కధ అడ్డం తిరిగింది


 అక్టోబర్ 31, 2002... బ్రెజిల్.

 అర్ధరాత్రి దాటింది. అయినప్పటికీ సావోపోలో ప్రాంతంలో ఓ మూలగా ఉన్న ఆ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. మెయిన్ డోర్ తలుపులు తెరిచే ఉన్నాయి. జీపు దిగుతూనే ఇంటిని పరిశీలనగా చూశాడు ఇన్‌స్పెక్టర్ బ్రూనో. చాలా రిచ్‌గా ఉంది ఇల్లు. చక్కని రంగులతో, రంగు రంగుల దీప కాంతులతో వైభవానికి ప్రతీకలా ఉంది. రెండు నిమిషాలు నిశితంగా పరిశీలించి లోపలికి నడిచాడు.హాల్లో చాలామంది ఉన్నారు. అందరి ముఖాల్లోనూ ఆందోళన. అందరి కళ్లలో ఎన్నో రకాల ప్రశ్నలు. వాళ్లందరినీ తేరిపార చూశాడు బ్రూనో. తర్వాత అతని కళ్లు గదిలో ఓ మూలకు మళ్లాయి.

 

 అక్కడ గోడకు ఆనుకుని కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఓ అమ్మాయి. ఏడ్చీ ఏడ్చీ తెల్లని ముఖం ఎర్రగా కందిపో యింది. ఎందరు ఓదారుస్తున్నా కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతోంది. ఆమెవైపు చూస్తూనే అక్కడున్న ఓ వ్యక్తిని అడిగాడు బ్రూనో... ‘‘డెడ్‌బాడీస్ ఎక్కడ?’’

 

 ఆ వ్యక్తి చూపించాడు. సబార్డినేట్స్‌తో కలసి అటువైపు కదిలాడు. మాస్టర్ బెడ్ రూమ్ మధ్యలో ఖరీదైన మంచం. దాని మీద తెల్లని దుప్పటి. ఆ దుప్పటి కాస్తా రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఆ రక్తపు మడుగులో పడివున్నాయి రెండు మృత దేహాలు. తలలు పగిలి మెదళ్లు బయటికి వచ్చాయి. మెడచుట్టూ తెల్లని టర్కీ టవళ్లు బిగుసుకుని ఉన్నాయి.

 

 ‘‘దారుణంగా చంపారు’’ అన్నాడు బ్రూనో. ‘‘రక్తం ఇంకా పూర్తిగా ఇంకి పోలేదు సర్. అంటే మర్డర్స్ జరిగి మరీ ఎక్కువసేపు కాలేదు’’ అన్నాడు విక్టర్ ఆధారాలను పరిశీలిస్తూ. ‘‘అవును విక్టర్. కరెక్ట్‌గా చెప్పావ్’’... సబార్డినేట్‌ను మెచ్చుకున్నాడు బ్రూనో. ఆధారాలు సేకరించమని చెప్పి హాల్లోకి వచ్చాడు. ఆ అమ్మాయి ఇంకా ఏడుస్తూనే ఉంది. వెళ్లి ఆమెకి ఎదురుగా నేల మీద కూర్చున్నాడు. ‘‘నీ పేరు సూజన్ కదూ’’ అన్నాడు అనునయంగా. అవునన్నట్టు తలూపింది. ‘‘అసలేం జరిగిందమ్మా?’’ అన్నాడు కూల్‌గా.

