రక్త చరిత్ర

రక్త చరిత్ర - Sakshi


నిజాలు దేవుడికెరుక

 అనుకోకుండా ఎవరో అన్న మాట...

 ఓ పెద్ద రహస్యాన్ని వెలికి తీసింది.

 ఓ ఘోర నిజాన్ని కళ్లముందు నిలిపింది.

 యావత్ ప్రపంచాన్నే వణికించింది. అసలింతకీ ఏం జరిగింది???


 

 ఆగస్ట్ 1992, ఇంగ్లండ్‌లోని గ్లాస్టర్ నగరం...స్టేషన్‌లో కూర్చుని తీరిగ్గా ఫైళ్లు తిరగేస్తున్నాడు పోలీస్ చీఫ్ బెంజమిన్. అంతలో సబార్డినేట్ బెన్ వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా ఎదురుగా నిలబడి చేతులు నులుముకుంటున్నాడు. అతన్నలా చూడగానే ఏదో విషయం ఉందని అర్థమైంది బెంజమిన్‌కి.

 

 ‘‘ఏంటి బెన్... ఏదో చెప్పాలని వచ్చినట్టున్నావ్’’... అన్నాడు చేతిలోని ఫైల్ టేబుల్ మీద పెడుతూ.

 ‘‘అదీ... నాకు రెండు రోజులు లీవ్ కావాలి సర్’’... నసిగాడు బెన్. నవ్వాడు బెంజమిన్. ‘‘లీవ్ కూడా నువ్వు ధైర్యంగా ఎందుకు అడగలేకపోతు న్నావో తెలుసా? అలా అడగడం తప్పని నీకు తెలుసు కాబట్టి. ఈ నెలలో నువ్వు లీవ్ అడగడం రెండోసారి. నువ్వు చేసేది పోలీస్ ఉద్యోగమని గుర్తుందా బెన్?’’అధికారి స్వరం కాస్త కటువుగా పలికేసరికి కంగారుపడ్డాడు బెన్. ‘‘సారీ సర్. మా ఆవిడకి ఒంట్లో బాగోవడం లేదు. పాప ఏమో చిన్నది. అందుకే ఇలా లీవులు పెట్టాల్సి వస్తోంది. కాదనకండి’’.. బతిమాలుతున్నట్టుగా అన్నాడు.

 

 ఓసారి బెన్ వైపు తీక్షణంగా చూసి చూపు తిప్పుకున్నాడు బెంజమిన్. ‘‘పోలీసులమైనంత మాత్రాన మనకి సమస్యలు ఉండవని కాదు. కాకపోతే వాటికి ఎదురీదే శక్తి అందరికంటే మనకి కాస్త ఎక్కువ ఉండాలి. నువ్వు తరచుగా లీవులు తీసుకుంటున్నావని మిగతావాళ్లు కంప్లయింట్ చేస్తున్నారు. దానికి తోడు గత కొద్ది నెలలుగా నీ పర్‌ఫార్మెన్స్ కూడా పూర్‌గానే ఉంది. ఏదీ... ఇటీవలి కాలంలో నువ్వు కష్టపడి ఇన్వెస్టిగేట్ చేసిన ఒక కేసు చూపించు నాకు?’’ బెన్ ముఖం ఎర్రబడింది. ‘‘నేనేమీ పనికి బద్దకించడం లేదు సర్. మొన్నటికి మొన్న ‘25 క్రామ్‌వెల్ స్ట్రీట్’లో ఉన్న ఒక ఇంటివాళ్ల పాప కనిపించట్లేదని తెలిసింది. పనిగట్టుకుని వెళ్లి ఇన్వెస్టిగేట్ చేశాను. కానీ ఆ పాప తల్లిదండ్రులు సహకరించలేదు. నన్నేం చేయమంటారు చెప్పండి?’’... కినుకగా అన్నాడు బెన్.

 

 బెంజమిన్ మెదడులో ఏదో కదిలి నట్టయ్యింది. ‘‘పాప కనిపించడం లేదన్న విషయం నీకెలా తెలుసు?’’... అడిగాడు.

