విహారం...వినోదం...బావిలోనే!

విహారం...వినోదం...బావిలోనే!


ఇక్కడ కనిపించేది ఏడంతస్తుల మేడ కాదు. ఏడు నిలువుల లోతున్న బావి. పేరు రాణీ కీ వావ్. అంటే రాణి గారి బావి అని అర్థం. ఇది గుజరాత్‌లోని పఠాన్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ తీరాన ఉంది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌కు 130 కి.మీ.ల దూరం. ఈ బావిలోకి దిగడం ఓ విచిత్రం. అయితే, ఏ మెట్టు నుంచి నుంచి దిగామో తిరిగి అదే మెట్టుకు చేరడం అసాధ్యమే. నిజమే! ఒక చోట మొదలై తిరిగి అదే చోటుకు రావడం అంటే ఓ పజిల్‌ని పూరించినట్లే. ఏడు అంతస్తులలో ఏడు విశాలమైన వరండాలు, ఆ వరండాలకు ఆధారమైన స్తంభాల మీద అందమైన శిల్పాలు, చల్లటి గాలి... అన్నీ కలసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కానీ 64 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 27 మీటర్ల లోతున్న ఈ బావిలోకి దిగడం ఓ సాహసం. ఓసారి దిగిన తర్వాత ప్రపంచాన్ని జయించినంత గొప్ప అనుభూతి కలుగుతుంది.

 

 ఎవరిదీ ఆలోచన?!


 ఈ ప్రదేశాన్ని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం పాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని జ్ఞాపకార్థం ఆయన భార్య రాణి ఉదయమతి దీనిని నిర్మించింది. అయితే ఇంత పెద్ద నిర్మాణం సరస్వతి నదికి వచ్చిన వరదల్లో మునిగి 1980 వరకు ఇసుక మేటలోనే ఉండిపోయింది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయట పడిన ఈ బావి గత ఏడాది జూన్‌లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేరింది. వందల ఏళ్లపాటు మట్టిలో ఉన్నప్పటికీ స్తంభాల మీదున్న శిల్పాలు చెక్కు చెదరలేదు. బుద్ధుడు, విష్ణువు, దశావతారాలు, కల్కి, రాముడు, మహిషాసురమర్దని, నరసింహుడు, వామన, వరాహ అవతారాలతోపాటు నాట్య భంగిమలో ఉన్న నాగకన్యలు... మొత్తం ఐదు వందల శిల్పాలున్నాయి. ఏడంతస్తుల నిర్మాణంలో సుమారు ఎనిమిది వందల శిల్పాలు చెక్కి ఉండవచ్చని అంచనా. ఇప్పుడు ఐదు అంతస్తులు మాత్రమే సరిగ్గా ఉన్నాయి.

 

 సాధారణంగా బావిలో దిగిన వాళ్లు ఆక్సిజన్ తగినంత అందక, ఎక్కువసేపు ఉండలేకపోతారు. కానీ ఈ నిర్మాణంలో మెట్లు దిగి కిందికి వెళ్లే కొద్దీ ఎటువంటి అసౌకర్యమూ ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి సులువుగా ప్రసరించేటట్లు ఉంటుంది నిర్మాణశైలి. నాలుగో అంతస్తు నుంచి మరొక బావి అనుసంధానమై ఉంటుంది. పైన దీర్ఘచతురస్రాకారంలో, లోతుకు వెళ్లే కొద్దీ వలయాకారంగా ఉంటుంది.

 

 ఈ బావి ఎందుకంటే...

 గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇలాంటి బావులు ఎక్కువగా కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం మూడు వేల ఏళ్ల నుంచి అనుసరిస్తున్న విధానం ఇది. భూగర్భ జలాలను రక్షించుకోవడానికి లోతైన బావులను తవ్వుతారు. వర్షపు నీరు చేరడానికి కాలువలు, చిన్న చిన్న తటాకాలను తవ్వుతారు. పనిలో పనిగా కొన్నింటిని విహారకేంద్రాలుగా మలచుకుంటారు. ఎండాకాలంలో ఇవి చక్కటి వేసవి విడుదులు. ఈ బావుల పరిసరాల నుంచి ఓ పది అడుగుల దూరంలో భానుడి తీవ్రత భరించలేనంత తీక్షణంగా ఉన్నప్పుడు కూడా దిగుడు బావి దగ్గర శీతల పవనాలు వీస్తుంటాయి.

 

 అప్పటి ఆర్కిటెక్టులకు నేచురల్ ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీ ఏదో తెలిసే ఉంటుంది. ఇన్ని తెలిసిన తర్వాత ఇలాంటి దిగుడుబావిలోకి తొంగి చూడని యువత ఉండదు. అలాగే పఠాన్‌లో తయారయ్యే పటోలా చీరల మీద మనసు పారేసుకోని మహిళ ఉండదు. ఇదే ట్రిప్‌లో మధేరాలోని సన్ టెంపుల్‌ను, దాని పక్కనే ఉన్న సూర్యకుండ్‌ను కూడా చూడవచ్చు. రాన్ ఆఫ్ కచ్‌లో ఫ్లెమింగోలను, ఎండకు కాంతులీనుతూ కళ్లను మిరుమిట్లు గొలిపే ఉప్పు కయ్యలను కూడా చూడచ్చు. అయితే ఇక్కడ ఒక కిలో ఉప్పు కొనడం కష్టమే. కనీసం నాలుగు కిలోలైనా కొనాలి. ఎందుకంటే కిలో ఉప్పు పావలా. ఇప్పుడు పావలాలే లేవు మరి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top