా, సెక్స్ అంటే తెలియని భయం ఉన్నా, మానసిక ఒత్తిడి ఉన్నా కూడా అనుభూతి కలగదు. అయితే మీరు అను మానపడినట్టు వైట్ డిశ్చార్జికి, అనుభూతి కలగకపోవడానికి సంబంధం లేదు. దుర్వాసన వస్తోంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండి ఉండవచ్చు. ఓసారి గైనకాలజిస్టును సంపద్రించి చికిత్స తీసుకోవడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే ఇన్ఫెక్షన్ పెరిగి... పెళ్లయిన తర్వాత కలయిక సమయంలో పొత్తి కడుపులో నొప్పి, యోనిలో మంట వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అలా అని ముందు నుంచే మీరు అనవసరమైన భయాలు పెట్టుకో కుండా సంతోషంగా ఉండండి. పెళ్లయిన తర్వాత కూడా అంతా బాగానే ఉంటుంది. అయితే పెళ్లికి ముందు మాత్రం కాస్త హద్దులు పాటిస్తేనే మంచిది.

 

నా వయసు 30. ఇంకా పెళ్లి కాలేదు. ఓ వ్యక్తిని ప్రేమించాను. అతని మీద నమ్మకంతో తప్పటడుగు వేశాను. తర్వాత గొడవలొచ్చి ఇద్దరం విడిపోయాం. అయితే నాకు జననాంగం దగ్గర్నుంచి తొడల వరకు ఏవో బొబ్బలు వచ్చాయి. క్యాండిడ్ ఆయింట్‌మెంట్ రాసినా తగ్గడం లేదు. నేనేం చేయాలి? అలాగే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నేను కన్యను కాదని నా భర్తకు తెలిసిపోతుందా?

 - సుజాత, ఖమ్మం



ఇలాంటి సంబంధాల ఫలితాలు ఇలానే ఉంటాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి అవి వైరల్ వార్ట్స్ అని పిస్తోంది. అవి క్యాండిడ్ ఆయింట్ మెంట్‌తో తగ్గవు. ఒకసారి డెర్మటాల జిస్టును కానీ, గైనకాలజిస్టును కానీ సంప్రదించండి. ఇక మీరు కన్య కాదని తెలుస్తుందా అనేది చెప్పడం కష్టం. అది మీ శరీరతత్వాన్ని బట్టి, వచ్చే వ్యక్తి గుణం, తెలివిని బట్టి ఉంటుంది.



నాకు పెళ్లై పదేళ్లవుతోంది. కానీ నాకు ఇంతవరకూ శృంగారంలో ఉండే అనుభూతి తెలియలేదు. భావప్రాప్తి అనే మాట చాలా చోట్ల చదివాను. అసలు దానికి అర్థం ఏమిటి?

 - మీనాక్షి, కరీంనగర్



శృంగారంలో పొందే అనుభూతిని భావప్రాప్తి అంటారు. అది కలగడంలో శరీరం కంటే మనసు ప్రాధాన్యం ఎక్కువ. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి ఉంటే భావప్రాప్తి కలగకపోవచ్చు. శృంగారం అంటే అసహ్యం, భర్త పట్ల అయిష్టత, శారీరక శ్రమ వంటివి వాటి వల్ల కూడా కలగకపోవచ్చు. ఓసారి సెక్సాలజిస్టును కలిసి విడమర్చి చెప్పండి. వారు సలహాలు, సూచనలు ఇస్తారు.         

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top