ప్రజాస్వామ్యం వర్ధాల్లాలి

ప్రజాస్వామ్యం వర్ధాల్లాలి


వివరం

ఇవాళ్టి ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఓ ఆశాజ్యోతి. ఇది తిరుగులేని వాస్తవం. కానీ నేటి ప్రజాస్వామ్యమే, దాని ప్రస్తుత స్వరూపమే అంతిమమని నిర్ధారించడం ప్రజాస్వామ్యానికే అపచారం. ఆ పంథాను ఎంచుకున్న వ్యవస్థలన్నీ సుఖసంతోషాలతో వెల్లివిరుస్తున్నాయని చెప్పడం కూడా ఆ సిద్ధాంత స్ఫూర్తికి ద్రోహం చేయడమే. ఆ వ్యవస్థకు అనేక రూపాలు కనిపిస్తాయి. వ్యవస్థను బట్టి, కాలాన్ని బట్టి ప్రజలు ఆశించిన రీతిలో, వారి ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రజాస్వామ్యం అవతరించడం ఒక వాస్తవం. సెప్టెంబర్ 15న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ’ సందర్భంగా డెమోక్రసీ గురించి ‘వివరం’గా...

 

రాచరికాలు, నియంతృత్వాలు, సైనిక నియంతృత్వాలు, కుటుంబ పాలనలు, అథారిటేరియన్ పాలక వ్యవస్థలు, కులీనుల ఏలుబడులు, కమ్యూనిస్టు సోషలిస్టు వ్యవస్థలు విఫలమైనప్పుడల్లా ప్రజాస్వామ్యమే దర్శనమిచ్చింది. పతనమైన రాజకీయ వ్యవస్థను బట్టి కొత్త రూపంతో అక్కడ అవతరించింది. తాను బలహీన పడుతుంటే మౌనం వహించింది కూడా. ప్రజాళికి గుర్తుకొస్తే కాలానుగుణంగా మళ్లీ తలెత్తుకు నిలబడింది. అయినా, ప్రజాస్వామ్యం అంటే సోషలిజంలా ‘అంతా ధరించడం వల్ల ఆకృతిని కోల్పోయిన టోపీ’ వంటిది కాదు.



ఏ రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పటికీ ఎన్నో దేశాలలో, వ్యవస్థలలో మకుటం లేని మహారాజు గౌరవం దక్కించుకుంటున్న శక్తి. ఇంత సుదీర్ఘ ప్రయాణం చేసి వస్తున్నప్పటికీ, ఎప్పుడో క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో అంకురించినప్పటికీ ఈ అత్యున్నత సామాజిక, రాజకీయ తాత్వికత 21వ శతాబ్దం తొలి దశాబ్దానికైనా వేళ్లూనుకుందని చెప్పడం మాత్రం సాధ్యం కావడం లేదు.



ఆ ధోరణికి మనుగడ లేదని చెప్పడమూ అసాధ్యమే. ప్రజాస్వామిక వ్యవస్థల చరిత్రే దీనికి సాక్ష్యం. ఆ ఆశాజ్యోతి రేపు కూడా వెలుగుతూ ఉండాలని కోరుకోవడం వరకే మన బాధ్యత. ఆ జ్యోతి నుంచి ఇంకొన్ని జ్యోతులు వెలగాలని ఆకాంక్షించడమే, అందుకు అనువైన వాతావరణం కల్పించడమే ప్రపంచం సదా నిర్వర్తించవలసిన కర్తవ్యం.

 

ధ్వని-ప్రతిధ్వని

రెండున్నర వేల ఏళ్ల క్రితం అక్కడ ఏథెన్స్ నగర రాజ్యంలోనూ, క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో ఇక్కడ భారతదేశంలో కొలువుతీరిన గణతంత్ర రాజ్యాలలోనూ సామాన్యపౌరుడు గళమెత్తి తన ఆకాంక్షలను వెల్లడించాడని చారిత్రకాధారాలు గట్టిగా ఘోషిస్తున్నాయి. ఆ గళం ప్రతి శతాబ్దంలోనూ వినిపిస్తూనే ఉంది. మనతరం చెవులను కూడా తాకిన  2011 నాటి ‘అరబ్బు వసంతం’లో వినిపించినది కూడా దాని ప్రతిధ్వనే. ప్రజాస్వామ్యం కోసం సామాన్య పౌరుడు చేసిన సింహగర్జన అది.



