నీకు నేను... నాకు నువ్వు...

నీకు నేను... నాకు నువ్వు...


సినిమా వెనుక స్టోరీ - 34

తేజ... తేజ... తేజ... ఎక్కడ విన్నా ఇదే పేరు. 40 లక్షల్లో ‘చిత్రం’ తీసి 9 కోట్లకు పైగా రాబట్టడమంటే ఇప్పటి ట్రెండ్‌లో నిజంగా చిత్రం భళారే విచిత్రమే! అప్పటి వరకూ కెమెరామ్యాన్‌గా ఉన్నవాడు ‘చిత్రం’తో ఒక్కసారిగా ఫేమస్ అయి పోయాడు. నిర్మాతలు ఎగబడ్డారు.

 తేజ కొంచెం చిత్రమైన మనిషి. రెమ్యునరేషన్ కన్నా ముందు మనిషి నచ్చాలి. మనిషి నచ్చితేనే సినిమా చేస్తాడు. అలా ఇద్దరికి గ్రీన్‌సిగ్నలిచ్చాడు. ఒకరు - సుంకర మధుమురళి, ఇంకొకరు - ‘జెమినీ’ కిరణ్.



మధుమురళి బ్యానర్లో జగపతిబాబు హీరోగా ‘ఫ్యామిలీ సర్కస్’కు ప్లానింగ్ జరుగుతోంది. ఇటు ‘జెమినీ’ కిరణ్ సంస్థలో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా చేయాలి. వెంకటేశ్‌కు కథ చెప్పి వచ్చాడు తేజ. ఆయన ‘ఎస్’ చెప్పలేదు. ‘నో’ చెప్పలేదు. కానీ పనులు ఆపలేదు తేజ. మ్యూజిక్ డెరైక్టర్ ఆర్.పి.పట్నా యక్, లిరిక్ రైటర్ కులశేఖర్‌కు సిట్యు యేషన్స్ చెప్పి రెండు పాటలు కూడా రెడీ చేయించేశాడు. అదిరిపోయేలా వచ్చాయి. ఒకటేమో ఫోక్ సాంగ్. ‘గాజువాక పిల్లా... మేం గాజులోళ్లం కాదా’, ఇంకొకటి డ్యూయెట్... ‘తుమ్మెదా... ఓ తుమ్మెదా’.

 

బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది కానీ, వెంకటేశ్ ఏం తేల్చడం లేదు. ఆయన స్టూడియోకెళ్లాడు తేజ. అక్కడ సెట్‌వర్క్ జరుగుతోంది. వెంకటేశ్ కొత్త సినిమా కోసమట. విజయ్‌భాస్కర్ డెరైక్షన్‌లో ‘నువ్వు నాకు నచ్చావ్’ చేస్తున్నారట. తేజకు క్లారిటీ వచ్చేసింది. ఇక తన సినిమా ఉండదు. కారెక్కాడు. కారు స్పీడ్‌గా ఫిల్మ్‌నగర్ డౌన్ రోడ్డులోకి దూసుకెళ్తోంది. తేజ మైండ్ కూడా స్పీడ్‌గా ఆలోచిస్తోంది. సడెన్ బ్రేక్. ఎదురుగా గొర్రెల మంద. ఓ అమ్మాయి వాటిని అదిలిస్తూ రోడ్డు దాటుతోంది. అటుపక్క కాస్ట్లీ కారులో కూర్చున్న ఓ అబ్బాయి చాలా అసహ నంగా ఈ అమ్మాయివైపు చూస్తున్నాడు. ఆమె కంగారుగా గొర్రెలను పక్కకు తరిమేసింది. కారు ముందుకెళ్లిపోయింది.

 

ఆఫీసులో అడుగుపెట్టాడు తేజ. బాగా ఆకలి వేస్తోంది. ఆఫీస్‌బాయ్ పెట్టే లోపు తనే వడ్డించేసుకుని తినేశాడు. ఇంతలో ‘జెమినీ’ కిరణ్ వచ్చాడు. ‘‘ఓ పావుగంటలో మీకో కథ చెబుతా. మీకు నచ్చితే దానితోనే సినిమా తీద్దాం. ఇక వెంకటేశ్ ప్రాజెక్టు ఉండనట్టే’’ అని చెప్పేశాడు తేజ. లంచ్ కంప్లీటయ్యాక, ఆ టేబుల్ మీదే తలవాల్చుకుని పావుగంట కునుకు తీశాడు. తర్వాత కిరణ్ రూమ్‌లో కెళ్లి కథ చెప్పడం మొదలుపెట్టాడు.

