ఘనజీవి

ఘనజీవి - Sakshi


 ‘‘రావిశాస్త్రి మంచి రచయిత కాడు’’.

 అది సుబ్బయ్య అభిప్రాయం కాదు.

 ‘‘రావిశాస్త్రి ఒట్టి చచ్చు రచయిత’’.

 అదీ సుబ్బయ్య అభిప్రాయం కాదు.

 ‘‘రావిశాస్త్రి ఈజ్ వెరీ ఎఫిషియన్ట్ రైటర్’’.

 సుబ్బయ్యలాగే అనేకమంది ‘పాస్’ చేసే ‘రిమార్క్’ అది.




రావిశాస్త్రి హాఫ్ హాండ్స్ చొక్కా వేసుకుంటాడు. వేసుకున్న హాఫ్‌హాండ్స్ చొక్కాను టక్ చేసుకుంటాడు. మనిషి చూడ్డానికి తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉన్నాయన నల్లటి కళ్లద్దాలు పెట్టుకుంటాడు. ఆ కళ్లద్దాలు మందంగా ఉంటాయి. హాఫ్‌హాండ్స్ చొక్కాను టక్ చేసుకునే ఈ తెల్లటి నల్ల కళ్లద్దాల మనిషిని పూర్తిపేరుతో ‘రాచకొండ విశ్వనాథశాస్త్రి’ అని ఎవరూ పిలవరు. ‘చాత్రిబాబు’ అంటారు. లాయర్ బాబు అని కూడా అంటారు. అలాంటి లాయర్‌బాబైన చాత్రిబాబు ‘నంగిరిపింగిరి’గా ఎప్పుడూ రాయలేదు. ధైర్యంగా రాసేడు. జోరుగా రాసేడు. రకరకాల బతుకుల్నీ, ‘అధోజగత్’ జీవుల్నీ; కోర్టుల్లోని ప్లీడర్లనూ, సాక్షులనూ, సారాకాసేవాళ్లనూ, ఆ కాసిన సారాతాగేవాళ్లనూ, సిల్కు జాకెట్లనీ, ‘గవరయ్య’ల్నీ, నాయకుల్నీ, దోపిడీగాళ్లనీ, అమాయకుల్నీ, పిరికివాళ్లనీ అందరినీ బొమ్మ కట్టించేడు.



 ‘ధైర్యం ఉంటేనే మిగతా సద్గుణాలు (నిలబడతాయి.)... పాపుల్లో సాహసులూ ఉంటారు, భయస్తులూ ఉంటారు. కాని- భయానికీ మంచికీ పొందిక లేదు. పిరికివారెవరూకూడా మంచివారు కాజాలరు; మంచికి నిలబడలేరు... మంచిగా ఉండాలంటే గుండె నిబ్బరం చాలా ఉండాలి,’ అని మనస్ఫూర్తిగా నమ్మి రాసేడు.

 ‘డబ్బులో వుండే సౌఖ్యాలూ, లేమిలో వుండు దుఃఖాలూ, ధనం కల్పించే గొప్ప గర్వం మదాంధతా, లేమి కల్పించే నిస్పృహ నైచ్యం దైన్యం’ అన్నీ కూడా జీవితంలోంచి బాగా ఎరిగి రాసేడు.

 ‘నిజంగా జరిగింది నిజంగా జరిగిందా? జరిగినది నిజం జరిగినది నిజమేనా?’ అని అక్షరాలను ఆచితూచి మరీ రాసేడు.

 ‘దారిద్య్రం ఎవ్వరికీ... (చివరికి తన) పగవాడిక్కూడా ఉండకూడదని’ మరీమరీ తలిచేడు, తలిచి మరీ రాసేడు.

 ‘‘సందర్భానికి తగినట్టుగా ఆయన రచన ఒకచోట సెలయేటి నడకలా ఆహ్లాదం కొలుపుతుంది. మరొకచోట ప్రవాహంలా పరవళ్లు తొక్కుతుంది. ఇంకొకచోట జలపాతంలా ఊపిరి సలపకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఉండి ఉండి ఒక్కొకచోట కవిత్వంగా మారి కావ్యస్థాయికి తీసుకెళ్తుంది’’.

 ‘బందోబస్తుగా చాలా భారీగా ఉన్నాడతను. సీమపందిలా ఎర్రగానూ, పనసకాయలా గరుగ్గానూ ఉన్నాడు. బాగా సర్వీసు చేసినప్పటికీ చెడిపోకుండా నిలబడ్డ బెంజి లారీలా దిట్టంగానూ ఉన్నాడు’. (‘రాజు-మహిషి’ నవలలో మందుల భీముడి గురించి)

 ‘ఆమెకు ముప్పయ్యేండ్లుండొచ్చు. ఒకప్పుడామె అందంగా ఉండుంటుంది. పెద్ద కొప్పుని ఒకప్పుడు చక్కగా ముడుచుకుని ఉండుంటుంది. ఆమె కట్టుకున్న నల్లకోక ఒకప్పుడు, అప్పుడెప్పుడో కొత్తదయుంటుంది. చాలారోజుల కిందట చాలాసార్లు భోంచేసి ఆమె ఆరోగ్యంగా ఉండుంటుంది (‘మాయ’ కథలో ముత్తేలమ్మ వర్ణన)

 శంకరగిరి గిరిజాశంకరం, అన్‌జానా, జాస్మిన్, కాంతాకాంత, గొల్కొండ రాంప్రసాద్ లాంటి మారుపేర్లతోనూ రాశాడు రావిశాస్త్రి.

 తన కోపం, తన దుఃఖం, సంతోషం, సరదా, క్యూరియాసిటీ వగైరాలు ఇతరులకు తెలియచెయ్యడానికి కూడా ఆయన రచయిత అవతారం ఎత్తాడు.

 అయితే, ‘తాను రాస్తున్నది ఏ మంచికి హాని కల్గిస్తూందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తూందో అని ఆలోచిం’చి మరీ జాగ్రత్తగా రాసేడు. ‘రచయిత (అయిన) ప్రతివాడూ’ కూడా అలాగే రాయాలని కోరుకున్నాడు.

 ఆరు సారా కథలు, ఆరు సారో కథలు, ఆరు చిత్రాలు, మరో ఆరు చిత్రాలు, రుక్కులు, బాకీ కథలతోపాటు, అల్పజీవి, ఇల్లు, సొమ్మలు పోనాయండి, గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలల్ని మళ్లీ మళ్లీ చదువుకొండని వదిలేసివెళ్లిపోయాడు రావిశాస్త్రి. రత్తాలు-రాంబాబు, రాజు-మహిషి లాంటి అసంపూర్ణ నవలలను పూరించుకునే అవకాశం కూడా ఇచ్చివెళ్లాడు. అర్ధాంతరంగా ముగించినా, వాటిని సంపూర్ణంగా పారాయణం చేయగలిగేలా చేసేది రావిశాస్త్రి చేసిన మాటల మాయాజాలం; కాళిదాసులాగా ముచ్చటగొలిపే ప్రతీకల శైలీ విన్యాసం. అసలు ఉపమానాలతోనే కడుపు నింపేస్తాడు. ఒక్కోసారి కథను పక్కనపెట్టి, చదవడం కోసమే చదువుకోగల వినోదం ఇస్తాడు. ఆ తరహా చాలా కొద్దిమందికి లోపమూ, చాలా ఎక్కువమందికి ఆయన అక్షరాల్ని విడిచిపెట్టకుండా చదువుకునే ఆకర్షణాబలమూ!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top