డెమోక్రాటియా (గ్రీక్) అనే పదం పుట్టినది కూడాఏథెన్స్ నగర రాజ్యంలోనే. డెమో (ప్రజలు), క్రాటోస్ (అధికారం) అనే రెండు పదాల సంగమమిది. ఇదే ఆంగ్లంలోకి వచ్చి డెమోక్రసీగా రూపుదాల్చింది. ఓటు ద్వారా దేశ ప్రజానీకం తన అభిమతాన్నీ, సార్వభౌమాధికారాన్నీ చాటుకోవడమే దీనిలోని పరమార్థం. విస్తృతార్థంలో పాలనా వ్యవహారాలలో ప్రజావాణిని గౌరవించడం. రాజు,  కొందరు ధనికులు ఉండే శాసనసభలో, సాధారణ పౌరుడికి కూడా చోటు కల్పించడమనే ప్రయోగాన్ని ఏథెన్స్‌లో ఆ కాలంలో చేశారు. మన గణతంత్ర రాజ్యాలలో జరిగింది కూడా దాదాపు ఇదే. ఈ ప్రయోగమే నేటి వరకు అనేక రూపాలతో సాగుతోంది. మధ్య యుగాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి.

 

మాగ్నాకార్టా

ఆఖరికి చీకటి యుగాలలో కూడా ప్రజాస్వామ్యం కోసం అన్వేషణ సాగింది. 1215లో బ్రిటిష్  సామ్రాజ్యం లిఖించుకున్న ‘మాగ్నాకార్టా’ అలాంటి యుగాలలో ప్రజాస్వామ్య సిద్ధాంతానికి దివిటీ పట్టింది. నాటి ఇంగ్లండ్ రాజు జాన్ మితిమీరి చలాయిస్తున్న అధికారాలకు కత్తెర వేసి, పరిమితంగానే అయినా ప్రజలకు కొన్ని హక్కులు  కల్పించడానికి ఉద్దేశించినదే 63 నిబంధనల మాగ్నాకార్టా. న్యాయస్థానాల ద్వారా సామాన్యుడు కూడా న్యాయం అందుకునే హక్కును కల్పించడం, హద్దూ పద్దూ లేకుండా పెంచుతున్న పన్నులను కట్టడి చేయడం, విచక్షణా రహితంగా విధిస్తున్న శిక్షలను క్రమబద్ధీకరించడం, కేథలిక్ చర్చికి కొన్ని అధికారాలు దఖలు పరచడం వంటి అంశాల మీద మాగ్నాకార్టా సాధారణ పౌరులకు హామీ ఇచ్చింది. అంటే రాజు అధికారానికి అడ్డుకట్ట పడి, ప్రజాభిప్రాయానికి విలువ ఏర్పడింది.



ఇక అమెరికా స్వాతంత్య్ర సమరంలో భాగంగా చేసిన ‘స్వాతంత్య్ర ప్రకటన’(1776) ప్రజాస్వామ్య తాత్వికతను సంపద్వంతం చేసింది. స్వేచ్ఛ, సమత్వం, సౌభ్రాత్రం నినాదం ఇచ్చిన ఫ్రెంచి విప్లవం (1789) దీనికి కొత్త దృష్టిని అద్దింది. ఇంత బలమైన భూమిక ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య సిద్ధాంత మనుగడకీ, దాని అమలుకూ రాజులు, నియంతలు, కులీన ప్రభువులు, అరాచకవాదులు, సైనిక నియంతలు శతథా అడ్డుపడ్డారు. ప్రజాస్వామిక సిద్ధాంతాలు పుడుతూనే ఉన్నాయి. ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పోరాటాలలోనే 20వ శతాబ్దం ప్రవేశించింది.

