స్వచ్ఛ జ్యోతి

స్వచ్ఛ జ్యోతి - Sakshi


అహ్మదాబాద్‌ యూనివర్సిటీ (గుజరాత్‌)  ‘గాంధీ పాద్రయాత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది గ్రామాలకి తరలి వెళ్లారు. అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.‘గాంధీ పాదయాత్ర’లో భాగంగా గ్రామాలకు వెళ్లిన ప్రొఫెసర్‌ జ్యోతికి ఒక చేదు నిజం తెలిసింది. చాలా గ్రామాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. గ్రామ పెద్దలకు అదొక సమస్యగానే అనిపించడం లేదు. మరోవైపు స్త్రీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చీకటి పడితేకానీ కాలకృత్యాలు తీర్చుకునే పరిస్థితి లేదు.



యూనివర్సిటీకి తిరిగి వచ్చిన తరువాత వైస్‌చాన్స్‌లర్‌ డా.సుదర్శన్‌ అయ్యంగార్‌తో ఈ సమస్య గురించి ప్రొఫెసర్‌ జ్యోతి చర్చించారు. ‘గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించడానికి ఏదైనా ప్రాజెక్ట్‌ చేపట్టండి’ అని వీసీ సూచించారు. ఉత్సాహంగా అంగీకరించారు జ్యోతి. అయితే ఆమెను నిరాశపరచి వెనక్కిలాగే మాటలు తప్ప ఉత్సాహపరచే మాటలు ఎక్కడా వినిపించలేదు. అయినా  ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు జ్యోతి. గ్రామాలకు వెళ్లి మరుగుదొడ్ల ఆవశక్యత  గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు.



 అయితే ఎక్కడా స్పందన లేదు. ఏదో యాంత్రికంగా వింటున్నారు అంతే! అయినా సరే... తన బాధ్యత నుంచి వెనక్కి తగ్గలేదు. కాలికి బలపం కట్టుకొని ఊరూరూ తిరుగుతూ మరుగుదొడ్ల ప్రయోజనాల గురించి ఏడు నెలల పాటు ప్రచారం చేశారు. ఆ కృషి వృథా పోలేదు. గ్రామస్తుల్లో కదలిక మొదలైంది. ప్రభుత్వ పథకం కింద తమ ఇంటి ఆవరణలో  మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి గ్రామస్తులు చొరవ చూపడం మొదలైంది. మరుగుదొడ్డి నిర్మించుకునేవారికి ప్రోత్సాహక బహుమతులు కూడా ఇచ్చేవారు జ్యోతి. తన పొదుపు మొత్తాల నుంచి డబ్బును వెచ్చించేవారు.



 తన వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకునేవారు. జ్యోతి కృషి వల్ల 34 గ్రామాల్లో 6000లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అయితే ఆమె ఈ పని మొదలుపెట్టినప్పుడు కొందరు చాటు మాటుగా వెక్కిరించేవాళ్లు. ‘హాయిగా యూనివర్శిటీలో పాఠాలు చెప్పుకోకుండా ఈ పనేమిటి?’ అనే వాళ్లు. అయితే తాను చేస్తున్నది హుందాతనం లోపించిన పని అని ఎప్పుడూ అనుకోలేదు జ్యోతి. జాతికి సేవ చేసుకోవడానికి తనకు లభించిన గొప్ప అవకాశంగా భావించారు.‘‘ ప్రభుత్వం, ప్రజలు కలసి పనిచేసినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యం అవుతుంది’’ అంటున్నారు మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమస్థాయికి తీసుకెళ్లిన ప్రొఫెసర్‌ జ్యోతిలాంబ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top