అన్వేషణ

అన్వేషణ

వర్షం ఉధృతంగా కురుస్తోంది. నాలుగు బాటలు కలిసే ఒకచోట ఎవరో ధర్మాత్ముడు కట్టించిన ఒక చిన్న సత్రం స్వరూపాన్ని కోల్పోయి, శిథిలమై వానలో తడుస్తోంది. అంత వర్షం కురుస్తోన్నా లెక్కచేయకుండా ఒక ఎద్దు సత్రం ముందున్న చెట్టుక్రింద బద్ధకంగా గడ్డి నెమరేస్తోంది. సత్రం ముందున్న నల్లమాను చెట్లు తలలు విరబోసుకొని నృత్యం చేస్తున్న దయ్యాల్లా అటూ ఇటూ ఊగుతున్నయ్. గాలి తాకిడికి కొట్టుకొని వచ్చే వానజల్లు సత్రం లోపల ముడుచుకు కూర్చున్న నలుగురు వ్యక్తులను ఝడిపిస్తూంది. జల్లు లోనికి వచ్చేకొద్దీ వాళ్లు కొద్దికొద్దిగా వెనక్కు జరుగుతున్నారు.

 

 ‘‘వెధవ్వాన... బ్రతుకనిచ్చేట్లేదు’’ అన్నాడు లోకనాథం విసుగ్గా గంజాయి గొట్టాన్ని మరింత గట్టిగా పీలుస్తూ.  చైత్ర మాసంలో ఎండ మాడ్చేస్తున్న రోజుల్లో ‘‘వెధవెండ... ప్రాణాలు తోడేస్తూంది’’ అని విసుక్కున్నాడు. చలిగాలి బాకుల్లా శరీరాన్ని చీలుస్తున్న చలికాలంలో ‘దరిద్రపు చలి’ అని గొణుక్కున్నాడు. కాలాలు మారుతున్నయ్ కాని - అతని బ్రతుకులో మార్పు రాలేదు. చలి, ఎండ, వానలను తట్టుకుంటూనే బతుకు సాగిస్తున్నాడు.  సరిగ్గా ఆ చతుష్పధానికి రెండేసి మైళ్ల దూరంలో నాలుగువైపులా నాలుగు బస్తీలున్నాయి. లోకనాథం అట్టబొమ్మలు చేసి బస్తీలో అమ్మగా వచ్చిన డబ్బుతో పొట్ట గడుపుకుంటున్నాడు. ప్రొద్దుననగా బస్తీకి బయలుదేరాడంటే తిరిగి ఏ సాయంత్రానికో సత్రానికి వచ్చేవాడు. ఆ సత్రంలో మరో ముగ్గురుంటున్నారు.

 

  ఆ ముగ్గురిలోనూ పాండురంగడు కొద్దిగా తలతిక్క మనిషి. గోడలమీద బొగ్గుతో బొమ్మలు గీసి నలుగుర్ని ఆకర్షించి, దర్జా గానే నాలుగు డబ్బులు అడుక్కునేవాడు. రవణుడికి ఒక కాలు కుంటి, ఒక కన్ను గుడ్డి. ఎక్కడయినా డబ్బులు బాగా దొరుకుతాయనుకునే చోట గుడ్డ ఒకటి పరచి అడుక్కునేవాడు. నాలుగోవాడు కాముడు. రెండు కండ్లూ లేని అంధుడు. వీళ్లను విధి ఏ విధంగా కలిపిందో తెలీదు కానీ కలిసే జీవిస్తున్నారు. ఒకరంటే ఒకరికి వల్లమాలిన ప్రేమ. తలకొక దారినపోయి కాస్తో కూస్తో సంపాదించి కొంచం చీకటి పడగానే సత్రానికి చేరుకునేవారు. ఎవరికి ఎంత లభ్యమయితే అంత భోజన సామగ్రి తెచ్చి పడేస్తారు. వండుకుని తిని, కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత నిద్రపోతారు. వీళ్ల దైనందిన జీవితం గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పుకోదగ్గ విషయాలు ఏవీ లేవు.