 

మూడు దశలలో ఆవిర్భావం

ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్థల ఆవిర్భావం మూడు దశలలో జరిగిందని చరిత్రకారులు చెబుతారు. ఇదో ఆసక్తికరమైన అంశం. అమెరికాలో పురుషులందరికీ ఓటు హక్కును ప్రసాదించిన 1820 నుంచి తొలి దశ ప్రారంభమైందని చెబుతారు. 1926 వరకు సాగిన ఈ దశలో 29 దేశాలలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పాటైనాయి. కానీ ఈ దశలో తిరోగమన కోణం కూడా ఉంది. అది 1922లో మొదలయింది. 1942 వరకు సాగింది. నిజానికి ప్రజాస్వామ్య సిద్ధాంతం మీద సానుకూల దృక్పథం ఎంత బలమైనదో; విమర్శ, వ్యంగ్యం కూడా అంత బలంగానూ వినిపిస్తాయి.



‘ప్రజాస్వామ్యం ప్రతి దద్దమ్మకీ ఓటుతో ఏదో ఒకటి చేయగల శక్తిని ప్రసాదిస్తుంది’ అంటారు. ఇటలీలో ముస్సోలినీ చెలరేగిన కాలం ఇలాంటి దృక్పథానికి ఊతాన్ని ఇచ్చింది. ఫాసిస్ట్ సిద్ధాంత ప్రవక్త బెనిటో ముస్సోలినీ జోక్యంతో ఆ దేశాల సంఖ్య 29 నుంచి 12కు దిగజారిపోయింది.

 

రెండో ప్రపంచ యుద్ధం తరువాత రెండో దశగా పరిగణిస్తారు. మిత్రరాజ్యాల కూటమి విజయం ఇందుకు నాంది పలికింది. 1962 నాటికి ఈ దశ ఉచ్ఛస్థితికి చేరుకుంది. కొత్తగా 36 దేశాలలో ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రజలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. రెండో దశ కూడా తిరోగమనాన్ని చవి చూసింది. ఆరు దేశాలలో ప్రజాస్వామ్యాన్ని కూల్చిన ఆ తిరోగమన దశ 1960-75 మధ్య కాలంలోనిది. 1974 నుంచి 1990 వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకున్న దేశాలు 30.



వీటి సంఖ్య 2013 సంవత్సరం నాటికి 120కి పెరిగింది. అంటే ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ ప్రభుత్వాలను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్న దేశాలు ప్రపంచంలో 60 శాతం. ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం  ప్రయాణించక తప్పని పరిస్థితులు నెమ్మదిగా బలపడుతున్నాయని అప్పుడే అంతా గమనించారు. నిజానికి దేనినైనా మార్చే శక్తి కాలానికి ఉంటుందని 20వ శతాబ్దం ఆరంభ ఘడియలూ, పరిణామాలే రుజువు చేశాయి.

 

1970-80 మధ్య కాల ంలో కనిపించేది మూడో దశ. ఇది కేథలిక్ దేశాలలో వచ్చిన మార్పులతో సాధ్యమైంది. అంతవరకు ఎక్కువగా ప్రొటెస్టంట్ శాఖను అనుసరించే దేశాలలోనే ప్రజాస్వామ్యం నెలకొనడం చూస్తాం. నిజానికి 1989 నుంచి జరిగిన మార్పులు ఎక్కువ కేథలిక్ సమాజాలలోనే జరిగాయి.  యూరోపియన్ కమ్యూనిటీ ఆవిర్భావంతో వచ్చిన మార్పులు, అవి అంతిమంగా ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపడం వంటి పరిణామాలను కూడా మూడో దశలో భాగంగానే పరిగణిస్తారు.



దక్షిణ ఐరోపాలో ఎక్కువ దేశాలలో ప్రజాస్వామ్యం పటిష్టమైనది ఆ కాలంలోనే. పాశ్యాత్య ప్రపంచంలో ప్రజాస్వామిక వ్యవస్థకు అంకురార్పణ చేసిన గ్రీస్ కూడా 1981లో యూరోపియన్ కమ్యూనిటీలో సభ్యత్వం తీసుకుంది. మరో ఆరేళ్లలోనే స్పెయిన్, పోర్చుగల్, టర్కీ కూడా సభ్యత్వాలు తీసుకున్నాయి. కమ్యూనిస్టు పాలనను కాదనుకున్న తరువాత 1991లో హంగెరీ, చెకోస్లొవేకియా, పోలెండ్‌లు కూడా యూరోపియన్ కమ్యూనిటీలో సభ్యత్వం కోసం వరసలో నిలబడ్డాయి.