 

 ఆ అమ్మాయి ఏదో చెప్పాలనుకుంది. మాట పెగల్లేదు. దుఃఖంతో వెక్కెక్కి పడు తోంది. తర్వాత ఎప్పటికో నిభాయించు కుని నోరు విప్పింది. ‘‘మా తమ్ముణ్ని స్పెషల్ క్లాస్ నుంచి పికప్ చేసుకోడానికి వెళ్లాను సర్. ఇద్దరం తర్వాత మూవీకి వెళ్లాం. డిన్నర్ కూడా చేశాం. ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీసి ఉంది. లేట్‌గా వస్తామని చెప్పాం కాబట్టి మమ్మీ, డాడీ తలుపు తెరచి ఉంచారేమో అను కున్నాం. కానీ అప్పటికే వాళ్లనెవరో చంపే శారు. బెడ్‌రూమ్‌లో శవాలుగా పడివున్న మమ్మీని, డాడీని చూసి తట్టుకోలేక పోయాం. వెంటనే పక్కింటి వాళ్లను పిలిస్తే వచ్చారు. వాళ్లే మీకు ఫోన్ చేశారు.’’

 

 ‘‘మీ తమ్ముడు ఎక్కడ?’’ అన్నాడు బ్రూనో చుట్టూ చూస్తూ.

 ‘‘బయట ఉన్నాడు సర్. చాలా ఏడుస్తున్నాడు. అందుకే మా ఫ్రెండ్స్ తనని లాన్‌లోకి తీసుకెళ్లారు.’’ లేచి లాన్‌లోకి వెళ్లాడు బ్రూనో. కొందరు యువతీ యువకుల మధ్య ఉన్నాడు సూజన్ తమ్ముడు క్రిస్టియన్. బిగ్గరగా ఏడుస్తున్నాడు. అందరూ ఓదా రుస్తున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ఏమీ ఎరగనట్టుగా ఏం జరిగిందంటూ క్రిస్టి యన్‌ని అడిగాడు బ్రూనో. ఆ అబ్బాయి ఏం జరిగిందో చెప్పాడు. సేమ్ వెర్షన్. తన అక్క ఏం చెప్పిందో అదే చెప్పాడు. బ్రూనో అనుమానం క్లియరైంది. అతనికి సూజన్ మీద సందేహం లేదు. ఎందు కంటే తన మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. కానీ పోలీసు బుర్ర కదా! అందుకే ఆమె తమ్ముడిని కూడా అడిగి చూశాడు. అతడిలోనూ తడబాటు లేదు. అక్క చెప్పినట్టే స్పష్టంగా చెప్పాడు. దాంతో కేసును వేరే కోణంలో ఇన్వెస్టిగేట్ చేసేం దుకు సమాయత్తమయ్యాడు బ్రూనో.

    

 వారం రోజుల తర్వాత...


‘‘నేను చెప్పాను కద సర్. అదే జరిగింది.’’ కాస్త గట్టిగానే నవ్వాడు బ్రూనో. ‘‘నువ్వు చెప్పినదాని గురించి అడగడం లేదు మిస్ సూజన్. చెప్పకుండా దాచినదాని గురించి అడుగుతున్నాను. నాకు ఓర్పు చాలా తక్కువ. కాబట్టి వెంటనే నిజం చెప్పేసెయ్.’’ అయోమయంగా చూసింది సూజన్. ‘‘సడెన్‌గా ఇంటికొచ్చారు. చిన్నపాటి విచారణ అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఏంటి సర్ ఇది’’ అంది అర్థం కానట్టుగా.

 

 ‘‘నీ వయసు పంతొమ్మిది. అంటే దాదాపు నా సర్వీసు అంత. ఈ వయ సులో నువ్వే ఇంత తెలివిగా మాట్లాడితే, నీ వయసంత సర్వీసు ఉన్న నేనెంత తెలి వైనవాడిని అయి ఉంటానో ఆలోచించు’’ అన్నాడు ఆమె కళ్లలోకి చూస్తూ. సూజన్ మాట్లాడలేదు. తల దించు కుంది. కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలిపడు తున్నాయి. ‘‘మీరు తప్పుగా అనుకుంటు న్నారు సర్. వాళ్లు మా అమ్మానాన్నలు. మమ్మల్ని కళ్లలో పెట్టుకుని పెంచారు. నేను వాళ్లకి కలలో కూడా కీడు తలపెట్టలేను. దయచేసి వాళ్లను ఎవరు చంపారో...’’‘‘నాకు తెలుసు ఎవరు చంపారో. ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి నువ్వు నోరు తెరవకపోయినా నష్టం లేదు’’ అనేసి వెళ్లిపోతోన్న బ్రూనో వైపు బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది సూజన్.