 

 వేసవి కాలంలో అయితే ఏ చెట్టు కిందయినా తల దాచుకోవచ్చుగానీ, వచ్చిన చిక్కల్లా ఈ వర్షాకాలంలోనే! ఆ చిన్న సత్రంలో శిథిలమవగా మిగిలినవి హాలు, ఒక చిన్న గది. సత్రాన్ని కట్టి చాలాకాలం కావడం మూలాన, పైకప్పు, గోడలు నెర్రెలుపడి, వర్షపు నీరు బొట్లు బొట్లుగా పడుతూంటుంది. ఆ చిన్న గది నలుగురికి కావాల్సిన సామాను ఎంత కాలమని రక్షిస్తుంది! బియ్యం, పప్పులు లాంటివి పోసుకునేందుకు పగుళ్లు పడిన పెద్ద డబ్బా, రెండు మూడు మట్టి కుండలూ, ఒక చింకి చాట ఉన్నాయ్. 

 

 అవి కూడా ఎంత కాలమని వర్షపు ధాటికి నిలువగలవు! ఆ గదిలోనే ఎలుకల దండుకు, వాటిని తరిమేందుకు పెట్టిన రెండు పెంపుడు పిల్లులకు నిరంతరం యుద్ధం జరుగుతుంటుంది. వీటి యుద్ధానికి భేరి నాదంలా ఆ పగుళ్ల డబ్బా పెద్దగా శబ్దం చేస్తూ ఉంటుంది.వర్షం హోరు మరింత హెచ్చింది. లోకనాథం దుప్పటి గట్టిగా చుట్టుకొని, మోకాళ్ల మీద తల ఆన్చుకొని, గతాన్ని తలపునకు తెచ్చుకొంటున్నాడు. తండ్రి చనిపోయిన ఆ రోజు అతనికి బాగా గుర్తుంది. ఎందరు ఎంత ధైర్యం చెప్పినా అతని హృదయం మూగగా ఏడ్వడం, తండ్రి శవం పంచ భూతాల్లో ఐక్యమయ్యేందుకు వెళ్లడం, నాలుగు రోజుల విషాదం, తరువాత ఆస్తి పంపకం, అన్నీ జ్ఞాపకానికొస్తున్నాయి.

 

 అందర్నీ ఆప్తులుగా నమ్మిన రోజులవి. పెద్దన్నలిద్దరూ ఆస్తిని సమా నంగా పంచుకున్నారు. తనమీద అభి మానంతో కాకపోయినా లోకానికి జడిసి వాళ్లు తన వాటాకు వదిలింది నాలుగు వందలు!! కొంతమంది తనను చూచి జాలిపడ్డారు; కొంతమంది అసమర్థు డన్నారు. వేటినీ పట్టించుకోలేదు తను. దక్కిన నాలుగు వందల్నీ ఓ పాత రిక్షాగా మార్చుకున్నాడు. జీవితంలో మొట్ట మొదటిసారి ధైర్యం చేశాడు. బతకగలిగే ఆత్మవిశ్వాసం ఉంది. బతకగలనన్న ధీమా ఉంది; దేవుడిచ్చిన కండ బలముంది. రాతిలో కప్ప కూడా బతుకుతోంది - తనేనా బతకలేంది..?’’

 

 రిక్షా తారురోడ్ల మీద విసుగూ విరామం లేకుండా తిరిగింది. ఎంతో మంది ఎక్కేరు-దిగేరు. నాలుగు డబ్బులు చేతిలో పడ్డాయ్. కలిగినంతలో బ్రతుకు జాగ్రత్తగా సాగింది. అప్పుడే రాజితో పరిచయమయింది. రాజి పాత బంగళా పక్కనే ఉన్న కానుగ చెట్టు దగ్గర సోడాలు అమ్మేది. అలసిపోయి, రిక్షా కానుగ చెట్టు క్రింద ఆపి రాజి చేతితో యిచ్చిన సోడా తృప్తిగా తాగిన రోజులు... తనలా తాగుతుంటే రాజి కళ్లలో ఏదో మెరుపు..! ఆ మెరుపే ఇంకా తన హృదయంలో మెరుస్తోంది. ఆప్యాయత పెరిగింది. 

 

 మనసులు కలిసేయి. రాజి తన గుడిసె కొచ్చేసింది-గుడిలో మూడుముళ్లు పడ్డాక. నీడలాంటి తోడు దొరికింది - శ్రమను మరపించే తోడు. ఏనాడు కూడా రాజి కళ్లల్లో వెలుగు, పెదవుల మీద నవ్వు మాయం కాలేదు. కొంతకాలం జీవితంలో ఇంద్రధనస్సులాంటి ఆనందం.

