పూజకు పూలు ఎలా కోయకూడదు?

పూజకు పూలు ఎలా కోయకూడదు?


నివృత్తం: దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసేముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి, చెట్టుకు నమస్కరించాలి. పువ్వులు అందకపోతే కర్రతో దులపకూడదు. చేతితోనే కోయాలి. ఆ కోసినవి చేతిలో వేసుకోకూడదు. ఒడిలో వేసుకోవాలి. కింద పొరపాటున కూడా పెట్టకూడదు. కొందరు స్నానం చేసి, ఆ వెంటనే వెళ్లి పూలు కోస్తుంటారు. కానీ తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు... పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు.  ఈ నియమాల్లో దేనిని తప్పినా... సమర్పించే పూల వల్ల ఎటువంటి ప్రయోజనమూ చేకూరదని అంటారు.

 

 ఆలుబిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి పిల్లల్లేరని రామేశ్వరం పోయాట్ట...

సాధారణంగా ఎవరైనా ముందు తమవాళ్లను బాగా చూసుకుని, తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ వాళ్లను గాలికొదిలేసి ఊరినుద్ధరించాలని చూస్తుంటారు. అలాంటి వాళ్లను గురించి పుట్టుకొచ్చిన సామెత ఇది.ఓ వ్యక్తి తన ఇంటిని, పిల్లల్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడట. అతగాడు ఓ రోజు ఉన్నట్టుండి తీర్థయాత్రలకు బయలుదేరాడట. జీవితం మీద విరక్తి పుట్టి వెళ్లిపోతున్నాడేమో అనుకుని అందరూ కంగారుగా అడ్డుకున్నారట. కానీ తాను విరక్తితో వెళ్లడం లేదని, పిల్లలు కలుగని తన బంధువుకి సంతానభాగ్యం కలిగించమని వేడుకోవడానికి రామేశ్వరం వెళ్తున్నానని చెప్పాడట. దాంతో అవాక్కయిన జనం... నీ పెళ్లాం పిల్లల గురించి పట్టించుకోవుగానీ, బంధువుల బాగు కోసం రామేశ్వరం పోతావా అంటూ చీవాట్లు పెట్టారట. అదీ సంగతి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top