మీ ఇల్లు చల్లగుండ

మీ ఇల్లు చల్లగుండ - Sakshi


మొక్కే కదా అని పీకేశామో మన పీక కోసేవారెవరూ ఉండకపోకవచ్చు గాని, మన పరిసరాల్లోని మొక్కలను పీకి పారేస్తే మన పీక మనమే కోసుకున్నంత పని అవుతుంది. మొక్కలను పెంచడం మన ప్రాణావసరం. మొక్కలే మనకు ప్రాణదాతలు. మీ ఇల్లు, ఇంటిల్లిపాదీ చల్లగా ఉండాలంటే మొక్కలను పెంచాల్సిందే. మొక్కలే లేకుంటే భూమి కూడా మరో నిర్జీవ గ్రహంగా మిగిలిపోతుంది. మొక్కల అవసరాన్ని ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. అలాగని మొక్కల పెంపకం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత కూడా! ఇది వానాకాలం. మొక్కలు నాటడానికి అనువైన కాలం. ఈ వానాకాలాన్ని ఊరకే కరిగిపోనివ్వకుండా మొక్కవోని దీక్షతో మొక్కలను నాటుదాం. మన వంతుగా పచ్చదనాన్ని పెంపొందిద్దాం.

 

ఇళ్లలో అందం కోసం, అలంకరణ కోసం తీగలు, పూల మొక్కలు, ముళ్ల చెట్లు మాత్రమే కాదు, ఆహారం కోసం, ఆరోగ్యం కోసం ఆకు కూరలు, కూరగాయల మొక్కలు, ఔషధ మొక్కలు వంటివి పెంచుకోవడానికి కొద్దిపాటి స్థలం చాలు. వీటిలో చాలా రకాల మొక్కలను చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. ఇంటి ముందు ఎలాంటి ఆవరణ లేని అపార్ట్‌మెంట్లలో నివసించే వారికి ఇలాంటి మొక్కలు అనుకూలంగా ఉంటాయి. మొక్కలపై ఆసక్తి ఉంటే అపార్ట్‌మెంట్ వాసులు కుండీల్లో బోన్సాయ్ వృక్షాలను పెంచుకోవచ్చు.



వీటిలో పండ్లు, కాయలు కాసే రకాలు కూడా దొరుకుతాయి. ఇంటి ముందు కొంచెం విశాలమైన ఆవరణ ఉన్నట్లయితే నీడనిచ్చే రకరకాల చెట్లు పెంచుకోవచ్చు. నీడతో పాటు పండ్లు, కాయలు ఇచ్చే చెట్లు కూడా పెంచుకోవచ్చు. తీగ మొక్కలతో పందిరి వేసుకోవచ్చు. ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం ఏమంత కష్టమైన పని కాదు. ఖర్చుతో కూడిన పని కూడా కాదు. వాటి పెంపకానికి ఖర్చుతో కూడిన రసాయన ఎరువుల వంటివేవీ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో వాడి పారేసిన కూరగాయల తొక్కలు, కాఫీ పొడి, టీ పొడినే ఎరువుగా  కాస్త తీరిక చేసుకుని మొక్కలను పెంచితే వాటితో వచ్చే ఆనందమే వేరు. ఇళ్లలో పెంచుకోదగ్గ వివిధ వృక్షజాతుల గురించి...

 

తీగ మొక్కలు    

* తీగజాతి మొక్కల్లో కొన్ని రకాలు అలంకరణ కోసం ఉపయోగపడతాయి. మరికొన్ని రకాల కూరగాయల మొక్కలు కూడా తీగలుగా పెరిగి ఆహార అవసరాలకు ఉపయోగపడతాయి.

* మల్లె, జాజి,మాలతి, గోకర్ణ, శంఖపుష్పి, లిల్లీ, మనీప్లాంట్, బోగన్‌విల్లా, అల్లామందా క్రీపర్, రంగూన్ క్రీపర్, మండెవిల్లా వంటి తీగజాతి మొక్కలను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. మనీప్లాంట్‌లోని వివిధ రకాల తీగ మొక్కలకు పూలు పూయవు. అయితే, చాలా వరకు తీగ మొక్కలకు అందమైన పూలు పూస్తాయి.

* తీగ మొక్కలను కుండీల్లో నాటుకుని ఇళ్లల్లో కిటికీలకు పాకేలా పెంచుకోవచ్చు. కొంత స్థలం ఉన్నట్లయితే, పందిరి వేసి ఈ తీగలను పందిరి మీదకు పాకించవచ్చు. తీగ మొక్కలను పందిరిగా వేసుకుంటే చల్లని నీడ కూడా దొరుకుతుంది.

* బచ్చలి, తమలపాకు, బఠాణీ, చిక్కుడు, కాకర, దోస, ఆనప, పొట్ల, బీర, టొమాటో, గుమ్మడి వంటి ఆకుకూరలు, కూరగాయల మొక్కలు తీగలుగా పెరుగుతాయి.

* తీగ మొక్కలకు పందిరి ఏర్పాటు చేయవచ్చు. లేకుంటే పైకప్పుల మీదకు పాకేలా కూడా ఏర్పాటు చేయవచ్చు.