 పిల్లలు పుట్టారు. పెద్దవాడు శీనడు. ఎందుకో వాడిని చదివించాలనిపించింది; చేర్పించాడు. ఆ తర్వాత మల్లి పుట్టింది. చక్రాల్లాంటి కళ్లతో పుట్టింది. దాని కంటిలో అదే వెలుగు! కళ్లలో కాంతిని కూతురి కిచ్చేసి, రాజి వెళ్లిపోయింది. కనిపించ కుండా అనంతంలో కలిసిపోయింది. లోకనాథం కళ్లలో కన్నీరు తిరిగింది.

 

 ‘‘కాలం చెల్లింది. భగవంతుడు తీసికెళ్లాడు’’ అని తనను తానే సమాధానపరచు కున్నాడు. రాజీ లేకుండానే కాలం వెళ్లబుచ్చడం నేర్చుకున్నాడు. మానవుడి మనసులా మారుతూ మారుతూ పరుగులు తీసింది కాలం. మల్లికి ఈ మధ్యనే పెళ్లి చేశాడు; శీనయ్య రాజుగారి ఫ్యాక్టరీలో పనికి కుదిరేడు. అయినా తను రిక్షా లాగడం మానలేదు. రిక్షాలో ఎందర్నో ఎన్నెన్ని చోట్లకో చేర్చాడు. కాని ఎవరి కళ్లలోనూ సంతృప్తిని లోకనాథం చూడలేకపోయాడు. వాళ్ల కళ్లలో ఏమిటో నిరాశ! నిశ్చలంగా, నిర్మలంగా ఎవరూ చూడ్డం లేదు. వాళ్ల కళ్లు దేనికోసం వెతుకుతున్నయి? రిక్షా తొక్కడం ‘‘ఏయ్ రిక్షా’’ అని ఎవరో పిలవడం; రేటు ఎక్కువని వాదించడం, ఒక్కొక్కప్పుడు సర్దుకు పోవడం, మరొకప్పుడు గిట్టదని తను రిక్షా వెనక్కు త్రిప్పడం-, ఏవిటిదంతా! ఎందుకిదంతా!

 

 ఆ తరువాత తనకు ఈ రకమైన బ్రతుకులో చిరాకు పుట్టుకొచ్చింది. ఏవిటీ అసంతృప్తి; మష్తిష్కం ఆలోచిస్తోంది. బ్రతుకు గడచేదే మూన్నాళ్లు. ఈ మధ్యలో తీపి, చేదు, విషం. బ్రహ్మ మనుషుల్నెం దుకు పుట్టిస్తున్నట్లు? బతికే కొద్దికాలంలో మనుషులు చేస్తున్నదేవిటి? ఇంత అన్నం కడుపుకు తినడం, పెరిగి పెద్దవడం; పెళ్లి పెటాకులు, బిడ్డలు, ఆశలు, కోరికలు, నిద్ర, ఈర్ష్య, కోపాలు, దుమ్ము, ధూళి- ఇదేనా బతుకంటే! ఈ బతుకుతున్న మనుషులందరూ ఏవిటి సాధిస్తున్నట్లు-? అసంతృప్తి రోజురోజుకీ ఎక్కువై పోయింది. గుండె కెలకటం మొదలెట్టింది.

 

 మనసంతా ఏవిటోగా ఉంది. గంజాయి దమ్ము గట్టిగా లాగాడు. మాన వుడు పుట్టినదెందుకు? కొద్దికాలం బతికి చచ్చినందువల్ల అతనికొచ్చిన లాభమే మిటి? బ్రతుకుతున్నది బతికేందుకేనా? బతకాలి కనుక బతకాలా? మనసుకు కష్టం రాకుండా ప్రశాంతంగా బతికేందుకు కావాల్సిన తృప్తి ఎక్కడ నుండి లభిస్తుంది? ఎక్కడ దొరుకుతుంది? శంకరాచార్యుని శృంగేరీపీఠం మొదలు శివానందుని ఋషీకేశం వరకూ పుణ్యతీర్థాలు సేవించాడు. తన స్వరూ పమే మారిపోయింది. తల, గడ్డం, మీసాలు, గోళ్లు పెరిగి సన్యాసిలా తయా రయ్యాడు. ఇష్టం వచ్చిన చోట్లు మనసుకు నచ్చిన చోట్లు తిరిగేడు. చేతిలో డబ్బు కరిగిపోయింది. కాని తను ఆశించిన తృప్తి మాత్రం అనుభవంలోకి రాలేదు.