 

 ఆమెకు తెలీదు... బ్రూనో తనను పిలిచేటప్పటికే అన్ని ఆధారాలూ సంపా దించేశాడని. అందుకే తను మళ్లీ అదే వెర్షన్ వినిపించింది. కానీ అతడు మాత్రం నమ్మడానికి కాదు కదా, ఆమె చెప్పేది వినడానికి కూడా సిద్ధంగా లేడు.

 నిజానికి ఆ రోజు సూజన్, ఆమె తమ్ముడు క్రిస్టియానో చెప్పింది విన్న తర్వాత వాళ్లమీద ఎటువంటి సందేహం కలగలేదు బ్రూనోకి. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడో అప్పుడే అతడికి వందల కొద్దీ సందేహాలు పుట్టుకొచ్చాయి. హత్య జరిగిన రోజు సాయంత్రం తన తమ్ముడిని పికప్ చేసుకో వడానికి వెళ్లానని చెప్పింది సూజన్. కానీ ఆ రోజు అతడికి స్కూల్లో స్పెషల్ క్లాసే లేదు. పైగా సూజన్ సాయంత్రం బయ టకు వెళ్లలేదు. రాత్రి ఎనిమిది దాటాక వెళ్లింది. అది కూడా తన తమ్ముడితో కలసి. అంటే క్లాస్, పికప్ అన్నీ అబద్ధాలు. ఆ తర్వాత వాళ్లు చెప్పింది సినిమా చూశామని, డిన్నర్ చేశా మని. ఆ రెండూ నిజమే. అయితే సినిమా చూసింది, డిన్నర్ చేసింది వాళ్లిద్దరు మాత్రమే కాదు. వాళ్లతో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు ఎవరా అని ఎంక్వయిరీ చేసినప్పుడే ఊహించని ఆధారాలు దొరికాయి బ్రూనోకి.

 

 ఆ మూడో వ్యక్తి పేరు డానియెల్ క్రావినోస్... సూజన్ బాయ్‌ఫ్రెండ్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకో వాలనుకున్నారు. కానీ అది సూజన్ తండ్రి ఆల్బర్ట్, తల్లి మరీసియాలకు ఇష్టం లేదు. ఇంత చిన్న వయసులో ప్రేమ, పెళ్లి ఏంటి చదువుకోమన్నారు. డబ్బు, హోదా, సరైన బ్యాగ్రౌండ్ లేని డానియెల్‌ని అల్లుడిగా ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పేశారు. అక్కడే మొదలైంది అసలు కథ.

 

 తల్లిదండ్రులు తన ప్రేమను కాదన్నారన్న కోపంలో వాళ్లు తనకు అంతవరకూ పంచిన ప్రేమను మర్చి పోయింది సూజన్. బాయ్‌ఫ్రెండ్‌తో కలసి వారిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. దానికోసం తన తమ్ముడి ఆలోచనల్ని కూడా కలుషితం చేసింది. ఆస్తి దక్కా లన్నా, జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నా అమ్మానాన్నలు ఉండ కూడదంటూ నూరిపోసింది. అక్టోబర్ 31వ తేదీ రాత్రి వారిని అంతం చేసేందుకు పన్నాగం పన్నింది. ఆ రోజు... తమ ప్లాన్ ప్రకారం సినిమాకి వెళ్తున్నానని అమ్మానాన్నలకు చెప్పి, తమ్ముడిని తీసుకుని వెళ్లిపోయింది సూజన్. ఆ తర్వాత డానియెల్‌ని తీసుకుని ఇద్దరూ ఇంటికొచ్చారు. ఏమాత్రం కనికరం లేకుండా రాడ్లతో తలమీద మోది ఇద్దర్నీ చంపేశారు. ఇంకా ప్రాణం మిగులు తుందేమోనన్న అను మానంతో టవళ్లను మెడచుట్టూ బిగించారు. తర్వాత బయటకు వెళ్లిపోయి సినిమా చూసి, డిన్నర్ చేశారు. డానియెల్‌ని తన రూమ్ దగ్గర వదిలేసి అక్కాతమ్ముళ్లు ఇంటికొచ్చారు. ఏమీ ఎరగనట్టు, అమ్మానాన్నల మృతదేహాలను చూసి షాక్ తిన్నట్టు బిల్డప్ ఇచ్చారు.

