మనిషిపై సూర్యచంద్రుల ప్రభావం ఉంటుందా?

మనిషిపై సూర్యచంద్రుల ప్రభావం ఉంటుందా?


సద్గురు జగ్గీ వాసుదేవ్

www.sadhguru.org


యోగా

యోగాలో, హఠయోగా ఒక సన్నాహక ప్రక్రియ. హ అంటే సూర్యుడు. ఠ అంటే చంద్రుడు. మీలోని సూర్యచంద్రుల మధ్య, లేదా ఇడ, పింగళ అనే నాడుల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే యోగానే హఠయోగా. హఠ అంటే మీ శరీరానికి కారణభూతమైన ఈ రెండు ముఖ్య అంశాల మధ్య ఒక విధమైన సమన్వయం తీసుకురావటం!

 

ఈ భూమిపై ఉన్న జీవాన్ని ప్రభావితం చేయటంలో ఈ విశ్వంలోని అన్నిటి కంటే కూడా సూర్యుడు చాలా ప్రధానమైనవాడు. సూర్యుడు మన గ్రహం మీద ఉన్న జీవానికి మూలం. మనం తినే తిండి, తాగే నీరు, పీల్చుకునే గాలి ఇలా ప్రతీ దాంట్లో సూర్యుడి పాత్ర ఉంటుంది. సూర్య కిరణాలు ఈ గ్రహం మీద పడకపోతే, జీవ మనుగడకు అవకాశమే లేదు. అంతా ముగిసిపోతుంది. ఇప్పుడు అకస్మాత్తుగా సూర్యుడు అదృశ్యమైపోతే, 18 గంటల్లో అన్నీ గడ్డకట్టుకుపోతాయి. సముద్రాలన్నిటితో పాటు మీ రక్తం కూడా! అసలు ఈ గ్రహం మీద ఉత్పత్తి అయ్యే వేడి అంతా కూడా వివిధ మార్గాల్లో వ్యక్తమయ్యే సౌరశక్తి!

 

చంద్రుడి వివిధ స్థానాలు కూడా మనిషి శారీరక, మానసిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. భారతదేశంలో చంద్రుడి స్థానం ప్రతిరోజూ పరిగణనలోకి తీసుకోబడుతుంది. చంద్రుని వివిధ స్థానాలను మానవ శ్రేయస్సుకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఈ సంప్రదాయంలో ఎప్పుడో తెలుసుకున్నారు.



మీరు ఒక స్థాయి ఎరుక(అవేర్‌నెస్), గ్రహణశక్తితో ఉంటే, చంద్రుని ప్రతీ దశలో మీ శరీరం కొంత భిన్నంగా ప్రవర్తించడం మీరు గమనిస్తారు. మహిళల్లోని పునరుత్పత్తి ప్రక్రియ, అంటే అసలు మానవ జనన ప్రక్రియే చంద్ర భ్రమణంతో చాలా లోతుగా అనుసంధానమై ఉంది. అంటే, భూమి చుట్టూ జరిగే చంద్ర భ్రమణం, మనిషిలో సంభవించే పునరావృత స్థితులు ఈ రెండూ చాలా లోతుగా అనుసంధానమై ఉంటాయి.

 

మీ జీవితంలోని ప్రతీ క్షణం, మీరు చేసే ప్రతీ విషయం ఈ రెండు శక్తులచే, అంటే సూర్యచంద్రులచే నియంత్రించబడుతుంది. అందుకే, భౌతికంగా మనం చేసే ఆధ్యాత్మిక సాధన అంతా కూడా ఈ ప్రకృతి చక్రాలతో, అంటే సూర్యచంద్రభ్రమణాలతో మనల్ని మనం అనుసంధానం చేసుకోవటం కోసమే!

ప్రేమాశీస్సులతో  - సద్గురు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top