బ్లాక్‌మెయిల్ చేసే భంగిమలతో ఫొటోలు...

బ్లాక్‌మెయిల్ చేసే భంగిమలతో ఫొటోలు... - Sakshi


 నేను, ఒకబ్బాయి ప్రేమించుకున్నాం. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాం. కానీ అతనికి సిగరెట్ తాగే అలవాటుందని ఈ మధ్యే తెలిసింది. నాకు స్మోక్ చేసేవాళ్లంటే అసహ్యం. అందుకే అతనికి ‘నో’ చెప్పాను. కానీ అతను మేమిద్దరం కలిసి దిగిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నన్ను నేను రక్షించు కోవడానికి మార్గం చూపించండి.

 - ఓ సోదరి, వీరవాసరం



 మీరిద్దరూ దిగిన ఫొటోలు ఎలాం టివి? బ్లాక్‌మెయిల్ చేసే భంగిమలతో ఫొటోలు దిగేవరకూ తనకి సిగరెట్ తాగే అలవాటు ఉందన్న విషయం మీకు తెలియకుండా మేనేజ్ చేసినందుకు అతణ్ని అభినందించాలి. అయితే అతడు ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో మీరు వివరించలేదు. సాధారణంగా ఇలాంటి  పనులు చేసేవాళ్లు ముఖంపై యాసిడ్ పోస్తామనో, దారి కాచి కత్తులతో పొడుస్తామనో భయపెడతారు. మీలాంటి అమ్మాయిలు భయపడుతూంటారు. కానీ మీరు ఎదురు తిరిగితే... మీరెంత భయ పడుతున్నారో అవతలివాళ్లూ అంతే భయ పడతారు. కాబట్టి వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. ఆ ధైర్యం లేకపోతే మీ ఇంట్లోని పెద్దవాళ్లతో ఉన్నదున్నట్టు చెప్పండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. మీరిప్పుడు అన్నీ దాచి మరొకరిని పెళ్లి చేసుకుంటే, ఆ తర్వాత ఇలాంటి విషయాలు బయటకు పొక్కితే... మీరు మీ జీవితాన్నే కోల్పో వలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వెంటనే ఇంట్లో వాళ్లకి చెప్పండి. మీ పెద్ద వాళ్లకి విషయం తెలిసిందని గ్రహిస్తే, మీ మాజీ స్నేహితుడు భయపడతాడు. మళ్లీ చెప్తున్నాను... మనం భయపడినంతవరకే బ్లాక్ మెయిలర్స్ భయపెడతారు. అయితే మీరు ఎదురు తిరగడం వల్ల మిమ్మల్నొది లేసి బలహీన వ్యక్తిత్వం ఉన్న మరోవ్యక్తిని లోబర్చుకోడానికి ప్రయత్నించొచ్చు. కాబట్టి ధైర్యం చేసి పోలీసు రిపోర్ట్ ఇస్తే మీలాంటి చాలా మంది అమ్మాయిల్ని రక్షించినవారవుతారు.

 

  నేను పీజీ చేస్తున్నాను. చదువులో ఎప్పుడూ ఫస్టే. కానీ ఈ మధ్య మనసు వేరే విషయాల మీదకు పోతోంది. నా ఫ్రెండ్స్ అంతా వారాంతాల్లో సినిమాలకి, షికార్లకి వెళ్తుంటారు. నాకది ఎప్పుడూ అలవాటు లేదు. వీకెండ్స్ నా ఫ్యామిలీతోనే గడుపుతాను. కానీ ఈ మధ్య నాక్కూడా ఫ్రెండ్స్‌తో వెళ్లాలనిపిస్తోంది. ఆ విషయం అమ్మతో చెబితే ఎప్పుడూ లేనిది ఇదేం అలవాటు అంటోంది. నాన్నయితే- అలాంటివన్నీ చేస్తే చదువు అటకెక్కుతుంది అని సీరియస్ అవుతున్నారు. సరదాగా సినిమాకి వెళ్తేనే నేను చెడిపోతానా సర్?

 - సాగర్, రాజమండ్రి

  పీజీ చేస్తున్న మీరు... స్నేహితులతో కలిసి ఆదివారం సినిమాకి వెళ్లడంలో తప్పేమీ లేదు. మీ అమ్మగారు భావించినట్టు అదేమీ దుర్మార్గమైన అలవాటు కాదు. జీవితం కొంచెం విస్తృతమవ్వాలంటే ఇలాంటి ఆకర్షణలు కొద్దిగానైనా ఉండాలి. అయితే ఇవే ఆలోచనలు మిమ్మల్ని సదా వెంటాడుతూ ఉంటే మాత్రం, అది మీ చదువు మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. అలా జరుగుతుంటే కనుక ఈ కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మీరిప్పటికే పీజీ చేస్తున్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత స్నేహితులతో ఎలా గడిపినా భవిష్యత్తుకి అడ్డు రాదు. అయినా వారాంత సినిమాలు కూడా మానేసి మీరు పీజీ వరకూ ఫస్ట్ క్లాస్‌లో పాసవుతూ వచ్చారు అంటే మీ మనస్తత్వం కొద్దిగా అర్థమవుతోంది. కాబట్టి చదువు ఆఖరి దశలో కొత్త ప్రయోగాలు చేయకండి. ఒకవేళ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలను అని నమ్మకం ఉంటే, అప్పుడు మీకు నచ్చినట్టుగా స్నేహితులతో తిరగండి.

 

  నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. నా భార్యతో నాకే సమస్యా లేదు. కానీ మా అత్తమామలు మాత్రం ప్రతి దానిలోనూ కల్పించు కుంటున్నారు. నేనేం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతారు. నా ఉద్దేశం మంచిదేనా కాదా అని పరీక్షిస్తూ ఉంటారు. ప్రతిదాన్నీ అపార్థమే చేసుకుంటారు. పైగా వాళ్ల అభిప్రాయాల్ని నా భార్యమీద రుద్దే ప్రయత్నం చేస్తుంటారు. నేను నా మాట తీరుతో నా ఆఫీసులో వాళ్లని, బయటివాళ్లని అందరినీ ఆకట్టుకున్నాను. కానీ మా అత్తమామల ఉద్దేశంలో నాకసలు మాట్లాడమే రాదు. వాళ్లిలా కామెంట్లు చేయడం వల్ల నా కాన్ఫిడెన్స్ పోతోంది. నన్నేం చేయమంటారు?

 - రవికుమార్, విజయనగరం

 మీ జీవితంలో మీ అత్తమామల చొరబాటు అంతగా ఎందుకు ఉంటోంది? మీరు ఇల్లరికం ఉంటున్నారా? సాధారణంగా కూతురి మీద తల్లి తన అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. దానివల్ల అల్లుళ్ల కంప్లయింట్లు ఈ విధంగానే ఉంటాయి. మీ ఉత్తరాన్ని బట్టి మీ వ్యక్తిత్వంలోనే కొద్దిగా లోపం ఉన్నట్లు అనిపిస్తోంది. ముందు మీరు ఇండివిడ్యువాలిటీని పెంచుకోండి. ముఖ్యంగా ‘అవతలివాళ్ల కామెంట్ల వల్ల మీ మీద మీకు నమ్మకం తగ్గిపోవడం’ అంత మంచి పరిణామం కాదు. కాబట్టి మీ అత్తమామల పట్ల మీ ఫిర్యాదులన్నిటి గురించీ మీ భార్యతో విపులంగా మాట్లాడండి. ఆమెను తన తల్లితో మాట్లాడమని చెప్పండి.  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top