* ఇంటి చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నట్లయితే, ప్రహారీని ఆనుకున్న స్థలంలో వెదురు పొదలను తీగ మొక్కలకు ఆసరాగా పెంచవచ్చు. ఇంటికి నలువైపులా దట్టంగా పొదలను పెంచినట్లయితే శబ్దకాలుష్యం నుంచి, వాయు కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు, ఇంటి వాతావరణం కూడా చల్లగా ఉంటుంది.

 

పుష్ప విలాసం

పూల మొక్కలను పెంచుకోవడానికి దాదాపు అందరూ ఇష్టపడతారు. పూలనిచ్చే వృక్షజాతుల్లో కొన్ని లతలు, తీగలుగా పెరిగితే, ఇంకొన్ని చిన్న చిన్న మొక్కలుగా, మరికొన్ని గట్టి కాండంతో చెట్లుగా ఎదుగుతాయి. చిన్న చిన్న మొక్కలుగా ఎదిగేవాటిని కుండీల్లో పెంచుకోవచ్చు. బాల్కనీల్లో, టైపై కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవడానికి గులాబి, బంతి, చామంతి, కనకాంబరం, చంద్రకాంతం, దాలియా, తులిప్, లావెండర్ వంటి పూల మొక్కలను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.



ఇంటి ఆవరణలో ఆరుబయట స్థలంలో కూడా వీటిని పెంచుకోవచ్చు. మందార, గన్నేరు, నందివర్ధనం, సంపెంగ,  పొగడ, పారిజాతం, నూరు వరహాలు, గుల్‌మొహర్ వంటి పూల చెట్లు కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉండవు. ఇవి గట్టి కాండంతో ఏపుగా ఎదుగుతాయి. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో కాస్తంత స్థలం ఉంటే వీటిని పెంచుకోవచ్చు.

* పూల మొక్కలను సాధారణంగా అలంకారం కోసం పెంచుకుంటారు. మన దేశంలోనైతే పూజాదికాలకు పనికొస్తాయనే ఉద్దేశంతో కూడా పూల మొక్కలను పెంచుకుంటారు.

* మల్లె, జాజి, సంపెంగ, లావెండర్, నైట్ క్వీన్ వంటి కొన్ని పూలు సుగంధ పరిమళాలతో ఆకట్టుకుంటాయి. తోటకు అందానివ్వడమే కాకుండా, ఆహ్లాదభరితమైన పరిమళాల కోసం ఇలాంటి పూల మొక్కలను చాలామంది ఇష్టపడతారు.

 

మొక్కల పెంపకంలో జాగ్రత్తలు

* మొక్కలకు తగిన కుండీలను ఎంపిక చేసుకోవాలి. కుండీల్లో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండేందుకు వాటి అడుగున చిన్న చిన్న రంధ్రాలు ఉండాలి  కుండీల్లో పెంచుకునే మొక్కలు అడ్డదిడ్డంగా ఎదిగిపోకుండా, వాటిని అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. వాటికి కాస్త ఎండ సోకే ప్రదేశంలో ఉంచాలి  మొక్కలకు అవసరం మేరకు తగుమాత్రంగా నీరు పోస్తూ ఉండాలి. వాటికి పోషకాలను అందించేందుకు సేంద్రియ ఎరువులను వాడవచ్చు  వంటింటి సేంద్రియ వ్యర్థాలను మొక్కల కుండీల్లో నేరుగా వేయకూడదు. వాటిని ఒక కుండీలో నింపి నేలలో తవ్విన గొయ్యిలో వేసి కంపోస్టుగా మార్చాలి. ఆ తర్వాతే మొక్కలకు వేయాలి.  పెరటి మొక్కల పెంపకంలోనూ దాదాపు ఇవే పద్ధతులు పాటిస్తే సరిపోతుంది. మొక్కల వద్ద నీరు ఎక్కువగా నిల్వ చేరకుండా చూసుకుంటూ ఉండాలి.

* మట్టిని గుల్లగా తవ్వుకుని, సేంద్రియ ఎరువు కలిపిన తర్వాత మొక్కలు నాటుకుంటే అవి బాగా ఎదుగుతాయి.

 

ఇళ్లల్లో చెట్లు ఉంటే...

భూమ్మీద దాదాపు 80 వేలకు పైగా వృక్షజాతులు మన ఆహార అవసరాలకు ఉపయోగపడగలవు. అయితే, వీటిలో 30 శాతం వృక్షజాతులను మాత్రమే మనుషులు ఆహార అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇవి కాకుండా, భూమ్మీద 70 వేల రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి.

 

ప్రపంచంలోనే  అతి పురాతనమైన చెట్టు  ‘మెథుసెలా’ కాలిఫోర్నియాలో ఉన్న ఈ చెట్టు వయసు 4848 సంవత్సరాలు. కాలిఫోర్నియాలోని వైట్ మౌంటెయిన్స్‌లో ఉన్న బ్రిసెల్‌కోన్ పైన్ అడవుల్లో ఈ ప్రాచీన వృక్షం ఉంది. ఇది కచ్చితంగా ఎక్కడ ఉందో కొద్దిమంది శాస్త్రవేత్తలకు మాత్రమే తెలుసు.