 ‘‘ఆరోజు నేనా ప్రాంతానికి పనిమీద వెళ్లాను. అక్కడ ఎవరో మాట్లాడుకుం టుంటే విన్నాను. వాళ్ల పక్కింటి వాళ్ల పాప కనిపించడం లేదంట. ఉన్నట్టుండి మాయమైపోయింది, ఏదో జరిగి ఉంటుంది అని వాళ్లు అనుకుంటున్నారు. దాంతో నేను ఆ పాప ఇంటికెళ్లి పేరెంట్స్‌ని అడిగాను. కానీ వాళ్లు సమాధానం చెప్ప డానికి ఇష్టపడలేదు సర్. మా పాప ఊరెళ్లింది అని చెప్పి ముఖమ్మీదే తలుపు వేసేశారు. అందుకే వచ్చేశాను.’’‘‘నీకసలు బుర్ర ఉందా? వాళ్లు చెప్పేస్తే వచ్చేస్తావా? విషయం ఏంటో కూపీ లాగొద్దూ?’’... కాస్త విసుగ్గా అన్నాడు బెంజమిన్.

 

 ‘‘ఏదైనా జరిగివుంటే తల్లిదండ్రులు కంప్లయింట్ ఇస్తారు కదా అని...’’

 చిర్రెత్తుకొచ్చింది బెంజమిన్‌కి. ‘‘నిజంగా పాప ఊరు వెళ్లి ఉంటే వాళ్లు ముఖమ్మీద తలుపేయాల్సిన అవసరం లేదు. పైగా చుట్టుపక్కల వాళ్లు తల్లి దండ్రుల్ని అనుమానిస్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఈ చిన్న విషయం కూడా నీ బుర్రకి తట్టలేదంటే ఏమనాలి నిన్ను?’’తల దించుకున్నాడు బెన్. ముఖంలో అవమాన భారం కనిపించింది. దాంతో బెంజమిన్ కాస్త తగ్గాడు. ‘‘సరే నువ్వెళ్లు. నేను చూస్తాలే. రెండు రోజులే లీవు’’ అన్నాడు స్వరం తగ్గించి. సెల్యూట్ చేసి వెళ్లిపోయాడు బెన్. బెంజమిన్ మాత్రం బెన్ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు.

   

 25 క్రామ్‌వెల్ స్ట్రీట్....

 పోలీసు జీపు వచ్చి ఓ ఇంటిముందు ఆగింది. ఆ ఇల్లు చూడటానికే విచిత్రంగా ఉంది. మరీ పాత కట్టడం కాదు. కానీ శుభ్రం చేయకపోవడం వల్ల దుమ్ము కొట్టుకుపోయి, రంగులు వెలిసిపోయి, చెత్త పేరుకుపోయి చిరాగ్గా తయారైంది. పరిసరాలను పరిశీలిస్తూ వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు బెంజమిన్.  ‘‘ఎవరు కావాలి?’’... తలుపు తెరుస్తూనే అరిచినట్టు అడిగాడా వ్యక్తి. బెంజమిన్‌కి ఆశ్చర్యం వేసింది. సమయం సందర్భం లేకుండా పోలీసులు ఇంటికొస్తే ఎవరికైనా కంగారుగా ఉంటుంది, కానీ ఇతనేమిటి నామీదే విసుక్కుంటున్నాడు అనుకున్నాడు మనసులో. ‘‘నేను ఇన్ స్పెక్టర్ బెంజమిన్. మీ అమ్మాయి కని పించడం లేదని తెలిసింది. ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను’’ అన్నాడు తన భావాలు పైకి కనిపించనీయకుండా.ఆ మాట వింటూనే విరుచుకుపడ్డాడా వ్యక్తి. ‘‘ఎవరు మీకీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? మా అమ్మాయికి ఏమీ కాలేదు. మా బంధువుల ఇంటికి వెళ్లింది. సెలవులు కదా’’ అన్నాడు విసుగ్గా. ‘‘పరీక్షలు దగ్గరకు వస్తుంటే ఇప్పుడెవ రండీ మీ అమ్మాయికి సెలవులు ఇచ్చింది’’ అన్నాడు బెంజమిన్ ఆ వ్యక్తివైపే తీక్షణంగా చూస్తూ.

