కథ: పైరసీ..?

కథ: పైరసీ..? - Sakshi


మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి లాంటి పర్వదినాల్లో కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి ఉండే భక్తులను అదుపు చేయలేక ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయలేక మాకు తలప్రాణం తోకకొస్తుంది. అసలు సమాజంలో ఇంతమంది భక్తులు, పుణ్యాత్ములు ఉన్నారా? జనంలో భక్తిప్రపత్తులు, ధర్మ చింతన ఇంతగా పొంగిపొరలుతున్నాయా అనే సందేహం కూడా నాకు తరచుగా వస్తూవుంటుంది భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయే దేవాలయాలను చూస్తుంటే.

 కానీ నా అనుభవం చెప్పేది మాత్రం దానికి వ్యతిరేకంగా ఉంది.

 గత సంవత్సరం నా స్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు హత్యలు, ముప్ఫై ఎనిమిది రేప్‌లు, మూడు వందల దొంగతనాలూ జరిగితే ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఆ రికార్డును క్రిమినల్స్ బద్దలు కొట్టేశారు.

 సమాజం నిండా ఇంతమంది పుణ్యాత్ములు, భక్తులు ఉంటే ఈ క్రిమినల్స్ అంతా ఎక్కడి నుంచి వస్తున్నట్లు? భక్తికి భక్తీ క్రైమ్‌కు క్రైమూ అని ఏ తిత్తికి ఆ తిత్తి వేరేగా జనాలు డిసైడ్ అయిపోయారా?

 ఎమ్మే ఫిలాసఫీ చదివాను కాబట్టి తరచుగా నాకు ఇలాంటి సందేహాలే వస్తుంటాయి. అందుకే నన్ను డిపార్ట్‌మెంట్లో ‘పోలీస్ ప్లేటో’ అనే నిక్ నేమ్‌తో పిలుస్తూ ఉంటారు.

 ఇంతకీ చెప్పలేదు కదా నేనో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ని.

 డిపార్ట్‌మెంట్‌లో చేరి మూడు సంవత్సరాలు దాటుతోంది. భయంకరమైన స్ట్రిక్ట్ అధికారిగా నాకు గొప్ప పేరుంది. నేరం, నేరస్థుడు ఈ రెండే నేను చూసే విషయాలు. లంచం, రికమెండేషన్స్ లాంటి అస్త్రాలు నా దగ్గర సాగవు. అందుకోసమే తరచుగా నాకు ట్రాన్స్‌ఫర్లు అవుతూ ఉంటాయి.

 సమయం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలు దాటుతోంది.

 కోర్టు పనులు లేని కారణంగా ఇటీవలే జరిగిన మర్డర్ కేస్ ఫైల్‌ను మరింత లోతుగా అధ్యయనం చేసే పనిలో ఉన్నాను పోలీస్ స్టేషన్‌లో నా ఛెయిర్‌లో కూర్చుని.

 సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన ఇరవై ఆరేళ్ల యువతి తన ప్రియుడి సహాయంతో కట్టుకున్న భర్తను హత్య చేయించింది. కాదు కాదు స్వయంగా తాను కూడా ఆ హత్యలో పాల్గొంది. భర్త చచ్చిపోయిన తర్వాత హాయిగా ప్రియుడితో లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని మర్డర్ ప్లాన్ వేసింది. కానీ బ్యాడ్‌లక్. హత్య జరిగిన వారం రోజులకే సాక్ష్యాధారాలతో మాకు దొరికిపోవటంతో ప్రస్తుతం జైల్లో ఉంది.

 అసలు నేరస్థులు ఏ ధైర్యంతో ‘క్రైమ్స్’ చేస్తారో నాకు అర్థం కాదు. నేరస్థుడు ఎప్పటికైనా దొరికిపోక తప్పదు. భర్తను హత్య చేసిన సాఫ్ట్‌వేర్ అమ్మాయి సంగతే తీసుకోండి. ఎవరో దుండగులు తన భర్తను హత్య చేసినట్లుగా ప్రపంచాన్నీ పోలీసులనూ నమ్మించే ప్రయత్నం చేసింది కానీ, ఆ అమ్మాయి మొబైల్ కాల్ రికార్డ్ పరిశీలించగానే మొత్తం అంతా బైటపడిపోయింది. చేజేతులా జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది.