 

నివురు గప్పిన నిప్పు

కొన్ని పరిణామాలను గమనిస్తే ప్రజాస్వామ్యం ఎప్పుడూ నివురు గప్పిన నిప్పులా ఉంటుందని అనుకోవలసి వస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధం బలహీనపడడం, సోవియెట్ రష్యా ప్రభావం నీరసపడడం వంటి పరిణామాలతోనే తూర్పు యూరప్‌లో ఉద్యమాలు ఎగసిన మాట వాస్తవం. గల్ఫ్ యుద్ధం పేరుతో ఐదు లక్షల మంది అమెరికా సైనికులు ఆ ప్రాంతంలో మోహరించిన ఫలితమే కువైట్, సౌదీ అరేబియాలలో ప్రజాస్వామ్య గళం ఎంతో కొంత వినిపించడం. అలాగే పాకిస్థాన్, ఆఫ్ఘాన్  వ్యవహారాలలో  అమెరికా జోక్యం తగ్గితే, ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడి, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంటుంది.  

 

భారత్ సాధించింది


ప్రచ్ఛన్న యుద్ధం, అసంఖ్యాకమైన యుద్ధాలు, సంక్షోభాల మధ్య కూడా ఆరున్నర దశాబ్దాల పాటు ఏ సమాజమైనా  ప్రజాస్వామిక వ్యవస్థను అంటిపెట్టుకుని ఉండడం గొప్ప విజయం. అది భారత దేశం సాధించింది. ఈ అంశాన్ని సాపేక్షంగా చూసి ప్రపంచం కూడా విస్తుపోతోన్న మాట వాస్తవం. సోవియెట్ రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం మనుగడ సాగించిన కాలం 74 సంవత్సరాలు.



కమ్యూనిస్టు పాలన అథారిటేరియన్ గుణం కలిగినదన్నమాట సత్యదూరం కాదు. కానీ భారత్‌లో వాక్ స్వాతంత్య్రం ఎక్కువ. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. అవిద్య ఉంది. దారిద్య్రం ఉంది. వేర్పాటువాదం ఉంది. అయినా మెజారిటీ ప్రజానీకం ప్రజాస్వామిక వ్యవస్థలోని సానుకూల అంశాన్ని ప్రేమిస్తున్నారు. సహజీవనంలోని మాధుర్యాన్నీ, బలాన్నీ గుర్తిస్తున్నారు.

 

భారత్ ప్రజాస్వామిక దేశమని రాజ్యాంగం ముందుమాట చెబుతుంది. ప్రజాస్వామిక మౌలిక సూత్రాలు న్యాయం, స్వేచ్ఛ, సమత్వం మన రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఎన్ని విమర్శలు ఉన్నా భారతదేశంలో అథారిటేరియన్ ప్రభుత్వం ఎప్పుడూ ఏర్పడలేదు. ఆ అవకాశం కూడా లేదు. భారత సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే వ్యవస్థలు, వ్యక్తుల అభిప్రాయాలకు ఇక్కడ పత్రికలలో చోటు ఉంటుంది. వేర్పాటువాదుల గళం వినిపించే అవకాశం ఉంది. సమత్వం కోసం ఎవరైనా ఉద్యమించే అవకాశం ఉంది.



అందరికీ చదువుకునే అవకాశం ఉంది. ఇక భారత్‌లో చట్టాల అమలులో జరిగే  జాప్యం గురించి ఎవరైనా విమర్శించగలరే గానీ, అసలు చట్టాల అమలే లేదని అన లేరు. చాలా సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులతో భారత ప్రజాస్వామ్యం, దాని మౌలిక లక్షణం క్షేమంగా నిలబడిన మాట వాస్తవం. మన ప్రజాస్వామిక వ్యవస్థ తొలి పాతికేళ్లలోనే నిజానికి గొడ్డలిపెట్టు వంటి సంక్షోభంలో పడింది. అయినా గట్టెక్కగలిగింది. అదే అత్యవసర పరిస్థితి (1975-1977) చీకటి యుగం.