 

 గతుక్కుమన్నాడతను. కంగారు పడ్డాడు. బిత్తర చూపులు చూశాడు. దాంతో బెంజమిన్ అనుమానం బల పడింది. ‘‘మర్యాదగా నిజం చెప్పు మిస్టర్ ఫ్రెడ్ వెస్ట్. నేనన్నీ తెలుసుకునే వచ్చాను. మీ అమ్మాయి ఆనీ ఎక్కడ?’’... ఈసారి బెంజమిన్ గొంతు కరకుగా పలికింది. ఫ్రెడ్ ఏదో చెప్పబోయాడు. కానీ కన్‌ఫ్యూజ్ అయ్యాడు. దాంతో బెంజమిన్ బృందం అతన్ని పక్కకు నెట్టి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇల్లంతా వెతికింది. ప్రతి గదినీ పరిశీలించింది. వంటింట్లో అడుగు పెడుతుంటే అడ్డుపడింది ఫ్రెడ్ భార్య రోజ్‌మేరీ. ‘‘మీకు ఎవరిచ్చారీ అధికారం? ఎందుకు ఇల్లంతా తిరుగుతున్నారు’’ అంటూ అరిచింది. బెంజమిన్ తన స్టయిల్లో సమాధానం చెప్పేసరికి సెలైంట్ అయిపోయింది.

 

 పోలీసులు అంగుళం కూడా వదల కుండా పరిశోధించారు. ఎక్కడా ఏ ఆధారమూ దొరకలేదు. కానీ సెల్లార్‌లోకి వెళ్లాక ఊహించని ఓ భయానక అనుభవం ఎదురైంది. సెల్లార్ అంతా గందరగోళంగా ఉంది. ఏవోవో పెట్టెలు ఉన్నాయి. అక్క డక్కడా తవ్వి మళ్లీ పూడ్చిన గురుతులు ఉన్నాయి. పెట్టెలు తెరిచిన పోలీసులు లోపల ఉన్న ఎముకలను చూసి గతుక్కు మన్నారు. పూడ్చిన గోతుల్ని తవ్వినప్పుడు లోపల కనిపించిన కుళ్లిన మృతదేహాలను, ఎముకల గూళ్లను చూసి అవాక్కయ్యారు. ఒకటీ రెండూ కాదు పదకొండు హత్యలకు సాక్ష్యాలు దొరికాయా సెల్లార్‌లో.

 

 బెంజమిన్‌లో ఆవేశం పెల్లుబికింది. ఫ్రెడ్ వెస్ట్‌ని స్టేషన్‌కి లాక్కెళ్లాడు. మొదట ఏవో కథలు చెప్పాడు ఫ్రెడ్. కానీ పోలీసు పవర్ రుచి చూశాక నిజాలన్నీ కక్కాడు. ఆ హత్యలన్నీ తాను, తన భార్య రోజ్‌మేరీ కలిసి చేశామని ఒప్పుకున్నాడు.  ఆ రోజు విచారణలో ఫ్రెడ్ చెప్పిన విషయాలు విని మతి పోయింది పోలీసులకి. దొరికినవి పదకొండు హత్యలకు ఆధారాలే అయినా... నిజానికి ఫ్రెడ్ దంపతులు చంపింది ముప్ఫైమందికి పైనే. ఈ రక్తచరిత్ర ఫ్రెడ్ చిన్నప్పుడే మొద లయ్యింది.  ఫ్రెడ్ బాల్యం అతణ్ని ఓ కిరా తకుడిలా తయారు చేసింది.

 

  ఫ్రెడ్ తల్లి దండ్రులు విచ్చలవిడిగా జీవించేవారు. నచ్చినవారితో సంబంధాలు పెట్టుకునే వారు. పన్నెండేళ్లు రాగానే ఫ్రెడ్‌ని సైతం అతడి తల్లి లైంగికంగా వేధించింది. దాంతో అతడిలో విచ్చలవిడితనం తప్పు కాదు అనే భావన మొదలైంది. ఎవరు ఎవరితోనైనా సంబంధాలు నెరపవచ్చు అన్న ఆలోచన యవ్వనంలోకి వచ్చేసరికి అతడిలో నాటుకుపోయింది. దాంతో కనిపించినవారి మీదల్లా మోహపడేవాడు. కాదంటే రేప్ చేసి చంపేసేవాడు. శవాన్ని ఎవరికీ దొరక్కుండా మాయం చేసేవాడు. కొన్నాళ్లకు తన గాళ్‌ఫ్రెండ్ క్యాథరీన్‌ని పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. కానీ ఫ్రెడ్‌లోని పైశాచికత్వాన్ని భరించలేని క్యాథరీన్... ఇద్దరు పిల్లల్నీ భర్త వద్దే వదిలిపెట్టి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత క్యాథరీన్‌ను వెతికి పట్టుకుని చంపేశాడు ఫ్రెడ్.