 

 

భూగర్భ జలాలు అడుగంటి పోకుండా చూడటంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

 

చెట్లు లేని చోట వర్షపు నీరు భూమిలోకి ఇంకేందుకు తగిన ఆస్కారం ఉండదు. విస్తారంగా చెట్లు ఉన్న ప్రదేశాల్లో భూగర్భ జలాలకు లోటు ఉండదు.

 

 

సుగంధాలను వెదజల్లే వాటిలో చెప్పుకోవాలంటే, పూలు పూయకపోయినా మరువం, దవనం వంటి మొక్కలను కూడా చేర్చుకోవచ్చు. సుగంధం కారణంగానే మరువం, దవనం వంటి ఆకులను పూలతో కలిపి మాలలుగా అల్లి అలంకరణలో ఉపయోగిస్తుంటారు.

 

 పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 260 పౌండ్ల ఆక్సిజన్ విడుదలవుతుంది. అంటే, ఇద్దరు మనుషులకు ఏడాది మొత్తానికి సరిపోయేటంత ప్రాణవాయువు అన్నమాట. నలుగురు మనుషుల కుటుంబం ఉండే ఒక ఇంటి ఆవరణలో కనీసం రెండు చెట్లు ఉన్నట్లయితే ఆ కుటుంబానికి ప్రాణవాయువుకు లోటు ఉండదు.

 

చెట్టును నరికి ఆ కలప అమ్మితే అంత మొత్తం రాకపోవచ్చు, పండ్ల చెట్టయితే ఆ చెట్టు ఇచ్చే పండ్ల నుంచి కూడా అంత ఆదాయం రాకపోవచ్చు. చెట్ల నుంచి పరోక్షంగా లభించే పర్యావరణ సేవలకు విలువ కడితే పూర్తిగా ఎదిగిన ఒక చెట్టు విలువ 10 వేల డాలర్లు (రూ.6.69 లక్షలు) ఉంటుందని నిపుణుల అంచనా.

 

ఇంటి ఆవరణలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు పెంచినట్లయితే ఇంట్లో ఏసీ వినియోగించాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. వీటి వల్ల ఏసీ కోసం అయ్యే ఖర్చు 30 శాతం వరకు తగ్గుతుంది. ఆరుబయటి వాతావరణం కంటే దట్టంగా చెట్లు ఉన్న చోట వాతావరణం చల్లగా ఉంటుంది.

 

కర్బన ఉద్గారాల కట్టడికి చెట్టును మించిన విరుగుడు ఇంకేదీ లేదు. జీవితకాలంలో ఒక చెట్టు దాదాపు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోగలదు. వాయుకాలుష్యాన్ని నివారించడంలో చెట్లను మించినవేవీ లేవు.

 

పూర్తిగా ఎదిగిన చెట్టు తన నీడలో ఉన్న మనుషులపై అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ప్రభావాన్ని దాదాపు 50 శాతం మేరకు నివారించగలదు. పూర్తిగా ఆరుబయట ఆడుకోవడం కంటే చెట్ల నీడన ఆటలాడుకోవడం పిల్లలకు క్షేమంగా ఉంటుంది.

 

చెట్ల వల్ల గాలి నాణ్యత గణనీయంగా  మెరుగుపడుతుంది. పూర్తిగా ఎదిగిన చెట్టు గాలిలోని ధూళి కణాలను 20 శాతం మేరకు, బ్యాక్టీరియాను 50 శాతం మేరకు అరికట్టగలదు. ఇలా చెట్లు మన ఆరోగ్యానికి కూడా రక్షణ ఇస్తాయి.

 

ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో లేదా పైకప్పు మీద కుండీలు ఏర్పాటు చేసుకుని కూరగాయలు, ఆకుకూరల మొక్కలు వంటివి పెంచితే అవి చాలా వరకు ఆహార అవసరాలు తీరుస్తాయి. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల చెట్లు పెంచితే అవి చల్లని నీడనివ్వడమే కాకుండా, పోషకాలనిచ్చే పండ్లను ఇస్తాయి.

 

మొక్కలు, చెట్లు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయి. ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి బయటకు చూస్తూ చుట్టూ పచ్చదనం కనిపిస్తే మనసు ఆహ్లాదంగా మారుతుంది. పచ్చని వాతావరణం వల్ల దిగులు, గుబులు, ఆందోళన, అలజడి వంటి ప్రతికూల భావోద్వేగాలు సద్దుమణుగుతాయి.

 

దృఢమైన కాండంతో పెద్దగా ఎదిగే చెట్లను పెరట్లో నాటినట్లయితే, అవి కొంత ఎదిగేంత వరకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. ఏపుగా ఎదిగిన తర్వాత చాలా చెట్లకు రోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా ఉండదు.

 

కూరగాయల మొక్కలు, పండ్ల చెట్లు ఇంట్లోనే పెంచుకుంటే ఖర్చు కన్నా ముందు ఆరోగ్యాన్ని విషరసాయనాల బారి నుండి చాలావరకు కాపాడుకోవచ్చు. నిత్యం బజారుపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

 

ఇంట్లో పెంచుకున్న మొక్కలు, చెట్ల నుంచి ఒకవేళ అవసరానికి మించి పండ్లు, కూరగాయల దిగుబడి వచ్చినట్లయితే వాటిని అమ్మి ఆదాయం కూడా పొందవచ్చు.