 నేను గాఢంగా నిట్టూర్చి కానిస్టేబుల్ని పిలిచి, ‘టీ’ తెమ్మని చెప్పాలనుకుంటున్న సమయంలో నా మొబైల్ ఫోన్ మోగింది. అవతల నా పై అధికారి కాబట్టి నేను ఎలర్ట్ అవుతూ ‘సర్’ అన్నాను వినయంగా.

 ‘‘ఏం చేస్తున్నావోయ్ హీరో...’’

 ‘‘స్టేషన్‌లోనే ఉన్నాను సర్...’’

 ‘‘వెరీగుడ్. మన టాస్క్‌ఫోర్స్‌వాళ్లకు ఓ పైరసీదారుడు దొరికాడు. నువ్వు కాస్త గట్టిగా ఇంటరాగేషన్ చేసి, దాని వెనుక ఇంకా ఎవడెవడున్నాడో బైటకు లాగు. ఇండస్ట్రీ నుంచి నిర్మాతలు బాగా గొడవ పెట్టేస్తున్నారు. ఇటువంటి పైరసీదారుల్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేయాలి’’ అంటూ ఆయన నాకు ఆదేశాలు జారీ చేశారు.

 ‘‘అలానే సర్...’’ అన్నాను నేను వినయంగా.

 మరో పావుగంట తర్వాత ఇద్దరు టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్స్ ఓ యువకుడిని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. వాడిని చూస్తే అప్పటికే రెండు రౌండ్లు కోటింగ్ పూర్తయి ఉంటుందని అర్థం అయ్యింది. వాడిని నాకు హ్యాండోవర్ చేసి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కానిస్టేబుల్ తెచ్చిన టీ తాగుతూ వాడి వంక పరిశీలనగా చూశాను.

    

 పాతికేళ్లలోపు ఉండచ్చు. సన్నగా, పొడవుగా ఉన్నాడు. పోలీస్ ఇంటరాగేషన్ రుచి చూశాడు కాబట్టి బాగా వాడిపోయి ఉన్నాడు. నేను కన్నార్పకుండా వాడి వంకే చూస్తూ టీ తాగటం పూర్తిచేశాను.

 ‘‘ఏంట్రా నీ పేరు?’’

 ‘‘రఘునందన్ సార్.’’

 ‘‘ఎక్కడుంటావురా నువ్వు?’’

 ‘‘మాది వెస్ట్ గోదావరి దగ్గర చిన్న పల్లెటూరు సార్.’’

 ‘‘మీ నాన్న ఏం చేస్తాడురా?’’

 ‘‘లేడు సార్. నా చిన్నప్పుడే చచ్చిపోయాడు.’’

 ‘‘ఆహా! వెరీగుడ్. మరి అక్కడ నుంచి సిటీకెందుకొచ్చావురా?’’

 ‘‘ఉద్యోగం కోసం సార్.’’

 ‘‘ఏం చదువుకున్నావురా? టెన్త్ ఫెయిల్డా?’’ అన్నాను వెటకారంగా.

 ‘‘కాదు సార్. ఎమ్మే ఫిలాసఫీ. కంప్యూటర్స్‌లో డిప్లొమా.’’

 ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నేను చదువుకున్నదీ అదే. ఎంత విచిత్రం? సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్న నేను ఇంటరాగేషన్ చేస్తుంటే, అతను క్రిమినల్ కాబట్టి నా ముందు చేతులు కట్టుకుని సమాధానాలు చెబుతున్నాడు.

 ‘‘అంత చదువుకుని పైరసీ చేయటానికి సిగ్గులేదా నీకు?’’ ఈసారి ‘రా’ అనే అక్షరం నాకు తెలీకుండానే నా ప్రశ్నల్లోంచి తొలగించబడింది. అతను నావైపు సూటిగా చూస్తూ అన్నాడు, ‘‘ఇందులో సిగ్గుపడేదేముంది సార్?’’

 నాకు చప్పున కోపం పొంగింది.

 ‘‘యూ బ్లడీఫూల్. నేరం చేసింది కాకుండా మళ్లీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావా? కోట్లు ఖర్చుపెట్టి నిర్మాతలు సిన్మాలు తీసేది నీలాంటి పైరసీదారుల్ని మేపటానికి కాదు’’ గట్టిగా అరిచాను.

 అతను నావంకే సూటిగా చూస్తూ విచిత్రమైన నవ్వొకటి నవ్వాడు.

