బరువు తగ్గడానికి మార్గాలేంటి?

బరువు తగ్గడానికి మార్గాలేంటి?


ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఫిజికల్‌ యాక్టివిటీకి ప్రాధాన్యత ఇవ్వాలా? రిక్రియేషన్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే ఏమిటి?  caesarean section (సి–సెక్షన్‌) అనే మాట గురించి విన్నాను. దీని గురించి వివరంగా తెలియజేయగలరు.                                                                                                                 

  డి.సునీత, పీలేరు



ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు మొత్తంగా విశ్రాంతి తీసుకోవలసిన అవసరం లేదు. మొదటి మూడు నెలలలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మామూలుగా కూర్చొని చేసుకునే పనులు, వంట పనులు వంటి తేలిక పనులు చేసుకోవచ్చు. మరీ బరువు పనులు, ఎక్కువ వంగి లేవడం వంటివి తగ్గించుకోవలసి ఉంటుంది. కొందరిలో ముందు ప్రెగ్నెన్సీలు అబార్షన్లు అవ్వడం, మాయ కిందకి ఉండటం, గర్భసంచీ ముఖద్వారం చిన్నగా, లూజుగా ఉండటం వంటి సమస్యలు ఉన్నప్పుడు, ఎక్కువగా విశ్రాంతి తీసుకోమనడం జరుగుతుంది. పైన చెప్పిన సమస్యలు ఏమీ లేనప్పుడు, డాక్టర్‌ సలహా మేరకు, ఇంటి పనులు, వాకింగ్‌ వంటివి మూడు నెలలు దాటిన తర్వాత చేసుకోవచ్చు.



ఐదవ నెల నుంచి చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టి, కొద్దికొద్దిగా పెంచుకుంటూ వ్యాయామాలు చేయవచ్చు. రిక్రియేషన్‌ ఎక్సర్‌సైజ్‌ అంటే ప్రెగ్నెన్సీలో ఒక పద్ధతి ప్రకారం ఎరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ (నడక, రన్నింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్‌) చేయడం, దీనివల్ల గర్భిణీలు మెల్లగా గర్భం వల్ల వచ్చే మార్పులకు అలవాటుపడతారు. దాంతో అలసట, టెన్షన్స్, మానసిక ఒత్తిడి, నడుంనొప్పి వంటి సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం కలుగుతుంది. సిజేరియన్‌ అంటే గర్భంతో ఉన్నప్పుడు, శిశువుని యోని నుంచి కాకుండా పొట్ట కోసి, గర్భాశయాన్ని కోసి శిశువుని బయటకు తీసి, మళ్లీ గర్భాన్ని, పొట్టను కుట్టివేయడం.



గర్భిణిగా ఉన్న సమయంలో స్త్రీలు లావు పెరగడం సహజంగా జరుగుతుంటుంది. డెలివరీ తరువాత వారి రూపురేఖలు మారిపోతాయి. అలా కాకుండా... ప్రెగ్నెన్సీ తరువాత బరువు తగ్గడానికి సులువైన మార్గాలు ఏమైనా ఉన్నాయా? ప్రెగ్నెన్సీ తరువాత ఎంత కాలానికి బరువు తగ్గే ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు?

