మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా!

మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా! - Sakshi


పాటతత్వం

ప్రేమ అంటే సంతోషం... సంతోషమంటే జీవితం. ప్రేమించిన వ్యక్తి తోడుంటేనే సంతోషం..జీవితం. మనకు దొరికే అరుదైన విలువైన బంధమదే. ఆ నవ్వులు, ఆ మాటలు, ఆ స్పర్శ, ఆ సాంగత్యం నీకిష్టం..అలాంటి బంధాన్ని వీడటమంటే జీవితాన్ని వీడటమే. ఆ స్నేహం వరం, అది జ్ఞాపకమైతే శాపం. ఇలాంటి సందర్భం నేను సంగీత దర్శకత్వం వహించిన ‘సంబరం’ సినిమాలో కథానాయకుడికి ఎదురవుతుంది. బాల్య స్నేహితులైన నాయకా నాయికలు ఒక విషయంలో విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు హీరో పడే మానసిక సంఘర్షణను పాటలో చెప్పాలని దర్శకుడు దశరథ్ అడిగారు.



’సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గారి దగ్గరకు వెళ్లాం. సినీ సాహిత్య మాగాణిలో పసిడి పాటలు పండిస్తున్న హాలికుడాయన. ముఖ్యంగా ఆయన రాసే ప్రేమ పాట సిరి’వెన్నెల’ వెలుగే.

 

‘సంబరం’ కథలో హీరో హీరోయిన్లు బాల్య స్నేహితులు. ఆటపాటల సంతోషాలు తప్ప ఎలాంటి గొడవలు లేని పిల్లలు వీళ్లు. చిన్నప్పటి నుంచే ఒకరితో ఒకరు ఉండటం చాలా ఇష్టం. వయసొచ్చిన ప్రేమలో శారీరక స్వార్థాలు ఉంటాయి గానీ... నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమ వీళ్లది. పెరుగుతున్న వయసుతో పాటే వాళ్ల స్నేహమూ పెరుగుతుంది. పెద్దయ్యాక ప్రేమగా మారుతుంది. పరస్పరం ఇష్టమే కానీ... శ్రద్ధగా చదువుకునే అమ్మాయికి... చదువులో, ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండే అబ్బాయి అంటే కోపం. చాలా సార్లు చెప్పి చూస్తుంది అతను మారడు.



దాంతో అతని ప్రేమను తిరస్కరిస్తుంది. బాధ్యతలేని వాళ్లతో బతుకు పంచుకోలేనని బాధతోనే చెబుతుంది. ఉద్యోగం కోసం వేరే ప్రాంతానికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు హీరో. ఇళ్లు, కుటుంబం కన్నా... తన ప్రాణమైన ప్రేమని వదులుకొని వెళ్లాల్సి రావడం కథానాయకుడు తట్టుకోలేకపోతాడు... సీతారామశాస్త్రి గారు పల్లవి ఇలా రాశారు... ఎందుకే ఇలా గుండె లోపలా ఇంత మంట రేపుతావు అందని కలా అన్ని వైపులా అల్లుకోకిలా ఆగనీక సాగనీకా ఎన్నాళ్లిలా

 వెంటాడుతు వేధించాలా మంటై నను సాధించాలా

 కన్నీటిని కురిపించాలా జ్ఞాపకమై రగిలించాలా    

 మరుపన్నదే రానీయవా దయలేని స్నేహమా

 తన ముందే ఉంది తన ప్రేమా, తన జీవితం... కళ్ల ముందే కదలాడే కల అది.



