సెల్ఫ్ హెల్ప్ గురు

సెల్ఫ్ హెల్ప్ గురు


ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి:

నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది;

నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది.


- డేల్ కార్నెగీ



‘నేర్చుకోవడం అనేది అంత ప్రధానం కాదు; నేర్చుకుంటుండగా నువ్వెలాంటి మనిషివిగా తయారవుతావన్నది అంతకంటే ముఖ్యం’ అంటాడు డేల్ కార్నెగీ. ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్ధభాగంలో వ్యక్తిత్వ వికాసానికి తనదైన బాట పరిచిన కార్నెగీ తరచూ ఇలా చెప్పేవాడు: ‘నిన్ను నువ్వు ఇలా ప్రశ్నించుకో: నాకు ఇంతకంటే చెడు ఏం జరగ్గలుగుతుంది? ఆ చెడును అంగీకరించడానికి సిద్ధపడు. ఆ చెడునుంచి మెరుగవడానికి ప్రయత్నించు’. వ్యక్తిగతంగా కూడా డేల్ కార్నెగీ చాలా చెడ్డ పరిస్థితుల్లోంచే మెరుగవుతూ వచ్చాడు.



ఈ భవిష్యత్ ‘సెల్ఫ్ హెల్ప్ గురు’... అమెరికాలో 1888 నవంబర్ 24న పేద రైతుకుటుంబంలో జన్మించాడు. వాళ్ల ఊరిని పక్కనున్న నది ఎప్పుడూ వరదల్తో ముంచెత్తేది. దానివల్ల కరువు ఉత్పన్నమయ్యేది. అప్పుల భారంతో వాళ్ల నాన్న ఒక దశలో ఆత్మహత్యకు కూడా సిద్ధపడ్డాడు. ‘సిగ్గుపడే పరిస్థితుల్లోకి నెట్టిన’ పేదరికాన్ని చిన్నారి డేల్ ఈసడించుకునేవాడు. అయితే అంతటి విపత్కర కాలంలోనూ సంసారాన్ని ఈదడానికి ధైర్యంగా నిలబడిన వాళ్ల అమ్మ వ్యక్తిత్వం అతడిని ముగ్ధుడిని చేసేది.

 

బడికి గుర్రం మీద వెళ్లేవాడు డేల్. ఫీజులేని చోట చదివేవాడు. చదువుకుంటూ పొలం పనులు చేసేవాడు. ఆవుల పాలు పిండటానికి ఉదయం నాలుగింటికి లేచేవాడు. కాలేజీలో చదువుతున్నప్పుడు ఒకమ్మాయిని ప్రేమించానని చెబితే, ఆమె తిరస్కరించింది. దీనికి కచ్చితంగా తన పేదరికమే కారణమని బలంగా విశ్వసించాడు. తాను ఎప్పటికైనా ధనవంతుడినీ, గొప్పవాడినీ కావాలనీ గట్టిగా శపథం చేసుకున్నాడు. కాలం దాన్ని నిజం చేసింది కూడా!

 

భుక్తి కోసం డేల్ కార్నెగీ కొన్నాళ్లు సేల్స్‌మన్‌గా పనిచేశాడు. మరికొన్నాళ్లు నటుడిగా ప్రయత్నించాడు. కొన్నిరోజులు పాఠాలు చెప్పాడు. అయితే, స్టేజీ మీద మాట్లాడాలంటే అందరూ భయపడటాన్ని గమనించిన కార్నెగీకి ‘పబ్లిక్ స్పీకింగ్’లోనే కెరీర్ కనబడింది. ‘ఎప్పుడూ మూడు ఉపన్యాసాలుంటాయి: నువ్వు సాధన చేసింది; నువ్వు ఇచ్చింది; నువ్వు ఇచ్చివుంటే బాగుండేదనుకున్నది’.

 

తొలినాళ్లలో రాబడిలో 80 శాతం యజమానికి ఇచ్చే ఒప్పందం మీద ఒక హాల్‌ను అద్దెకు తీసుకున్నాడు. వికాస పాఠాలు బోధించడం మొదలుపెట్టాడు. ‘ఎదుటివారిని విమర్శించేముందు నీ లోపాల గురించి మాట్లాడు’. ‘మెరుగైనది ఎంతచిన్నదైనా అభినందించు; ప్రతి మెరుగైనదాన్నీ అభినందించు’. ‘నీదే తప్పయితే వెంటనే ఒప్పుకో; దృఢంగా ఒప్పుకో’. ‘మంచి శ్రోతవు కా; ఎదుటివారిని తమగురించి చెప్పుకునేలా ప్రోత్సహించు’. ‘వాదనలోంచి బయటపడే ఉచితమైన మార్గం ఏమిటంటే, అది లేకుండా చేసుకోవడమే!’