 

గొర్రెలు కాసుకునేవాడి కూతురు హీరోయిన్. కృష్ణా ఒబెరాయ్ లాంటి రిచెస్ట్ మ్యాన్ కొడుకు హీరో. వాళ్లిద్దరి మధ్యనా లవ్‌స్టోరీ. సీన్లతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేసేశాడు. ‘జెమినీ’ కిరణ్ ఫ్లాట్. ‘‘ఇంతకూ ఈ సినిమాలో ‘గాజువాక పిల్లా’ పాట ఉంటుందా? లేదా?’’ ఆసక్తిగా అడిగాడు కిరణ్. తేజ నవ్వుతూ ఏదో చెప్ప బోయాడు. కిరణ్ మధ్యలోనే కల్పించుకుని, ‘‘ఎల్లుండే ఓపెనింగ్ పెట్టేద్దాం. చాలా మంచి ముహూర్తం ఉంది. మిగతా విషయాలు తర్వాత ప్లాన్ చేద్దాం’’ అని చెప్పేశాడు.

 

ఆ రోజు జనవరి 2. అసోసియేట్ డెరైక్టర్ దశరథ్‌తో కూర్చుని తేజ చకచకా స్క్రిప్టు రెడీ చేసేశాడు. సినిమా పేరు ‘నువ్వు - నేను’. జనవరి 4నే షూటింగ్ స్టార్ట్. హీరో లేడు. హీరోయిన్ ఎవరో తెలియదు. ఫస్ట్‌డే... తనికెళ్ల భరణి, ‘తెలంగాణ’ శకుంతలపై సీన్స్ షూట్ చేసేశారు. ఆ తర్వాత రోజూ కొన్ని షాట్స్ తీశారు. ఇప్పుడు హీరో హీరోయిన్ల కోసం వేట మొదలైంది. సుమంత్‌ను కలిశాడు తేజ. వర్కవుటయ్యే పరిస్థితి లేదు. మాధవన్‌ని అడిగితే తెలుగు సినిమాలు చేయనంటాడు. తేజలో అసహనం. ఆ టైమ్‌లో ఉదయ్‌కిరణ్ వచ్చాడు ఆఫీసుకి. రోజూ వచ్చి తేజను కలిసి వెళ్తూంటా డతను. ‘చిత్రం’తో తనను హీరోను చేసిన తేజ అంటే ఉదయ్‌కిరణ్‌కు విపరీతమైన గౌరవం. ఏ సినిమా చేయాలో... ఎవరి దగ్గర కథ వినాలో... ఎంత రెమ్యునరేషన్ తీసుకోవాలో... ఏదైనా తేజ చెబితేనే వింటాడు.

 

తేజ చెప్పడంతోనే తన సెకెండ్ సినిమా డేట్లు ‘నిధి’ ప్రసాద్‌కిచ్చాడు. ఆయన డెరైక్షన్‌లో ‘హోలీ’ చేయాలి. తేజ ఎదురుగా భక్తిభావంతో కూర్చున్నాడు ఉదయ్‌కిరణ్. నవ్వుతూ గలగలా మాట్లాడే తేజ, ఆ రోజెందుకో ముభావంగా ఉన్నాడు. మూడ్ బాలేదని అర్థమైంది. అందుకే ఉదయ్‌కిరణ్ కూడా కామ్‌గా ఉన్నాడు. కాసేపటి తర్వాత తేజ అన్నాడు. ‘‘ఉదయ్! జిమ్ బాగా చేసి బాడీ పెంచు. ‘నువ్వు - నేను’ నీతోనే చేస్తున్నా.’’

 ఉదయ్‌కిరణ్‌కి సెకెండ్ టైమ్ కూడా బంపర్ లాటరీ కొట్టేసిన ఫీలింగ్.

   

‘నువ్వు - నేను’ హోల్డ్‌లో పెట్టి ‘ఫ్యామిలీ సర్కస్’ కంప్లీట్ చేస్తున్నాడు తేజ. వాళ్లేమో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. హడావిడిగా ఆ వర్క్ పూర్తి చేసేశాడు. తీరా సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. తేజ కూడా ‘సెకెండ్ ఫిల్మ్ సిండ్రోమ్’ని తప్పించుకోలేకపోయాడు.