 

 కానీ పాపం వాళ్లు ఊహించలేదు... తాము చూసిన సినిమా టికెట్లు, చేసిన డిన్నర్ బిల్సు, సీసీ కెమెరాలు తమను పట్టిస్తాయని. వాటి ద్వారా పోలీసులు తాము చేసిన దారుణాన్ని పసిగట్టేస్తారని. సూజనే హంతకురాలని తెలిసి బ్రెజిల్ యావత్తూ ఆశ్చర్యపోయింది. పంతొమ్మి దేళ్ల అమ్మాయి... ఇంత దారుణంగా ఆలో చించగలదా అంటూ షాక్ అయిపోయా రంతా. అందంగా, అమాయకంగా, ఎంతో నెమ్మదస్తురాలిలా కనిపించే సూజన్ అంత పెద్ద నేరం చేసి ఉండదని కూడా ఆమె స్నేహితులు, సహ విద్యార్థులు వ్యాఖ్యా నించారు. కానీ సూజన్ నేరం చేసింది. ఆ నేరం నాలుగేళ్ల విచారణ తర్వాత కోర్టులో నిర్ధారణ అయ్యింది. ఆమెకు నలభయ్యేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

 

 ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన వయసు సూజన్‌ది. అర్థం లేని ఆవేశాలతో, స్వార్థంతో దారుణంగా ప్రవర్తించింది. జన్మనిచ్చిన తల్లిని, తన జీవితాన్ని మలిచేందుకు అహర్నిశలూ కష్టపడుతోన్న తండ్రిని పొట్టనబెట్టుకుంది. చివరికి ఆమెకి ఏం మిగిలింది? కటకటాలు... కన్నీళ్లు. చెడుకు ముగింపు ఎప్పుడూ చెడ్డగానే ఉంటుంది. ఆ నిజం తెలిసేసరికి ఆమె జీవితం చేయి జారిపోయింది!

 

 సూజన్ తండ్రి ఆల్బర్ట్ ఇంజినీర్. మంచివాడు, పేరున్నవాడు కావడంతో ఆయన మరణోదంతం ప్రాచుర్యాన్ని పొందింది. సూజన్ చేసిన దురాగతాన్ని మీడియా ఎండగట్టింది. ఏదేమైతేనేం... చివరికి ఆమెకి శిక్ష పడింది. సూజన్‌తో చేతులు కలిపిన ఆమె తమ్ముడు క్రిస్టియానోకి, ప్రియుడు డానియెల్‌కి చెరో 38 సంవత్సరాల శిక్ష పడింది. అందరూ ప్రస్తుతం బ్రెజిల్ జైల్లో మగ్గుతున్నారు. కానీ ఇంత జరిగినా సూజన్‌లో అస్సలు పశ్చాత్తాపం లేదు. కోర్టులో కేసు నడుస్తున్నంత కాలం కూడా నిర్లక్ష్యంగానే ఉండేది. తనలో భయంగానీ, బెంగగానీ కనిపించేవి కాదు. ఒక్కోసారి కోర్టులోనే పెద్దగా నవ్వేది. ఇప్పటికీ ఆమె ప్రవర్తన అలాగే ఉందంటున్నారు అధికారులు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top