ఆస్కార్‌ను కోల్పోయింది అందుకే!

ఆస్కార్‌ను కోల్పోయింది అందుకే!


 ఆ సీన్ - ఈ సీన్

  దక్షిణాదిలో సూపర్‌హిట్ సినిమాను తీయడానికి ఒక ఫార్ములా ఉంది. హాలీవుడ్ నుంచి ఒక థీమ్ పాయింట్‌ను తీసుకో... దాన్ని తెలుగో, తమిళ సంస్కృతికో అన్వయించు... ఒక యంగ్ హీరోయిన్‌ను పెట్టు... ఆరు పాటలు, వీలైనన్ని ఫైటింగ్ సీక్వెన్స్‌లు కల్పించు... కొన్ని పంచ్‌డైలాగులు, సెంటిమెంట్ అదనపు మెరుగులు! ఈ ఫార్ములా ప్రకారం సినిమా తీస్తే అది కచ్చితంగా హిట్ అవుతుంది. తీసిన వారికి గొప్ప పేరు వస్తుంది. ఇది ఒక హిట్ ఫార్ములా అని చెప్పడానికి అనేక రుజువులున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ‘కో’ సినిమా. తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఒక హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో రూపొందింది అనే అభియోగాలున్నాయి.

 

 2011లో జాతి దృష్టినంతటినీ ఆక ర్షించిన తమిళ సినిమాలొచ్చాయి. శంకర్ రజనీకాంత్‌తో తీసిన ‘రోబో’, ధనుష్ హీరోగా రూపొందిన ‘అడుక్కలం’, ‘ఆటోగ్రాఫ్’ దర్శకుడు చేరన్ రూపొం దించిన ‘మురాన్’ వంటి సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు కూడా పొందాయి. ‘అడు క్కలం’ జాతీయ అవార్డును అందుకొంది. ఈ సినిమాలన్నీ ఏకంగా ఆస్కార్ అవార్డులకు పోటీ పడే స్థాయికి చేరాయి. విదేశీ క్యాటగిరీలో ఇండియా నుంచి ఆస్కార్‌కు పంపాలంటూ తమిళులు ఈ సినిమాలను జాతీయ కమిటీ పరిశీలనకు పంపించారు. ఆ ఏడాదిలో తమిళంలో వచ్చిన ‘కో’ సినిమా కూడా ఇలా ఆస్కార్ ఎంట్రీ కోసం ట్రై చేసింది. అయితే ఈ సినిమాల్లో వేటికీ మన దేశం తరపున ఆస్కార్‌కు వెళ్లేంత  సీన్ లేదని, ఇవన్నీ కాపీ క్యాట్‌లేనని ఆ కమిటీ తేల్చేసింది!

 

 మిగతా సినిమాల సంగతి పక్కన పెడితే... జీవా, కార్తీక హీరో హీరోయిన్లుగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగం’ సినిమా మనవాళ్లను బాగా ఆకట్టుకొంది. వైవిధ్యమైన కథనం, పొలిటికల్ డ్రామా అయి ఉండటం, అంత వరకూ ఇలాంటి సినిమాలే వీ రాకపోవడంతో ‘రంగం’ ఎంతో ఆకట్టుకొంది. ఔత్సాహికులైన కొందరు యువకులు రాజకీయాల్లోకి వచ్చి అందరి ప్రశంసలూ అందుకొంటారు. అవినీతి, కుళ్లూ కుతంత్రాలతో కూడిన రాజకీయాలకు సింహస్వప్నంగా మారతారు. అలాంటి వారిని ప్రోత్సహించడానికి సామాన్యులు, మీడియా ముందుకొస్తుంది. ఎన్నికల వరకూ వెళ్లిన ఆ యువతరం పార్టీ కూడా చివరికి ఒక వ్యక్తి స్వార్థానికి ప్రతిరూపం అని, ప్రజల నుంచి సానుభూతిని పొందడానికి అతడు తమవారినే పొట్టనపెట్టుకొనే కిరాతకమైన ఎత్తుగడ వేశాడని కథలోని ప్రధాన పాత్రలకు అర్థం అవుతుంది.

 

 అతడి స్వార్థానికి అతడూ బలైపోతాడు. అయితే అతడి నిజస్వరూపం గురించి తెలిస్తే యువతరం స్ఫూర్తి దెబ్బతింటుందన్న భావనతో ప్రధాన పాత్రలు దాన్ని రహస్యంగానే ఉంచి, యువతరం స్పూర్తిని ఆకాశమంత స్థాయిలోనే ఉంచడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా కథ యథాతథంగా కాదు కానీ, ఔట్‌లైన్ మాత్రం 2009లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘స్టేట్ ఆఫ్ ప్లే’ నుంచి తీసుకొన్నదని అంటారు. రెండు సినిమాలకూ చాలా సామీప్యత లుంటాయి. ‘స్టేట్ ఆఫ్ ప్లే’లో కథానాయ కుడు మీడియాలో పనిచేస్తూ ఉంటాడు. అతడి స్నేహితుడు రాజకీయాల్లో ఉంటాడు. స్నేహితుడు ఉత్తముడన్న భావనతో అతడు రాజకీయంగా నిల దొక్కుకోవడానికి తీవ్ర ంగా శ్రమిస్తూ, నిస్వార్థంగా అతడిని ప్రజల ముందు హీరోగా నిలబెడతాడు.

 

 అయితే అతడు క్లయిమాక్స్ సమయానికి విలన్ అవు తాడు. అయితే ఈ విషయం ప్రజలకు తెలిస్తే వ్యవస్థ మీదే నమ్మకం పోతుందన్న భయం ఉన్న హీరో అతడిని కట్టడి చేసి, జనాల్లో తమ భావనల స్ఫూర్తిని ఎలా కాపాడాడనేదే ‘స్టేట్ ఆఫ్ ప్లే’ కథ. ఈ ఔట్‌లైన్ ఆధారంగా చేసుకొని కేవీ ఆనంద్ ‘కో’ సినిమాను తీర్చిదిద్దాడని క్రిటిక్స్ అంటారు. ఇలా కాపీ కొట్టడం వల్లనే ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాన్ని కోల్పోయిందని కూడా చెబుతుంటారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ‘రంగం’ సినిమా ఆడియోపరంగా కూడా సూపర్ హిట్. అయితే హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటల్లో కూడా కొన్ని కాపీ స్వరాలున్నాయి!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top