 

 డబ్బు అయిపోవడంతో ఆకలి పెరుగు కొచ్చింది. తిరిగి బతుకు సమస్య తలెత్తింది. అట్టలు కత్తిరించి బొమ్మలు చేశాడు. చిన్నపిల్లలకు అమ్ముతూ ఈ సత్రానికి చేరాడు. తిరిగి అదే జీవితం!! దొరికింది తినడం సత్రంలో నిద్రపోవ డంతో సరిపోతోంది. తను చేసిన అట్ట బొమ్మలు తన జీవితాన్ని చూచి నవ్వు తున్నయ్! కాదు ఏడిపిస్తున్నాయి. తిరిగి జీవితం పాత కొత్తదనాన్ని కోరుతోంది. తన మనసు మళ్లీ ఇంటిమీదకు మళ్లు తోంది. కొడుకూ, కూతురూ గుర్తుకొస్తు న్నారు. రక్తసంబంధం ఎంతో దూరం నుండి చేతులు చాచి పిలుస్తోంది. శీనయ్యకు పెళ్లయివుంటుంది. ఈపాటికొక బుల్లి మనవడు పుట్టే ఉంటాడు. వాడి ముద్దుమాటలు తను వినాలి. వాడు తనను ‘‘తాతయ్యా’’ అంటే మురిసి పోవాలి. వాడ్ని తనతో బజారుకు నడిపిం చుకెళ్లి వాడు కోరినవి కొనిపించి...!’’ 

 

 లోకనాథానికి తను దాచిన డబ్బు సంగతి గుర్తుకొచ్చింది. అట్టబొమ్మల అమ్మకంలో ఆరు వందలు మిగల్చ గలిగేడు. మనువడికి ఉంగరం, కోడలికి గొలుసు ఇస్తే బాగుంటుందనుకున్నాడు. మరోసారి, ఎత్తయిన ఆకాశపు మారు మూలలో వేయిరంగుల మెరుపొకటి మెరిసింది. ఆకాశం ఉరిమింది. వానజల్లు మరొకసారి లోకనాథం పాదాలను తడి పింది. లోకనాథం వాస్తవ జగత్తులోని కొచ్చాడు. ‘‘వెధవ్వాన’’ అని మరోసారి విసుక్కున్నాడు. గంజాయి గొట్టంలో మరింత ఆకు దట్టించి, పొగ గట్టిగా పీల్చి వదిలేడు. ఆలోచన్లు ముసురుకుంటు న్నాయి. తిరిగి మనువడు గుర్తుకొచ్చాడు; మరునాడే కొడుకు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లాలనిపించిందతనికి. 

 

 అయినా ఐదు సంవత్సరాలుగా మనసులు ఒకటిగా అనుకుని మెలగిన వీళ్లను వదలి పోవాలంటే మనసుకెందుకో బాధగా వుంది. లోకనాథం వాళ్లకేసి ఒకసారి చూచాడు. జీవితం అలవాటయిపోయి నట్లు వాళ్లు ప్రశాంతంగా నిద్రపోతు న్నారు. చీకూచింతా ఉన్నా-వీళ్లు లేనట్లు నటిస్తున్నారేమో అనిపించింది. అతని హృదయం వాళ్లమీద జాలితో నిండింది. ‘‘అందరూ- అందరే, పిచ్చి పెద్దమ్మలు - ఈ రోజు దొరికింది ఈరోజే తినేస్తారు. రేపు ఎలా గడుస్తుందన్న ఆలోచనే లేదు..!’’ అనుకున్నాడు లోకనాథం. వర్షం జోరుతగ్గి, చలి వేస్తోంది. దుప్పటి గట్టిగా కప్పుకుని కళ్లు మూసుకున్నాడు. 

 

 తొలి కోడి కూసింది. చలి ఇంకా గజగజలాడిస్తూనే వుంది. తూర్పు దిక్కున అరుణ రేఖలు ఆకారాన్ని దిద్దుకుంటు న్నయ్. లోకనాథం చలికి దుప్పటి గట్టిగా కప్పుకుని ముడుచుకు పడుకుని ఉన్నాడు. ‘‘బాబయ్యింకా లెగలేదేంటి-! బస్తీకెళ్లే ఏలయింది.’’ అన్నాడు రవణుడు. కాముడు లోకనాథాన్ని కుదిపి, ‘‘ఏటి యాలింత మొద్దు నిద్ర. బస్తీకెళ్లే ఏలయింది లెగు లెగు. సూరీడు మరిగింత పొడ్సుకొస్తే ఎల్లటం కట్టం మరి.’’