 మొదటి సినిమాతో వచ్చిన క్రేజ్ తగ్గిపోలేదు కానీ, తేజలోనే ఏదో ఫీలింగ్. ఒక రకమైన కసి. ‘నువ్వు - నేను’ని బ్లాక్‌బస్టర్ చేయాలి. ఆ లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు తేజ.

 

హీరోయిన్ సెలెక్షన్. ముంబై నుంచి అమ్మాయిలొచ్చారు. ఒకమ్మాయి బాగుంది. కాన్ఫిడెంట్‌గా ఉంది. ఈ సినిమాకు తనే దిక్కు అని అర్థమైపోయి నట్టుంది. ఫోజు కొడుతోంది. ఫైవ్‌స్టార్ హోటల్‌లో రూమ్ కావాలి.... ఇంతమంది అసిస్టెంట్స్ ఉండాలి... ఫ్లైట్‌లో బిజినెస్ క్లాస్ టికెట్ కావాలి అంటూ డిమాండ్స్. తేజకు చిర్రెత్తుకొచ్చింది. మిగతా అమ్మాయిలందర్నీ చూపించి, ‘‘నీ దృష్టిలో వాళ్లల్లో లీస్ట్ ఎవరు?’’ అనడిగాడు. ఆమె ఆశ్చర్యపోతూ చాలా క్యాజువల్‌గా ఒకమ్మాయి వైపు వేలు చూపించింది. ‘‘నువ్వింక వెళ్లొచ్చు.



నా సినిమాలో ఆ అమ్మాయే హీరోయిన్’’ అని తేజ చెప్పే సరికి, ఆమె షాకైపోయింది. అలా అనిత హీరోయిన్‌గా సెలెక్టయిపోయింది. హైదరాబాద్‌లోనే మ్యాగ్జిమమ్ షూటింగ్. ముంబై, వికారాబాద్ అడవుల్లో కొంత షూటింగ్ చేశారు. ఎమ్మెస్ నారాయణది కీ రోల్! ధర్మవరపు సుబ్ర హ్మణ్యంది చిన్న క్యారెక్టర్! కానీ రోజూ లొకేషన్‌కొచ్చి తేజతో కూర్చునేవాడు.



ఇద్దరూ జోక్స్ చెప్పుకుంటుండేవారు. ఆయనలోని కామెడీ టింజ్‌కి తేజ ఫ్యాన్ అయిపోయాడు. అక్కడేమో ఎమ్మెస్ ఫుల్ బిజీ. కాల్షీట్లు కూడా టైట్. దాంతో, ఎమ్మెస్ క్యారెక్టర్ తగ్గించేసి, ధర్మవరపుది పెంచేశాడు. శోభన్‌బాబు రింగ్‌లా క్రాఫ్ సెట్ చేసి, ధర్మవరపు రోల్‌లో బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేర్చేశాడు.

 

‘తెలంగాణ’ శకుంతలది ఫుల్ నెగిటివ్ పాత్ర. ఆమె ఇంతకు ముందు అలాంటివి చేయలేదు. ఎంతవరకూ పండుతుందోనని తేజకే డౌట్. అందుకే ఆమెను పక్కన పెట్టేసి, ‘బెంగళూరు’ పద్మను పిలిపిం చాడు. ఆమెతో ఒకరోజు షూటింగ్ కూడా చేసేశాడు. ఇది తెలిసి తనికెళ్ల భరణి ఫీలైపోయారు. తేజతో ఆయనకు బాగా చనువు. ‘‘ఆమె సీనియర్ ఆర్టిస్ట్. పైగా డ్రామాల నుంచి వచ్చింది. ఇలా పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు’’ అని చెప్పారు భరణి. తేజ ఇంకేం మాట్లాడలేదు.

 

తర్వాతి రోజు మళ్లీ ‘తెలంగాణ’ శకుంతల రంగంలోకి దిగారు. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాల్లో సూటూ బూటూ వేసుకుని నటించిన వైజాగ్ ప్రసాద్‌ను హీరో తండ్రి పాత్రకి తీసుకున్నారు. చాలామంది ఇది రాంగ్ డెసిషన్ అన్నారు. తేజ వినలేదు.