భారత మూడో ప్రధాని ఇందిరాగాంధీ ఈ అకృత్యానికి ఒడిగట్టారు. అత్యవసర పరిస్థితి వంటి ఘోర ప్రమాదం ఇప్పట్లో దేశానికి లేకపోవచ్చు. కానీ అసలు ప్రజాస్వామ్యం మౌలిక లక్షణాలైన స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన విద్య, అందరికీ సమాన అవకాశాలు వంటి వాటి విషయంలో కప్పదాటు వైఖరి కొనసాగుతూనే ఉంది. ఇది ప్రమాదం.

 

కమ్యూనిస్టు దేశాలలో లోపాలు ఉన్నాయి. సైనిక నియంతృత్వాలలో అన్నీ లోపాలే కనిపిస్తాయి. రాచరికాలలో ప్రజల గొంతుకు విలువే లేదు. ఇవన్నీ చారిత్రక సత్యాలు.  వీటితో పోల్చినపుడు ప్రజాస్వామ్యం చాలా గొప్పది. కాబట్టే ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయమని చెప్పుకోవచ్చు.

 - డా॥గోపరాజు నారాయణరావు

 

ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలు

 

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత అందులో ప్రధాన శక్తులు జర్మనీ, ఆస్ట్రియా-హంగెరీ, టర్కీ, రష్యా మహా సామ్రాజ్యాలు పతనమై రాడికల్, ప్రజాస్వామిక ఉద్యమాలు బలపడ్డాయి. ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలు అభివృద్ధి చెందినది ఈ శతాబ్దంలోనే. యుద్ధాలు, విప్లవాలు, వలసల మీద పోరాటాలు, ఆర్థిక సంక్షోభాలు ఇందుకు తోడ్పడ్డాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం వంటి పేర్లతో ఈ వ్యవస్థ బలపడుతూ వచ్చింది.



చైనాలోని తియనాన్మెన్ స్క్వేర్ ఊచకోత, తూర్పు ఐరోపా పరిణామాలు, బెర్లిన్ గోడ పతనం, సోవియెట్ రష్యా విచ్ఛిన్నం ప్రజాస్వామిక పవనాల గాఢతకు నిదర్శనాలు. అయితే 1989-91  నాటి ఈ మహా పరిణామాలకూ, 21వ శతాబ్దం ఆరంభంలో జరిగిన ప్రజాస్వామిక ఉద్యమాలకూ తేడా ఉంది. ఇక ప్రజాస్వామిక వ్యవస్థల నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్న వాతావరణం ప్రపంచంలో నెలకొంది. ఆర్థిక, అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ వ్యవస్థలతో అనుసంధానం కావడం ప్రజాస్వామ్యంతోనే ముడి పడి ఉంది. ముందు జాగ్రత్త కలిగిన దేశాలలో ఏదో విధంగా ప్రజాస్వామ్యానికి మొగ్గు చూపే ప్రక్రియ దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఆరంభమైంది.

 

నిజానికి ప్రజాస్వామిక వ్యవస్థలను ఆకాంక్షిస్తూ చెలరేగిన ఉద్యమాలన్నీ ఒక మూసలో వచ్చినవి కావు. పరిస్థితుల ‘పరిపక్వత’ అన్న సూత్రాన్ని అనుసరించినవి కూడా కాదు. 1990 నాటి బల్గేరియా, రుమేనియా, యుగోస్లావియా, మంగోలియాలలో వచ్చిన ప్రజాస్వామిక ఉద్యమాలకీ, నేపాల్‌లో రాచరికం పతనానికీ మధ్య పోలికలు కనిపించవు. అదే సంవత్సరం నేపాల్ రాజు బీరేంద్ర హిమాలయ రాజ్యంలో బహుళ రాజకీయ పక్ష విధానానికి అనుమతి ఇవ్వడం గమనించదగినది.



ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పాటు యోచనకు అక్కడే బీజం పడింది.  నేపాల్‌లో రాచరికం పతనం కావడానికి కారణం మావోయిస్టు సిద్ధాంతం పునాదిగా ఉన్న, హింసాత్మక పంథాతో (1996-2006) సాగిన ఉద్యమం. కానీ అక్కడ రాజు బతికి బయటపడ్డాడు. రుమేనియాలో సాధారణ ప్రజలు తిరుగుబాటు చేశారు. నాటి పాలకుడు సీసెస్క్యూ కమ్యూనిస్టు పార్టీకి చెందినవాడు. ఇతడిని ప్రజలు కాల్చి చంపారు.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top