 ‘‘ఎందుకు నవ్వుతున్నావ్?’’

 ‘‘ఏం లేద్సార్.’’

 నేను ఛెయిర్‌లోంచి పైకి లేచి దగ్గరగా వెళ్లి, షర్ట్ కాలర్ పట్టి లాగి ముఖంలో ముఖం పెట్టి పోలీస్ మార్క్ క్రౌర్యాన్ని నా ముఖంలోకి తెచ్చుకుంటూ ‘‘నకరాలు చేస్తున్నావేంట్రా? నువ్వు ఎమ్మే చదివితే నాకెందుకు, పీహెచ్‌డీ చేస్తే నాకేంటి? యూ ఆర్ ఆఫ్ట్రాల్ ఏ క్రిమినల్. కోర్టులో నీకు కఠినశిక్ష పడకపోతే నేను పేరు మార్చుకుంటాను. ఇంతకీ మీ గ్యాంగ్‌లో ఇంకా ఎవరెవరున్నారు?’’ అన్నాను కఠినంగా. ‘‘ఇంకెవ్వరూ లేర్సార్. ఇదంతా నేనొక్కడినే చేశాను.’’

 ‘‘ఒక సిన్మా పైరసీ చేయటం అనేది కేవలం ఒక్కడితోనే సాధ్యపడదని నాకు తెలుసు. మర్యాదగా చెబితే మంచిది. లేకపోతే నాలోంచి రాక్షసుడు బైటకొచ్చాడంటే ఆ తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాపపడినా ప్రయోజనం ఉండదు.’’

 ‘అసలు వీడితో నాకు డిస్కషన్ ఏంటీ. సెల్లో పడేసి బొక్కలిరగతన్నక!’ అని నాలో నేను అనుకున్నాను.

 నాకు ఎందుకో అసహనంతో కూడిన ఇరిటేషన్ లాంటిది కలుగుతోంది. నేరస్థుడు పోలీసుల ముందు గజగజా వణికిపోవాలి. కనీసం భయపడినట్లయినా నటించాలి. అప్పుడే మా అహం సంతృప్తి చెందుతుంది. వీడేమో నా ముందు నిలబడి జెన్ మాస్టర్‌లాగా నవ్వుతున్నాడు. ఆఫ్ట్రాల్ పైరసీదారుడు. వీడి గురించి నేను ఇంతగా ఆలోచించటం కూడా అనవసరం.

 ‘‘ఆఖరుసారిగా అడుగుతున్నాను, టాస్క్‌ఫోర్స్‌వాళ్లు నీకిచ్చింది శాంపుల్ మాత్రమే. నా చేతుల్లో పడ్డాక, కొమ్ములు తిరిగిన క్రిమినల్స్ కూడా మొత్తం అంతా కక్కేస్తారు. అఫ్‌కోర్స్ నేనే కక్కిస్తాను. కానీ ఆ ప్రాసెస్ చాలా భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. అసలు నీకు పైరసీ చేసేందుకు ఎవరెవరు సహకరించారు? పైరసీ డీవీడీలను ఏయే సెంటర్లకు ఏవిధంగా పంపుతున్నారు? ఇంతవరకూ ఇలాగ ఎన్ని సిన్మాలు పైరసీలు చేశారు. ఈ డీటెల్స్ అన్నీ కావాలి నాకు.’’

 నా వార్నింగ్‌కు వాడి ముఖంలో సాధారణంగా అయితే భయం అనే ఫీలింగ్ ప్రస్ఫుటంగా కన్పించాలి. కానీ అలాంటి భయాలేమీ కనపడలేదు. ఇంతకుముందు మాదిరిగా నిర్లిప్తంగా, నిర్వికారంగా నిలబడి నావైపు చూస్తూ, ‘‘ఇప్పటిదాకా నేను ఆరు సిన్మాలు పైరసీ చేశాను సార్. ఇరవై ఎనిమిది వేల రూపాయలొచ్చాయి నాకు. కానీ ఇప్పుడా డబ్బులు నా దగ్గర లేవు. ఖర్చయిపోయాయి’’ అన్నాడు తాపీగా.