 

ఈ సినిమాలో 11 పాటలు. అన్ని అంటే చాలా కష్టం. తేజ మాత్రం అలాంటి లెక్కలు పెట్టుకోలేదు. పాటలు బాగుంటే.. కథలో ఇమిడిపోతే.. ప్రేక్షకుడు ఎన్నయినా పట్టించుకోడనేది తేజ సిద్ధాంతం. వెంకటేశ్ స్క్రిప్టు కోసం చేసిన రెండు పాటలూ ఇందులోకి షిఫ్ట్ చేశారు. ‘గాజువాక పిల్లా...’ యాజ్‌టీజ్. ‘తుమ్మెదా...’ పాటకు మాత్రం లిరిక్స్ మార్చేసి ‘ప్రియతమా... ఓ ప్రియతమా...’ అని సెట్ చేశారు. ‘గాజువాక పిల్లా’ అవుట్‌పుట్ సరిగ్గా రాలేదని మూడుసార్లు రీషూట్ చేశారు. ‘నా గుండెలో నీవుండి పోవా’ పాట పూర్తయిన రెండు నిమిషాల గ్యాప్‌కే ‘నాకు నువ్వు నీకు నేను’ అంటూ చిన్న సాంగ్ బిట్ పెట్టారు. ఇలా వెంట వెంటనే పాటలంటే ఓ రకంగా రిస్కే. కానీ తేజ మంచి ఫ్లోలో ఉన్నాడు. ట్రాక్ తప్పుతాడని అనిపించడం లేదు.  

 

వైజాగ్ ప్రసాద్ తన కొడుకుని, తన ప్రియురాలి కూతురుకిచ్చి పెళ్లి చేయాలనే ప్రపోజల్ సీన్‌కు ఆర్.పి., కులశేఖర్ బాగా అపోజ్ చేశారు. తేజ వినే మూడ్‌లో లేడు.

 కోటీ 63 లక్షలతో సినిమా రెడీ. ఎవ రికీ ఎలాంటి హోప్సూ లేవు. ఈ సినిమా హిట్టయితేనే తేజ ఉంటాడు. లేకపోతే అవుట్. అయినా తేజ టెన్షన్ పడలేదు. ఈ సినిమాతో మళ్లీ హిట్ సాధిస్తున్నానని మనస్సాక్షి ముందే చెప్పేసింది. ఫస్ట్‌డే మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్. ఎక్కడ చూసినా యూత్. థియేటర్లన్నీ కాలేజీ క్యాంపసుల్లా మారిపోయిన ఫీలింగ్.

 

ఇప్పుడు తేజ స్టార్ డెరైక్టర్... ఉదయ్ కిరణ్ స్టార్ హీరో... ధర్మవరపు స్టార్ కమెడియన్... ఆర్.పి.పట్నాయక్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్. సినిమా ఎంత హిట్టయ్యిందో, పాటలూ అంతకన్నా హిట్టయ్యాయి. ముఖ్యంగా ‘గాజువాక పిల్లా’ ఒక ఊపు ఊపేసింది. ‘నువ్వు యూత్ ఏంట్రా’, ‘మూసుకు కూర్చోరా పూలచొక్కా’, ‘మీ పెద్దోళ్లున్నారే’ లాంటి డైలాగులు బాగా పేలాయి.  చాలా సాదా సీదా ప్రేమకథను టైట్ స్క్రీన్‌ప్లేతో, ఎమోషనల్ డెప్త్‌తో తేజ బాగా మేనేజ్ చేశాడు. మేజిక్ చేశాడు. 21 కోట్ల వరకూ కలెక్ట్ చేసిందీ సినిమా. మళ్లీ కాలేజీ సినిమాలు, లవ్‌స్టోరీల హవా మొదలైంది. తేజ కూడా ఇంకో లవ్‌స్టోరీ పనిలో ఉన్నాడు. ఓ కొత్తబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఘనవి‘జయం’ సాధించాలి. తేజ నిజంగా తలచుకుంటే ఏదైనా సాధించగలడు!



* ఐదారు సీన్స్‌లో ఉదయ్‌కిరణ్ డబ్బింగ్ నచ్చక, మళ్లీ రీ-డబ్ చేయించా లనుకున్నారు. కానీ అతను ‘మనసంతా నువ్వే’ షూటింగ్‌లో బిజీ కావడంతో అలానే ఉంచేశారు.

* క్లైమాక్స్‌లో వచ్చే ‘చినుకు చినుకు’ పాటను చివరి నిమిషంలో యాడ్ చేశారు. మిక్సింగ్ టైమ్‌లో తేజ అక్కడో పాట పెడితే బావుంటుందనుకున్నారు. అప్పటికప్పుడు కులశేఖర్‌తో పాట రాయించి పెట్టేశారు.

* హిందీలో తుషార్ కపూర్‌తో ‘యే దిల్’ పేరుతో రీమేక్ చేశారు తేజ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top