వాస్తవానికి అందనిది. ఆ ప్రేమను విడిచి వెళ్లకుండా అన్నివైపులా అల్లుకోకనీ, వెంటాడుతూ వేధించొద్దని... జ్ఞాపకమై రగిలించొద్దనీ దయలేని స్నేహాన్ని కోరారు సీతారామశాస్త్రి గారు. మొదటి చరణంలో తను వీడటం తప్పదు... కొత్తదారి వెతుక్కోవాల్సిందే, మదిలో నిప్పులు మండుతున్నా... గతమంతా చితిమంటై వెంటే ఉన్నా... బాటసారిగా బతకాల్సిందే. నువ్వూ, నీ చిరునవ్వూ చేరని చోటే కావాలి... ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి అని రాశారు. ఒక్క సీతారామశాస్త్రి మాత్రమే పలికించగల భావమిది. ప్రేమికుడికి ప్రేయసే లోకం... అందుకే నువ్వూ నీ చిరునవ్వూ చేరని చోటే లేదంటాడు... ఒక వేళ ఉంటే అది తనకు తెలీదంటాడు...

 

తప్పదని నిను తప్పుకుని వెతకాలి కొత్తదారి

 నిప్పులతో మది నింపుకుని బతకాలి బాటసారి    

 జంటగా చితిమంటగా గతమంత వెంట ఉందిగా

 ఒంటిగా నను ఎన్నడూ వదిలుండనందిగా

 నువ్వు నీ చిరునవ్వు చేరని చోటే కావాలి

 ఉందో లేదో ఈ లోకంలో నీకే తెలియాలి

 కలిసి ఉన్నప్పుడు నయనంలో రోజూ తన ఉదయమే... విడిపోతే ఆ కళ్లు క్షణక్షణం వరుణమే. అందుకే వెళ్లే దారిలో కనీసం వెలుగైనా చూడనీక కన్నీటి అల రేపకనీ, జన్మలో నువు లేవనీ ఇకనైన నన్ను నమ్మనీ అంటాడు. చెంతే ఉన్నా సొంతం కావని నిందించననీ... తననే తాను వెలివేసుకుని వెళిపోతానని... ఆ పాత్ర ఆవేదన వ్యక్తం చేశాడు సిరివెన్నెల...

 

ఆపకిలా ఆనాటి కలా అడుగడుగు కూలిపోదా

 రేపకిలా కన్నీటి అలా ఏ వెలుగు చూడనీక

 జన్మలో నువు లేవని ఇకనైన నన్ను నమ్మనీ

 నిన్నలో వదిలేయని ఇన్నాళ్ల ఆశని

 చెంతే ఉన్నా సొంతం కావని నిందించేకన్నా

 నన్నే నేను వెలివేసుకుని దూరం అవుతున్నా

 తనకంటే... తానంటేనే ఇష్టం... ఇదీ విడదీయలేని... వేరుచేసి చూడలేనిది ప్రేమ బంధం. బాల్యం నుంచి ఇంత ఇష్టంగా తనతో బ్రతకడానికి అలవాటైన వ్యక్తి... తను లేకుంటే ఉండగలడా. ఆ వ్యక్తి స్థానంలో తానే ఉన్నంత వేదనతో పాట రాశారు సీతారామశాస్త్రి గారు. ఆయనతో నాది తండ్రీ కొడుకుల బంధం. భావం లేకుండా ఆయన ఏ పాటా రాయరు. ఏవో కొన్ని పదాలతో పాటలు పూర్తిచేయడం సీతారామశాస్త్రి కెరీర్‌లో లేదు.



ఇప్పుడున్న ఏ గీత రచయితతోనూ ఆయన్ని పోల్చలేం. తెలుగు సినిమా పాటల రచయితగా ఆయన కీర్తి శిఖరం. ఈ పాట వింటూ ఏడ్చిన వాళ్లను ఎందరినో చూశాను. ట్యూన్‌కు రాసిన పాట ఇది. పాటంతా ఊటీలో చిత్రీకరణ జరిపారు. సినిమా కమర్షియల్ సక్సెస్ కాకున్నా... ఈ పాటకు బాగా పేరొచ్చింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. సినిమా హిట్టయితేనే ఆ చిత్రంలోని పాటల గురించి మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి మారితేనే మంచి పాటలకు గౌరవం దక్కినట్లవుతుంది.

సేకరణ: రమేష్ గోపిశెట్టి

 - సిరివెన్నెల, గీత రచయిత

 - ఆర్పీపట్నాయక్

నటుడు, సంగీత దర్శకుడు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top