ఏనాటి బంధమో!

ఏనాటి బంధమో!


 జ్ఞాపకం

 మా ఇల్లు రైల్వేస్టేష్టన్‌కి దగ్గరగా ఉండేది. రైలు  శబ్దం వినకపోతే ఏదో లోటుగా అనిపించేది.  రైల్వే క్యాంటీన్‌లో కూర్చుని వచ్చి పోయే రైళ్లను, అందులో నుంచి దిగే ప్రయాణికులను చూడడం అలవాటుగా ఉండేది. బహుశా ఈ అలవాటే నేను ఒకరిని రక్షించడానికి కారణమైంది.ఒకరోజు మా ఫ్రెండ్స్ ఎవరూ ఊళ్లో లేరు. ఏమీ తోచక ఫ్లాట్‌ఫామ్ మీద నడుస్తూ ఉన్నాను. ఒక ట్రైన్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి ఏడుస్తూ దిగాడు. అతడిని మా ఊళ్లోగానీ, చుట్టుపక్కల ఊళ్లల్లోగానీ ఎప్పుడూ చూసినట్లు అనిపించలేదు. ట్రైన్ దిగిన వాళ్లంతా ఎటు పోవాల్సిన వాళ్లు అటు వెళ్లిపోయారు. ఆ వ్యక్తి  మాత్రం ఎటూ వెళ్లకుండా ఒక చోట కూలబడ్డాడు. కంటికి ధారగా ఏడుస్తున్నాడు.

 

 అతడినలా చూస్తే జాలేసింది. వెళ్లి ‘‘ఎందుకలా ఏడుస్తున్నారు?’’ అని అడగాలనుకున్నాను. కానీ ఎందుకో వెనకడుగు వేశాను. అయితే ఆయన కొద్దిసేపటి తరువాత పట్టాల వెంట వేగంగా నడవడం  మొదలుపెట్టాడు. నాకెందుకో అనుమానం వచ్చి ఆయన వెంటే వెళ్లాను. ఆయన ఒక చోట పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. నా గుండె ఆగిపోయింది.  ఇంతలో ఒక ట్రైన్ వేగంగా వస్తోంది. కాస్త అటు ఇటయితే ఆయన ప్రాణం పోయేది.

 

 కానీ నేను పరుగున వెళ్లి ఆయన్ని అక్కడి నుంచి లాగాను. ఆ మధ్యనే ఆయన భార్యాపిల్లలు ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయారట. అది తట్టుకోలే, వాళ్లు లేకుండా బతకలేక ఈ నిర్ణయం తీసు కున్నాడట. మనసు అదోలా అయిపోయింది. ఓదార్చి మా ఇంటికి తీసుకెళ్లాను. అమ్మానాన్నా కూడా ఆయనకెంతో ధైర్యం చెప్పడంతో ఒక వారం రోజుల్లో మూమూలు మనిషయ్యాడు. మా ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అయ్యాడు. ఇప్పటికీ మా బంధం కొనసాగుతూనే ఉంది!

 - ఆర్.రాజ్‌కుమార్, చింతల్‌పల్లి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top