 

వృక్షసంపద శాంతిభద్రతలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పచ్చదనమే లేని కాంక్రీట్ వనాలను తలపించే పట్టణాల కంటే పచ్చని పరిసరాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో నేరాల సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది. పచ్చదనం వల్ల మానసిక ప్రశాంతత నెలకొనడమే దీనికి కారణమని ఫిలడెల్ఫియాలోని టెంపుల్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


 

పండ్ల చెట్లు

పూల మొక్కల తర్వాత ఇళ్లలో పెంచుకోవడానికి చాలామంది ఇష్టపడేది పండ్ల చెట్లనే. ఇంటి ఆవరణలోనో, పెరట్లోనో కొంచెం స్థలం ఉంటే ఇష్టమైన పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. పండ్ల చెట్లను కుండీల్లో పెంచుకునే అవకాశాలు తక్కువ. వీటిని పెంచుకోవాలంటే ఇంటి ఆవరణలోనైనా, పెరట్లోనైనా, డాబాలపైనా అన్నిరకాల పండ్ల చెట్లను పెంచుకోవచ్చు. మామిడి, జామ, పనస, బత్తాయి, నారింజ, కమలా, నిమ్మ, దానిమ్మ, నేరేడు, మారేడు, సపోటా, సీతాఫలం, రేగు, అంజీర, ఉసిరి, నేల ఉసిరి, వెలగ, బొప్పాయి, అరటి వంటి పండ్ల చెట్లు ఇళ్లలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.



పండ్ల చెట్ల వల్ల చల్లని నీడ దొరకడమే కాకుండా, రుచికరమైన పండ్లు లభించడం అదనపు లాభం. అంతేనా! పండ్ల చెట్లు రక రకాల పక్షులకూ ఆవాసంగా ఉంటాయి. దృఢమైన కాండం గల పండ్ల చెట్ల మీదకు పాకేలా రకరకాల తీగమొక్కలనూ పెంచుకోవచ్చు. పండ్ల వర్గంలో చేర్చకపోయినా, కొంత విశాలమైన స్థలం ఉన్నట్లయితే ఏపుగా ఎదిగే కొబ్బరి, పోక, బాదం వంటి చెట్లు కూడా పెరటి తోటల్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవి కాకుండా, తీగలుగా పాకే పుచ్చ, కర్బూజా వంటి మొక్కలను పందిరి పైకి లేదా పైకప్పు పైకి పాకించి పెంచుకోవచ్చు.

 

కుండీల్లో పెంచుకోదగ్గ పండ్ల రకాలు

చాలావరకు పండ్ల చెట్లను ఆరుబయటే పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని రకాల పండ్ల చెట్లను కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుంటే పీచ్, ఆప్రికాట్, మల్బరీ, కేప్ గూస్‌బెర్రీ, చిన్న దానిమ్మ (డ్వార్ఫ్ పోమగ్రనేట్), ఫిగ్ వంటి చెట్లను పెంచుకోవచ్చు. ఇవి కాస్త గట్టి కాండంతో చెట్లుగా ఎదిగే రకాలే అయినా, వీటి ఎత్తు మూడు నాలుగు అడుగులకు మించి ఉండదు. అందువల్ల వీటిని విశాలమైన వరండాల్లో, బాల్కనీల్లో లేదా పైకప్పు మీద కాస్త పెద్దసైజు కుండీలను ఏర్పాటు చేసుకుని పెంచుకోవచ్చు. ఇవే కాకుండా తీగజాతికి చెందిన ద్రాక్ష మొక్కలను కూడా కుండీల్లో పెంచుకోవచ్చు.

 

కూరగాయల మొక్కలు

కూరగాయలు, ఆకు కూరల మొక్కల్లో చాలావరకు ఇళ్లలో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. రోజువారీ వినియోగించే కూరగాయలు, ఆకు కూరల్లో చాలా రకాలను కుండీల్లో సైతం తేలికపాటి పద్ధతుల్లో పెంచుకోవచ్చు. కొంత ఖాళీ స్థలం ఉన్నట్లయితే పెరటి తోటలుగా కూడా కూరగాయల మొక్కలను సాగు చేయవచ్చు. బయట కొనుగోలు చేసే కూరగాయలు, ఆకుకూరల కంటే ఇంట్లో పెంచుకునే మొక్కల నుంచి సేకరించే కూరగాయలు, ఆకుకూరలు సురక్షితంగా ఉంటాయి.



బయట పొలాల్లో వీటి సాగు కోసం యథేచ్ఛగా పురుగు మందులు, రసాయనిక ఎరువులు వినియోగిస్తుంటారు. ఇళ్లలో పెంచుకున్నట్లయితే, పురుగు మందులు, రసాయనాలు వాడకుండానే వీటిని సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఇళ్లలో పెంచుకోవడానికి అనువైన కొన్ని కూరగాయల రకాల గురించి...