– శ్రీ, విజయవాడ



గర్భిణిగా ఉన్నప్పుడు స్త్రీలలో హార్మోన్ల ప్రభావం వల్ల, ఇంకా ఇతర మార్పుల వల్ల బరువు పెరగటం, ఒంట్లో నీరు చేరటం, కొద్దిగా నల్లబడటం వంటి ఎన్నో మార్పులు జరుగుతాయి. కాన్పు తర్వాత 50% మార్పులు 2–3 నెలలకి అవంతటవే మెల్లగా తగ్గిపోతాయి. బరువు ఎవరూ అంత సులువుగా తగ్గరు. సాధారణ కాన్పు అయితే ఒకటిన్నర నెల నుంచి చిన్నగా వాకింగ్, పొట్ట వ్యాయామాలు మొదలుపెట్టవచ్చు. సిజేరియన్‌ ఆపరేషన్‌ అయితే ఒక్కొక్కరి ఆరోగ్యాన్ని బట్టి, కుట్ల దగ్గర నొప్పి లేకుండా ఉంటే, రెండు నెలల తర్వాత నుంచి వాకింగ్‌ మొదలుపెట్టవచ్చు. ఇబ్బంది ఏమీ లేకపోతే నాలుగో నెల నుంచి ప్రాణాయామం వంటి చిన్న చిన్న వ్యాయామాలతో మొదలుపెట్టి, మెల్లగా అబ్డామినల్‌ వ్యాయామాలు చేయవచ్చు. వీటిలో ఎటువంటి అసౌకర్యం లేకపోతే ఐదవ నెల నుంచి వ్యాయామాలను పెంచుకుంటూ చేసుకోవచ్చు. వీటివల్ల తొమ్మిది నెలల పొట్ట పెరిగి, వదులైన పొట్ట కండరాలు గట్టిపడి, పొట్టమీద ఉన్న కొవ్వు తగ్గి, చాలావరకు శరీరంలో జరిగిన మార్పులు సాధారణ స్థాయికి వస్తాయి. అలాగే ఆహారంలో కూడా పాపకు పాలు ఇవ్వాలి కాబట్టి సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకుంటూ, కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.



మిస్‌క్యారేజ్‌ గురించి హెచ్చరించే ‘బ్లడ్‌టెస్ట్‌’ వస్తున్నట్లు విన్నాను. నిజమేనా? ఇది కొన్ని దేశాలకు మాత్రమే పరిమితమా? ఒకవేళ ఇలాంటి బ్లడ్‌టెస్ట్‌ అనేది ఉంటే ఏ నెలలో చేయించుకోవాలి? ‘కీ హార్మోన్‌’ అనే దాని గురించి తెలియజేయగలరు.

– విమల, ఆదిలాబాద్‌



మిస్‌క్యారేజ్‌ అంటే 6 నెలల లోపల అబార్షన్, గర్భంలో పిండం పెరగకుండా ఆగిపోవటం వంటి అనేక పరిస్థితులను కలిపి అనడం జరుగుతుంది. గర్భంలో పిండం మొదటి మూడు నెలల లోపల పెరగటానికి బీటా హెచ్‌సీజీ అనే హార్మోన్‌ ఎంతో కీలకం. దీనినే కీ హార్మోన్‌ అంటారు. ఈ హార్మోన్‌ గర్భం దాల్చిన నెలలో, పీరియడ్‌ మిస్‌ అవ్వకముందు నుంచే మెల్లగా విడుదల అవ్వడం మొదలై, 4 రోజులకు ఒకసారి రెట్టింపు అవుతూ ఉండి, 12 వారాలకు గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ హార్మోన్‌ ప్రభావంతో పిండం పెరుగుదల సక్రమంగా ఉంటుంది. పిండం పెరుగుదల సరిగా లేనప్పుడు, ఈ హార్మోన్‌ లెవల్‌ రక్తంలో తగ్గిపోవటం లేదా పెరగకపోవటం జరుగుతుంది. స్కానింగ్‌లో గర్భం సరిగా తెలియనప్పుడు, సరిగా పెరగనప్పుడు బ్లడ్‌టెస్ట్‌లో సీరమ్‌ బీటా హెచ్‌సీజీ అనే పరీక్ష ద్వారా ఈ హార్మోన్‌ ఎంత శాతంలో విడుదల అవుతుంది, ఇది పెరుగుతుందా లేదా అనేదాన్ని బట్టి మిస్‌క్యారేజ్‌ అవకాశాలను, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ అవకాశాలను అంచనా వేయడం జరుగుతుంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top