 

విద్యార్థులు, ఉద్యోగార్థులు, వ్యాపారులు, సంసారులు అన్న తేడా లేకుండా ఆయన తరగతులకు హాజరయ్యేవారు. వాళ్లను వాళ్లతోనే తమ సమస్యలకు పరిష్కారాలు వెతికించేవాడు. ‘ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసుకో: సమస్య ఏమిటి? ఆ సమస్యకు కారణాలేమిటి? ఆ సమస్యకు ఉండదగిన పరిష్కారాలేమిటి? ఉన్నవాటిల్లో అత్యుత్తమ పరిష్కారం ఏమిటి?’ ‘అన్ని వాస్తవాలనీ సేకరించు; వాస్తవాలన్నింటినీ బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి రా; ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, దానికనుగుణంగా నడుచుకో!’

 

కార్నెగీ వార్తాపత్రికలకు కాలమ్స్ రాసేవాడు. రేడియోలో షో నిర్వహించేవాడు. బాధల్ని అధిగమించడానికి సగటు సూత్రాన్ని ఉపయోగించమనేవాడు. అలాగే, తొలగించలేనిదానికి అంగీకారమే శరణ్యం అని చెప్పేవాడు. ఇవన్నీ తన సొంత ఆలోచనలేమీ కాదనీ, సోక్రటీస్, చెస్టర్‌ఫీల్డ్, జీసస్ నుంచి అరువు తెచ్చుకున్నవేననీ అనేవాడు. ‘అవే నచ్చకపోతే మరింక ఎవరివి వాడతావు?’

 

ఆయన పాఠాల్లో కొన్నింటిని క్రోడీకరించి, ‘పబ్లిక్ స్పీకింగ్: ఎ ప్రాక్టికల్ కోర్స్ ఫర్ బిజినెస్‌మెన్’ వెలువరించాడు. అయితే, కార్నెగీ పేరును ఖండం దాటించిన పుస్తకం మాత్రం ‘హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్’ (1937). దానికి ముందు ‘ది ఆర్ట్ ఆఫ్ గెటింగ్ అలాంగ్ విత్ పీపుల్’ అని పేరు పెట్టాడాయన. ప్రచురణకర్తల్ని ఆ టైటిల్ ఆకర్షించలేదు. పేరు మార్చి, విషయం చేర్చి, మళ్లీ ఇచ్చాడు. అయితే, గట్టిగా 30,000 కాపీలు పోతుందనుకున్నది, నెల లోపలే 3,33,000 ప్రతులు అమ్ముడుపోయింది. ‘ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యచకితుణ్ని’ అన్నాడు ఇంటర్వ్యూకు వచ్చిన విలేఖరితో. తర్వాత కోటిన్నర కాపీలు అమ్ముడుపోయింది. వివిధ భాషల్లోకి అనువాదమైంది.

 

1948లో ‘హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్’ ప్రచురించాడు. ఆయన మొత్తం బోధనల్లోని సారాంశం ఇలా ఉంటుంది: ‘విమర్శ, నింద, ఫిర్యాదు తగవు’. ‘నిజాయితీగా ప్రశంసించు’. ‘నవ్వు’. ‘ఇతరుల మీద మనఃపూర్వక ఆసక్తిని చూపించు’. ‘ఇతరుల్ని అనుకరించకు’. ‘ఇతరులకోసం సంతోషాన్ని సృష్టించు’. ‘నీ కష్టాల్ని కాదు, నీ వరాల్ని లెక్కించుకో’. ‘పనిలోనే విశ్రాంతి తీసుకోవడం ఎలాగో నేర్చుకో’. ‘వాటి ప్రాధాన్యతా క్రమంలో పనుల్ని పూర్తిచేయి’. ‘నిన్ను నువ్వు కనుక్కో; నీలా ఉండు; ఈ భూమ్మీద నిన్ను పోలిన మనిషి మరొకరు లేరని గుర్తుంచుకో’. ఆయన చెప్పినవన్నీ మరెక్కడైనా విన్నట్టనిపిస్తోందా? అదే కార్నెగీ గొప్పతనం!

 - ఆర్.ఆర్.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top