* బచ్చలి, బఠాణీ, చిక్కుడు, దొండ, దోస, ఆనప, పొట్ల, బీర, గుమ్మడి వంటి తీగజాతి మొక్కలను కుండీల్లో నాటుకుని, వాటి తీగలను ఇంటి పైకి పాకించవచ్చు. ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఆరుబయట స్థలం ఉంటే వాటికి పందిరి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.

* ఆవాలు, మెంతులు, ధనియాలు, పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర, మిర్చి, టొమాటో, బెండ, గోరుచిక్కుడు, చిక్కుడు, బీన్స్, క్యాప్సికం, వంగ, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి ఆకు కూరలు, కూరగాయలను వాటిని కుండీల్లో తేలికగా పెంచుకోవచ్చు.

* బాల్కనీల్లో లేదా టైపై, బీమ్‌లపైన కాస్త పెద్దసైజు కుండీలను, తొట్టెలను ఏర్పాటు చేసుకోగలిగితే ఉల్లి, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప, చిలకడ దుంప, కంద, చేమ, ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్ వంటి నేలలో పెరిగే కూరగాయలనూ సాగు చేసుకోవచ్చు. పెరట్లో తగినంత స్థలం ఉన్నట్లయితే, వీటిని నేరుగా మట్టిలోనే పెంచుకోవచ్చు.

 

కూరగాయలు, పండ్లు... ప్రపంచ రికార్డులు

కూరగాయల మొక్కలను, పండ్ల చెట్లను ఇళ్లల్లో పెంచుకునే పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొందరు ఔత్సాహికులు ఎంతో శ్రద్ధాసక్తులతో వీటిని పెంచుకుంటూ ఉంటారు. కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం ద్వారా ప్రపంచ రికార్డులు నెలకొల్పిన వారు కూడా ఉన్నారు. రికార్డులకెక్కిన అలాంటి విశేషాలు కొన్ని...



అతిపెద్ద చిలకడ దుంప: చిలకడ దుంప ఎంత పెద్దగా కనిపించినా మహా అయితే దాని బరువు పావు కిలోకు కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయితే, ఇది అలాంటిలాంటి చిలకడ దుంప కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద మహా భారీ చిలకడ దుంప. దీని బరువు ఏకంగా 11.2 కిలోలు. లెబనాన్‌లోని టైర్ నగరంలో ఖలీల్ సెమ్హాట్ అనే ఔత్సాహికుడి పెరటి తోటలో పండింది ఈ చిలకడ దుంప.

 

అతిపెద్ద పనసపండు: పనసపండు సాధారణంగానే పెద్దగా ఉంటుంది. కాస్త పెద్దసైజు పనసపండు అయితే అయిదారు కిలోలు కూడా తూగుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అత్యంత భారీ పనసపండు. దీని బరువు 34.6 కిలోలు. హవాయిలోని జార్జ్, మార్గరెట్ షాట్యూర్ దంపతుల ఇంటి ఆవరణలోని చెట్టుకు కాసింది ఈ బకాసుర పనసపండు.

 

అతిపెద్ద క్యాబేజీ: క్యాబేజీ సాధారణంగా ఎంత పెద్దగా కనిపించినా ఒకటి రెండు కిలోల వరకు ఉంటుంది. ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతి భారీ క్యాబేజీ. అమెరికాలో అలాస్కా రాష్ట్రంలోని పామేర్ ప్రాంతంలో జాన్ ఇవాన్స్ అనే మెకానికల్ డిజైనర్ పెరటి తోటలో కాసింది ఈ రాకాసి క్యాబేజీ. దీని బరువు ఎంతంటారా? కేవలం 34.4 కిలోలు మాత్రమే!

 

అతిపెద్ద పుచ్చకాయ: చూడగానే భూగోళాన్ని తలపించే పుచ్చకాయలు సాధారణంగానే పెద్దగా ఉంటాయి. కాస్త పెద్దసైజు పుచ్చకాయలు ఐదారు కిలోల వరకు కూడా ఉంటాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పుచ్చకాయ. దీనిని ఒక మనిషి మోయడం అసాధ్యం. దీని బరువు ఏకంగా 122 కిలోలు. అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రానికి చెందిన లాయిడ్ బ్రైట్ కుటుంబానికి చెందిన పొలంలో పండింది ఇది.

 

అతిపెద్ద క్యారెట్: అతిపెద్ద క్యారెట్ రికార్డు కూడా అతిపెద్ద క్యాబేజీని పండించిన జాన్ ఇవాన్స్ పేరు మీదే ఉంది. అలాస్కాలోని ఈ పామేర్ పెద్దమనిషి తన పెరటితోటలో పండించాడు దీన్ని. దీని బరువు ఏకంగా 8.5 కిలోలు.

 

అతిపెద్ద గుమ్మడిపండు: గుమ్మడిపండ్లు సహజంగానే పెద్దగా ఉంటాయి. ఎంత పెద్ద గుమ్మడిపండునైనా ఒక మనిషి కాస్త కష్టంగానైనా మోసేందుకు వీలవుతుంది. ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న గుమ్మడి పండును మోయాలంటే మనుషులు చాలరు. క్రేన్లు ఉపయోగించాల్సిందే! ఎందుకంటే దీని బరువు 951 కిలోలు మరి. బెన్ మీయర్ అనే స్విస్ తోటమాలి తోటలో పండింది ఇది.

