ఈ సమయంలో అది తాగవచ్చా?

ఈ సమయంలో అది తాగవచ్చా?


మా బంధువుల్లో ఒక అమ్మాయికి  కడుపులోనే బిడ్డ చనిపోయింది. దీని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. అమ్మాయి బలహీనంగా ఉండడం వల్ల ఇలా జరిగిందని, ప్రెగ్నెన్సీ సమయంలో సరిౖయెన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరిగిందని, గుర్రపు వాతమని... ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు. వీటిలో ఏది నిజం? కడుపులో బిడ్డ చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? అనేది తెలియజేయగలరు.

 – పి. శైలజ, తెనాలి



కడుపులో బిడ్డ ఏ నెలలో చనిపోయింది అనేదాన్ని బట్టి కారణం అంచనా వేయడం జరుగుతుంది. కడుపులో బిడ్డ చనిపోవడానికి, తల్లిలో సమస్యలు, బిడ్డలో సమస్యలు, మాయ (ప్లాసెంటా) సమస్యలు కారణం కావచ్చు. తల్లిలో బీపీ పెరగడం, ఉమ్మనీరు తగ్గిపోవడం, బిడ్డ బరువు పెరగకుండానే తల్లి నుండి బిడ్డకు రక్తసరఫరా సరిగా లేకపోవడం, బిడ్డకు సరిగా శ్వాస అందకపోవడం, అదుపులో లేని మధుమేహ వ్యాధి, అధిక తీవ్రతతో ఉన్న జ్వరం, ఇన్‌ఫెక్షన్‌లు. నెలలు పూర్తిగా నిండిపోయినా (40 వారాలు) ఇంకా నొప్పులు రాలేదని ఎదురుచూడటం దాని ద్వారా, ఉమ్మనీరు ఎండిపోయి మాయ పనితీరు తగ్గి, బిడ్డకు రక్తసరఫరా ఆగిపోయి, శ్వాస ఆగిపోవచ్చు.



తల్లి నుంచి బిడ్డకు రక్తసరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గూడు కట్టడం, బిడ్డలో అవయవ లోపాలు, జన్యుపరమైన లోపాలు, నెలలు నిండకుండానే గర్భంలో మాయ విడిపోవడం, గర్భంలో బ్లీడింగ్‌ అవ్వడం బిడ్డకు రక్తసరఫరా ఆగిపోవడం, బొడ్డుతాడులో (అంబలీకల్‌ కార్డ్‌) ముడులు (ట్రూ నాట్స్‌) బిడ్డ మెడ చుట్టూ బొడ్డుతాడు గట్టిగా బిగుసుకోవడం వంటి కారణాల వల్ల బిడ్డ కడుపులో చనిపోవచ్చు.



కొందరిలో కాన్పు సమయంలో నొప్పుల తీవ్రతను బిడ్డ తట్టుకోలేకపోవడం బిడ్డకు శ్వాస అందకపోవడం వల్ల బిడ్డ కడుపులో చనిపోవచ్చు. కొంతమందిలో కారణాలు తెలియకుండానే బిడ్డ కడుపులో చనిపోవచ్చు. కొందరిలో ఈ విషయాన్ని ముందుగా కనిపెట్టలేము. కొందరి బిడ్డ ఎదగకపోవడం, ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం, తల్లిలో అధిక బీపీ లాంటి సమస్యలు ఉన్నప్పుడు బిడ్డ కడుపులో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు వేసుకుని, కొందరిలో కాన్పు ముందుగానే చేసి బిడ్డను బయటకు తీయడం జరుగుతుంది.



ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌ని. నాకు చిరుతిండ్లు తినే అలవాటు ఎక్కువగా ఉంది. ఈ సమయంలో తినవచ్చా? నేను నాన్‌వెజ్‌ తినను. గుడ్లు మాత్రం తింటాను. వీటిని ఎక్కువగా తినడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందా? నాకు మ్యాంగో జ్యూస్‌ అంటే ఇష్టం. ఈ సమయంలో తాగవచ్చా? గర్భిణిగా ఉన్నవాళ్లు ఎండాకాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచింది?

– ఎన్‌.ఆర్, పొద్టుటూరు



గర్భం లేని సమయంలో కూడా చిరుతిండ్లు జంక్‌ఫుడ్‌ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. గర్భిణీ సమయంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. గ్యాస్‌ తయారవడం, ఎసిడిటీ సమస్య మామూలుగానే ఎక్కువ ఉంటుంది. చిరుతిండ్ల వల్ల వాటిలో వాడే కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, ఇంకా ఇతర పదార్థాల వల్ల పొట్ట ఉబ్బరం, అరగకపోవడం, అధికంగా బరువు పెరగడం వంటి దుష్ఫలితాలే తప్ప ఉపయోగాలు ఏమీ ఉండవు. మరీ తినాలనిపిస్తే, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. ఈ కాలంలోనే దొరికే మామిడిపండ్లను చూస్తే ఎవరికైనా మిస్‌ అవ్వకుండా ఈ నెల రోజులు బాగా తినాలనిపిస్తుంది.



కాని గర్భిణీలలో ఎక్కువగా మామిడి పండ్లు లేక జ్యూస్‌ తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం, లూజ్‌ మోషన్స్‌ షుగర్‌ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు పెరగడం, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగి మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తినాలనిపిస్తుంది కాబట్టి, జ్యూస్‌ కంటే కూడా కొన్ని కొన్ని ముక్కలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఎండాకాలంలో గర్భిణీలు ఎండలకు ఎక్కువ చెమట్లు పట్టడం, ఒంట్లో నీరు శాతం తగ్గిపోయి, అలసటగా ఉండటం, ఓపిక లేకుండా చిరాకుగా ఉంటారు. గర్భిణీలు ఎండాకాలంలో ఎక్కువగా మంచినీరు కనీసం 3–4 లీటర్లు ఒకేసారిగా కాకపోయినా కొంచెం కొంచెంగా, మజ్జిగ, లస్సీ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకుంటూ ఉండాలి.



పండ్లలో అధికంగా నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దాని జ్యూస్, దానిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్‌ వంటివి తీసుకోవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకు తేలికగా అరిగే ఆహారం తీసుకోవడం మంచిది. కారం, మసాలా ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కోడిగుడ్డులో ప్రొటీన్స్, విటమిన్స్‌ ఎ,డి,ఇ,బి1, బి2,బి5,కె, ఫోలిక్‌ యాసిడ్, అమైనో యాసిడ్స్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్‌ వంటి ఎన్నో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బాగా సన్నగా ఉన్నవారు రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గుడ్డులోని పచ్చసొనలో కొవ్వు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. బరువు అధికంగా ఉంటే పచ్చసొన తీసివేసి తెల్లసొన రోజూ తీసుకోవడం మంచిది. లేదా వారానికి రెండు మూడుసార్లు మొత్తం గుడ్డు తీసుకోవచ్చు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top