సూఫీ కాఫీ కహానీ

సూఫీ కాఫీ కహానీ - Sakshi


నేషనల్ కాఫీ డే సెప్టెంబర్ 29

మానవాళికి అలవాటుగా మారిన అనుదిన పానీయాల్లో కాఫీ అధునాతనమైనది. చాక్లెట్ క్రీస్తుపూర్వం నుంచే వాడుకలో ఉండగా, టీ కూడా కాఫీకి శతాబ్దాల మునుపటి నుంచే వాడుకలో ఉండేది. ఇథియోపియాలోని కఫ్ఫా ప్రాంతానికి చెందిన ఒరోమో జాతి ప్రజల పూర్వీకులు తొలిసారిగా కాఫీ గింజల మహత్తును గుర్తించినట్లు ఒక గాథ ప్రచారంలో ఉంది. అయితే, ఆ ప్రాంతంలో పురాతన కాలంలో కాఫీ పండించినట్లు ఎలాంటి ఆధారాలూ లేవు. కాఫీ గింజలను వేయించి, పానీయం తయారు చేసుకునే తాగే అలవాటు క్రీస్తుశకం పదిహేనో శతాబ్ది నాటికే యెమెన్, అరేబియా ప్రాంతాల్లో ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి.



అప్పట్లో ఎక్కువగా సూఫీ గురువులు కాఫీ సేవించేవారు. కాఫీ వల్ల ఏకాగ్రత, ధ్యానంలో తాదాత్మ్యత సులువుగా సాధించగలమని వారు నమ్మేవారు. శతాబ్దం గడిచేలోగానే కాఫీ పశ్చిమాసియా ప్రాంతమంతటికీ పాకింది. ఆ తర్వాత అనతి కాలంలోనే పాశ్చాత్య ప్రపంచానికి విస్తరించింది.

 

మన దేశానికి ఇలా వచ్చింది...

కాఫీ, టీ వంటి పానీయాలు మన దేశానికి వచ్చాయంటే, అదంతా బ్రిటిష్ వాళ్ల ఘనతేనని చాలామంది అనుకుంటారు. కాఫీ, టీ తోటల పెంపకానికి వారు బాగానే దోహదపడ్డారనడం వరకు వాస్తవమే గాని, మన దేశానికి మొదటిసారిగా కాఫీని తీసుకొచ్చింది బ్రిటిష్ వారేనంటే అది పొరపాటే. యెమెన్ దేశానికి చెందిన సూఫీ గురువు బాబా బుదాన్ తొలిసారిగా 1670లో భారత్‌కు ఏడు కాఫీ విత్తనాలను అక్రమంగా తరలించుకు వచ్చాడు. అంటే, కాఫీ మన దేశంలోకి తొలిసారిగా స్మగ్లింగ్ మార్గంలో అడుగుపెట్టింది.



బాబా బుదాన్ స్మగుల్ చేసి తీసుకొచ్చిన కాఫీ గింజలను మైసూరు ప్రాంతంలో నాటారు. వాతావరణం అనుకూలించడంతో మైసూరు పరిసరాల్లోను, కూర్గ్ ప్రాంతంలోను తొలినాటి కాఫీ తోటలు విస్తరించాయి. ఇప్పుడైతే మన దేశంలో కర్ణాటక, తమిళనాడు, కేరళలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, ఒడిశాలోని కొన్ని జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కాఫీ తోటల పెంపకం జరుగుతోంది. బ్రిటిష్ కాలంలో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాల్లో కాఫీ తాగే అలవాటు బాగా పెరిగింది. ఊరూరా కాఫీ హోటళ్లు వెలశాయి. కాఫీ ఘనత చమత్కార పద్యాలకెక్కింది. అంతేనా..? ఒక కవివరేణ్యుడు ఏకంగా కాఫీ దండకమే రాసి పారేశాడు.

 

కాఫీదాసుల్లోప్రముఖులు

కాఫీ వినియోగం పెరిగాక, చాలామంది ప్రముఖులు కాఫీదాసులుగా మారారు. ముఖ్యంగా సృజనాత్మక, కళా రంగాలకు చెందిన ప్రముఖులు కాఫీ లేనిదే పని మొదలుపెట్టేవారు కాదు. కాఫీ తాగడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి ఉండేది. సంగీత దిగ్గజం బిథోవెన్ కాఫీ అంటే పడిచచ్చేవాడు. కప్పు కాఫీ కోసం ఆయన లెక్కపెట్టి మరీ కచ్చితంగా అరవై గింజలను వాడేవాడు. సుప్రసిద్ధ రాజకీయవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ రోజులో తరచుగా కాఫీ తాగడమే కాదు, తాను స్వయంగా వేయించిన కాఫీ గింజలను లండన్ మార్కెట్‌లో విక్రయించేవాడు కూడా.