 

అతిపెద్ద కాలిఫ్లవర్:  ఇది కూడా అలాస్కాలోని పామేర్ పెద్దమనిషి జాన్ ఇవాన్స్ పెరటితోటలో పూసినదే. ఎంత పెద్ద కాలిఫ్లవర్ అయినా ఒకటి రెండు కిలోలకు మించి ఉండదు. అయితే ఇవాన్స్ తోటలో పూసిన ఈ కాలిఫ్లవర్ మాత్రం ఏకంగా 14.1 కిలోలు తూగింది.

 

అతిపెద్ద బ్రకోలి: కాలిఫ్లవర్ మాదిరిగానే ముదురాకుపచ్చ రంగులో కనిపించే బ్రకోలీ విషయంలోనూ అలాస్కాలోని పామేర్‌కు చెందిన జాన్ ఇవాన్స్‌దే రికార్డు. ఆయన పెరటితోటలో పండిన ఈ బ్రకోలి బరువు 15.8 కిలోలు.

 

అతిపెద్ద యాపిల్:
ఎర్రగా బుర్రగా కనిపించే యాపిల్ పండు సాధారణంగా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటుంది. జపాన్‌లోని హీరోసాకి నగరంలో చిసాతో ఇవాసాకి అనే రైతు తోటలో పండిన ఈ యాపిల్‌ను పట్టుకోవడానికి రెండుచేతులు చాలవు. దీని బరువు 1.849 కిలోలు.

 

అతిపెద్ద నిమ్మకాయ: నిమ్మకాయలు మామూలుగా ఎంత ఉంటాయి? గుప్పిట్లో రెండు మూడు నిమ్మకాయల వరకు అవలీలగా ఇమిడిపోతాయి. ఇజ్రాయెలీ రైతు కఫార్ జీతిమ్ తోటలో పండిన ‘గజ’నిమ్మకాయను పెకైత్తాలంటే కాస్త ప్రయాస పడాల్సిందే! ఈ నిమ్మకాయ బరువు 5.265 కిలోలు మరి.

 

అతిపెద్ద ఉల్లిపాయ: సాధారణంగా బజారులో దొరికే ఉల్లిపాయల్లో ఎంత పెద్ద ఉల్లిపాయ అయినా మహా అయితే అరకిలోకు కాస్త అటు ఇటుగా తూగుతుందేమో! ఇంగ్లాండ్‌లోని  పీటర్ గ్లేజ్‌బ్రూక్ అనే పెద్దాయన తన తోటలో పండించిన ఉల్లిపాయ ప్రపంచంలోనే అతి భారీ ఉల్లిపాయ. దీని బరువు 7.7 కిలోలు.

 

అతిపెద్ద బంగాళదుంప: ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళదుంపను పండించిన ఘనత కూడా అతిపెద్ద ఉల్లిపాయను పండించిన ఇంగ్లాండ్ పెద్దాయన పీటర్ గ్లేజ్‌బ్రూక్‌కే దక్కుతుంది. ఆయన తోటలో పండిన ఈ బంగాళ దుంప బరువు 3.8 కిలోలు.

 

ఇళ్లలో పెంచుకోగల ఔషధ మొక్కలు

పెరటి తోటల్లోను, కుండీల్లోను చాలా రకాల ఔషధ మొక్కలను కూడా పెంచుకోవచ్చు. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదనే సామెత ఉంది గాని, అదంతా ఉత్తుత్తదే! పెరట్లోనో, ఇంట్లో కుండీల్లోనో పెంచుకున్న ఔషధ మొక్కలు కూడా వైద్యానికి భేషుగ్గానే పనికొస్తాయి. అత్యవసరమైన ఔషధ మొక్కలు కొన్నయినా ఇంట్లో ఉన్నట్లయితే ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి అనువైన కొన్ని ఔషధ మొక్కల గురించి...



* తులసి, పుదీనా, కొత్తిమిర, మెంతికూర, లావెండర్, రోజ్‌మేరీ, కలబంద వంటివి చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చు.

* మన దేశంలో దాదాపు హిందువులందరి ఇళ్లల్లోనూ తులసి కోట ఉంటుంది. పూజ కోసం తులసి మాలలు, తీర్థంలోకి తులసి ఆకులను విరివిగా వాడుతుంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు తులసిలో చలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

* తులసి ఆకులను నమిలి తిన్నా, తులసి ఆకుల రసంలో కాస్త తేనె కలిపి తీసుకున్నా గొంతుకు సంబంధించిన ఇబ్బందులు నయమవుతాయి. ఆకలి తగ్గుదల, వికారం, తలనొప్పి, మొటిమలు, చిన్న చిన్న గాయాలు వంటివి నయం చేయడానికి కూడా తులసి ఉపయోగపడుతుంది.

* యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు గల పుదీనాను వాంతులు, కడుపునొప్పి, అజీర్ణం, నోటి దుర్వాసన, తలనొప్పి వంటివి నయం చేయడానికి ఉపయోగిస్తారు.

* యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా గల కొత్తిమీరను మూత్రాశయ సమస్యలు, కిడ్నీ సమస్యలు, జాండిస్, రక్తపోటు, డయాబెటిస్, ఉబ్బసం, కీళ్లనొప్పులు నయం చేయడానికి వాడతారు.

* మెంతికూరలోనూ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, అజీర్తి, కడుపునొప్పి, చిగుళ్లవాపు వంటివి నయం చేయడానికి మెంతికూర ఉపయోగపడుతుంది.

* సుగంధం వెదజల్లే రోజ్‌మేరీ మొక్క వాతావరణంలోని ఎలాంటి హెచ్చుతగ్గులనైనా తట్టుకోగలదు. జలుబు, తలనొప్పి, అజీర్తి, బట్టతల, చుండ్రు, కండరాల నొప్పులు, డిప్రెషన్ నయం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

* సుగంధాలు వెదజల్లే లావెండర్‌ను సౌందర్య సాధనాల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. యాంటీ సెప్టిక్ లక్షణాలు, యాంటీ డిప్రెసంట్ లక్షణాలు లావెండర్‌లో పుష్కలంగా ఉంటాయి. కడుపు ఉబ్బరం, అజీర్తి, వాంతులు, మైగ్రేన్, పంటినొప్పి, జుట్టురాలడం వంటి సమస్యలను లావెండర్ సమర్థంగా నయం చేయగలదు.

* దళసరిగా కనిపించే కలబంద ఆకులు తోటకు అందానివ్వడమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడటంలోనూ గణనీయమైన పాత్ర పోషిస్తాయి. ఇళ్లలో పండించే కూరగాయల మొక్కలకు కాసే కూరగాయలకు కలబంద గుజ్జును పట్టిస్తే, చాలా రకాల బ్యాక్టీరియా వాటికి సోకకుండా ఉంటుంది.

* విటమిన్-సి పుష్కలంగా ఉండే కలబంద గుజ్జు మౌత్‌వాష్‌గా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలోను, జీర్ణకోశ సమస్యలను నియంత్రించడంలోను, గాయాలను నయం చేయడంలోను కలబంద సమర్థంగా పనిచేస్తుంది.

* కుండీలో పెంచుకోగల మరో అద్భుతమైన ఔషధ మొక్క చెంగల్వ కోష్టు. దీని మూలిక డయాబెటిస్‌ను అదుపు చేయడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని ‘ఇన్సులిన్ ప్లాంట్’ అని కూడా అంటారు. ఇది చర్మవ్యాధులను, అధిక రక్తపోటును కూడా అరికడుతుంది.

* కుండీలో పెంచుకునే అవకాశం లేకపోయినా, ఇంటి వద్ద కొంత ఖాళీ స్థలం ఉంటే తప్పనిసరిగా పెంచాల్సిన ఔషధ వృక్షం వేపచెట్టు. వేప ఆకులు, బెరడు, పూతలో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉన్నాయి.

* చుండ్రు, మొటిమలు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు, కడుపులోని క్రిమిదోషాలు, మలేరియా, డయాబెటిస్ వంటివి నయం చేయడంలో, శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో వేప సాటిలేనిది.

* ఔషధ గుణాలు గల వృక్షాల్లో ఉసిరి చెట్టు కూడా ముఖ్యమైనది. ఆయుర్వేద ఔషధాల తయారీలో త్రిఫలాల్లో ఒకటైన ఉసిరిని విరివిగా వాడతారు.

* విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరికాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. జుట్టురాలడం, కంటి జబ్బులు, చర్మవ్యాధులు, జీర్ణకోశ వ్యాధులను నయం చేయడంలోనూ ఉసిరి సమర్థంగా పనిచేస్తుంది.

 

పండ్లు, కాయలు ఇవ్వకున్నా, కేవలం నీడనిచ్చే చెట్లను కూడా పెరటి తోటల్లో పెంచుకోవచ్చు. కాస్త విశాలమైన స్థలం ఉన్నట్లయితే దేవదారు, అశోక, వేప, రావి, జమ్మి, మద్ది, టేకు, సరుగుడు, నీలగిరి వంటి చెట్లను పెరట్లో పెంచుకోవచ్చు.  బలమైన కాండంతో ఎదిగే ఇలాంటి చెట్లపైకి వివిధ రకాల తీగ మొక్కలను పాకించవచ్చు. చల్లని నీడనిచ్చే ఇలాంటి చెట్లు దీర్ఘకాలంలో కలప కోసం ఉపయోగపడతాయి. వీటి ద్వారా వచ్చే కలపను వంటచెరకు కోసం, ఫర్నిచర్ తయారీ కోసం ఉపయోగించుకోవచ్చు.

 

కొన్ని పెరటి మొక్కలు అత్యంత అరుదుగా దొరుకుతాయి. వీటిని పెంచడం వల్ల పెరటి తోటకే ఒక అందం వస్తుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే పూసే బ్రహ్మకమలం మొక్కలను అక్కడక్కడా కొందరు ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు.