 

 లోకనాథం లేచి బద్ధకంగా ఆవులించాడు. ‘‘ఏవిటో- ఈ వేళింకా నిద్రపోవాలనిపిస్తోందిరా- బద్ధకంగా ఉంది-ముసలాడ్నయి పోయాను కదరా... ఒరేయ్ కాముడూ పొద్దున్నే మంచి కల చెడకొట్టేవు కదరా నన్ను లేపేసి..’’‘‘ఏంటా కల!’’ అడిగేడు కాముడు శ్రద్ధ కనబరుస్తూ; అందరూ చుట్టూ కూర్చున్నారు. లోకనాథం చెప్పసాగేడు- తన కొడుకూ, మనవడూ, వాడి చిలిపి చేష్టలూ. ‘‘ఇంటికెళ్లాలనుందేటి-?’’ అన్నాడు కాముడు ఇంక చెప్పనివ్వకుండా. 

 

 ‘‘అవున్రా కాముడూ, వెళ్లాలనుంది కాని, మిమ్మల్నొదిలి పోవాలంటే దిగులుగా వుందిరా!’’

 ‘‘ఆ... దాన్దేవుంది. ఓసారి పోయిరా సరిపోద్ది’’ లోకనాథం వెళ్లిపోవడం ఇష్టం లేకపోయినా, తనలోని బాధ కనబడ కుండా అన్నాడు కాముడు! మిగతావాళ్లు కూడా కాముడిని బలపరిచారు. లోక నాథం ‘‘నేనంటే ఎంత ప్రేమ వీళ్లకి’’ అనుకున్నాడు. లేచి బొంత తీసుకుని వచ్చి వాళ్ల మధ్య కూర్చున్నారు రంగడూ, రవణుడూ. లోకనాథం కుట్లు విప్పి అందు లోంచి అయిదులూ పదులూ నోట్ల దొంతర తీసి పట్టుకున్నాడు. ‘‘ఇంటిమీద కలవరం నాలుగు రోజుల్నుంచి ఎక్కువై పోయిందిరా కాముడూ. ఈరోజు దశమి మంచిది. ఈరోజే వెళ్దామనుకుంటు న్నాను’’ మీ అభిప్రాయం ఏవిటన్నట్లు వాళ్లవైపొకసారి చూశాడు లోకనాథం. నోట్లు లెక్కబెడుతూ.

 ‘‘మళ్లీ రావా’’ అన్నాడు రంగడు.

 ‘‘ఏమో చెప్పలేను. వస్తే వస్తాను.’’

 

 అందరూ దిగులు దాచేసి నవ్వేరు.  లోకనాథం లేచి చెరువువైపు వెళ్లేడు. ఒక గంట తర్వాత వచ్చి మూట ముల్లె సర్దు కున్నాడు: అందరూ చతుష్పధం మధ్యకు చేరుకున్నారు. లోకనాథం సంచీలోంచి వంద రూపాయలు తీసి ‘‘దీన్ని వుంచండి. ఎప్పటికయినా అవసరానికి పనికి వస్తుంది’’ అన్నాడు. అంతవరకూ తెచ్చి పెట్టుకున్న గాంభీర్యం సడలింది. కళ్లు తుడుచుకున్నాడు. ‘‘ఒరేయ్-కాముడూ’’ అన్నాడు. కాళ్లు లేని కాముడు, దగ్గరగా వచ్చాడు. వంద రూపాయలు వాడి చేతిలో పెట్టి తలను ఆప్యాయంగా తడిమేడు. కాముడి చీకటి కన్నుల్లోంచి రెండు కన్నీటి బొట్లు వెలికి వచ్చి, లోకనాథాన్ని చూసి, భారంగా నేల రాలేయి. 

 

 అందరికీ పేరుపేరునా వెళ్లొస్తానని చెప్పి, లోకనాథం తూర్పుదిశగా నడక సాగించాడు. కాముడు తన మనో నేత్రంతో, లోకనాథం వెళ్లడాన్ని ఊహించు కుంటున్నాడు. చేతిలో పది రూపాయల నోట్లు గాలికి రెపరెపలాడుతున్నయ్. రంగడూ రవణడూ దృష్టి ఆనినంత మేర లోకనాథాన్ని చూచారు. భారంగా నిట్టూర్చి ముగ్గురూ మూడు త్రోవల్లో గమ్యస్థానాన్ని చేరుకొనడానికి భారంగా అడుగులు వేశారు.

