గంగను తెచ్చిన భగీరథుడు

గంగను తెచ్చిన భగీరథుడు


బృహత్తరం


పల్లె ప్రాణం పోస్తుంది.. పెంచి పోషిస్తుంది.. పెద్దవాణ్ని చేస్తుంది.. కానీ పట్నంలో అడుగుపెట్టగానే పల్లె గుర్తుండదు.. తాను అప్పటిదాకా పడిన .. జనాలు ఇప్పటికీ పడుతున్న కష్టాలు మరిచిపోతారు. తాను పుట్టి పెరిగిన పల్లెనే చిన్నచూపు చూస్తారు. అమ్మో అక్కడ బతకడం నా వల్ల కాదంటారు..  పట్నపు సౌఖ్యానికి అలవాటు పడిన ఒకప్పటి పల్లెవాసులు. కానీ భగవతి అగర్వాల్ అలా కాదు.

 

భగవతి అగర్వాల్ పల్లెలో పుట్టాడు.. అక్కడి కష్టాల మధ్య పెరిగాడు. పట్నం బాట పట్టాడు.. ఆపై దేశ విదేశాలు తిరిగాడు.. కోట్లు సంపాదించాడు.. ఇలా సుఖంగా జీవితం సాగిపోతున్న దశలో ఆయనకు బాధ్యత గుర్తొచ్చింది.. పల్లెవాసులు కష్టాల తీరుద్దామన్న సంకల్పం మొదలైంది. ఆ సంకల్పం..  వేలమంది దాహం తీరుస్తూ.. కోట్లమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆకాశ గంగ పేరుతో ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో అగర్వాల్ చేస్తున్న భగీరథ ప్రయత్నం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి.

 

దేశ జనాభాలో రాజస్థాన్ వాటా 5.5 శాతం. దేశ విస్తీర్ణంలో 10.5 శాతం ఆ రాష్ట్రానిదే. కానీ దేశంలోని భూగర్భ జలాల్లో రాజస్థాన్ వాటా ఎంతో తెలుసా..? కేవలం 1 శాతం. ఈ గణాంకాలు చాలు.. రాజస్థాన్ వాసుల నీటి కష్టాలు ఎలాంటివో చెప్పడానికి. అక్కడి నగరాలు, పట్టణాలకే నీటి కష్టాలు తప్పనపుడు.. ఇక పల్లెల సంగతి చెప్పాల్సిన పని లేదు. వాళ్లను పట్టించుకునే నాథుడుండడు. ఇలా నిరాదరణకు గురైన ఓ చిన్న పల్లెలో ఏడు దశాబ్దాల కిందట పుట్టాడు భగవతి అగర్వాల్.



బాల్యంలో తోబుట్టువులతో కలిసి కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి.. గంటల కొద్దీ కష్టపడి నీళ్లు తెచ్చుకున్న రోజులు అగర్వాల్‌కు ఇంకా గుర్తే. తన బాల్యమంతా ఇలాగే సాగింది. కేవలం నీళ్లు తేవడం కోసమే కొందరమ్మాయిలు చదువు మానేయడం.. శుద్ధమైన నీళ్లు అందుబాటులో లేక ఎంతోమంది చనిపోవడం కళ్లారా చూశాడు అగర్వాల్. ఈ అనుభవాలన్నీ చూస్తూనే ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసిన అగర్వాల్.. ఉద్యోగం తెచ్చుకున్నాక వియెన్నా (ఆస్ట్రియా)లో స్థిరపడ్డాడు. ఆ తర్వాత యుఎస్‌కు వెళ్లి అక్కడ భారీగానే ఆర్జించాడు. ఐతే ఉద్యోగం నుంచి రిటైరై ప్రశాంతంగా కాలం గడిచిపోతున్న సమయంలో అగర్వాల్‌కు స్వగ్రామం గుర్తుకొచ్చింది.

 

తానిక్కడ స్నానానికి కూడా పరిశుద్ధమైన నీళ్లు వాడుతుంటే.. తమ చుట్టుపక్కల గ్రామాల్లో తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి తలుచుకుని మథనపడ్డాడు. ఓ రోజు తన మిత్రులకు ఓ పార్టీ ఇచ్చిన ఆయన భారత్‌లోని గ్రామాలకు ఏమైనా చేయగలమా అని అందరినీ అడిగాడు. కొందరు విరాళాలివ్వడానికి ముందుకొచ్చారు. ఆర్థిక సాయం చేద్దామన్నారు. ఐతే డబ్బులిస్తే పరిష్కారం కాదని.. నేరుగా కార్యక్షేత్రంలోకి దిగి.. పల్లెవాసుల కష్టాలు తీర్చాలని భావించాడు అగర్వాల్. మిత్రుల నుంచి పోగుచేసిన విరాళాలు, సొంత డబ్బు తీసుకుని.. రాజస్థాన్‌లోని తన స్వస్థలానికి బయల్దేరాడు.

 

ఇక్కడికి వచ్చి పరిస్థితి చూస్తే.. ఒకప్పటి కంటే దుర్భరంగా ఉందని అర్థమైంది. ఒకప్పటి కంటే భూగర్భ జలాలు అడుగంటి పోయి గ్రామీణులు పడుతున్న నీటి కష్టాలు చూశాడు. ఈ ఇబ్బందులకు తెరదించేందుకు వర్షపు నీటిని ఒడిసిపట్టడమే మార్గమని భావించి.. ఆకాశ గంగ పేరుతో ఓ ప్రాజెక్టు ఆరంభించాడు. వర్షపు నీరు వృథాగా పోకుండా.. ప్రతి నీటి చుక్కా ఓ చోటికి చేరేలా తక్కువ ఖర్చుతో, గ్రామీణుల శ్రమదానంతో చెక్‌డ్యామ్‌లు, నీటి గుంతలు, వాటర్ ట్యాంకులు నిర్మించాడు. ప్రతి ఇంటిమీద పడే వర్షపు నీరంతా కూడా నేరుగా వీటిలోకి చేరే ఏర్పాట్లు చేశాడు. నీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి.. గ్రామీణుల అవసరాలకు సమృద్ధిగా.. పరిశుద్ధమైన నీటిని అందించాడు.

 

చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు కూడా పెరిగాయి. మూణ్నాలుగేళ్లుగా వేసవిలోనూ నీటి కష్టాలు కనిపించట్లేదు ఈ గ్రామాల్లో. ప్రపంచబ్యాంకు కూడా సహకరించడం.. ఎన్జీవోలు సాయం చేయడంతో మరిన్ని గ్రామాలకు ‘ఆకాశ గంగ’ను విస్తరిస్తున్నాడు అగర్వాల్. ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక ‘పర్పస్’ ప్రైజ్ పురస్కారంతో పాటు మరికొన్ని అవార్డులు దక్కాయి. అగర్వాల్ ప్రయత్నాన్ని రాజస్థాన్ ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆయన ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించి.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల దాహార్తి తీర్చడానికి ప్రణాళికలు రచిస్తోంది.

 ‘ఆకాశ గంగ’ పేరుతో ఈ అభినవ భగీరథుడు చేసిన ప్రయత్నం.. కొన్ని కోట్లమంది దాహార్తిని తీర్చబోతోంది.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top