ప్రతీకారం

ప్రతీకారం


ఎదో (జపాన్)... 1736వ సంవత్సరం...

 ‘‘మీకు అభ్యంతరం లేకపోతే నేనీ రాత్రికి ఈ ఆలయంలో పడుకుంటాను’’... అన్నాడు హోత్సుమీ. ‘‘మీరు నిరభ్యం తరంగా ఉండొచ్చు. అదిగో, ఆ కనిపించేవే మా నివాసాలు. అక్కడికి వచ్చినా ఫర్లేదు’’... అన్నాడా సన్యాసి.

 

 ‘‘వద్దండీ. ఇక్కడుంటాను’’ అన్నాడు హోత్సుమీ. ‘‘సరే... ఏదైనా అవసరమైతే రండి. మొహమాటపడొద్దు’’ అనేసి వెళ్లి పోయాడతను. హోత్సుమీ తన బ్యాగ్ లోంచి దుప్పటి తీసి పరుచుకున్నాడు. బ్యాగ్‌ను తలకింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. బాగా అలసి పోయా డేమో... కన్నులు మూతపడుతున్నాయి. కాసేపుంటే నిద్రాదేవత ఒడిలోకి పూర్తిగా జారిపోయేవాడే. కానీ హఠాత్తుగా వినబడిన అడుగుల సవ్వడి, నిద్రకు ఆనకట్ట వేసింది.

 

 ఎండిన ఆకుల్ని తొక్కుకుంటూ పడుతోన్న అడుగులు. ఎవరో నడుస్తున్నారు. దగ్గర్లోనే చాలా మంది బౌద్ధ సన్యాసులు నివాసముంటు న్నారు. వాళ్లెవరైనానా? అంతే అయి వుంటుంది. లేకపోతే ఇంత రాత్రివేళ ఇంకెవరు వస్తారు! తనకు తానే ప్రశ్నలు వేసుకున్నాడు. తనకు తానే జవాబులూ ఇచ్చుకున్నాడు. కానీ ఆ అడుగుల సవ్వడి చేరవయ్యేకొద్దీ ఏదో అలజడి మనసులో. లేచి కూర్చుని శబ్దం వస్తోన్నవైపు చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. సవ్వడి కూడా ఆగిపోయింది. అంతా తన భ్రమ అయి వుంటుందనుకున్నాడు. మళ్లీ పడుకుని నిద్రకు ఆహ్వానం పంపాడు.

 

 కాసేపటికి మళ్లీ అదే సవ్వడి. కానీ ఈసారి లేవలేదు హోత్సుమీ. మళ్లీ భ్రమే అనుకుని అటు తిరిగి పడుకున్నాడు. అంతలో ఓ స్త్రీ పిలుపు, ‘హోత్సుమీ’ అంటూ. ఉలిక్కిపడ్డాడు. ఎవరామె? ఎందుకు పిలుస్తోంది. తనకసలు తన పేరెలా తెలుసు? వెనక్కి తిరగాలా వద్దా అనుకుంటూండగానే మరోసారి ఆ స్వరం వినబడింది. ‘‘హోత్సుమీ... నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోవని, నన్ను వెతు క్కుంటూ వస్తావని. ఐలవ్యూ హోత్సుమీ.’’

 

 చప్పున తిరిగి చూశాడు హోత్సుమీ. అంతే... అతడి గుండె వేగం హెచ్చింది. ఒంట్లోని భయం చెమటలా బయటకు రాసాగింది. గట్టిగా కేకపెట్టాడు. ఆ కేక దగ్గర్లోనే ఉన్న నివాసాల వరకూ వెళ్లింది. ఉలిక్కిపడి లేచారు బౌద్ధ గురువులు. ఏం జరిగిందో అనుకుంటూ ఆలయం వైపు పరుగులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి విస్తుపోయారు.

 

 నేలమీద పడివున్నాడు హోత్సుమీ. భయంతో పెద్దగా తెరచుకున్న కళ్లు అలానే ఉన్నాయి. ముక్కు నుంచి నోటి నుంచి రక్తం ధారలు కట్టింది. మెడ విరిగి వేళ్లాడు తోంది. కాళ్లూ చేతులూ ఎవరో మెలి తిప్పి నట్టుగా తిరిగిపోయాయి. ఏం జరిగిందో, అంత దారుణంగా ఎవరు చంపారో అర్థం కాలేదెవరికీ. ఎందుకంటే వాళ్లకి హోత్సుమీ ఎవరో తెలీదు. అతడి గతమేమిటో తెలీదు. తెలిస్తే అతణ్నెవరు చంపారో అర్థమైవుండేది.

 

 ఇంతకీ హోత్సుమీ ఎవరు? అతణ్నెవరు చంపారు?హోత్సుమీ కిటకునీ ప్రాంతానికి చెందినవాడు. 1716లో ఓసారి అనుకో కుండా ఎదో (టోక్యో పూర్వనామం) ప్రాంతానికి వెళ్లాడు. తన బసలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఓ పాట వినిపించింది. ఆ స్వరంలోని తీయ దనానికి వివశుడయ్యాడు. వెంటనే పాట వినిపించినవైపు వెళ్లాడు. ఓ యువతి. ఒంటరిగా కూర్చుని పాడుకుంటోంది. అతడు వెళ్లగానే ఠక్కున పాట ఆపేసి, సిగ్గుపడి వెళ్లిపోయింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుందేమో, ఆమె రూపం చూడొ చ్చనుకున్నాడు హోత్సుమీ.

 

  కానీ ఆమె తిరగలేదు. మరునాడు అదే సమయానికి మళ్లీ పాట. వెతుక్కుంటూ వెళ్లిన హోత్సుమీకి అదే భంగపాటు. అలా వారం గడిచింది. ఇక ఆగలేకపోయాడు హోత్సుమీ. వెళ్లిపోతున్న ఆమెను ఆగ మన్నాడు. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ‘మీ పాట జీవితాంతం వినాలన్పిస్తోంది. నన్ను పెళ్లి చేసు కుంటారా?’ అని అడిగాడు. చప్పున వెనక్కి తిరిగిందామె. అప్పుడు చూశాడామెని. అతడి మనసు వికలమై పోయింది. ఆమె స్వరం అంత అందంగా ఆమె మోము లేదు. కురూపి. ముఖం తిప్పుకున్నాడు.

 

 ఆమె మాత్రం ఆనందంగా వచ్చి అతణ్ని వాటేసుకుంది. ‘ఈ ప్రేమ కోసం ఇన్నాళ్లూ అలమటించాను, ఈ జన్మలో మీ చేయి వదలను’ అంది. అస హ్యంతో, అవమానంతో అతడి అణు వణువూ రగిలిపోయింది. ఆమె తన గురించి వాళ్ల వాళ్లతో చెబితే చచ్చినట్టు ఆమెను పెళ్లాడాలి. అందుకే కోపాన్ని అణ చుకుని నవ్వును నటించాడు. విహారానికి వెళ్దాం రమ్మని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను చంపేశాడు. తర్వాత తన దారిన తను వెళ్లిపోయాడు.కానీ హోత్సుమీకి తెలియదు... ఆమె మృతదేహాన్ని ఆమె తరఫువాళ్లు కను గొన్నారని, దాన్ని ఆమెకెంతో ఇష్టమైన బౌద్ధాలయానికి దగ్గర్లోనే సమాధి చేశారని. తెలిసుంటే ఇరవయ్యేళ్ల తర్వాత అక్కడికి వెళ్లివుండేవాడు కాదు. తన పాపానికి పరిహారంగా మృత్యువునే పొంది ఉండేవాడు కాదు!                      

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top