సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా?

సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా? - Sakshi


నాకు పెళ్లై సంవత్సరం అయింది. నా వయసు 24 సంవత్సరాలు. పిల్లలు ఇప్పుడే  వద్దనుకుంటున్నాం. భవిష్యత్‌ గర్భం కోసం అండాలను దాచి పెట్టే టెక్నాలజీ వచ్చిందని విన్నాను.  ఈ ప్రక్రియ ద్వారా ముప్పై సంవత్సరాలు దాటిన తరువాత పిల్లలను కంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమైనా ఉంటాయా?

– కె.సుమన, హైదరాబాద్‌



మీ వయసు 24 సం. పిల్లలు ఎన్ని సంవత్సరాల తర్వాత కావాలనుకుంటున్నారు. మూడు, నాలుగు, అయిదు సంవత్సరాలా? సాధారణంగా ఆడవారిలో ఉన్న రెండు అండాశయాలలో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫాలికల్స్‌ 7 మిలియన్లుగా మొదలయ్యి, వాటిలో కొన్ని నశించిపోగా, రజస్వల అయ్యే సమయానికి 4 లక్షలు మిగులుతాయి. వీటిలో కేవలం 400–700 ఫాలికల్స్‌ మాత్రమే, అండాలను నెలకు ఒకటి లేదా రెండు  పీరియడ్స్‌ ఆగిపోయేవరకు విడుదల చేస్తాయి. మిగతావన్నీ నశించిపోతాయి. ఉన్న 400–700 ఫాలికల్స్‌లో కూడా, వయస్సు 30 దాటేకొద్దీ, మెల్ల మెల్లగా అండాల సంఖ్య తగ్గడం మొదలవుతుంది. 35 సం. దాటేకొద్దీ విడుదలయ్యే అండాల సంఖ్య, నాణ్యత, చాలావరకు తగ్గిపోతాయి. 35 సం.లు దాటేవరకు పిల్లలు వద్దనుకున్నవారికి, క్యాన్సర్‌కి రేడియో, కీమో థెరపీ తీసుకునేవారిలో అండాలు నశించే అవకాశాలు ఉన్నవారు, మరేదన్నా కారణం వల్ల అండాశయాలు తీసేవారిలో వారికి తర్వాత పిల్లలు కావాలనుకున్నప్పుడు, అందుబాటులో ఉండటానికి, అండాలను దాచిపెట్టే పద్ధతినే Oocyte cryo preservation అంటారు. ఈ టెక్నాలజీ మనదేశంలో, మన రాష్ట్రంలో, హైదరాబాద్‌లో కూడా కొన్ని ఐవీఎఫ్‌ సెంటర్లలో అందుబాటులో ఉంది.



ఖర్చు సెంటర్‌ని బట్టి, ఎన్ని అండాలను, ఎన్ని సంవత్సరాల పాటు దాచిపెట్టాలి వంటి అనేక అంశాలను బట్టి లక్ష నుంచి రెండు లక్షల వరకు ఉంటుంది. సాధారణంగా మీ ఆరోగ్య పరిస్థితి, అండాశయాల పనితీరు, ఫాలికల్స్‌ సంఖ్యను బట్టి, ఎన్ని సంవత్సరాల తర్వాత అయితే ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది అనేది ఒక అవగాహనకు రావచ్చు. అండాశయాల హార్మోన్స్, పనితీరు, అన్నీ బాగుంటే... 30 సంవత్సరాల వయసుకు ఈ పద్ధతి అవసరం లేదు. చాలావరకు 35 సం.లు దాటిన తర్వాత పిల్లలు కావాలనుకునే వారికే ఎక్కువ మటుకు ఈ పద్ధతి అవసరం పడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా అండాలను ఏ వయసులో దాచిపెడతామో, మళ్లీ వాడేటప్పుడు, వాటి వయస్సు దాచిపెట్టినప్పుడు ఉండే వయసే ఉంటుంది (మనిషి వయస్సు పెరిగినా కాని). ఈ టెక్నాలజీ వల్ల దుష్ఫలితాలు ఎక్కువగా ఏమీ లేవు.

పెళ్లయిన వాళ్లు... అండాలను దాచిపెట్టే దాని కంటే, అండాలను, భర్త వీర్యకణాలలో ఫలదీకరణ జరిపిన తర్వాత తయారయ్యే పిండాలను దాచిపెట్టుకోవడం మంచిది (embryo cryo preservation).



‘మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌’ అనేది ఎందుకు వస్తుంది? మన శరీరతీరువల్ల వస్తుందా? తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుందా? ఈ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఉండాలంటే రోజువారి జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా? మూత్రం రంగును బట్టి ఈ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించవచ్చా? తెలియజేయగలరు.

 – బి.శ్రీలత, శ్రీకాకుళం



మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ అంటే యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే రంధ్రం (యురెత్రా). కిందకే, యోని రంధ్రం, దాని కిందనే, మలద్వారం ఉంటాయి. చాలావరకు మలద్వారం నుండి బ్యాక్టీరియా, క్రిములు, పైకి పాకే అవకాశాలు చాలా ఉంటాయి. ఇవి యోనిలోకి కాని, మూత్ర ద్వారంలోకి పాకి, ఇన్‌ఫెక్షన్‌లను కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం... వంటి కొన్ని సందర్భాలలో ఈ క్రిములు పెరిగి ఇన్‌ఫెక్షన్‌ రావటానికి కారణం అవుతాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో, అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిలో, ఈ క్రిములు పెరగకుండా రోగ నిరోధక శక్తి ఆపుతుంది. నీళ్లు బాగా తాగుతూ ఉంటే మూత్రంలో క్రిములు కొట్టుకుపోతాయి.



లేకపోతే ఈ క్రిములు మెల్లగా పెరుగుతూ మూత్రం సంచి (యూరినరీ బ్లాడర్‌) నుంచి పైకి అంటే మూత్రం పైపులకు (యూరేటర్స్‌) తద్వారా కిడ్నీలకు పాకి, ఇన్‌ఫెక్షన్‌ బాగా వృద్ధి చెంది కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి, తద్వారా ప్రాణహాని వరకు చేరే అవకాశాలు ఉంటాయి. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నప్పుడు, మూత్రంలో మంట, మూత్రం ఎక్కువసార్లు వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పసుపుపచ్చగా రావడం, పొత్తికడుపులో నొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటి అనేక లక్షణాలు, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి ఉంటాయి. బిగుతుగా వుండే జీన్స్‌ ఎక్కువసేపు రోజు, గంటల తరబడి వేసుకోవడం వల్ల కూడా, గాలి చొరబడక, ఇన్‌ఫెక్షన్‌ కలిగించే క్రిములు పైకి పాకి ఇబ్బంది కలిగించవచ్చు. మంచినీళ్లు రోజుకు కనీసం రెండు లీటర్లు తీసుకోవాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. దాని ద్వారా మలద్వారంలోని క్రిములు ముందుకి పాకకుండా ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు వెళ్లిపోవాలి కాని, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వల్ల కూడా కొంతమందిలో యూరినరీ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top