ఫ్రెంచి రచయిత వోల్టేర్‌ను కాఫీకి వీరాభిమానిగా చెప్పుకోవచ్చు. ఆయన రోజుకు ఏకంగా యాభై కప్పుల వరకు కాఫీ సేవించేవాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ కూడా ఈ విషయంలో వోల్టేర్‌కు సాటి వస్తాడు. ఆయన రోజుకు దాదాపు గ్యాలన్ (3.78 లీటర్లు)  కాఫీ లాగించేసేవాడు.

 

ఉత్పత్తిలో మనది ఐదోస్థానం

కాఫీ ఉత్పత్తిలో మనది ఐదో స్థానం. మొదటి నాలుగు స్థానాల్లో బ్రెజిల్, వియత్నాం, ఇండోనేసియా, కంబోడియా దేశాలు ఉన్నాయి. కాఫీ వినియోగంలో మాత్రం అగ్రరాజ్యమైన అమెరికాదే అగ్రస్థానం. ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి.

కాఫీ తాగితే...

1. శరీరానికి ఇంధనం: వాహనానికి ఇంధనం ఎలా పనిచేస్తుందో, శరీరానికి కాఫీ కూడా అలానే పనిచేస్తుంది. కాస్త కాఫీ పడ్డాక హుషారు పెరిగి, పనితీరులో వేగం పుంజుకుంటుంది. కెఫీన్ ప్రభావంతో శరీరంలో ఎడ్రినలిన్ హార్మోన్ స్థాయి పెరిగి, ఉత్సాహం ఉరకలేస్తుంది.

 

2. నవయవ్వన పానీయం: కాఫీని నవయవ్వన పానీయంగా చెప్పుకోవచ్చు. వార్ధక్యాన్ని దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీ, కోకో వంటి పానీయాల కంటే కాఫీలోనే ఎక్కువగా ఉంటాయి. కాఫీలో బి2, బి3, బి5 విటమిన్లు, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషక ఖనిజాలు కూడా ఉంటాయి.



3. చక్కెర జబ్బుకు చెక్: కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజూ కాఫీ తాగే వారికి టైప్-2 డయాబెటిస్, గుండెజబ్బులు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని ‘ది డయాబెటిక్ జర్నల్’ అధ్యయనంలో తేలింది. కాఫీ  లివర్‌కు కూడా రక్షణగా నిలుస్తుంది. రోజుకు కనీసం నాలుగు కప్పుల కాఫీ తాగేవారికి లివర్ వ్యాధులు వచ్చే అవకాశాలు 80 శాతం మేరకు తగ్గుతాయని హార్వర్డ్  నిపుణుల అధ్యయనంలో తేలింది.

 

4. మేధకు పదును: కాఫీ మెదడుకు పదును పెడుతుంది. కాఫీలోని కెఫీన్ మెదడు స్పందించే వేగాన్ని, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కాఫీ తాగేవారికి అల్జిమర్స్, పార్కిన్‌సన్స్ వంటి నాడీ సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో తేలింది.

 

5. ఆనందామృతం: దిగులు, గుబులు వంటి ప్రతికూల మానసిక లక్షణాల నుంచి బయటపడేసే సుగుణం కాఫీ సొంతం. అందుకే కాఫీ ప్రియులు తమ అభిమాన పానీయాన్ని ఆనందామృతంగా పరిగణిస్తారు.

 

6. బద్ధకానికి బద్ధ శత్రువు: కాఫీని బద్ధకానికి బద్ధశత్రువుగా చెప్పుకోవచ్చు. కాఫీప్రియులు ఎన్నడూ బద్ధకస్తులు కారు. కాఫీలోని కెఫీన్ మానసికంగాను, శారీరకంగాను చురుగ్గా ఉంచుతుంది. అంతేకాదు, శరీరంలోని జీవక్రియల వేగాన్ని 3 శాతం నుంచి 11 శాతం వరకు పెంచుతుంది. అందువల్ల కాఫీ తాగేవారిలో స్థూలకాయులు తక్కువగా ఉంటారు.

 

7. దీర్ఘాయుః ప్రదాత: కాఫీ సాక్షాత్తు అమృతం కాకపోవచ్చు గాని, ఇంచుమించు అలానే పనిచేస్తుందని నిపుణుల ఉవాచ. కాఫీ తాగేవారికి స్థూలకాయం, గుండెజబ్బులు, చక్కెర జబ్బు వంటివి దూరంగా ఉంటాయి గనుక, వారిలో ఎక్కువమంది దీర్ఘాయుష్కులుగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top