 

 ‘ఫట్’మంటూ ముఖం మీద కొట్టేసరికి వాడి నోట్లోంచి రక్తం బైటకొచ్చింది. ‘‘మీ పైరసీదారుల కారణంగా లక్షలు, కోట్లు నష్టం వస్తుందని నిర్మాతలు గగ్గోలు పెడుతుంటే, నువ్వు కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే వచ్చాయని చెబుతావేంట్రా బాడ్కోవ్ నా కొడకా?’’ నాలోంచి పోలీస్ సంపూర్ణంగా వళ్లు విరుచుకుంటూ బైటకొచ్చేశాడు.

 ‘‘నేను చెప్పేది నిజం సార్. పైరసీ డీవీడీలు ఎవరు చేస్తారో నాకు తెలీదు. నా దగ్గరకొచ్చిన స్టాక్‌ను వాళ్లు చెప్పిన వాళ్లకు అందజేస్తే డీవీడీకి ఐదు వందల రూపాయల చొప్పున కమీషన్ ఇస్తారు.’’

 ‘‘నీకు డీవీడీలు ఇచ్చేదెవరు?’’

 ‘‘ఒక్కోసారి ఒక్కోళ్లు తెచ్చిస్తారు. తరచూ వాళ్ల ఫోన్ నంబర్స్ మార్చేస్తూ ఉంటారు. వాళ్లు నాకు ఫోన్ చేసి ‘ఫలానా చోట నిలబడు. ఆటోలో కార్టన్ బాక్స్ తెచ్చిస్తాడు’ అని చెబుతారు. నేను వాటిని వాళ్లు చెప్పిన చోట డెలివరీ చేస్తాను. అంతే సార్.’’

 ‘‘ఎమ్మే చదివి ఇలాంటి లత్కోర్ పనులు చేయటానికి నీకు సిగ్గులేదంట్రా?’’

 పోలీస్ స్టేషన్‌లోని స్టాఫ్‌కూ, నాకూ

 అందరికీ కళ్లు తిరిగేలా వాడు, ‘‘తప్పుడు పనులు చేస్తూ బతకాలని ఎవరూ అనుకోరు సార్. సిటీకొచ్చిన కొత్తలో నేను కూడా రోజుకు ఇరవై గంటలు కష్టపడి నా కుటుంబాన్ని పోషించాలనుకున్నాను. కానీ పరిస్థితుల కారణంగానే ఇందులోకి దిగాల్సి వచ్చింది’’ అన్నాడు.

 ‘‘ఏంట్రా పరిస్థితులు? రోగిష్టి తండ్రి, పెళ్లి కాని చెల్లెలు, ఇంకా చదువుకుంటున్న తమ్ముడు... ఇలాంటివేనా?’’ నేను హేళనగా నవ్వుతూ అన్నాను.

 ‘‘కాద్సార్. క్రియేటివిటీ అనేది నాకో పాషన్. సిన్మా ఇండస్ట్రీలో బాయ్ దగ్గర నుండి అసిస్టెంట్ డెరైక్టర్‌గా ఎదగటానికి నాకు మూడేళ్లు పట్టింది. నా కష్టానికి తగిన డబ్బులు ఎప్పుడూ దొరకలేదు. చాలామంది నాకు డబ్బులు ఎగ్గొట్టారు. అయినా నేను బాధపడలేదు. కానీ నేను ఎన్నో రాత్రులు మధించి తయారుచేసిన ఐడియాలు, డైలాగులు కొట్టేసి కనీసం సహకారం అని కూడా నా పేరు వేయలేదు. ఇదేంటని అడిగితే తన్ని బైటకు నెట్టారు’’ అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా నేను హేళనగా, ‘‘ఓహో! రివెంజ్ అన్నమాట. ఏ పరిశ్రమ అయితే నిన్ను ఆదరించలేదో ఆ పరిశ్రమనే పైరసీ ద్వారా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావన్నమాట’’ అన్నాను.

 ‘‘నాలాంటి అనామకుడు పరిశ్రమను ఏం చేయగలుగుతాడు సార్. నన్ను నేను నాశనం చేసుకోవటం తప్ప?’’

 ‘‘నీకు జీవితంలో కొన్ని చేదు అనుభవాలు, సంఘటనలు ఎదురై ఉండవచ్చు. అంతమాత్రాన క్రిమినల్‌గా మారి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే డిపార్ట్‌మెంట్ సహించదు’’ నేను కఠినంగా చెప్పాను.

 ‘‘సార్!’’ అన్నాడతను, ‘‘నేను ఓ ప్రశ్న అడిగితే తమరు కోపగించుకోరు కదా?’’  