 

అరుదైన మొక్కల్లో కొన్ని అంతరించిపోయే దశలో ఉన్నాయని వృక్ష శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

 

మెజెంటా ఘోస్ట్ ఫ్లవర్, మౌంటైన్ బాల్సాన్, సిరోయి లిల్లీ, స్ట్రైప్‌డ్ డ్యూ ఫ్లవర్ వంటి పూల మొక్కలు మన దేశంలో అరుదుగా కనిపిస్తాయి. ఈ మొక్కలు కుండీల్లో కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి.

 

అరుదైన మొక్కలను అంతరించిపోకుండా కాపాడుకుంటేనే పర్యావరణ సమతుల్యత బాగుంటుందని చెబుతున్నారు.


 

ఉద్యాన ఉత్పత్తుల్లో మనది రెండోస్థానం

హరిత విప్లవం ప్రభావంతో మన దేశంలో 1960, 70 దశకాల నాటి ఆహార కొరత పరిస్థితి చాలా వరకు తీరింది. వ్యవసాయ విధానంలో మన ప్రభుత్వాలు ఇప్పటికీ తిండిగింజలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నా, ఉద్యాన ఉత్పత్తుల్లోనూ మన దేశం గడచిన నాలుగు దశాబ్దాలలో గణనీయమైన పురోగతినే సాధించింది. ఉద్యాన ఉత్పత్తుల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే, భారత్ రెండో స్థానంలో ఉంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు వంటి ఉద్యాన ఉత్పత్తుల సాగు విస్తీర్ణం 2014-15 నాటికి 2.34 కోట్ల హెక్టార్లు కాగా, ఈ ఉత్పత్తుల పరిమాణం 283.5 మిలియన్ టన్నులు. మన దేశంలో ఉద్యాన ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తెలంగాణలోని నల్లగొండ, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా, మధ్యప్రదేశ్‌లోని సాగర్, షాదోయి, పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్, మహారాష్ట్రలోని పుణే, ఔరంగాబాద్, జల్గాంవ్, సాంగిల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.

 

మొక్కలు - వాస్తు

చల్లని నీడ కోసం, పరిమళాలు వెదజల్లే పూల కోసం, ఆహార అవసరాలు తీర్చే కూరగాయలు, పండ్లు వంటి వాటి కోసం చాలామంది మొక్కలను పెంచుతుంటారు. అయితే, కొందరు వాస్తుపరమైన నమ్మకాలతో కూడా ఇళ్లలో మొక్కలను పెంచుతూ ఉంటారు. భారతీయ వాస్తుశాస్త్రంతో పాటు చైనీస్ ‘ఫెంగ్‌షుయి’ నమ్మకాల ఆధారంగా అరిష్టాలు తొలగిపోతాయనే ఉద్దేశంతో, అదృష్టం కలసి వస్తుందనే ఉద్దేశంతో కూడా చాలామంది మొక్కలు పెంచుతూ ఉంటారు. నమ్మకాలతో ముడిపడ్డ కొన్ని మొక్కల గురించి...



* ‘ఫెంగ్‌షుయి’ ప్రకారం కుండీలో లాటస్‌బాంబూ మొక్కను పెంచితే అదృష్టం కలసి వస్తుందని చాలామంది నమ్ముతారు.

* జెండాలా రెపరెపలాడే పూలు పూసే పీస్‌లిల్లీ మొక్కలను కుండీలో పెంచుకున్నట్లయితే ఇంటికి లేదా కార్యాలయానికి ఆకర్షణశక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది.

* మనీప్లాంట్‌ను ఇంటి గుమ్మం వద్ద కుండీలో పెంచుకున్నట్లయితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారు.

* ఇంట్లో లేదా కార్యాలయంలో అంబ్రెల్లా ప్లాంట్‌ను పెంచుకుంటే కార్యసాఫల్యతతో పాటు అదృష్టం కలసి వస్తుందనే నమ్మకం ఉంది.

* తులసిచెట్టు ప్రతి ఇంటా ఉండి తీరవలసిందని, దీనివల్ల సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం ఎప్పటి నుంచో ఉంది.

* ఇంటికి తూర్పు, ఉత్తర దిశలలో చిన్న చిన్న మొక్కలను పెంచడం వల్ల సకల శుభాలు కలుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది. అయితే, ఈశాన్య మూలలో మాత్రం ఎలాంటి మొక్కలు లేకుండా ఖాళీగా ఉండేలా చూసుకోవాలనేది వాస్తు నిబంధన.

* గులాబీని మినహాయిస్తే మిగిలిన ఎలాంటి ముళ్ల చెట్లను ఇళ్లలో పెంచరాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. తుమ్మ వంటి ముళ్ల చెట్లను ఇంట్లో పెంచితే అవి ప్రతికూల శక్తులకు ఆలవాలంగా మారుతాయనే నమ్మకం ఉంది.

* ఇంటికి నైరుతి దిశలో పూల మొక్కలను పెంచడం వల్ల అదృష్టం కలసి వస్తుందని వాస్తుశాస్త్ర నమ్మకం.

* రాతి నిర్మాణాలతో కూడిన రాక్‌గార్డెన్స్ ఏర్పాటు చేసుకోవడానికి నైరుతి మూల అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల అదృష్టం కలసి వస్తుంది. అయితే, రాక్ గార్డెన్స్‌ను ఈశాన్య మూలలో ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top