 

 గుడివాడ స్టేషన్లో రైలు ఆగింది. అందులోంచి దిగి, తల ఎత్తి చుట్టూ పరికించి, ఊర్లోకి ఉత్సాహంగా అడుగులు వేశాడు లోకనాథం. పరిసరాల స్వరూపం మారినా, లోకనాథం ఇల్లు అలాగే ఉంది. కొడుకును చూడబోతున్నాననే సంతో షంతో హృదయంలోంచి ఆనందపు జల్లు పైకి చిమ్ముతోంది. ఇంటిని సమీపించాడు. ఇల్లు శుభ్రంగా అలికి ముగ్గుపెట్టి ఉంది. గృహలక్ష్మి వచ్చివుంటుంది, అందుకే ఇల్లు కళకళలాడుతోంది అనుకున్నాడు. తలుపు తట్టేడు. ఎవరో ముగ్ధ లోపల నుండి వచ్చి తలుపు తీసింది.

 

 ‘‘ఓరయ్యా నువ్వు?’’ అంది సౌమ్యంగా. కోడలు కాబోలనుకున్నాడు.

 ‘‘నేను శీనయ్య తండ్రినమ్మా. వాడు లేడా ఇంట్లో?’’

 ‘‘యే శీనయ్యా!’’ అందామె ఆశ్చర్యంగా. లోకనాథం తెల్లబోయాడు. ‘‘ఈ ఇల్లు గల్లాయనమ్మా... నేనింకా నువ్వు..!’’ లోకనాథం మాట మధ్యలో ఆపేశాడు. 

 ‘‘ఓ-ఆయనా! ఇల్లు మాకమ్మేసి- యాడకో ఎళ్లిపోయిండు’’

 ‘‘ఎక్కడకు వెళ్లాడో తెలుసా?’’

 ‘‘తెలీదు’’

 

 లోకనాథం వెనుదిరుగేడు. శీనయ్య గురించి వాకబు చేశాడు. చివరకు తెలిసింది, శీనయ్య నాలుగు సంవత్సరాల క్రితమే ఎక్కడికో వెళ్లిపోయాడని. లోక నాథానికి ఆశాభంగం కలిగింది. ‘‘ఇక్కడ నుండి వెళ్లిపోయినంత మాత్రాన, కనపడ కుండా పోతాడా! వెతికి చూస్తాను’’ అని ధైర్యం తెచ్చుకున్నాడు. కొడుక్కోసం గాలిస్తున్నాడు. ఎంతకీ ఆచూకీ తెలియదే! ఏనాటికయినా చూడకపోతానా అనే ఆశతో విజయవాడ వచ్చాడు. స్టేషన్ రద్దీగా ఉంది; లోకనాథం కళ్లు నిద్ర మత్తుతో జోగుతున్నయ్. కొడుకును వెదకడం కోసం వరుసగా మూడు రాత్రుళ్లు నిద్రపోలేదు. కళ్లు ఎర్రగా మారి మంట పుడుతున్నయ్. నిద్రపోవాలని పిస్తోంది. మూటలో నగలు పెట్టిన పెట్టిని; బొడ్డు చుట్టూ జాగ్రత్తగా కట్టిన డబ్బును తడుముకున్నాడు. కోడలి కోసం బంగారు గొలుసు; రెండు వందల రూపాయలు పెట్టి కొన్నాడతను. మూట తలకింద పెట్టుకుని నిద్రపోయాడు.

 

 బారెడు పొద్దెక్కినాకగాని లోకనాథం మేలుకోలేకపోయాడు. లేచి బద్ధకంగా ఒళ్లు విరుచుకున్నాడు. తల ఎందుకో బలే పోటుగా ఉంది. కాసేపు అటూ ఇటూ తిరిగే జనాన్ని పళ్లుతోమే పుల్లలమ్ముకునే కుర్రాళ్లను చూచి; డబ్బుమూట కోసం నడుము చుట్టూ చేయిపోనిచ్చాడు. ఒక్కసారి గుండె ఝల్లుమంది. హృదయ స్పందన ఆగిపోయినట్లైంది. మనసులో వేదన సెగలై, ఆవిరులై తెరలు తెరలుగా పైకి వస్తోంది. పోయింది మామూలు డబ్బు కాదు... తన ప్రాణాలన్నీ కూర్చిపెట్టిన డబ్బు. మనవడి కోసం, కోడలి కోసం దాచిన డబ్బు!!! ‘‘పోయిన డబ్బు ఊరికెనే పోలేదు. మనసంతా మంటపెట్టి పోయింది’’ లోకనాథం గొణుక్కున్నాడు. అతనికే ఏ అపురూప శక్తన్నా ఉంటే, మూగ బాధకు చిహ్నంగా రాలిన ఒక్కొక్క కన్నీటిబొట్టు వెయ్యి పిశాచాలై, అతని మనోబాధకు కారకులైన వారిమీద విరుచుకుపడేవి. లోకనాథం నెత్తి బాదుకుంటూ ఏడుస్తున్నాడు. పోలీసులు వచ్చారు. వారితో తన డబ్బు ఎలా పోయిందీ చెప్పేడు. అతని మనసంతా చెప్పలేని అశాంతితో నిండిపోయింది.