 

 ‘‘ఒక్కోసారి ఒక్కోళ్లు తెచ్చిస్తారు. తరచూ వాళ్ల ఫోన్ నంబర్స్ మార్చేస్తూ ఉంటారు. వాళ్లు నాకు ఫోన్ చేసి ‘ఫలానా చోట నిలబడు. ఆటోలో కార్టన్ బాక్స్ తెచ్చిస్తాడు’ అని చెబుతారు. నేను వాటిని వాళ్లు చెప్పిన చోట డెలివరీ చేస్తాను. అంతే సార్.’’

 

 నాకు ఎందుకో అసహనంతో కూడిన ఇరిటేషన్ లాంటిది కలుగుతోంది. నేరస్థుడు పోలీసుల ముందు గజగజా వణికిపోవాలి. కనీసం భయపడినట్లయినా నటించాలి. వీడేమో నా ముందు నిలబడి జెన్ మాస్టర్‌లాగా నవ్వుతున్నాడు.

 ‘‘ఏంటది?’’

 ‘‘అసలు పైరసీ అంటే ఏమిటి సార్?’’

 ‘‘హీరో హీరోయిన్లకు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్స్ ఇచ్చి, ఆ పైన కోట్లు ఖర్చుపెట్టి నిర్మాతలు అష్టకష్టాలు పడి సిన్మాలు తీస్తుంటే, వాళ్లకే సొంతమైన ఆ సిన్మాలను నీలాంటి పైరసీదారులు అక్రమంగా కొట్టేయటమే పైరసీ అంటే. ఈ విధంగా పైరసీ చేసేవాళ్లకు చట్టంలో కఠినమైన శిక్షలు పడతాయి. వేరేవాడికి చెందిన మేధోపరమైన హక్కులను హరించే దుస్సాహసానికి ఎవరు తెగబడ్డా చట్టం క్షమించదు.’’

 అతను పేలవమైన నవ్వు నవ్వి ఇలా అన్నాడు, ‘‘నన్ను పైరసీదారుడంటున్నారు. డీవీడీకి ఐదు రూపాయల కోసం కక్కుర్తిపడి నేనీ పనిచేశాను. నేను చేసింది తప్పే. నన్ను నేను సమర్ధించుకోను. కానీ సర్... జపనీస్ సిన్మా నుంచి స్టోరీ, ఫ్రెంచ్ సిన్మా నుంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రష్యన్ సిన్మా నుంచి క్యారెక్టరైజేషన్, డచ్ సిన్మాల నుంచి యాక్షన్ సీన్స్ యధాతథంగా కాపీ కొట్టేసి, ఓ కిచిడీగా సిన్మా రూపొందిస్తే, దానిమీద నైతికపరమైన హక్కులు ఎవరికుంటాయి సార్? ఐదు రూపాయల క్రైమ్ చేసినందుకే నన్ను ఇలా చితక్కొట్టారు. కోట్లాది రూపాయల ఈ క్రైమ్‌ను ఏమంటారు సార్? దీన్ని పైరసీ అనరా?’’

 జీవితంలో నేనెప్పుడూ అంత షాక్ తిన్లేదు.

 ఆఫ్ట్రాల్ ఓ పైరసీదారుడు నాకో సవాల్ విసిరాడు. నాకే కాదు, ఈ వ్యవస్థకే ఓ సవాల్ విసిరాడు. వాడి ప్రశ్నకు నేనేం సమాధానం చెప్పాలి? పోనీ ఇదే ప్రశ్న పై అధికారిని అడిగే ధైర్యం చేయగలనా?

 ఇప్పుడు నేనేం చేయాలి?

 వీడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వదిలేయాలా? లేకపోతే సాయంత్రం ప్రెస్‌మీట్ ఎరేంజ్ చేసి వీడిని మీడియా ముందు ప్రదర్శించి, ‘పైరసీదారులను ఉక్కు పాదంతో అణచివేస్తాం’ అనే స్టేట్‌మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత అదంతా టీవీల్లో చూసి సంతృప్తిపడిపోవాలా?

 నేనేం చేయాలి?

 ప్లీజ్! మీకు తెలిస్తే మీరైనా చెప్పండి. నాకైతే వీడు అడిగిన ప్రశ్నకు కళ్లు తిరుగుతున్నాయ్.

 - ఆదెళ్ళ శివకుమార్

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top