నయా... ఆగయా

నయా... ఆగయా


 ఇటీవల హీరోలుగా పరిచయమైన రోషన్, నిఖిల్‌కుమార్.. ఇద్దరిదీ పెద్ద బ్యాగ్రౌండే. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ ‘జాగ్వార్’ ద్వారా తెలుగు, కన్నడ భాషల్లో పరిచయమయ్యాడు. మొదటి సినిమా కాబట్టి అద్భుతంగా నటిస్తాడని ఆశించలేం. అయితే బాగా కసరత్తులు చేస్తే మంచి మాస్ హీరో అనిపించుకుంటాడని సినీ పండితుల విశ్లేషణ. తండ్రి శ్రీకాంత్‌కి జిరాక్స్ కాపీలా ఉన్నాడు రోషన్. మొదటి సినిమాతోనే ఆకట్టుకోగలిగాడు.

 

 ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మతాబులు విరజిమ్మే కాంతులను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కొత్తగా తెరపైకొచ్చే కథానాయికలు కూడా మతాబుల్లాంటి వాళ్లే. ఈ ఏడాది ఇప్పటివరకూ డజను మంది కథానాయికలు పరిచయమయ్యారు. వీళ్లల్లో మలయాళ తారలు ఎక్కువగా ఉండటం విశేషం. థౌజండ్‌వాలా పేల్చినప్పుడు గుండె ఎలా అదురుతుందో ఈ అందగత్తెలను చూసి అబ్బాయిల గుండెలు అలానే అదిరాయి. మనసు మతాబులా విచ్చుకుంటే.. కళ్లు కాకరపువ్వొత్తులా కాంతులీనాయి.

 

 దీపావళి టపాసుల్లో చిచ్చుబుడ్డులకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్‌నే ఈ నాయికలు సంపాదించుకున్నారు. ‘నేను శైలజ’ ద్వారా పరిచయమైన కీర్తీ సురేశ్ మంచి కీర్తినే సంపాదించుకున్నారు. ‘అఆ’తో పరిచయమైన మలయాళ మతాబు అనుపమా పరమేశ్వరన్ ఇటీవల విడుదలైన ‘ప్రేమమ్’లోనూ భేష్ అనిపించుకున్నారు. ఇదే చిత్రం ద్వారా పరిచయమైన మరో మలయాళ టపాసు మడోన్నా సెబాస్టియన్ కూడా బూరెబుగ్గలతో భేషుగ్గానే కనిపించారు. ‘జెంటిల్‌మన్’లో నివేదా థామస్ అందచందాలు, అభినయం రెండూ పేలాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మెహరీన్ కొంచెం పుష్టిగా.. బాగా మందుతో కూరిన మతాబులా ఆకట్టుకుంది.

 

  ‘ఒక మనసు’ అంటూ మెగావారసులు నిహారిక కొణిదెల మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. మలబార్ తీరం నుంచి వచ్చిన నాయికల్లో ‘మజ్ను’తో పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్ కూడా భేష్ అనిపించుకున్నారు. మరో మలయాళీ బ్యూటీ నమితా ప్రమోద్ ‘నైస్’ అనిపించుకున్నారు. నిక్కీ గర్లానీ, లారిస్సా బొనేసి, సోనమ్ బజ్వా, అదితీ ఆర్య వంటి న్యూ హీరోయిన్స్ కూడా తమ టాలెంట్‌ని చూపించుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పది నెలల్లో 12 మంది నాయికలు పరిచయం కావడం అంటే... మన తెలుగు పరిశ్రమ పరభాషలవాళ్లను ఏ రేంజ్‌లో ప్రోత్సహిస్తోందో ఊహించుకోవచ్చు.

 

 సంవతర్సం మొదటి రోజున విడుదలైన ‘నేను శైలజ’ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలా పాజిటివ్ సైన్‌తో కొత్త సంవత్సరం మొదలైంది. ఆ తర్వాత ఫెస్టివల్ టైమ్‌లో రిలీజ్ కాకపోయినా విజయ విహారంతో పండగ చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ‘ఆఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీరస్తు శుభమసు’్త, డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’. ‘ఆఆ’ని దాదాపు రూ.35 కోట్లతో తీస్తే.. అంతా కలిపి రూ.50 కోట్లకు పైగానే దక్కించుకుంది. సుమారు రూ.60 కోట్ల ఖర్చుతో తీసిన ‘జనతా గ్యారేజ్’ అన్నీ కలుపుకుని దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూలు చేసి, ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అల్లు శిరీష్ కెరీర్‌కి శుభమస్తు అయింది ‘శ్రీరస్తు శుభమస్తు’. ఇది కూడా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ కిందే లెక్క. ఇక.. ‘బిచ్చగాడు’ అయితే సూపర్. ఈ చిత్రం తెలుగు అనువాద హక్కులు రూ.50 లక్షల రూపాయలు. అయితే.. రూ.20 కోట్లు వసూలు చేసి, రికార్డ్ సృష్టించింది.

 

 వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని

 ఈ ఏడాది నాని కెరీర్ తారాజువ్వలా పైపైకి ఎగిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్‌మన్’, ‘మజ్ను’... ఈ మూడు చిత్రాలూ మామూలు బడ్జెట్‌తో రూపొందినవే. కానీ, వసూళ్లు మాత్రం భారీగానే దక్కించుకున్నాయి. ముచ్చటగా మూడు విజయాలు అందుకుని, నాలుగో రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు నాని. తన తాజా చిత్రం ‘నేనో రకం’ క్రిస్మస్‌కి రిలీజ్ కానుంది.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top