 

 యౌవ్వన సంధ్య నుండి ముసలితనం వచ్చేవరకూ తృప్తి, తృప్తి అంటూ కలువ రించాడు లోకనాథం. అక్కడ్నించి తను వేసిన ప్రతి అడుగులోనూ తృప్తికోసం వెతికేడు. ఈ తృప్తి అన్నది మహా విచిత్ర మైనది. ముసురులో నిండిన వానలో మెరుపు లాంటిది. జీవితంలో ఎప్పుడో, ఎక్కడో, ఆ మెరుపు మెరుస్తుంది. ఆశ అంతటితో సంతృప్తి పడక, తృప్తిని వెతుక్కురమ్మని తరమటం మొదలెడుతుంది ఆ క్షణం నుంచీ. నిజా నికి ఈ తృప్తి అనే పదానికి అర్థం లేదు. తృప్తిని సంతృప్తి  పరచాలని మానవుడు కోరికలకు బానిసైపోతాడు. జీవించినంత కాలం కోరికలు ఉంటూనే ఉంటాయ్. ఆ అసంతృప్తి అట్లాగే తీగలు చాస్తుంది.

 

 లోకనాథం విషయంలో కూడా అంతే జరుగుతోంది. సంసార జీవితంలో ఏదో లోటుందని ఎక్కడో ప్రశాంతంగా ఉండే చోటుకు వెళ్లేడు. అతనికి ప్రశాంతమైన చోటు లభించింది. కానీ ఆ శాంతి కూడా అశాంతిగా మారి కొత్తదనం కావాలంది. తిరిగి సంసారం మీద, బంధుత్వం మీద మమకారం పుట్టింది. మమకారం కోసం అంత దూరం నుండీ, లోకనాథం పరు గెత్తుకు వచ్చాడు. చెమటోడ్చి సంపాదిం చిన డబ్బు నేలపాలయింది. అయినా లోకనాథాన్ని ఆశ మరింత ముందుకు లాగుతోంది. 

 

 కొడుకును ఇప్పుడు కాక పోయినా ఎప్పటికయినా చూడగలడు. విజయవాడలో ప్రతి వీధి, సందు, వదలకుండా అన్వేషిస్తున్నాడు. అతని అన్వేషణ సాగుతూనే ఉంది.తిరిగి బదరీనాథ్ వెళ్లి కాముడూ వాళ్లతో కలిసి ఉంటే బావుండునని పించిందతనికి. చేతిలో నగల పెట్టెపైన వెల్వెట్ గుడ్డ నిగనిగలాడుతోంది. పెట్టె తెరిచి అందులో నగకేసి దీనంగా చూశాడు. ‘‘నాకు కోడల్ని, మనవడిని చూసే అవకాశం ఉందో లేదో! నయమే ఆ డబ్బుతోటి దీన్నీ కొట్టేసుంటే నా గతి ఏం కాను? రక్షించావయ్యా, భగవంతుడా!’’ అనుకున్నాడతను కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి రెండు చేతులెత్తి నమస్కరిస్తూ.

 

 లోకనాథం సూర్యారావుపేటలో అడుగుపెట్టేడు. ఒళ్లంతా నొప్పిగా ఉంది. కాళ్లు మెలికలు తిరుగుతున్నయ్. ఇక నడవలేకపోయాడు. ఒక పెంకుటింటి ముందు మునిసిపాలిటీ కొళాయి కనిపించింది. కొద్దిగా నీళ్లు తాగి, ముఖం, చేతులూ, కాళ్లూ, కడుక్కుని ప్రహారీగోడ ముందు తోకమల్లి చెట్టు నీడక్రింద; చెట్టు బోదెకు ఆనుకుని కూర్చున్నాడు. పెట్టె లోంచి గొలుసు తీసి దీనంగా చూశాడు.

 

 ‘‘ఏవిటో ఈ భ్రమంతా! వెధవ ఇంత దూరం వస్తే కనబడకపోయె. భగవంతుడు ఎందుకో ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. ఆ సత్రంలోనే పడుంటే నాకీ బాధన్నా తప్పేది కదా! ఇక లాభం లేదు - ఈ నగను దుర్గమ్మకు కానుకగా ఇచ్చేస్తాను, పుణ్యం అయినా వస్తుంది!’’

