పుట్టలోన చెదలు...

పుట్టలోన చెదలు... - Sakshi


పద్యానవనం: కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్, వారిచే నేగతుల్ వడిసెన్? బుత్రులు లేనియా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్? చెడునే మోక్షపదం బపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!

 

 తాము కని, పెంచి, పెద్దచేసే పిల్లల పట్ల తలిదండ్రులకు ప్రేమాభిమానాలుండటం సహజం. అంతే ప్రేమ గౌరవాభిమానాలు పిల్లలూ తలిదండ్రులపై చూపిస్తారు. ఇలా ఉండటం ప్రకృతి సిద్ధం, భిన్నంగా ఉండటమే అసహజం. మానవజాతి మనుగడ ఒక పరంపరగా కొనసాగడం వెనుక ఈ సహజ ప్రకృతి సూత్రమే బంధాల్ని, అనుబంధాల్నీ సూత్రబద్ధం చేస్తోంది. ఇందుకు భిన్నంగా వ్యవహరించే వారూ ఉంటారు. తలిదండ్రులంటే లెక్కే ఉండదు. స్వార్థం పెచ్చుమీరిన చోట మానాభిమానాలు కనుమరుగవుతుంటాయి. కన్నవారని కూడా చూడకుండా క్షోభకు గురిచేసే తనయులెందరో!

 

 తనయులు అని ఎందుకు నొక్కిచెప్పడమంటే, కూతుళ్లతో పోల్చిచూస్తే... తలిదండ్రుల్ని వేదనకు గురిచేయడంలో కుమారులే ముందుంటారు. మన పితృస్వామ్య వ్యవస్థలో తండ్రి వారసత్వ సంపదకు కుమారులే వారసులవడం, కూతుళ్లను ఒకింటికిస్తే, ఆ ఇంటి కోడళ్లుగా అక్కడి సంపదను, ఆ కుటుంబపు కష్ట-సుఖాల్నీ అనుభవిస్తూ ఉండటం కూడా ఈ వ్యత్యాసానికి కొంత కారణం కావచ్చు.

 

 సంపదకు వారసత్వపు హక్కును కోరే పిల్లలు తలిదండ్రుల పట్ల తమ కనీస ధర్మాన్ని పాటించాలన్న ఇంగితాన్నీ మరచి పోతుంటారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రుల బాగోగులకు బాధ్యత తీసుకోని కొడుకులెందరో! వారసత్వ సంపదతో తమకన్నా స్థితిపరులు, సంపన్నులైన చుట్టుపక్కల వారిని చూసి తమ దుస్థితికి తలిదండ్రులే కారకులనుకునే పుత్ర రత్నాలూ ఉంటారు. పరిస్థితులేవైనా కావచ్చు, తమ లేమికి తలిదండ్రులే కారకులనీ, జన్మనివ్వడం తప్ప వారు తమకేమీ ఇవ్వలేదనీ ఈసడించుకునే వారిని చూస్తే అసహ్యమేస్తుంది. తమ ఆర్థిక స్థితి, కష్ట-సుఖాలతో నిమిత్తం లేకుండానే, ఏ తలిదండ్రులైనా తమ పిల్లలు తమకన్నా మెరుగైన జీవితం గడపాలనే కోరుకుంటారు. అందుకోసం ఎన్నెన్ని త్యాగాలకైనా సిద్ధపడతారు. ఇంతటి బహిరంగ సత్యాన్ని నెత్తికెక్కించుకోని మూర్ఖత్వమే స్వార్థపు మనుషుల్లో పశుత్వాన్ని పెంపొందిస్తుంది.

 

 మొన్నటికి మొన్న మన హైదరాబాద్ మహానగరంలో తలిదండ్రులతో యాసిడ్ తాగించి చంపిన తనయుడ్ని తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. పాపం ఇద్దరు కుమారుల్ని కని, పెంచి, పెద్ద చేసి, తమ శక్తి మేర ‘ప్రయోజకుల్ని’ చేశారు. అయినా, తనకేదో తక్కువ చేశారనే భావనతో ఉన్న కుమారుడొకరు, ‘రెండు లక్షల రూపాయలిస్తారా? ఈ యాసిడ్ తాగుతారా? నేను బయటకు వెళ్లి వచ్చేటప్పటికి ఏదో ఒకటి తేల్చండి’ అని హుకూం జారీ చేశాడు. రెండు లక్షల రూపాయలు సమకూర్చలేని తమ అశక్తత కన్నా, తాము కని, పెంచి, పెద్ద చేసిన తనయుడే తమ పాలిట మృత్యువుతున్నాడని పాపమా వృద్ధుల మనసెంత క్షోభ పడిందో... యాసిడ్ తాగి తనువు చాలించారు. ఇటువంటి పుత్రులుంటేనేం, లేకుంటేనేం?

 

 ‘‘తలిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టవా, గిట్టవా?’’ అని అడిగాడు వేమన. వారేదో ఉద్దరిస్తారనే భ్రాంతితో, తమకు కొడుకులు పుట్టలేదే! అని ఏడ్చే తలిదండ్రుల అవివేకాన్ని ఎత్తిచూపుతున్నాడు ధూర్జటి ఈ శతక పద్యంలో. ఒకరా! ఇద్దరా! దుర్యోధన-దుశ్శాసనాదిగా నూర్గురు కొడుకులు ఉండీ ఏం బావుకున్నాడు కౌరవేంద్రుడైన దృతరాష్ట్రుడు అనేది ప్రశ్న!! పుత్రులు లేని శుకముని ఏ సద్గతులు కోల్పోయాడు, ఏం దుర్గతి పట్టింది? అటువంటి దేమీ లేదే! అని గుర్తు చేస్తున్నాడు.

 

 చనిపోయిన తర్వాత స్వర్గయోగం లభించాలంటే పున్నామ నరకం తప్పాలనీ, దాన్ని తగు కర్మలనాచరించడం ద్వారా పుత్రుడు తప్పిస్తాడనీ ‘‘పున్నామ నరకాత్‌త్రాయతే ఇతి పుత్రః’’ అని చెబుతుంటారు. ఉందో, లేదో తెలియని స్వర్గం గురించి యోచించడం కన్నా, ఈ భూమ్మీదే నరకం చూపించే తనయులు ఉంటేనేం, లేకుంటేనేం! పైగా, శాస్త్రీయంగా ధ్రువపడిన మానవ శరీర ధర్మం ప్రకారం కూడా తమ సంతానం కూతురో, తనయుడో కావడం కేవలం యాదృచ్ఛికం. స్త్రీ పురుషుల ఇష్టాయిష్టాలు, పాత్రాప్రమేయాలతో నిమిత్తం లేకుండా ఎక్స్-వై, ఎక్స్-ఎక్స్ క్రోమోజోములు జతకట్టడాన్ని బట్టి సంతానం ఆడో, మగో కావచ్చన్నది సందేహాలకతీతంగా నిర్ధారణ అయిన విషయం. కొడుకా, కూతురా అన్న మీమాంసకు వెళ్లకుండా, తలిదండ్రులపై కనీస కనికరం చూపే వారే నిజమైన సంతానంగా భావించాలి. కొడుకులు లేకుంటే మోక్షపదం మిస్సవుతుందన్నది కేవలం మిథ్యావాదమంటున్న కవి హేతుబద్ధమైన ప్రతిపాదనకు జోహార్!

 - దిలీప్ రెడ్డి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top