 

 ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రెడ్‌కి రోజ్ మేరీతో పరిచయమైంది. ఆమెది కూడా ఫ్రెడ్‌లాంటి బాల్యమే. ఎన్నో వేధింపులకు గురయ్యింది. దాంతో మానసిక రోగిలాగా తయారైంది. ఆమెను ఇష్టపడి పెళ్లి చేసు కున్నాడు ఫ్రెడ్. ఇద్దరు కిరాతకులు కలి శారు. మానవత్వాన్ని మర్చిపోయి చెలరేగి పోయారు. ఎక్కడ ఏ ఆడపిల్ల ఒంటరిగా కనిపించినా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసే వారు. ఫ్రెడ్ వాళ్లపై దారుణంగా అత్యా చారం చేసేవాడు. అందుకు రోజ్ సహకరించేది. ఇంకా ఇంకా వేధించమని రెచ్చగొట్టేది. తర్వాత ఇద్దరూ కలిసి వాళ్లను చంపేసేవారు. కొందరిని చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతేశారు. కొందరిని కాల్చి బూడిద చేశారు. కొందరిని తమ సెల్లార్‌లోనే సమాధి చేశారు. దారుణం ఏమిటంటే... చివరికి ఫ్రెడ్ తన పిల్లల్ని కూడా వదల్లేదు. ముందు చిన్న కూతురైన ఎనిమిదేళ్ల చార్మైన్‌ని రేప్ చేసి చంపేశాడు. ఆమెను తల్లి క్యాథరీన్ దగ్గరకు పంపే శానని పెద్ద కూతురైన పదిహేడేళ్ల ఆనీకి చెప్పాడు.

 

 నిజానికి అప్పటికే క్యాథరీన్‌ని కూడా చంపేశాడు. ఆ విషయం తెలీని ఆనీ నిజమనుకుని ఊరుకుంది. అయితే ఒకరోజు తండ్రి తనమీద పశువులా పడే సరికి షాకైపోయింది. తనని వదిలి పెట్టమని వేడుకుంది. కానీ ఆ దుర్మార్గుడు కనికరించలేదు. మూడు రోజుల పాటు కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. భార్య సహాయంతో దాన్ని వీడియో తీశాడు. తట్టుకోలేకపోయింది ఆనీ. ఇంటి పక్కనే ఉన్న తన స్నేహితులతో చెప్పుకుని ఏడ్చింది. ఆ రోజు రాత్రే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె ఏమైందో తెలుసు కుందామని చుట్టుపక్కల వాళ్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బెన్ ద్వారా బెంజమిన్‌కు తెలిసింది. ఆ కిల్లర్ దంపతుల రక్తచరిత్రకు తెరపడింది.

 

 రెండేళ్ల పాటు కేసు నడిచింది. చేసిన ఘాతుకాలకుగాను కోర్టు ఫ్రెడ్‌కి ఉరిశిక్ష విధించింది. అతడికి సహకరించినందుకు రోజ్‌మేరీని జీవితాంతం జైల్లోనే మగ్గమంటూ ఆదేశించింది. ఎందరి ప్రాణాలనో తీసిన ఫ్రెడ్‌కి సైతం భయం వేసింది. తీర్పు వెలువడిన మరుసటిరోజే జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెడ్ పాపాల్లో భాగం పంచుకున్న అతడి అర్ధాంగి రోజ్ ప్రస్తుతం జైల్లో ఉంది. విచిత్రమేమిటంటే... ఆమె ఇప్పటికీ తన నేరాల్ని అంగీకరించలేదు. తను చేసిన దారుణాల విషయంలో కాస్తయినా పశ్చాత్తాపపడటం లేదు!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top