 

 అతని ఆలోచనలు సాగిపోతున్నయ్. ఇంతలో ఒక చిన్న బంతి వచ్చి అతని తలకు బలంగా తగిలి, వడిలో పడింది.  తల పట్టుకుని ‘‘అబ్బా’’ అన్నాడు. కోపం వచ్చింది. బంతిని చేతిలోనికి తీసుకుని నలువైపులా చూచాడు. ఎవ్వరూ కనబడక పోతే నీరసంగా కళ్లుమూసుకున్నాడు.

 

 ఆ ఇంటి కాంపౌండు గేటు తెరుచు కుంది. అందులోంచి ఒక నాలుగేళ్ల పాప; ఆ పాపతో అంతవరకూ ఆడుకుంటూ వున్న పక్కింటి కుర్రాడు పరుగెత్తుకుంటూ వచ్చారు. పక్కింటి కుర్రాడికి లోకనాథం గడ్డం, మీసాలు చూస్తుంటే భయం వేసింది. దూరంగా నిల్చున్నాడు. పాప భయం భయంగానే లోకనాథం దగ్గరి కొచ్చింది. ‘‘తాతయ్యా... మలే.. మలే.. ఆ బంతి నాది.. ఇవ్వవూ!’’ అంది.

 

 లోకనాథం కనులు తెరిచేడు. చిన్న పాపాయి తీయని గొంతుతో బెదురుగా అతనిని తాతయ్యా అని పిలుస్తోంది. లోకనాథం మనసు ఆనందంతో పొంగింది. ఎన్ని సంవత్సరాల నుండి ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడో! అసంతృప్తితో మండిపోతున్న అతని హృదయం మీద అమృత బిందువులు వర్షించినట్లయింది. పాప మరోసారి ‘‘తాతయ్యా... బంతి ఇవ్వవూ’’ అంది.

 

 లోకనాథానికి పాపమీద ఎనలేని ప్రేమ కలిగింది. ఆ పాపే అతడిని జీవితంలో మొదటిసారిగా తాతయ్యా అంది. ఎక్కడో గుండెల్లో అసంతృప్తితో నిండివున్న భాండానికి చిల్లుపడి ఆ అసంతృప్తి ఇవతలకు వచ్చి ఆవిరై పోయింది. గుండె తేలికైంది. ‘‘ఇదే... ఇదే... ఈ క్షణాన్ని జారవిడుచుకోకూడదు. ఇది మళ్లీ జన్మంతా ప్రయత్నించినా రాకపోవచ్చు.’’

 

 ‘‘తాతయ్యా... బంతి’’ పాప గొంతులో ఇవ్వడేమోనన్న భయం! ‘‘ఇస్తాను కాని- నీ పేరేమిటో చెప్పవా!’’ లోకనాథం గొంతు అతనికి తెలియకుండానే ప్రేమ వర్షించింది. ‘‘నా పేలు... దుల్గ... మలి నాన్నేమో నాని అంతాలు’’ అంది. ఆ ముద్దు మాటలు లోకనాథం హృదయంలో మరింత ప్రేమను రేకెత్తించాయి. 

 

 ‘‘దుర్గమ్మా.. చాలా మంచిపేరు. ఇలా రామ్మా’’... పాపను దగ్గరకు తీసు కున్నాడు. ‘‘ఇదిగో తీసుకో’’ బంతి ఇచ్చే శాడు. పాప పరుగు తీయబోయింది. పొదివి పట్టుకున్నాడు. జేబులో వున్న నెక్లెస్ తీశాడు. ఆశ్చర్యంగా చూస్తున్న పాపను పలుమార్లు ఆప్యాయంగా, తనివి తీరా ముద్దు పెట్టుకుని, నెక్లెస్ పాప మెడలో వేసేశాడు. పాప ఇంట్లోకి పరుగెత్తింది సంబరంగా. లోకనాథం లేచి నిలబడి, సజల నయనాలతో సంతృప్తిగా నవ్వేడు. కనకదుర్గ ఆలయంకేసి నేరుగా నడక సాగించాడు. నడుస్తూ అను కున్నాడు- ‘‘చాలు తండ్రీ యింత కన్నా యింకేం కోరను. యీ తృప్తి చాలు.’’(1965లో వచ్చిన ‘మల్లెలు’ సంకలనంలో ప్రచురితమైన కథకు సంక్షిప్తరూపం)

 
Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top